Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ఆరోగ్య యోగం... ఆనంద యానం

* నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

ప్రపంచం అనితర సాధ్యమైన వేగంతో ముందడుగు వేస్తోంది. అదే జోరును కొనసాగిస్తూ ప్రగతి పథంలో భారత్‌ మునుముందుకు దూసుకుపోతోంది. దేశాభివృద్ధి సూచీలు భవిష్యత్తుపై ఆశలు పెంచుతుంటే, ఆరోగ్య సూచీలు మాత్రం ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి. మారుతున్న కాలం, పెరుగుతున్న వేగం- మనిషి అలవాట్లు, ఆలోచనలు, జీవనశైలి పద్ధతుల్లో పెనుమార్పులకు కారణం అవుతున్నాయి. నిత్యం సంఘర్షణ, అనుక్షణం ఒత్తిడి ఎదుర్కొంటున్న వేళ- అందరికీ ఆరోగ్యం, ఆనందం లభించే మేలిమి సాధనంగా ప్రపంచం ‘యోగా మార్గాన్ని’ గుర్తించింది. ప్రధాని నరేంద్రమోదీ అవిరళ కృషి కారణంగా ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఇది భారతీయ సనాతన యోగా మార్గానికి లభించిన గుర్తింపు. యోగావల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుని, ఆచరణలో పెట్టి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందడం మనందరి కర్తవ్యం.

కుమార సంభవం కావ్యంలో ‘శరీరమాద్యం ఖలు ధర్మ సాధనమ్‌’ అంటే శరీరమే అత్యంత ముఖ్యమైన ధర్మ సాధనమని కాళిదాస మహాకవి ప్రవచించారు. ఆ మహనీయుడి మాటలు నిక్కమైన నిజాలు. కర్మలు చేసేది, ధర్మాన్ని అభ్యసించేది, సాధించేది శరీరమే. శరీరం, మనసు ఈ రెండు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. వీటిలో దేనికి సమస్య వచ్చినా ఆ ప్రభావం రెండో దానిపై పడుతుంది. మానసిక సమస్యలు ఎదురైన వారిలో శారీరక అనారోగ్యాలు, శారీరక సమస్యలు ఉన్నవారిలో మానసిక ఇబ్బందులు సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఏ చికిత్స అయినా శరీరానికి, మనసుకు ఏకకాలంలో జరగాలని వైద్యులు సలహా ఇస్తుంటారు.

ఆసనాలతో ఆరోగ్యం
నేడు శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడవుతున్న అనేక సమస్యలపై మన పూర్వీకులు అద్భుతమైన విశ్లేషణ చేశారు. శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా మార్గాన్ని చూపించారు. ఆసనాల ద్వారా అన్ని అవయవాలు ఆరోగ్యం సంతరించుకుంటాయి. ధ్యానం ద్వారా మనసులోని ప్రతి ఆలోచనకు కళ్ళెం పడి అదుపులో ఉంటుంది. ఈ రెండూ యోగా మార్గం ద్వారానే సాధ్యమవుతాయి. పతంజలి మహర్షి యోగా స్వరూప లక్షణాలు ప్రస్తావించుకుందాం అని ప్రారంభించి తొలుత చెప్పే మాట కూడా ఇదే! చిత్త వృత్తులను అదుపులో పెట్టడమే యోగం. ఇంద్రియం, మనసు, బుద్ధి, అహంభావం అనే అంతఃకరణ చతుష్టయాన్ని అదుపులోకి తెచ్చుకుని ముందుకు సాగే మార్గమే యోగ. నిజానికి దీన్ని ఎంతో కఠినమైన మార్గంగా చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ భావనే మనకు చాలా కాలం యోగా మార్గాన్ని దూరం చేసిందన్నది నా అభిప్రాయం. చాలా తేలికైన ఆసనాలు, సాధారణ ధ్యానం ద్వారా సైతం యోగా ప్రయోజనాలు పొందవచ్చు. క్రమం తప్పకుండా సాధన చేయడమే కీలకం. యోగా ద్వారా ఉన్నతమైన లాభాలు పొందిన వారిలో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. యోగా ప్రాధాన్యం గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే యోగా ఫలాలు అందరికీ అందించాలనే సంకల్పంతో దానికి విస్తృత ప్రాచుర్యం కల్పించి, అందరి జీవితాల్లో యోగాను అంతర్భాగంగా మార్చాలని, ప్రపంచమంతా యోగా విశిష్టతను మననం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలని భావించారు. ఆయన సంకల్పాన్ని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఆమోదించాయి. ఈ చొరవ నరేంద్ర మోదీ ప్రాపంచిక దృక్పథానికి, క్రాంతదర్శనానికి నిదర్శనం. ఆయన గట్టి చొరవ ప్రదర్శించకపోయి ఉంటే నేడు యోగా గురించి ప్రపంచ దేశాలన్నీ ఈ స్థాయిలో మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు. మోదీ వేసిన ముందడుగు కోట్ల సంఖ్యలో ప్రపంచ ప్రజలకు ‘యోగ’ మార్గాన్ని చూపించింది.

