Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ముదిమిలోనూ ఉపాధి ముచ్చట్లు

* నైపుణ్యాభివృద్ధితో అపార అవకాశాలు

పాశ్చాత్య దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుంటే వర్ధమాన దేశాలు యువజనంతో ఉప్పొంగుతున్నాయనే భావన పదేపదే వ్యక్తమవుతోంది. వాస్తవం అందుకు విరుద్ధమని ‘ప్రపంచ జనాభా అంచనాల సవరణ-ఆసియా’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి 2015లో వెలువరించిన నివేదిక వెల్లడించింది. వయసు, లింగ భేదం, ఆదాయపరంగా జనాభా స్వరూప స్వభావాలను తెలిపేదే జనవర్గ శాస్త్రం. ముఖ్యంగా జనాభాలో వృద్ధ, యువ వర్గాల నిష్పత్తి సామాజికంగా, ఆర్థికంగా విస్తృత ప్రభావం కనబరుస్తుంది. ప్రపంచ జనాభాలో అత్యధికులు ఆసియా దేశాల్లోనే నివసిస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన స్త్రీ పురుషుల శాతమూ నేడు ఆసియాలోనే ఎక్కువగా ఉంది. ప్రస్తుత ప్రపంచ జనాభాలో 60 శాతంగా ఉన్న ఆసియన్లు 2050లో 54 శాతంగా ఉంటారు. 2017లో ఆసియాలో 36.5 కోట్లుగా ఉన్న వృద్ధుల జనాభా 2027కల్లా 52 కోట్లకు పెరుగుతుంది. అసలు 2042నాటికి యూరోజోన్‌, ఉత్తర అమెరికా దేశాల జనాభాకన్నా ఆసియాలో 65 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్యే ఎక్కువగా ఉండబోతోంది. అర్ధ శతాబ్ది తిరగకుండానే ప్రపంచ వృద్ధ జనాభాలో సగానికిపైగా ఆసియా దేశాల్లోనే నివసిస్తారు. ఇదేమంత శుభపరిణామం కాదు. యువజనాభా అధికం కావడమంటే పనిచేసేవారు పెరగడమే. వారిని వ్యాపార, పారిశ్రామిక సంస్థలు ఉపయోగించుకుంటే తలసరి ఆదాయాలు వృద్ధి చెందుతాయి. 1965-90 మధ్యకాలంలో తూర్పు ఆసియా దేశాల్లో జరిగింది ఇదే. ఈ దేశాల్లో కొన్ని దశాబ్దాల ముందునుంచే జననాలు తగ్గడంతో వాస్తవ తలసరి ఆదాయాలు మూడింతలు హెచ్చాయి. 1940-1980 మధ్యకాలంలో శిశు మరణాలు సగానికి సగం తగ్గిపోయాయి. వృద్ధులకన్నా పనిచేసేవారి సంఖ్య పదిరెట్లు వేగంగా పెరగడం తూర్పు ఆసియా దేశాల జీడీపీ వృద్ధికి తోడ్పడింది. దీన్ని యువజనాధిక్య ప్రయోజనంగా ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రశంసించింది.

