Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

బరువు కాదు... బాధ్యత

* అభాగ్యులకు అండగా సామాజిక పింఛన్లు

‘దేశంలో ఎవరైనా నిస్సహాయులుగా ఉన్నారంటే అది వ్యవస్థలు, పాలకుల వైఫల్యమే. ఆపన్నులను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత. దాన్ని విస్మరించడం ఏ మాత్రం సహేతుకం కాదు’- తమిళనాడులోని ఒక వృద్ధాశ్రమాన్ని 2006లో సందర్శించిన అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం చేసిన వ్యాఖ్యలివి. వృద్ధుల దీన స్థితిగతులను చూసి ఆయన ఆవేదనగా స్పందించారు. అప్పటికీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా వయోవృద్ధుల పరిస్థితి దయనీయంగానే ఉంది. సమాజంలోని దివ్యాంగులు, వితంతువులు, ఇతర సామాజికవర్గాలవారు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వపరంగా వారికి ఆశించిన సాయం అందడం లేదు. సామాజిక న్యాయం జరగడం లేదు. ఎన్నో రాష్ట్రాల్లో వారు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. సామాజిక భద్రత ఎండమావిగా మారింది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలు కొంత ఉదారత చూపడం ఆశాజనక పరిణామం.

పేదరికంతో కష్టాలు రెట్టింపు
దేశంలో ప్రస్తుతం 10 కోట్ల మంది వృద్ధులు, 2.68 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారు. వితంతువుల సంఖ్య నాలుగు కోట్ల మేరకు ఉంది. వీరిలో చాలామంది కష్టాల్లో ఉన్నవారే. ఆర్థికంగా ఓ మాదిరిగా ఉన్న కుటుంబాలతో పోలిస్తే పేద కుటుంబాల్లోని వృద్ధులు రెట్టింపు బాధలు పడుతున్నారు. ముదిమి వయసులో ముప్పిరిగొనే అనారోగ్య సమస్యలు, కన్నవారి నిరాదరణ వంటివి వారి జీవన స్థితిగతులను దుర్భరం చేస్తున్నాయి. సొంతంగా పనులు చేసుకోలేని నిస్సహాయ స్థితిలో వారు ఇతరులపై ఆధారపడుతున్నారు. సాయం అందించేవారు అతి తక్కువగా ఉన్నారు. వృద్ధ మహిళలకు సమస్యలు మరీ ఎక్కువ. వృద్ధాశ్రమాల్లో, భిక్షాటనలో ఉన్నవారి గాథలు కన్నీళ్ళు తెప్పిస్తాయి. సాయం కోసం పోలీసులు, న్యాయస్థానాలు, అధికారులను ఆశ్రయిస్తున్నవారెందరో ఉన్నారు. మరోవైపు దేశంలో దివ్యాంగులు వైకల్యాలతో ఇక్కట్లు పడుతున్నారు. భర్తల్ని కోల్పోయిన మహిళలకు అగచాట్లు తప్పడం లేదు. కుటుంబీకుల నుంచి ఆదరణ లోపించడంతోపాటు వారికి అవసరమైన వసతులు, సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, అన్నింటినీ మించి ప్రభుత్వాల నుంచి చేయూత అందకపోవడం వల్ల పేద కుటుంబాలకు చెందినవారు బాధితులుగా మిగిలిపోతున్నారు.

