Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ప్రమాదంలో ప్రజారోగ్యం

* వెన్నాడుతున్న వైద్యుల కొరత

భారతీయ వైద్యరంగం సమస్యలతో సతమతమవుతోంది. వైద్యులు, నర్సుల కొరత, వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల లేమి వంటి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఏటా కొత్త కళాశాలలు ఆవిర్భవిస్తున్నా నేటికీ అవసరం మేరకు వైద్యులు, నర్సులు లేరు. దేశంలో 60 కోట్ల ప్రజలకు వైద్య సౌకర్యాలు కొరవడ్డాయి. ప్రస్తుతం దేశంలో 135 కోట్లకు పైబడిన జనాభాకు అందుబాటులో ఉన్న వైద్యులు కేవలం ఏడున్నర లక్షలమందే అంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రతి 1,425 మందికి అందుబాటులో ఉన్న వైద్యుడు ఒక్కరే. లేదా ప్రతి 1,000 మందికి 0.702 వైద్యుడు ఉన్నారు. భారత్‌కన్నా ఇతర దేశాల్లో పరిస్థితి ఒకింత మెరుగ్గానే ఉంది. ప్రతి వెయ్యి జనాభాకు ఆస్ట్రేలియాలో అత్యధికంగా 3.273, బ్రిటన్‌లో 2.778, అమెరికాలో 2.542, చైనాలో 1.456 వంతున వైద్యులు ఉన్నారు. భారత్‌లో ఉన్న కొద్దిమంది వైద్యుల్లో అత్యధికులు పట్టణాలకే పరిమితమవుతున్నారు. గ్రామాల్లో సేవలు అందించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా పల్లెల్లో వైద్యసేవల పరిస్థితి దయనీయంగా ఉంది. వైద్యుల్లో 34 శాతం, నర్సుల్లో 33 శాతమే గ్రామాల్లో సేవలు అందిస్తున్నారు. వైద్యులు, నర్సుల్లో ఎక్కువమంది మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నారు.

వైద్యులు ప్రధానంగా ప్రైవేటు రంగం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొత్త వైద్య కళాశాలల ఆవిర్భావంతో పెద్ద సంఖ్యలో వైద్య పట్టభద్రులు వస్తున్నమాట నిజమే. కానీ, వారిలో అత్యధికులు అధిక సంపాదన కోసం ప్రైవేటు రంగానికి బారులు కడుతున్నారు. ప్రతి అయిదుగురు వైద్యుల్లో నలుగురు, ప్రతి పదిమంది పారా మెడికల్‌ సిబ్బందిలో ఏడుగురు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులు వైద్యులు, సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని రాష్ట్రాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, నిపుణుల కొరత తీర్చడానికి కర్ణాటక సర్కారు 2017-18లో ‘ఆన్‌ కాల్‌ డాక్టర్‌’ పథకాన్ని ప్రారంభించింది. అవసరమైనప్పుడల్లా వీరు ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చి చికిత్స అందిస్తుంటారు. రోజులో ఎంతమంది రోగులకు చికిత్స చేశారనే ప్రాతిపదికపై వీరికి చెల్లింపులు చేస్తారు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు వైద్యుల కొరతతో సతమతమవుతున్నాయి. దీంతో బయటి నుంచి వచ్చే వైద్య నిపుణులకు చెల్లించే ఫీజులను పెంచాలని ప్రభుత్వం గత మార్చిలో నిర్ణయించింది. దీంతోనే సమస్య పరిష్కారమై పోతుందని చెప్పడం కష్టమే.

ఏళ్ల తరబడి నిర్లక్ష్యం
పెద్దయెత్తున వైద్యులను వచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాబోదు. ఏటా సుమారు 2.6 కోట్ల చొప్పున పెరుగుతున్న దేశ జనాభాకు దీటుగా అదనపు వైద్య సిబ్బందిని సమకూర్చుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది. ప్రస్తుతం దేశానికి 20 లక్షల మంది వైద్యులు, 40 లక్షల మంది నర్సులు అవసరం. 2017నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 462 వైద్య కళాశాలల్లో ఏడాదికి 56,748 మంది వైద్య విద్యార్థులకు మాత్రమే శిక్షణ ఇస్తున్నారు. 3,123 నర్సింగ్‌ కళాశాలల్లో 1,25,764 మంది నర్సులకు శిక్షణ లభిస్తోంది. ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ సారథ్య సంస్థ అయిన నేట్‌ హెల్త్‌ అంచనా ప్రకారం 2025కల్లా దేశానికి కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు వైద్యులు, సహాయక సిబ్బంది అవసరపడతారు. కానీ, 2039 వరకు దేశాన్ని వైద్యుల కొరత పీడిస్తూనే ఉంటుందని నేట్‌ హెల్త్‌ ఆరోగ్య నివేదిక హెచ్చరించింది.

