Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

బిడ్డల ఆరోగ్యానికి ఏదీ భరోసా?

* సరైన వైద్యం అందక రాలిపోతున్న చిన్నారులు

దేశంలో పసిబిడ్డల ఆరోగ్యానికి పూచీలేని వాతావరణం నెలకొంది. నెలలు నిండకముందే పుట్టడం, ప్రసవ సమయ సమస్యలు, రక్తంలో లోపాలవంటి కారణాలతోపాటు అపరిశుభ్రత, అరక్షిత తాగునీరు వంటి కారణాలవల్ల ఏటా వేల సంఖ్యలో చిన్నారులు మరణిస్తున్నట్లు ప్రఖ్యాత వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌’ అధ్యయన నివేదిక ఇటీవల కుండ బద్దలుకొట్టింది. ఏటా వేర్వేరు అనారోగ్య కారణాలవల్ల అయిదేళ్లలోపు పసిమొగ్గలు 12 లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారన్న వాస్తవంతోపాటు మరెన్నో భీతిగొలిపే చేదు నిజాల్ని ‘ద లాన్సెట్‌’ నివేదిక బహిర్గతం చేసింది. పిల్లల వికాసంపట్ల పెద్దలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.

భారత్‌లో 2000-2015 మధ్యకాలంలో పుట్టిన పిల్లలలో నవజాత (నెలరోజుల్లోపు) శిశు మరణాలు, తొలి ఏడాది నుంచి అయిదేళ్లలోపు చిన్నారుల మరణాలపై ‘ద లాన్సెట్‌’ నిపుణుల బృందం అధ్యయనం చేసింది. 2015లో మనదేశంలో 2.51 కోట్ల మంది శిశువులు జన్మించారు. వారిలో 12.01 లక్షల పసిమొగ్గలు అయిదేళ్ల వయసు నిండకముందే వివిధ కారణాలతో మరణించారు. ప్రతి వెయ్యి ప్రసవాలకు అయిదేళ్లలోపు చిన్నారులు సగటున 47.81 మంది కన్ను మూస్తున్నట్లు తేలింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ అయిదేళ్లలోపు శిశు మరణాల సంఖ్య ప్రతి వెయ్యి జననాలకు 39.68 నమోదైంది. గోవాలో ప్రతి వెయ్యి మందికి శిశు మరణాల రేటు 9.7 కాగా, అసోంలో అది 73. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ప్రాణనష్టం రెండున్నర రెట్లు అధికంగా ఉంది. 2015-2030 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది పసిపిల్లలు మృతి చెందే సంభావ్యత ఉండగా వారిలో 18 శాతం మంది భారత్‌ లోనే ఉంటారని అంచనా. మనదేశంలో ప్రతి రెండు నిమిషాలకు ముగ్గురు శిశువులు మృతి చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నవజాత శిశువుల్లో 22.2 శాతం మంది నెలలు నిండకముందే పుట్టడం మూలాన చనిపోతున్నారు. అలాగే ప్రసవ సమయంలో ఎదురయ్యే సమస్యలు 14 శాతం; మెదడువాపు, రక్తంలో ఇన్ఫెక్షన్‌ 9.9 శాతం; పుట్టుకతోనే సంభవిస్తున్న అనర్థాలు 9.4 శాతం; నిమోనియా, ధనుర్వాతం, డయేరియా 3.7 శాతం మరణాలకు కారణమవుతున్నాయి. సకాలంలో పౌష్టికాహారం, టీకాలు, వ్యాధులు, లోపాలను నియంత్రించే చికిత్స, సేవలు అందితే మాతా శిశు మరణాలలో సింహభాగం అదుపులోకొస్తాయి. అందుకోసం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఆరోగ్య క్రమశిక్షణను జీవన విధానంగా మలచుకోవాలి. భారత్‌లో ఆ తరహా పరిస్థితులు ఇప్పటికీ సుదూర స్వప్నమే!

