Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

బహుళ భాషలతో బంగరు భవిత

* ప్రాధాన్య క్రమంలోబోధన

మన మాతృభాషలు ఆధునిక అవసరాలకు సరిపోతాయా? దేశంలో ఆర్థికంగా బలసంపన్నులు ఇంగ్లిష్‌ని ఒక సాధనంగా వాడుకుని బాగా బలపడ్డారా? ఇంగ్లిష్‌ ద్వారా మంచి ఉద్యోగాలు, సంపద పొందారు కాబట్టి దాని ఆధిపత్యాన్ని అలాగే కొనసాగించాలని వారు అనుకుంటున్నారా? అభివృద్ధిలో దూసుకుపోవడానికి ఇతర దేశాలు ఇంగ్లిష్‌కు దాసోహమయ్యాయా? ఇక ఇప్పుడైనా మాతృభాషలకు పెద్దపీట వేసి, ఇన్నాళ్ళూ ఆ భాషలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దగలమా?- ఈ ప్రశ్నలన్నీ భాషాభిమాన పండితులు వేసినవి కావు. కొత్త జాతీయ విద్యావిధానంపై కస్తూరి రంగన్‌ కమిటీ రూపొందించిన నివేదికలో ఇలాంటి ప్రశ్నలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలా ఉన్నాయి. మన దేశంలో భాషాభిమానులు, విద్యావేత్తలు ఎప్పటినుంచో మాతృభాషల్లోనే చదువు ప్రధానంగా ఉండాలని కోరుకుంటున్నారు. దీనికి భాషాభిమానమో, సొంత భాషలోని సాహిత్యంపై మమకారమో కారణం కాదు. ఏ విషయమైనా సొంత భాషలో నేర్చుకున్నంత వేగంగా, సమగ్రంగా మరో భాషలో నేర్చుకోలేరని ఎన్నో శాస్త్రీయ సిద్ధాంతాలు చెబుతున్నాయి. వీటిని బలంగా విశ్వసించి ఎన్నో రూపాల్లో మాతృభాష కోసం ఎందరో గొంతెత్తుతూనే ఉన్నారు. దీనికి భిన్నంగా దళిత, వెనకబడిన వర్గాల మేధావులు కొందరు మరో బలమైన వాదన వినిపిస్తున్నారు.

భిన్న వాదనలు
ఎంత గొప్ప శాస్త్రీయ సిద్ధాంతమైనా మన దేశానికి ఏదీ పూర్తిగా సరిపడదని, ఒక్క మాతృభాషల్లోనే బోధనకు పెద్దపీట వేస్తే దళిత, వెనకబడిన వర్గాలు ఎప్పటికీ పైవర్గాలతో పోటీపడలేరని వారు గట్టిగా వాదిస్తున్నారు. మనదేశంలో శతాబ్దాల తరబడి కొనసాగిన కుల ఆధారిత సామాజిక వ్యవస్థ వల్ల ఏర్పడిన అసమానతలు అంత తొందరగా పోవని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఎక్కువగా దళిత, వెనకబడిన వర్గాలవారేనని, వీరికి ఆంగ్లాన్ని దూరంచేస్తే అంతరాలు అలాగే మిగిలిపోతాయన్నది ఆ మేధావుల వాదన. దీన్ని అంత తేలిగ్గా కొట్టేయలేం. ఇంగ్లిష్‌ బాగా వచ్చినవారే అన్నచోట్ల ఉన్నత స్థాయికి వెళ్లడం అందరికీ కనిపించే కఠోర వాస్తవం. ఇంగ్లిష్‌పై మోజు సమాజంలో ఎలా పాతుకుపోయిందో 122 ఏళ్ల క్రితమే గురజాడ కన్యాశుల్కంలో ఎంతో వ్యంగ్యంగా చెప్పారు. ‘మా అబ్బాయీ మీరూ ఒక పర్యాయం యింగిలీసు మాట్లాడండి బాబూ!’ అని వెంకమ్మ అమాయకంగా అడిగితే గిరీశం-వెంకటేశం వెలగబెట్టిన ‘ఇంగిలీసు’ విని నవ్వుకోని తెలుగువారెవరైనా ఉంటారా?

