Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పేదింటికి చేరని పెద్ద పథకాలు

* అభివృద్ధి జాడలేని దళిత వాడలు

దళితుల వెనకబాటు దశాబ్దాలుగా కొనసాగుతోంది. విద్యా ఉద్యోగ రంగాలతోపాటు ఆర్థిక, రాజకీయ రంగాల్లోనూ దళిత వర్గాలు దుర్విచక్షణను ఎదుర్కొంటున్నాయి. స్వాతంత్య్రానంతరం బలహీన వర్గాల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక నిబంధనలు పొందుపరచారు. పంచవర్ష ప్రణాళికల్లో బడుగుల పురోభివృద్ధికి ఏదో ఒక స్థాయిలో ప్రాధాన్యమివ్వడంతో దళితులు, ఇతర సామాజిక వర్గాల మధ్య అంతరాలు తగ్గుముఖం పట్టిన మాట కొంతమేరకు వాస్తవమే. వ్యక్తిగత అభివృద్ధితోపాటు పల్లెల్లో దళితవర్గాలు నివసించే ప్రాంతాలను పురోగతి బాట పట్టించేందుకు ప్రభుత్వాలు రచిస్తున్న ప్రణాళికలు ఇప్పటికీ కాగితాలకే పరిమితమవుతుండటం బాధాకరం. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వల్ల గ్రామాల్లోని దళితవాడలు కనీస మౌలిక వసతులు కొరవడి కుములుతున్నాయి.