దేశార్థికానికి బలిమి
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం, ఏ దేశానికైనా యువజనాధిక్య ప్రయోజనం రెండు దశలుగా సిద్ధిస్తుంది. మొదటి దశలో జనాభాలో యువజనుల శాతం పెరుగుదల వల్ల అధిక ఆర్థిక ఉత్పత్తి జరుగుతుంది. రెండోదశలో తలసరి ఆదాయాలు, పొదుపు పెరిగి చర స్థిర పెట్టుబడులు పెద్దయెత్తున పోగుపడతాయి. దీన్ని ఆర్థిక పరిభాషలో పెట్టుబడి సంచయమని వ్యవహరిస్తారు. ఈ రెండు దశల ప్రయోజనాలు తూర్పు ఆసియా దేశాలను రూపాంతరం చెందిస్తాయి. విద్య, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు వికసించే వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఈ దేశాలు తమ యువజన వనరులను గొప్పగా వినియోగించుకున్నాయి. కానీ, ఇప్పుడు ఆసియా దేశాలు క్రమంగా యువజనాధిక్య ప్రయోజనాన్ని కోల్పోతుండటంతో ఆర్థిక రథం ఊపు మందగిస్తోంది. రాగల రెండు దశాబ్దాల్లో జీడీపీ ప్రగతి మందగించి, వృద్ధుల సంఖ్య పెరగడం తూర్పు ఆసియా దేశాలకు భారంగా మారనుంది. వృద్ధులకు ఆరోగ్య సేవలు, ప్రజలకు నాణ్యమైన జీవనం అందించడం కష్టమైపోనుంది. ఒకవైపు సామాజిక సేవలపై ఖర్చులు పెరిగిపోతుంటే పనిచేసే యువజనులు తగ్గుతూ జీడీపీ మందగించడంవల్ల ప్రతికూల ప్రభావం తప్పదు. యువకులైన కార్మికుల సంఖ్య తగ్గుముఖం పట్టి, ఉత్పాధక అవసరాలు ఇనుమడిస్తే అప్పుడు శ్రామికశక్తికి గిరాకీ ఉంటుంది. పనివారికి ఎక్కువ జీతభత్యాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఇప్పటికే చైనాలో సంభవిస్తోంది. రేపోమాపో భారత్‌లోనూ కార్మిక వ్యయం పెరగవచ్చు. కంపెనీలు ఈ ఖర్చును తగ్గించుకోవడానికి అధునాతన సాంకేతికతతో కార్మికుల స్థానంలో స్వయంచాలన యంత్రాలను వినియోగించబోతున్నాయి. దీంతో యువ శ్రామికులు ఉపాధి కోల్పోయి వృద్ధుల ఆలనాపాలనా చూసుకోవడం కష్టతరమవుతుంది. పిల్లల పెంపకం కుటుంబాలకు భారంగా మారుతుంది. అప్పుడు వృద్ధులకు, పిల్లలకు, నిరుద్యోగులకు ప్రభుత్వాలే వివిధ మార్గాల్లో ఆర్థిక సహాయం అందించకతప్పదు. ఒకవేపు జీడీపీ వృద్ధి తగ్గుతుంటే ఇలా సామాజిక వ్యయం పెరగడం ప్రభుత్వాలను ఇబ్బందిపెడుతుంది. అదలాఉంచితే కార్మికులు పని కోసం విరివిగా వలసలు వెళ్లడం, మహిళా ఉద్యోగులు, కూలీల సంఖ్య పెరగడం, వృద్ధులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తమ నైపుణ్యాలను వినియోగిస్తూ పదవీ విరమణ తరవాతా పనిచేయడం ఈ తరంలో కనిపిస్తున్న సరికొత్త పరిణామాలు. ఈ పరిస్థితిని సక్రమంగా వినియోగించుకోవడానికి వినూత్న ప్రణాళికలు, కార్యాచరణలతో ప్రభుత్వాలు ముందుకు రావాలి.

పని సంస్కృతి కావాలి వరం
రాబోయే 35 ఏళ్లలో 70 శాతం భారత జనాభా 15-59 ఏళ్లవారే అయిఉంటారు. ఐరోపాలో ఈ వయోవర్గం 50 శాతంగా, ఆసియాలో 40 శాతంగా ఉంటారు. ఇతర దేశాల్లో వృద్ధుల శాతం పెరుగుతున్నకొద్దీ వారికి పనిచేసే వర్గాన్ని అందించడం ద్వారా భారత్‌ ఆర్థిక శక్తిగా ఎదగవచ్చు. అది జరగాలంటే ఈతరం వారికన్నా ఎక్కువ విద్యానైపుణ్యాలు ఉండే సిబ్బందిని తయారుచేసుకోవాలి. 2050కల్లా భారత్‌లో పనిచేసే వయసువారు 100 కోట్లకు చేరతారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో రోబోలు, కృత్రిమ మేధ, ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌)వంటి అధునాతన టెక్నాలజీలు విస్తరించి కొత్త తరహా సిబ్బందికి గిరాకీ ఏర్పడుతుంది. వారిని తయారుచేయడానికి అనువైన విద్యా నైపుణ్య వ్యవస్థలను మనం సృష్టించుకోవాలి.