భారత రాజ్యాంగంలోని 41వ అధికరణ వృద్ధులు, అనారోగ్య పీడితులు, దివ్యాంగులు, నిరుద్యోగులు, ఇతరత్రా ఇబ్బందులు పడేవారికి ప్రభుత్వం తగిన సాయం అందించాలని నిర్దేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చొరవ తీసుకోవాల్సి ఉన్నా జాప్యం జరిగింది. స్వాతంత్య్రం సిద్ధించిన 48 ఏళ్ల తరవాత కేంద్ర ప్రభుత్వం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని (ఎన్‌ఎస్‌ఏపీ) ప్రారంభించింది. దీనికింద సామాజిక పింఛన్ల పంపిణీని చేపట్టింది. మొదట్లో రూ.50తో పింఛను పథకం ప్రారంభమైంది. తొలుత కొన్ని రాష్ట్రాలకే అది పరిమితమైంది. క్రమేపీ పింఛన్లను కోరుకునేవారి సంఖ్య పెరగడంతో అన్ని రాష్ట్రాలకూ దీన్ని విస్తరించారు. కేంద్ర ప్రభుత్వం పింఛను పథకాలకు ఇస్తున్నది కేవలం రూ.200 మాత్రమే. వీటికి రాష్ట్ర ప్రభుత్వాలు కొంత కలిపి సాయం అందించాలి. దేశంలోనే చాలా రాష్ట్రాలు ఈ పథకాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రస్తుతం ఒడిశా, ఉత్తర్‌ ప్రదేశ్‌లలో సామాజిక పింఛన్లు రూ.300 వరకు ఉన్నాయి. బిహార్‌, జమ్మూ కశ్మీర్‌, తమిళనాడుల్లో రూ.400. రాజస్థాన్‌లో రూ.500, హిమాచల్‌ ప్రదేశ్‌లో రూ.550, సిక్కిం, కేరళ, మహారాష్ట్రల్లో రూ.600 చొప్పున పింఛను అందుతోంది. నిత్యావసరాలు మొదలుకొని అన్ని వస్తువుల ధరలూ ఆకాశాన్నంటున్న తరుణంలో ఇంత తక్కువ మొత్తం లబ్ధిదారులకు ఏ విధంగానూ ఉపయోగపడటం లేదు.

ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంలో 2014 మే వరకు నెలవారీ పింఛను రూ.200 మాత్రమే ఉండేది. అదీ వృద్ధులు, మరికొన్ని వర్గాలవారికి మాత్రమే లభించేది. రాష్ట్ర విభజన తరవాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఈ పథకాలపై దృష్టి సారించాయి. తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, వితంతువుల పింఛన్ను రూ.200 నుంచి వెయ్యి రూపాయలకు, దివ్యాంగుల పింఛన్ను రూ.1,500కు పెంచింది. పింఛను పరిధిని విస్తరించి, రాష్ట్రంలోని మహిళా బీడీ కార్మికులు, ఏ అండా లేని ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, చేనేత కార్మికులను ‘ఆసరా’ జాబితాలో చేర్చింది. ఆపై తెరాస ప్రభుత్వం శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సాధారణ పింఛన్ను నెలకు రూ.2,016కు, దివ్యాంగుల పింఛన్ను రూ.3,016కు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం జులై మాసం నుంచి కొత్త పింఛన్లు అందనున్నాయి. మరోవైపు వృద్ధాప్య పింఛను వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. ప్రస్తుతం పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 39 లక్షలు. వయోపరిమితి సడలింపు వల్ల మరో ఏడు లక్షల మంది ఈ పథకం పరిధిలోకి రానున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వెలుగులు
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నిర్ణయాల వల్ల 1.06 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వర్గాల్లోని లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు విరజిమ్మనున్నాయి. ఈ రాష్ట్రాల ఆర్థిక చేయూతతో వారికి మేలు కలగనుంది. పింఛను సాయం పెంపుతో వారి అవసరాలు తీరడంతో పాటు, గౌరవమూ పెరగనుంది. ఆత్మగౌరవంతో జీవించడానికి వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటికే పింఛను వల్ల సమాజంలో, ముఖ్యంగా ఇళ్లలో వృద్ధులకు ఆదరణ కొంతమేరకు ఇనుమడిస్తోంది. ఇబ్బందులు తగ్గుతున్నాయి. దివ్యాంగులకూ ఇది ఎంతో ప్రయోజనకరం. ఈ పథకాలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. నిర్వహణ పరమైన సమస్యలను అధిగమించాలి. పింఛన్లను పొందడానికి ఇంకా ఎందరో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ ఈ ప్రయోజనం అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుని, వ్యవస్థీకృత లోపాలను పరిహరించాలి.