వర్తమానంతోపాటు భవిష్య అవసరాలనూ తీర్చడానికి ఇప్పటి నుంచే నడుం బిగించాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే రాష్ట్రాల్లో ఏఐఐఎమ్‌ఎస్‌ (ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) తరహాలో ఉన్నత వైద్య విజ్ఞాన సంస్థల ఏర్పాటుకు నడుం కట్టింది. గడచిన రెండేళ్లలో కొత్త వైద్య కళాశాలలకు అనుమతి ఇవ్వడంతోపాటు ఇప్పటికే నడుస్తున్న కళాశాలల్లో కేంద్ర నిధులతో అదనంగా సీట్లు పెంచింది. దేశమంతటా అదనంగా 10,000 ఎమ్‌బీబీఎస్‌ సీట్లు, 8,000 పీజీ సీట్లను సృష్టిస్తామని భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. ఆ హామీని నెరవేర్చే క్రమంలో భాగంగా కేంద్ర సర్కారు 2019-20 విద్యా సంవత్సరంలో 2,750 సీట్లతో 25 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను స్థాపించనున్నట్లు ప్రకటించింది. వీటికితోడు 2019లో 1,500 సీట్లతో 10 ప్రైవేటు వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. 10,000 అదనపు సీట్ల లక్ష్యాన్ని నెరవేర్చాలంటే ఇంకా 5,750 సీట్లను సృష్టించాలి. పెరిగే విద్యార్థులకు దీటుగా అధ్యాపక సిబ్బందీ పెరగాలి. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయదలచిన 35 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు 600 మంది ఆచార్యులు, 1,000మంది సహ ఆచార్యులు, 1,500 మంది సహాయ ఆచార్యులు అవసరమవుతారు. మరోవైపు 2016 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రారంభమైన 100 కొత్త వైద్య కళాశాలలకు 9,000 మంది అధ్యాపకులు కావాలి. 2019లో ఏర్పాటయ్యే కొత్త కళాశాలలను కలుపుకొంటే మొత్తం సంస్థలు 529కి చేరతాయి. వాటిలోని ఎమ్‌బీబీఎస్‌ సీట్లు 70,978. ఆ లెక్కన బోధన సిబ్బంది, వసతులకు గిరాకీ పెరిగిపోతుంది.

దేశ ప్రజల ఆరోగ్య అవసరాల మరింతమంది విద్యార్థులు వైద్యరంగంలోకి అడుగుపెట్టాలి. ఇందుకోసం జిల్లా స్థాయి ఆస్పత్రులను వైద్య కళాశాలలుగా మార్చనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ పథకం కింద మొదటి దశలో 58 జిల్లా ఆస్పత్రులను, రెండో దశలో 24 ఆస్పత్రులను ఎంపిక చేశారు. వాటిలో 39 ఇప్పటికే వైద్య కళాశాలలుగా మారాయి. మూడో దశలో 75 జిల్లా ఆస్పత్రులను వైద్య కళాశాలలుగా మార్చనున్నారు. వీటిని వైద్య సేవలకు నోచుకోని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యమిస్తారు. ఒక్కో ఆస్పత్రిని వైద్య కళాశాలగా మార్చడానికి రూ.325 కోట్లు ఖర్చవుతాయి. కొత్తగా అన్ని హంగులతో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అయిదేళ్లు పడుతుంది. రూ.450 కోట్ల పెట్టుబడి అవసరమవుతుంది. తరవాత ఏటా నిర్వహణ కోసం రూ.150 కోట్ల చొప్పున వెచ్చించాలి. దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంత ఆర్థిక స్తోమత లేదు.

