Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సన్నద్ధత కొరవడిన సంస్కరణ

పర్యావరణ హితకరమైన రవాణా వ్యవస్థ ఆవిష్కరణలో భాగంగా నిర్ణీత కాలావధిలో విద్యుత్‌ వాహనాల వినియోగం పెంచే విధివిధానాల ఆవశ్యకతను కొన్నాళ్లుగా నీతి ఆయోగ్‌ తరచూ ప్రస్తావిస్తోంది. 2023 సంవత్సరం నాటికి శిలాజ ఇంధనాలతో నడిచే ఆటోలు, తరవాతి రెండేళ్లలో స్కూటర్లు మోటార్‌ సైకిళ్ల స్థానే విద్యుత్‌ వాహనాల తయారీ పట్టాలకు ఎక్కాలన్న తాజా ప్రతిపాదన తీవ్ర కలకలం రేపుతోంది. దేశంలో 2030నాటికి రోడ్లపై నూరుశాతం విద్యుత్‌ వాహనాలే ఉండాలన్న సర్కారీ ప్రకటన ఆచరణ సాధ్యం కానిదని భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్‌) రెండేళ్లనాడే తోసిపుచ్చింది. ఆరేళ్లలోపు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలన్నీ విద్యుత్తుతో నడిచేలా చూడటం అసాధ్యమని ఇప్పుడు దిగ్గజ వాహన తయారీ సంస్థలూ అంతే దృఢంగా స్పష్టీకరిస్తున్నాయి! విద్యుత్‌ వాహనాలకు అత్యంత కీలక ఆదరవు బ్యాటరీ. ప్రస్తుతం ఆ రకం బ్యాటరీలన్నింటి తయారీకి లిథియమే ప్రాణాధారం. దాంతోపాటు కోబాల్ట్‌, నికెల్‌ వంటివీ అవసరమవుతాయి. ద్విచక్ర వాహనాల ధరలో 70 శాతం దాకా, కార్ల తయారీ ఖర్చులో 50 శాతం మేర బ్యాటరీకే వెచ్చించాల్సి ఉంటుంది. బ్యాటరీ ముడిపదార్థాల దిగుమతుల నిమిత్తం కొన్ని దేశాలపైనే తక్కినవన్నీ ఆధారపడాల్సిరావడం, అవసరాలకు తగినంత సరఫరాలు లేకపోవడం మూలాన- పెట్రోలు రకంతో పోలిస్తే విద్యుత్‌ వాహనం ఖరీదు రెండింతల దాకా ఉంటోంది. దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్‌ కర్మాగారాలపై పడనున్న అదనపు భారం రూపేణా కాలుష్యమూ జోరెత్తే ముప్పుంది. ఎప్పుడైనా గ్రిడ్‌ వైఫల్యం సంభవిస్తే కోట్లాది వాహనాల గతేమిటి? ఇటువంటి మౌలిక అంశాల్ని లోతుగా తర్కించకుండా, అనివార్య సమస్యలకు సమర్థ పరిష్కారాలు అన్వేషించకుండా తొందరపడితే వ్యూహకర్తలు అభాసుపాలు కాక తప్పదు!

పట్టపగ్గాల్లేకుండా వాయు, వాహన కాలుష్యం దేశదేశాల్ని హడలెత్తిస్తోంది. ప్రజారోగ్య సంరక్షణకు సంబంధించి విశ్వవ్యాప్తంగా నేడు ఆత్యయిక స్థితి నెలకొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థే నిగ్గుతేలిన మాటా నిజం. రెండేళ్ల క్రితం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 42 అంచెల కార్యాచరణను ప్రకటిస్తూ డీజిల్‌ వాహనాల రద్దును ప్రస్తావించింది. ఇండియాలో సుమారు 22 కోట్ల మోటారు వాహనాల వల్ల రోజూ 630 టన్నుల సల్ఫర్‌ డయాక్సైడ్‌, 270 టన్నుల నైట్రోజన్‌ ఆక్సైడ్‌, రెండు వేల టన్నులకు పైగా కర్బన ఉద్గారాలు గాలిలో మిళితమవుతున్నాయన్న గణాంకాలు అప్పట్లోనే వెలుగు చూశాయి. కాలుష్య విరుగుడు వ్యూహాల్లో భాగంగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌ 2040 సంవత్సరానికల్లా పాత మోటారు వాహనాల్ని నిషేధించాలని తీర్మానించాయి. అంతకు పదేళ్ల ముందే 2030 నాటికి దేశంలో విద్యుత్‌ వాహనాలే ఉండాలని నాడు గిరిగీసిన మోదీ సర్కారు- పారిశ్రామిక వర్గాల నుంచి, ప్రజానీకం నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తమయ్యేసరికి వెనక్కి తగ్గింది. ఆ ప్రతిపాదనను తిరగదోడిన నీతి ఆయోగ్‌- గడువుకన్నా ముందే ద్విచక్ర, త్రిచక్ర వాహన వినియోగంలో మార్పులు లక్షించడం సహజంగానే వివాదాస్పదమవుతోంది. విడిభాగాల విషయంలోనూ అభ్యంతరాలున్నాయి. ప్రస్తుతం కార్ల తయారీలో 10-15 శాతం వరకు విదేశాల నుంచి రప్పించిన విడిభాగాలను ఉపయోగిస్తున్నారు. విద్యుత్‌ వాహనాలకైతే 70 శాతం అంతకుమించి విడిభాగాల దిగుమతులే ముఖ్యాధారం కానున్నాయి. బ్యాటరీలో కోబాల్ట్‌ స్థానే గంధకం, సోడియం, మెగ్నీసియాల వాడకంపై కొన్ని దేశాలు పరిశోధనల్లో మునిగితేలుతుంటే- కార్యాచరణలో ఇబ్బందులు, అత్యావశ్యక ప్రత్యామ్నాయాల యోచన లేని నీతి ఆయోగ్‌ గుడ్డిగా ముందుకు దూసుకుపోదామనడం కోరి కష్టాలు తెచ్చుకోవడమే.