పింఛన్లతో ఆగిపోరాదు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014 నుంచి నెలవారీ సాధారణ పింఛన్ను వెయ్యి రూపాయలకు, దివ్యాంగుల పింఛన్ను రూ.1,500కు పెంచింది. ఇటీవల శాసనసభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఈ పింఛను మొత్తాన్ని పెంచింది. ప్రస్తుతం ఏపీలో 12 రకాల పింఛన్లు అమలులో ఉన్నాయి. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, చర్మకారులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా రెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. డప్పు కళాకారులు, హిజ్రాలకు మూడు వేలరూపాయల చొప్పున ఇస్తోంది. ‘సదరం’ ధ్రువీకరణ పత్రం ఆధారంగా 80 శాతం వైకల్యమున్నవారికి రూ.3,000; 40 శాతం నుంచి 79 శాతం వైకల్యం ఉన్నవారికి రూ.2,000 చొప్పున సాయం అందిస్తోంది. డయాలసిస్‌ పొందుతున్న కిడ్నీ రోగులకు రూ.3,500 చొప్పున ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పింఛన్ల పెంపు దస్త్రంపై తొలి సంతకం చేశారు. వైఎస్‌ఆర్‌ పింఛనుగా పేరు మార్చి జూన్‌ నుంచి రూ.2,250 ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏడాదికి రూ.250 చొప్పున ఇలా రూ.3,000 వరకూ పెంచుకుంటూ వెళ్తామని వెల్లడించారు. తాజాగా సీఎం నిర్ణయంతో రూ.2,000 సాయం పొందుతున్న వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, చర్మకారులు, ఒంటరి మహిళలకు ఇకపై ప్రతి నెలా రూ.2,250 చొప్పున అందనుంది. వీరితోపాటు 40 శాతం నుంచి 79 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు సైతం రూ.3,000 సాయాన్ని వర్తింపజేయనుంది. ప్రస్తుతం 65 ఏళ్ల అర్హత వయసుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు 54.10 లక్షల మంది ఉన్నారు. తాజాగా వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 60 ఏళ్లకు తగ్గించడంతో ప్రజాసాధికార సర్వే ప్రకారం మరో 5,49,823 మందికి అదనంగా లబ్ధి చేకూరనుంది.

పింఛన్ల పెంపుదలతో వృద్ధులు, దివ్యాంగుల కష్టాలన్నీ పరిష్కారం కావన్నది నిర్వివాదం. నెలకు కేవలం రూ.2,000 నుంచి రూ.3,000 వరకు సాయంతో ఈ వర్గాలవారికి సంపూర్ణ సాయం అందదు. వారి సంక్షేమానికి మరింత కృషి చేయాల్సి ఉంటుంది. వృద్ధుల జీవన స్థితిగతుల్ని మార్చాలి. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేసే పిల్లల్లో పరివర్తన తేవాలి. వృద్ధుల నిత్యావసరాలు తీరేందుకు అవసరమైన ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలి. ఆహారభద్రతకూ లోటు ఉండకూడదు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు ఇతరచోట్ల వారికి ప్రత్యేక వసతులుండాలి. వారికి ప్రాధాన్యం ఇచ్చి పనులు చేయాలి. దివ్యాంగులకు చట్టపరంగా రిజర్వేషన్లను తప్పనిసరిగా అమలు చేయాలి. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు సరిగ్గా లేక వాటి కోసం దివ్యాంగులు పోరాడుతున్నారు. కేంద్రం ప్రస్తుతం సామాజిక పింఛన్లకు ఇస్తున్న రూ.200 సాయాన్ని భారీగా పెంచాలి. కేంద్ర పథకంగా దీనికి తగిన ప్రాధాన్యం లభించాలంటే, కేంద్రం మరింత ఉదారత చూపాలి. బడ్జెట్‌ కేటాయింపులు పెరగాలి. సమాజంలోని నిస్సహాయ వర్గాలను ఆదుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అన్ని రాష్ట్రాల్లో ఒకే తరహా పింఛను విధానాన్ని అమలు చేయాలి. తెలుగు రాష్ట్రాల తరహాలో కేంద్రం, మిగిలిన రాష్ట్రాలూ సామాజిక భద్రతకు పెద్ద పీట వేసేందుకు ముందుకు రావాలి.

- ఆకారపు మల్లేశం
Posted on 19-06-2019