యోగా అనే పదం ‘యుజ్‌’ అనే ధాతువు నుంచి ఉద్భవించింది. అంటే కలయిక, ఐక్యం, జత చేయడం అని అర్థం. దాంతోపాటు యోగా శబ్దానికి అదృష్టం, సంబంధం అనే అర్థాలూ ప్రచారంలో ఉన్నాయి. శరీరాన్ని, మనసును కలపడమే యోగా. దీని ద్వారా పొందే ప్రయోజనాన్ని మరే ఇతర శారీరక, మానసిక వ్యాయామాల ద్వారానూ పొందలేమన్నది నిర్వివాదాంశం. యోగాను కాలంతోనూ మతంతోనూ ముడిపెట్టి చూడటం బాధాకరం. యోగా పురాతనమైనదే కాదు, అత్యంత విలువైనది కూడా. సనాతన కాలం నుంచి నేటి వరకు అనేక సమస్యలకు అది పరిష్కారాలు చూపిస్తూనే ఉంది. ఎందుకంటే యోగా మార్గాన్ని మన పూర్వీకులు పరిశీలించి, పరిశోధించి, అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించారు. అలాంటి అత్యుత్తమ ఆరోగ్యమార్గాన్ని నేటి విజ్ఞాన శాస్త్రం అందించగలదా అన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది. అదే విధంగా యోగాను మతంతో ముడిపెట్టే ప్రయత్నాలు కొంత మంది చేయడం ఆందోళన కలిగిస్తోంది. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అనే పంచభూతాలకు కుల, మత భేద భావం ఎలా లేదో అదే విధంగా యోగాకు సైతం మతం లేదు. యోగా మార్గం ఓ జీవన విధానం, అది ఓ ఆరోగ్య శాస్త్రం! సంకల్పం, సాధన, సద్వివేచన ఉంటే చాలు.... భారతీయ సంస్కృతిలో, జీవన విధానంలో అంతర్భాగమైన యోగా చైతన్య గంగను ఎవరైనా ఆస్వాదించవచ్చు.

యువతకు కీలకం
ప్రస్తుత సమాజంలో అవసరమైన సమస్యల కంటే, అనవసరమైన సమస్యలే ఎక్కువయ్యాయి. వీటి కారణంగా బరువు పెరగడం మొదలుకుని ఆత్మన్యూనత వరకు ఎన్నో అంశాలు యువతను అల్లకల్లోలపరుస్తున్నాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులు వారి ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయి. ఫలితంగా శారీరక అనారోగ్యాలతో పాటు వారి మీద వారికి అదుపు లేక నమ్మకం సన్నగిల్లి, ఆత్మవిశ్వాసం తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో యువతకు యోగా మార్గాన్ని మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉంది. పాఠశాలలు, కాలేజీల పాఠ్యప్రణాళికల్లో యోగాను భాగం చేయాలి. ‘ఎన్‌సీసీ’ లాంటి వాటిలో ప్రాధాన్యం ఇవ్వాలి. యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదు- అది శరీరాన్ని, మనసును కలిపే ఓ ఆధ్యాత్మిక సాధనం. అనారోగ్యం లేని శరీరం, తికమకలు లేని మనసు, సందేహాలు లేని బుద్ధి ఈ మూడింటిని సాధించగలిగిన నాడే జీవనం చక్కని మార్గంలో ముందుకు సాగుతుంది. ఈ తరహా జీవనం బాధల నుంచి, రోగాల నుంచి, వ్యసనాల నుంచి, ఆందోళన తదితర సమస్యల నుంచి బయటపడేస్తుంది. అలాంటి ఉత్తమమైన మార్గాన్ని అనుసరించే వారి గురించి ఓ సందర్భంలో వేమన చెప్పిన పద్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం సముచితం.