ఏదైనా సమస్య తాలూకు లోతుపాతుల్ని ఆకళించుకోవడం ఒకెత్తు. సహేతుక దృక్పథంతో సజావుగా పరిష్కరించడం మరొకెత్తు. రమారమి 80 శాతం కాలుష్యానికి పదేళ్లకు పైబడిన వాహనాలే ప్రధాన కారకాలుగా నాలుగు సంవత్సరాల క్రితం ‘ఫిక్కి’ (భారత వాణిజ్య పారిశ్రామిక సంస్థల సమాఖ్య) నివేదిక వెల్లడించిన తరుణంలో- సుమారు 2.8 కోట్ల వాహనాల్ని రోడ్లపైకి రాకుండా నియంత్రించే యత్నంపై గగ్గోలు పుట్టింది. కొన్నేళ్లు వాడిన దరిమిలా వాహనాల్ని మూలన పారేసి కొత్తవి కొనుక్కోవడం విదేశాల్లో పరిపాటి కావచ్చు. దేశీయంగా ఆ ఊసే అసంఖ్యాకులకు పిడుగుపాటు. నాడు అలా గడువు మీరినవంటూ వాహనాలకు టోకున మరణ శాసనం విధించబోయిన తొందరపాటుతనమే, కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించిన మోటారు వాహనాల (సవరణ) బిల్లులోనూ ప్రస్ఫుటమవుతోంది. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు జరిమానాలు రెట్టింపు చేయాలంటున్న బిల్లు ప్రకారం- ఆంబులెన్సు, ఇతర అత్యవసర వాహనాలకు దారివ్వనట్లయితే రూ.10 వేల మొత్తం ముక్కుపిండి దండుకుంటారట! ఇంతలంతలవుతున్న జనాభా పరిమాణానికి దీటుగా రహదారుల నిర్వహణ సంగతి గాలికొదిలేసిన ప్రభుత్వ యంత్రాంగమా, ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో అడుగు కదపలేక ఇక్కట్లపాలవుతున్న సామాన్య పౌరులా... ఎవరు చెల్లించాలి ఆ జరిమానా? కాలుష్య కట్టడిలో, పర్యావరణ పరిరక్షణలో పౌరసమాజ క్రియాశీల భాగస్వామ్యం అత్యంత కీలకమైందని ఎన్నో దేశాల్లో రుజువైంది. ఇక్కడా అదే ఒరవడి కావాలి. జనజీవితంలో అంతర్భాగమైన వాహనాల్ని గడువు తీరగానే తుక్కుగా జమకట్టాలనే బదులు కాలుష్య నియంత్రణ వ్యూహాలతో వాటి ఆయుర్దాయం పెంపొందించడం ఉభయతారకమవుతుంది. తగినన్ని సన్నాహక చర్యలతో విద్యుత్‌ వాహన విధానం అమలుకు బాటలు పరిస్తే దీర్ఘకాలంలో చమురు దిగుమతుల భారం తగ్గి దేశార్థికానికి ఉపశమనం దక్కుతుంది. ఏ ప్రక్షాళన అయినా కోట్లాది ప్రజల జీవికకు ఇబ్బంది కలగని రీతిలో సాగితేనే, విశేష మన్ననలకు పాత్రమవుతుంది!

Posted on 26-06-2019