మారుతున్న జనాభా రూపురేఖలు
ఆసియా జనాభాలో వివిధ వయోవర్గాల నిష్పత్తి 1950 నుంచే మారడం మొదలై ఈ శతాబ్ది మధ్యనాళ్ల వరకు కొనసాగనుంది. తల్లిదండ్రుల మీద ఆధారపడే వయసు (0-14 ఏళ్ల) పిల్లల సంఖ్య 1990లో 100 కోట్లు దాటి, 2005లో కొంత తగ్గింది. పనిచేసే వయసు (15-64 ఏళ్ల)వారి సంఖ్య 2040-50 కల్లా గరిష్ఠ స్థాయికి చేరనుంది. 65 ఏళ్లు పైబడినవారి జనాభా 2045కల్లా 80 కోట్లను మించనుంది. 1962-78 మధ్య కాలంలో 0-14 ఏళ్లవారు ప్రపంచమంతటిలోకీ ఆసియాలోనే అత్యధికంగా ఉండేవారు. 2002 నుంచి యువత సంఖ్య గరిష్ఠానికి చేరింది. 2024 వరకు ఇది పెరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో 65 ఏళ్లు పైబడినవారి సంఖ్య 2050 తరవాతా ఎక్కువవుతుంది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2050కల్లా చైనా, జపాన్‌, హాంకాంగ్‌, తైవాన్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌, వియత్నామ్‌లలో కష్టించి పనిచేయగల శ్రామికుల సంఖ్య తగ్గిపోతుంది. భారత్‌, పాకిస్థాన్‌, ఇండొనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్‌లలో అది పెరుగుతుంది. 1950 నుంచి 2015 వరకు ప్రపంచంలో పనిచేసే వయోవర్గం చైనాలోనే అత్యధికంగా ఉండేది. 2030లో ఈ విషయంలో చైనాను భారత్‌ మించిపోతుంది. భారత్‌లో ఈ వయోవర్గం 2030కల్లా 100 కోట్లకు, 2050కల్లా 110 కోట్లకు చేరుతుంది. మరోవైపు 1990లో జపాన్‌లో 8.5 కోట్లకు చేరిన పనిచేసే వయోవర్గ జనాభా 2050కల్లా 5.5 కోట్లకు తగ్గనుంది. థాయ్‌లాండ్‌లోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. ఇలాంటి హెచ్చుతగ్గుల మధ్యా ఆసియాలో పనిచేసేవారి జనాభా వల్ల ఈ శతాబ్ది మధ్యనాళ్ల వరకు ప్రయోజనం సిద్ధిస్తూనే ఉంటుంది. 2015లో 280 కోట్లుగా ఉన్న ఈ వయోవర్గం 2050కల్లా 303 కోట్లకు పెరుగుతుంది. పనిచేసేవారి మీద ఆధారపడిన స్త్రీబాలవృద్ధులు 1960లలో 78 శాతం ఉండగా 2013-14 నాటికి వారి సంఖ్య 47 శాతానికి తగ్గింది. వీరిలో వృద్ధులు 2015లో 11శాతం. 2050నాటికి అది 29 శాతానికి చేరనుంది. ఈ నిష్పత్తి వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు గణించింది. ఆసియాలోని 12 ప్రధాన దేశాలకు తొమ్మిది దేశాల్లో పనిచేసే వయోవర్గం క్రమంగా తగ్గుతుంటే భారత్‌, పాక్‌, ఫిలిప్పీన్స్‌లలో మాత్రం ఈ వర్గం 2050 వరకు పెరిగి ఆ పైన తగ్గనారంభిస్తుంది. భారత్‌ తన యువ జనాభాకు 21వ శతాబ్ది నైపుణ్యాలను అలవరిస్తే వృద్ధ జనాభాతో సతమతమయ్యే ఇతర దేశాలకు శ్రమశక్తిని అందించి యువజనాధిక్య ప్రయోజనాన్ని గరిష్ఠంగా పొందగలుగుతుంది.