దేశంలో పెద్ద కులాల చేతుల్లోనే పెద్ద ఆర్థిక వనరులు ఉన్నాయి. ఎన్నో సర్వేల్లో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. దేశవిదేశాలకు చెందిన సామాజిక నిపుణులు కులానికి, ఆర్థిక వనరులకు మధ్యగల సంబంధాన్ని చాలా లోతుగా విశ్లేషించారు. స్వాతంత్య్రానంతరం ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా పరిస్థితి తలకిందులయ్యే రీతిలో మార్పు రాలేదు. ఇప్పటికీ ఈ వనరుల విషయంలో దళిత, వెనకబడిన వర్గాలు అగ్రకులాలతో పోటీ పడలేరు. 70 ఏళ్ల అనుభవం చూసిన తరవాత వనరుల పునఃపంపిణీ ఇకపై సాధ్యమవుతుందని చెప్పుకోలేం! ఇక మిగిలిందల్లా విద్యారంగం ఒక్కటే. అందరికీ ఓటు హక్కు ఉండటం వల్ల ఈ రంగాన్ని ప్రభుత్వం అంత తేలిగ్గా నిర్లక్ష్యం చేయలేదు. కాబట్టి విద్యా రంగంలో ప్రాథమిక సౌకర్యాలు, మంచి ఇంగ్లిష్‌ బోధన ఉంటే పైకి ఎగబాకడానికి తమకూ ఒక మార్గం అంటూ దొరకుతుందని దళిత, వెనకబడిన వర్గాల మేధావులు వాదిస్తున్న నేపథ్యంలో కస్తూరి రంగన్‌ కమిటీ నివేదిక వెలుగులోకి వచ్చింది.

ఆంగ్లం వల్ల కొందరే లాభం పొందారని కస్తూరి రంగన్‌ కమిటీ చెప్పినప్పటికీ దాన్ని పక్కన పెట్టాలని సూచించలేదు. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన మాతృభాషల్లో ఉండేలా పెద్దయెత్తున చర్యలు చేపడుతూనే, ప్రభుత్వ పాఠశాలల్లోనూ బహుభాషా బోధనలో భాగంగా ఇంగ్లిషునూ నేర్పించాలని సూచించింది. ఇంగ్లిష్‌ విషయంలో ప్రైవేటు-ప్రభుత్వ పాఠశాలల పట్ల ఎటువంటి విచక్షణ పాటించకూడదని స్పష్టం చేసింది. అయితే ఆంగ్లం ఏదో గొప్ప భాషని గాని, అది నేర్చుకొనకపోతే అంతా చీకటనిగాని చెప్పలేం. రెండు నుంచి ఎనిమిదేళ్ల వయసులో పిల్లలు సహజంగానే బహుభాషల్ని నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉంటారని, దాన్ని అందిపుచ్చుకొని వారికి కనీసం మూడు భాషల్లో చదవటం, రాయటం పట్టుబడేలా చేయాలని చెప్పింది.
మూడు నాలుగు భాషలు నేర్చుకున్న పిల్లలు ఇతర విషయాలను కూడా చాలా తొందరగా నేర్పుకుంటారని, పెరిగి పెద్దయిన తరవాత వారు మంచి స్థితిలోకి వెళ్లగలుగుతారని చెప్పింది. బహుళ భాషలను నేర్చుకోవడం పిల్లల మేధావికాసానికి అత్యవసరమని, దాన్ని ప్రధానంగా ఆ కోణం నుంచి చూడాలనీ తెలిపింది. త్రిభాషా సూత్రాన్ని 1968లో ఆమోదించినా అది ఎక్కడా అనుకున్న విధంగా అమలుకాలేదు. పాఠశాల విద్యను పూర్తిచేసుకున్న ఒక సగటు విద్యార్థి మూడు భాషల్లో మాట్లాడటం, రాయడం అనేది ఇప్పటికీ మనకు అనూహ్యమే! ఇంగ్లిష్‌ అయినా బాగా పుంజుకొందా అంటే అదీ లేదు. దేశంలో 15 శాతం మందికి మాత్రమే ఇంగ్లిష్‌ ఎంతో కొంత పట్టుబడింది. హిందీ, దాంతో సారూప్యత కలిగిన భాషల్లో మాట్లాడేవారు 54 శాతం దాకా ఉన్నారు.