ఆయుష్మాన్‌ భారత్‌కు అండగా...
ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద 50 కోట్లమందికి ఆరోగ్య బీమా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టడం ప్రశంసనీయమే. ఈ పథకం విజయవంతం కావడానికి వైద్య సిబ్బంది అందుబాటుతోపాటు, మౌలిక వసతుల లభ్యతా ఎంతో కీలకమవుతాయి. దాదాపు 136 కోట్లుగా ఉన్న జనాభాకు 23,582 ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయని అంచనా. వాటిలో సగానికిపైగా ప్రైవేటు ఆస్పత్రులే కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 15,000 ఆస్పత్రులు ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భాగస్వాములుగా చేరగా, వాటిలో 15 శాతం ప్రైవేటు ఆస్పత్రులే. వైద్యులు, ఆస్పత్రులు, పడకల కొరతను అధిగమించి శీఘ్రంగా, సమర్థంగా వైద్య సేవలు అందించడానికి టెలీమెడిసిన్‌ వంటి ఆధునిక సాంకేతికతలను చేపట్టాలి. మొబైల్‌ ఫోన్లు, వ్యక్తిగత వైద్య పరికరాలు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) సాధనాల్లో ఆరోగ్య రికార్డులను పొందుపరచడానికి తగు ప్రమాణాలు, యంత్రాంగాలను ఏర్పరచాలి. వైద్య సమాచారాన్ని ఎలక్ట్రానిక్‌ వైద్య రికార్డు (ఈఎమ్‌ఆర్‌)లలో పొందుపరచి, ప్రాంతీయ, కేంద్ర స్థాయి ఆరోగ్య సమాచార మార్పిడి కేంద్రాల్లో భద్రపరచాలి. ఈ సమాచారాన్ని ఆస్పత్రులు, వైద్యులకు అందుబాటులో ఉంచాలి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం త్వరలో లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎమ్‌సీ) బిల్లు ఆయా వర్గాల్లో ఆశలు రేకెత్తిస్తోంది!

సాంకేతికత ఆసరా
పాత, కొత్త వైద్య కళాశాలలు అధ్యాపకుల కొరతతో ఇబ్బందిపడుతున్నాయి. అర్హులైన అధ్యాపకులు దొరక్క ఇప్పటికే వైద్య విద్యా ప్రమాణాలను సడలించారు. కొత్త సంస్థల్లో ఆదరాబాదరాగా కోర్సు పూర్తి చేయించి, సరైన శిక్షణ లేని వైద్యులను తయారు చేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాబట్టి సుశిక్షిత వైద్యుల తయారీకి పకడ్బందీ విధానాలు చేపట్టాలి. వైద్య విద్యలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఒక ఆచరణీయ పరిష్కారం. టెలీమెడిసిన్‌, రిమోట్‌ మానిటరింగ్‌ సాధనాలను విస్తృతంగా చేపట్టడం ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యులతోనే ఎంతోమంది రోగులకు చికిత్స అందించవచ్చు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రముఖ ఆస్పత్రులు ఇప్పటికే ఈ విషయంలో చొరవ తీసుకున్నాయి. మదురైకి చెందిన అరవింద్‌ ఐ హాస్పిటల్‌ తమిళనాడు రాష్ట్రమంతటా 66 టెలీమెడిసిన్‌ కేంద్రాలను నెలకొల్పి, రోజుకు 1,800 మందికి నేత్ర పరీక్షలు చేస్తోంది. ఈ కేంద్రాలు నేత్ర పరీక్షల వివరాలను ఎలక్ట్రానిక్‌ రికార్డుల్లో నమోదు చేస్తాయి. వాటిని చూసి ప్రధాన ఆస్పత్రిలోని వైద్యులు కళ్లద్దాలను సూచిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, అపోలో ఆస్పత్రితో కలిసి పట్టణ, గ్రామీణ రోగులకు టెలీమెడిసిన్‌ సేవలు అందిస్తోంది. నేత్ర పరీక్షలూ వీటిలో భాగమే. పట్టణాల్లో ఉన్న వైద్యులు గ్రామాల్లోని రోగులకు చికిత్స సదుపాయం అందించడానికి టెలీమెడిసిన్‌ ఉపయోగపడుతోంది. 2021కల్లా 1.30 కోట్లమందికి ఈ పద్ధతిలో సేవలు అందించాలని అపోలో ఆస్పత్రుల గ్రూపు యోచిస్తోంది. సాధారణ జ్వరాలు, గర్భిణులు, బాలింతలకు చికిత్స, మధుమేహం, ఎముకలు, హృదయ సంబంధ వ్యాధులకూ టెలీమెడిసిన్‌ విధానం అనువైనది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టెలీమెడిసిన్‌ సౌకర్యం కల్పిస్తే వైద్యుల కొరతను చాలావరకు అధిగమించవచ్చు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి కేంద్రం టెలీమెడిసిన్‌ సేవలు అందిస్తోంది. ఈ యంత్రాంగంలో మొత్తం 384 ఆస్పత్రులు అనుసంధానమయ్యాయి. వీటిలో 18 సంచార యూనిట్లు (మొబైల్‌ వ్యాన్లు) ఉన్నాయి.

- వరప్రసాద్‌
Posted on 24-06-2019