Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

‘గంగ’ కోసం బెంగ

* తరుగుతున్న జలవనరులు

మానవుడి నీటి అవసరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాగడానికి, గృహావసరాలకు, పంటలు పండించడానికి, విద్యుదుత్పాదనకు, పారిశ్రామికాభివృద్ధికి, చేపల పెంపకానికి, నౌకాయానానికి నీరు అవసరం. తగినంత నీరు లభించక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికాభివృద్ధి, సాంఘికాభివృద్ధి నీటి అవసరాలను మరింతగా పెంచాయి. అవసరాల మేరకు జలవనరులు అభివృద్ధి చెందకపోవడం వల్ల నీటికొరత ఉద్ధృతమవుతోంది!

భూమిమీదున్న మొత్తం నీటిపరిమాణం 140 కోట్ల ఘన కిలోమీటర్లని అంచనా. ఈ నీటినంతటినీ భూతలంపై సమానంగా పరచినప్పుడు దాని మందం మూడువేల మీటర్లుంటుంది. ఇది భారీ పరిమాణమే. దానిలో 136.2 కోట్ల ఘన కిలోమీటర్లు (97.3 శాతం) ఉప్పునీటి రూపంలో సముద్రాలలో ఉంది. 3.8 కోట్ల ఘన కిలోమీటర్లలో 2.9 కోట్ల ఘన కిలోమీటర్లు ధ్రువప్రాంతాలలో మంచురూపంలో గడ్డకట్టుకొని నిరుపయోగంగా ఉంది. మిగిలినది భూగర్భంలో, నదులు, సరస్సులు, చిత్తడి నేలల్లో ఉంది. మొత్తంమీద ఉపయోగానికి అందుబాటులో ఉన్న నీరు 43 లక్షల ఘన కిలోమీటర్లు మాత్రమే. ఈ అత్యల్ప జల పరిమాణం మీదనే భూమండలంలోని సకలజీవరాసుల మనుగడ ఆధారపడి ఉంది.

దేశంలో సగటు వార్షిక వర్షపాతం 4,000 బిలియన్‌ ఘన మీటర్లు. దానిలో నదులలోనూ, వాగులలోనూ పారే నీరు 1,869 బిలియన్‌ ఘనమీటర్లు. డ్యాములు, ఆనకట్టలు కట్టడానికి అనుకూలమైన స్థలాలు లభించకపోవడం, సాంకేతిక, పర్యావరణ ప్రతిబంధకాల వల్ల జలాశయాలలో నిల్వ చేసుకొని ఉపయోగించుకోగలిగే నీటిపరిమాణం 690 బిలియన్‌ ఘన మీటర్లు మాత్రమే. అదనంగా ఏడాదికి 450 బిలియన్‌ ఘన మీటర్ల భూగర్భజలం లభిస్తుంది. అంటే దేశంలో లభ్యమయ్యే భూతల, భూగర్భజలాల మొత్తం పరిమాణంలో ఉపయోగపడేది 1,140 బిలియన్‌ ఘనమీటర్లు మాత్రమే. 2050 నాటికి దేశజనాభా 164 కోట్లకు పెరిగి, వివిధ కారణాల వల్ల అక్కడ ఆగిపోతుందని అంచనా. జలవనరులను పొదుపుగా ఉపయోగించుకున్నప్పుడే జనాభా అవసరాలు ఏదో ఒక స్థాయిలోనైనా తీరతాయి.