లోటుపాట్లు అనేకం
మాతృభాష, ఇంగ్లిష్‌కు తోడు మరో భాషను పిల్లలకు నేర్పించడానికి మన పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారా అంటే ప్రస్తుతం లేరనే చెప్పుకోవాలి. పాఠ్యపుస్తకాలు కూడా దేశ భాషల్లో సమగ్రంగా ఉన్నాయనీ అనలేం. ఇదొక పెద్ద సమస్య. దీన్ని పరిష్కరించకుండా ఒక్క అడుగైనా ముందుకు పడదు. త్రిభాషా సూత్రం అమలు కావాలంటే ఆంగ్లంలో ఉన్నవాటికి దీటుగా పాఠ్యపుస్తకాలు దేశభాషల్లో రావాలి. అందుకోసం మంచి ప్రతిభ ఉన్న ఉపాధ్యాయులకు ఆ పని అప్పగించాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమస్ఫూర్తితో ఏళ్ల తరబడి పాటుపడితేనే ఇది సాధ్యమవుతుంది. దేశ భాషల్లో తేలిగ్గా విషయాలను చెప్పడం పిల్లల మేధా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని కస్తూరి రంగన్‌ చెప్పడమే కాదు, మన భాషలకు ఆ శక్తి ఉందని చాలా ఉదాహరణలను కూడా ఇచ్చింది. ఇంగ్లిష్‌ అంతర్జాతీయ భాషగా అతి కొద్దికాలంలో ఎదిగిపోతుందని దేశదేశాల ప్రజలకు అదో అత్యవసరమైన భాషగా మారిపోతుందని 1950-60ల్లో వేసుకున్న అంచనాలు నిజంకాలేదనీ చెప్పింది. అభివృద్ధి చెందిన దేశాలు ఇంగ్లిష్‌ ఆలంబనతోనే ఎదగలేదని, తమ భాషల్లో విద్యా బోధనను పటిష్ఠపరచుకుని ఆ స్థాయి సాధించాయని అంది.

మన భాషల విషయానికొస్తే ఉత్తరాది, దక్షిణాదిలోని ప్రధాన భాషల్లో లిఖిత సాహిత్యం వెయ్యేళ్ల నుంచే ఉంది. అనేక విషయాలపై ఎన్నో పుస్తకాలున్నాయి. పదాల ఉచ్చారణలో ఎంతో నిర్దిష్టత ఉంది. పలికే పదానికి, రాసే పదానికి శబ్దపరంగా వ్యత్యాసం కూడా పెద్దగా ఉండదు. ముఖ్యంగా దేశ భాషలు స్థానిక సంస్కృతితో పెనవేసుకుని ఉంటాయి. మనిషి మనుగడ అంతా సంస్కృతి భాషలపైనే ఆధారపడి ఉంటుంది. మన ఆలోచలన్నీ పదాలు, వాక్యాల రూపంలోనే సాగుతాయి. పదాలు, వాక్యాల ద్వారానే మనం విజ్ఞానాన్ని ఒక క్రమంలో మనసులో దాచుకుంటాం. అందుకే నేర్చుకున్న భాషల సంఖ్య పెరిగితే విజ్ఞాన విస్తృతి పెరుగుతుంది. విజ్ఞానం పెరిగితే సంపద పెరుగుతుంది. సంకుచిత ఆలోచనలు అంతరిస్తాయి. బహుభాషల్లో నేర్పు వల్ల ఇన్ని లాభాలున్నాయి. మరి ఆ దిశగా కస్తూరి రంగన్‌ కమిటీ సిఫార్సులతోనైనా అడుగులు పడతాయా లేక గతంలోని త్రిభాషా సూత్రంలా హడావుడి మొదలై పురోగతి అంతంత మాత్రంగా ఉండిపోతుందా అన్నది వేచి చూడాలి!

 

- ఎన్‌.రాహుల్‌ కుమార్‌
Posted on 19-06-2019