కల్లగురుడు గట్టు కర్మచయంబులు
మధ్యగురుడు గట్టు మంత్రచయము
ఉత్తముండు గట్టు ‘యోగ’ సామ్రాజ్యంబు
విశ్వదాభిరామ వినురవేమ

కపట గురువు కర్మపాశంలో చిక్కుకునే విధంగా ప్రోత్సహిస్తే, మధ్యముడైన గురువు మంత్ర సంబంధమైన మార్గాన్ని చూపిస్తాడు. ఉత్తమ గురువు మాత్రం యోగా మార్గంలోకి తీసుకువెళతాడు అని ఆ పద్యం అర్థం.
శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యమే వ్యక్తి సంపూర్ణ స్వస్థతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించింది. ఈ సిద్ధాంతాన్ని వేల ఏళ్లుగా భారతీయ సంస్కృతి నమ్మి ఆచరించి ముందుకు నడిచింది. విదేశీయుల దండయాత్రలు కావచ్చు, పాశ్చాత్య వ్యామోహం కావచ్చు, యోగాకు మతాన్ని ముడిపెట్టడం కావచ్చు- ఏదేమైనా యోగా మార్గానికి భారతీయులు కాస్తంత దూరమైన మాట వాస్తవం. ఆ దుష్ఫలితాలను దేశం చాలా కాలం అనుభవించింది. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రపంచమంతా యోగా మార్గం వైపు దృష్టి సారిస్తోంది. అన్ని దేశాల ప్రజలు కుల మతాలకు అతీతంగా దీన్ని అవలంబిస్తున్నారు. కొన్ని దేశాల చట్టసభల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, కోస్టారికా లాంటి దేశాలు ఏకంగా అందుకు అనుగుణంగా ‘డిక్రీలు’ విడుదల చేశాయి. యుగయుగాల విశిష్టతను నిలబెట్టుకుంటున్న యోగా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అవలంబించాలని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాను.

నైపుణ్యం, ఏకాగ్రత పెంచుకునే మార్గం
‘చేసే పనిలో నైపుణ్యాన్ని పెంచుకోవడమే యోగం అని భగవద్గీత చెబుతోంది. ఇవాల్టి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిళ్లను, చైతన్యరహితమైన జీవన విధానంలో ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను ఏక కాలంలో హరించే శక్తి ‘యోగ’కు ఉంది. ఆలోచనలు, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కనబరచి- శరీరంలో జరిగే రసాయన ప్రక్రియలను ‘యోగ’ సమతులం చేస్తుంది. నిత్యం యోగాభ్యాసం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందనే విషయం రుజువైంది. దానివల్ల ఆలోచన సామర్థ్యం, తద్వారా సృజనాత్మకత వృద్ధి చెందుతాయి. ఏకాగ్రతతో చేసే ఏ పని అయినా మనలోని సంపూర్ణ నైపుణ్యాన్ని వెలికి తీస్తుంది. ఈ మార్గంలో యోగాభ్యాసం కేవలం శారీరక మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాక, వృత్తుల్లో కావలసిన నైపుణ్యాన్నీ అందిస్తుంది. అదే విధంగా రోజువారీ పని ఒత్తిడిని తట్టుకోవాలన్నా యోగా సరైన మార్గం. అందుకే ఏ ఉద్యోగాలు చేసే వారైనా ఉదయాన్నే కాసేపు యోగా, వ్యాయామం చేయడంవల్ల వారు తమ వృత్తుల్లో మంచి స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.

 

Posted on 21-06-2019