ఐక్యరాజ్యసమితి ప్రమాణాల ప్రకారం వార్షిక తలసరి నీటిలభ్యత 1,700 ఘన మీటర్లకంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటిఒత్తిడి ఉన్నట్లు, 1,000 ఘన మీటర్ల కంటే తక్కువగా ఉండే ప్రాంతాల్లో నీటికొరత ఉన్నట్లు పరిగణిస్తారు. దేశంలో ఏటా వర్షపాతం ద్వారా లభ్యమయ్యే భూతల జలపరిమాణం 1,86,900 కోట్ల ఘన మీటర్లని కేంద్ర జలసంఘం అంచనా వేసింది. 1951లో దేశజనాభా 36.1 కోట్లుగా ఉన్నప్పుడు, వార్షిక తలసరి నీటిలభ్యత 5,177 ఘనమీటర్లు. ప్రస్తుతం దేశజనాభా దాదాపు 136 కోట్లు. వార్షిక తలసరి నీటిలభ్యత 1,374 ఘనమీటర్లు. అంటే, ఇప్పటికే దేశం నీటిఒత్తిడికి గురవుతోంది. 2050 నాటికి జనాభా 164 కోట్లకు పెరిగినప్పుడు, వార్షిక తలసరి నీటిలభ్యత 1,140 ఘన మీటర్లకు తగ్గి, దేశం తీవ్రమైన నీటిఒత్తిడికి గురవనుంది.

జలవనరుల పరిరక్షణకు, వాటిని పొదుపుగా వినియోగించుకోవడానికి పాలకులు, ప్రజలు ప్రయత్నం చేయాలి. అందుకోసం మేలైన సాగునీటి ప్రక్రియలను చేపట్టాలి. అమూల్యమైన నీటివనరులను పొదుపుగా వాడుకుని అధికోత్పత్తిని సాధించడమే లక్ష్యం కావాలి. పంటకంతటికీ ఏకరీతిగా నీటినందిస్తూ, దానిపై నిర్దిష్టమైన నియంత్రణను ఏర్పాటు చేసుకోవాలి. 1998 నాటికే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో బిందుసేద్య విధానాన్ని సుమారు ఆరువేల హెక్టార్లలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని అల్ప వర్ష ప్రాంతాలైన రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో బిందుసేద్య విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎక్కువగా ఉంది.

వానజల్లు రీతిలో కృత్రిమ పద్ధతిలో పైరుపై నీటిని వెదజల్లడమే తుంపర విధానం. నీటిని పీల్చే ఇసుకనేలలు, తక్కువ ఖర్చుతో చదును చేయడానికి వీలుపడని, నేలపొర మందం తక్కువగా ఉన్న భూములు, ఎగుడు-దిగుడు నేలలు, సాధారణ పద్ధతిలో కాలువల ద్వారా సాగునీటినందించడానికి వీలుపడని ప్రాంతాలకు తుంపర సేద్యవిధానం అనుకూలమైనది. ఈ విధానంలో నీరు అవసరమైన మేరకే సరఫరా కావడం వల్ల, పొదుపవుతున్న నీటితో 25-33 శాతం అధిక విస్తీర్ణానికి సాగునీటి సౌకర్యం కల్పించవచ్చు. సన్నని బిందువుల రూపంలో వెదజల్లే నీటి వల్ల ఆకులు శుభ్రపడి, వాతావరణం నుంచి ఎక్కువ ప్రాణవాయువును గ్రహిస్తాయి. దీనివల్ల పైరు ఏపుగా పెరిగి, అధిక దిగుబడి లభిస్తుంది. రుతుపవనాల కోసం వేచి ఉండకుండా భూమిని సిద్ధం చేసి, వెంటనే నీరు అందించడం వల్ల, ఏడాదికి మూడు, నాలుగు పంటలను పండించవచ్చు. సకాలంలో నాట్లు పడిన పంటలు ఎక్కువ దిగుబడిని అందిస్తాయి. కాలువలు తవ్వడం, గట్లు వేసే పనిలేనందువల్ల, కొత్తగా మరికొంత భూవిస్తీర్ణం అందుబాటులోకి వస్తుంది. అధిక వ్యయంతో కూడిన బిందు, తుంపర వంటి సూక్ష్మసేద్య విధానాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తగిన ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలి. దీనివల్ల నీటిపొదుపు, పంట దిగుబడి పెరిగి ఉభయతారకంగా ఉంటుంది!

 

- చెరుకూరి వీరయ్య
(రచయిత- నీటిపారుదల రంగ నిపుణులు)
Posted on 21-06-2019