మూఢనమ్మకాలు, శాస్త్రీయ అవగాహన లోపం, పేదరికం ప్రభావానికి తలొగ్గి మనదేశంలో లక్షలమంది అనారోగ్యాన్ని కర్మఫలంగా అంగీకరిస్తున్నారే తప్ప తగిన జాగ్రత్తలు పాటించడానికి సిద్ధపడటం లేదు. గ్రామీణ ప్రాంతాలలో, ప్రత్యేకించి మారుమూల కుగ్రామాలలో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. మనదేశంలో టీకాలు అందని చిన్నారులెందరో ఉన్నారు. చాలా మంది, ముఖ్యంగా గ్రామీణులు టీకాల ప్రాముఖ్యం తెలియక, ఎప్పుడు ఏ టీకాలు ఇప్పించాలో అవగాహన లేక, ప్రభుత్వ వైద్యసేవల ద్వారా అన్ని టీకాలు లభ్యం కాకపోవడంతో, ప్రైవేటు వైద్యశాలలు డిమాండ్‌ చేసే భారీ రుసుమును చెల్లించలేక పిల్లలకు టీకాలు ఇప్పించకుండానే వదిలేస్తున్నారు. ప్రజారోగ్యంలో కీలక పాత్ర పోషించే ప్రభుత్వ వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పనితీరుపట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లి దశాబ్దాలైంది. కొరవడిన పరిశుభ్రత, అందుబాటులో లేని, పనిచేయని రోగనిర్ధారణ యంత్ర సామగ్రి, మందుల కొరత, వైద్య సిబ్బంది తగినంత మంది లేకపోవడం వంటివి శిశువులు, పెద్దలు అనే తేడా లేకుండా మొత్తం ప్రజారోగ్యంపట్ల ప్రభుత్వ చిత్తశుద్ధినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇలాంటి సమస్యల చక్రబంధంలో చిక్కుకున్న కారణంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ భారత్‌లో ఒక సవాలుగా పరిణమించింది. దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ 2005నుంచీ అయిదేళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గుముఖం పడుతుండటం కొంతలో కొంత ఊరట కలిగించే అంశం. ప్రభుత్వాల చొరవతోనే ఈ పురోగతి సాధ్యమవుతోందన్నది కాదనలేని వాస్తవం. 2030నాటికి ప్రతి వెయ్యి ప్రసవాలకు అయిదేళ్లకన్నా తక్కువ వయసున్న చిన్నారుల మరణాలు 25లోపు, నవజాత శిశు మరణాలు 12లోపునకు తీసుకురావాలని భారత్‌ లక్ష్యంగా నిర్దేశించుకొంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రభుత్వ వైద్య సేవల వ్యవస్థను పటిష్ఠపరచడంతోనే అది సాధ్యపడుతుంది. వైద్యరంగంలో ప్రజలందరికీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడం తప్పనిసరి. అంతకన్నా ముందు అన్ని ప్రభుత్వ వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీస వసతులను సమకూర్చాలి. దీనితోపాటు ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను ప్రభుత్వాలు సాకులు చూపించకుండా తక్షణమే భర్తీ చేయాలి. ఆరోగ్యం విషయంలో ప్రజలు మూఢనమ్మకాలను అధిగమించి శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించేలా చేయడం ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాలు. శిశువుల భావిజీవితం చిన్నాభిన్నం కాకుండా కాపాడే అన్ని టీకా మందులను ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉంచడం ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన ఇంకొక ప్రధాన అంశం. అనారోగ్య దుష్ప్రభావాల చక్రబంధంలో చిక్కుకున్న అభాగ్యులకు పునరావాస, పరిహార పథకాలపై పెట్టే శ్రద్ధను ప్రభుత్వాలు నివారణ చర్యలపై చూపిస్తే ఆరోగ్యవంతమైన మానవ వనరులు, సమర్థవంతమైన భావితరం మనకు దక్కుతాయి.

- వంగీపురం శ్రీనివాసాచారి (రచయిత - జీవన నైపుణ్యాల నిపుణులు, విశ్లేషకులు)
Posted on 14-06-2019