అనేక రంగాల్లో ఉపాధి మార్గాలు
కౌశల భారత్‌ వంటి శిక్షణ కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలి. నేడు మన శ్రామిక బలగంలో 20 శాతానికే ఏదో ఒక నైపుణ్యంలో ఎంతో కొంత శిక్షణ, అనుభవం ఉన్నాయి. మిగతావారు వ్యవసాయం, నిర్మాణం వంటి రంగాల్లో చిన్నాచితకా పనులతో బండి నెట్టుకొస్తున్నారు. నిజానికి దీన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగంగా పరిగణించాలి. గత దశాబ్దిలో మన ఆర్థిక వ్యవస్థ అయిదు కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించగా, వాటిలో అత్యధికం సేవా రంగంలోనే అందుబాటులోకి వచ్చాయి. పారిశ్రామిక ఉత్పత్తి, సేవేతర రంగాల్లో ఉపాధి కల్పన తగ్గిపోతే సేవారంగమే ఎంతో కొంత ఆదుకుంది. మరోవైపు చైనా ఒక్క దశాబ్దిలో ఏడు కోట్ల ఉద్యోగాలను సృష్టించిన ఘనతను సొంతం చేసుకుంది. భారతదేశంలో సేవారంగంలో జీతభత్యాలు పెరగడంతో బహుళజాతి సంస్థలు మెల్లగా వేరే దేశాల వైపు చూస్తున్నాయి. మున్ముందు సేవారంగంలో ఆశించిన స్థాయిలో ఉద్యోగ సృష్టి జరగకపోవచ్చు. ఈ లోటును అధిగమించడానికి మౌలిక వసతులు, ఇంధన రంగాల విస్తరణే శరణ్యం. రహదారులు, భవనాలు, రేవులు తదితర మౌలిక వసతుల నిర్మాణానికి భారీ పెట్టుబడులు, సిబ్బంది అవసరం. ముఖ్యంగా నైపుణ్యం లేని కూలీలకు ఇక్కడ బాగా పని దొరుకుతుంది. పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు తీసుకొస్తే ఉపాధి అవకాశాలు వృద్ధి చెందుతాయి. వ్యవసాయ యోగ్య భూమి, నీటిపారుదల వసతులు మెరుగుపడితే గ్రామాల్లో కోట్లమందికి ఉపాధి లభిస్తుంది. శీతల గిడ్డంగుల నిర్మాణం, రవాణా-బట్వాడా రంగాలను ఆధునికీకరిస్తే లక్షలమంది ఉద్యోగాలు పొందగలుగుతారు. ఆహార శుద్ధి, సిద్ధాన్నాల తయారీ, వ్యావసాయిక వ్యాపారాల వృద్ధి నిరుద్యోగ నిర్మూలనకు తోడ్పడతాయి. పై రంగాల్లో పరిశోధన, అభివృద్ధి, విద్యా కార్యక్రమాలను ప్రోత్సహించి నిపుణులను తయారుచేసుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా భారత్‌ మారాలి- అదీ వేగంగా!

 

- డాక్టర్‌ రాధా రఘురామపాత్రుని (రచయిత్రి- ‘గీతం’లో అసోసియేట్‌ ఫ్రొఫెసర్‌)
Posted on 19-12-2018