దేశంలోని దళితుల్లో 75 శాతానికిపైగా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. కాలం మారినా దళితుల జీవన స్థితిగతుల్లో గుణాత్మక మార్పు పొడగట్టలేదు. దేశంలో సుమారు 31.5 శాతం దళిత కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నాయి. మారుమూల పల్లెల్లో ఇంకా 55.3 శాతం కుటుంబాలు నీటివసతి కోసం చేతిపంపులు, బోరు బావులపైనే ఆధారపడుతున్నాయి. విద్యారంగంలో కొంతమేరకు పురోగతి ఉండటంవల్ల ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగుల భాగస్వామ్యం ఏదోస్థాయిలో నైనా కనబడుతోంది. దళితాభివృద్ధిని ఆకాంక్షిస్తూ, వారి నివాస ప్రాంతాలను అభివృద్ధిపరచే సంకల్పంతో కేంద్రప్రభుత్వం 2009-10 మధ్యకాలంలో ప్రధానమంత్రి ఆదర్శ్‌ గ్రామ యోజన పథకాన్ని ప్రారంభించింది. యాభై శాతం పైబడిన దళిత జనాభాగల పల్లెలను లక్ష్యంగా చేసుకొని వాటిని సమగ్ర అభివృద్ధి బాట పట్టించాలన్నది పథకం ప్రాథమిక లక్ష్యం. ఆ ప్రాతిపదికన ఎంపిక చేసిన ప్రతి గ్రామానికీ కేంద్ర ప్రభుత్వం రూ.21 లక్షలు మంజూరు చేస్తుంది. తొలి విడతగా 50శాతం నిధులను ప్రత్యేక కేంద్ర సహాయ నిధులనుంచి షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళికకు విడుదల చేస్తారు. ఆ నిధులతో పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు అడుగులు కదపాలి. తదుపరి 50 శాతం నిధులను సంబంధిత గ్రామంలో సాగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణ తరవాత సమర్పించే నివేదిక ఆధారంగా కేంద్ర కమిటీ చెల్లిస్తుంది. ఆ మొత్తాన్ని రెండేళ్లలో ఖర్చుచేసి ప్రజాసౌకర్యాలను అందుబాటులోకి తేవాలి. అప్పుడు అది ఆదర్శ గ్రామంగా పేరొందుతుంది. ముందస్తుగా ‘పైలట్‌ ప్రాజెక్టు’ కింద అయిదు రాష్ట్రాల్లోని వెయ్యి గ్రామాలను ఎంపిక చేశారు. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుపరచే ఉద్దేశంతో 2014-15 మధ్యకాలంలో ప్రభుత్వం గ్రామాల ఎంపికను మరింత విస్తరించింది. 2015 మార్చిలో మొదటిదశకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 11 రాష్ట్రాల్లో 1,500 గ్రామాలను ఎంపిక చేశారు. 1,117 గ్రామాల్లో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించగా- 6,793 పనులకు ఆమోదముద్ర లభించింది. అందులో కేవలం 564 పనులు మాత్రమే పూర్తికాగా- 4,451 పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. ఆ గ్రామాల అభివృద్ధి కోసం రూ.329.35 కోట్ల నిధులు కేటాయించగా 63.57 శాతమే వ్యయమయ్యాయి. సరిపడా నిధులున్నా వాటిని ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇప్పటివరకు కేవలం 140 గ్రామాలను మాత్రమే ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు. అవన్నీ ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన గ్రామాలే కావడం గమనార్హం. మిగిలిన పది రాష్ట్రాల్లో ఏ ఒక్క గ్రామమూ ‘ఆదర్శ్‌’ లెక్కల్లో చోటు సంపాదించుకోలేకపోవడం బాధాకరం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోనూ 13 గ్రామాలు ఎంపిక చేశారు. వాటిలో ఏ ఒక్క గ్రామానికి సంబంధించీ అభివృద్ధి ప్రణాళికలను అధికారులు రూపొందించలేకపోయారు. రెండోవిడతగా 2018, అక్టోబరునుంచి వివిధ మార్పులతో పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించారు. యాభైశాతం దళితులు ఉన్న 4,484 గ్రామాలను ఎంపిక చేశారు. ఒక్కో గ్రామం అభివృద్ధికి రూ.89 లక్షలు అవసరమని అంచనా వేశారు. మొదటి విడతలో పనులు ప్రారంభించడానికి 3,725 గ్రామాలను ఎంపిక చేసి 2019 ఫిబ్రవరినాటికి ఒక్కో గ్రామానికి రూ.38,601 లక్షల వంతున విడుదల చేశారు. కానీ గ్రామ అభివృద్ధి ప్రణాళికలు ఏ దశలో ఉన్నాయన్న విషయంలో స్పష్టత కొరవడింది. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపంవల్ల పనుల్లో జాప్యం జరుగుతోంది. అభివృద్ధి పనులపై అధికారులు తగిన స్థాయిలో దృష్టి సారించకపోవడంతో పథకం స్ఫూర్తి నీరుగారుతోంది.

ప్రధానమంత్రి ఆదర్శ్‌ గ్రామ యోజన పథకం పూర్తి స్థాయిలో అమలై విజయం సాధిస్తే ప్రగతికి బాటలు పడినట్లే! ఎంపిక చేసిన గ్రామాలతో పాటు అక్కడ ఉండే దళిత వాడలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయడమే ఇప్పుడు కీలకావసరం. గ్రామ అభివృద్ధి ప్రణాళికల్లో సామాజిక భద్రత, రహదారులు, గృహసముదాయం, విద్యుత్తు, సాంకేతిక సదుపాయం, జీవనోపాధి, నైపుణాభివృద్ధి వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సి ఉంది. ఈ పథకం అమలు తీరును తరచిచూసేందుకు ప్రభుత్వం పర్యవేక్షణ- మూల్యాంకన కమిటీని నియమించాలి. ఆ కమిటీ సభ్యులకు ప్రత్యేక అధికారాలు అప్పజెప్పాలి. అవిరళ శ్రద్ధతో పనిచేస్తేనే నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరి- ఆదర్శ గ్రామాలు సాక్షాత్కరిస్తాయి. రాజ్యాంగ స్ఫూర్తిని అందిపుచ్చుకొని స్వశక్తితో దళితులు పురోగమించేందుకు వీలు కల్పించే పరిణామమది!

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌
(రచయిత- ‘సెస్‌’లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)
Posted on 22-06-2019