Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

భయపెడుతున్న భూతాపం

* రుతుపవనాలపైనా ప్రభావం

ఈ ఏడాది రుతుపవనాల రాకలో జాప్యం జరగడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు ఆలస్యంగానైనా వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. రుతుపవనాల రాకలో జాప్యం ఈ ఏడాదికే పరిమితమైన అంశం కాదు. గతంలోనూ ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కేరళ తీరాన్ని ఈనెల మొదటి వారంలో తాకిన రుతుపవనాలు వేగంగా ముందుకు కదలలేదు. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. విస్తరిస్తున్న పారిశ్రామికీకరణ, విపరీతంగా పెరిగిన శిలాజ ఇంధన వాడకం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. శిలాజ ఇంధన వాడకం ద్వారా వెలువడుతున్న బొగ్గు పులుసు వాయువుతో భూతాపం పెరుగుతోంది. బొగ్గు పులుసు వాయువు విడుదల పెరుగుతున్నంత కాలం ఉష్ణోగ్రత అధికమవుతుందే తప్ప తగ్గదు. అందువల్ల కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. గాలిలో చేరిన 415 పీపీఎంల బొగ్గు పులుసు వాయువును 350 పీపీఎంల స్థాయికి తగ్గించనంత కాలం భూతాప విలయం తప్పదు.

ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి
ఇప్పటికే సగటు ఉష్ణోగ్రత 1.1 డిగ్రీలు పెరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ‘బ్రేక్‌ త్రు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ రిస్టోరేషన్‌’ ఈ ఏడాది మేలో వెలువరించిన నివేదిక మేరకు 2030 నాటికి సగటు ఉష్ణోగ్రత 1.6 డిగ్రీలు, 2045 నాటికి రెండు డిగ్రీలు పెరుగుతుంది. ఈ ఏడాది విపరీతమైన వేసవి ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. రాజస్థాన్‌లోని ‘చురు’ లో ఈనెల ఒకటిన 50.8, గత నెల 16న 50.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2016 మే 19న అక్కడ 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. రాష్ట్రంలోని ‘ఫలోడి’ లో గత నెల 16న అత్యధికంగా 51 డిగ్రీలు నమోదయింది. ఈ ఏడాది వేసవిలో దేశమంతటా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల స్థాయికి చేరాయి. విపరీతమైన ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. బిహార్‌లో వడదెబ్బకు తాళలేక ఒక్క రోజే 60 మందికి పైగా చనిపోయారు.

అధిక ఉష్ణోగ్రత ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతోంది. అనేక సమస్యలను సృష్టిస్తోంది. ఈ వేసవిలో తాగునీటి సమస్యతో దేశంలో 43 శాతం ప్రజలు సతమతమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పల్లెలను వదిలి వలస వెళ్లారు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో తాగడానికి నీళ్లు కూడా లేక ప్రజలు వలస పోవాల్సిన దుస్థితి నెలకొంది. భూతాపం ప్రభావంతో వడగాడ్పుల తీవ్రత పెరుగుతోంది. అక్టోబరు 2018 నాటి ఐపీసీసీ నివేదిక 1986-2015 మధ్యకాలంలో వడగాడ్పులను విశ్లేషించింది. దేశంలోని చాలా నగరాలు 2040 నాటికి వేసవిలో బయటకు అడుగు పెట్టలేని స్థితికి చేరతాయని అంచనా. పారిస్‌ ఒప్పందాన్ని యథాతథంగా అమలు పరచినా ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితే కరాచీ, కోల్‌కతా నగరాల ప్రజలు తీవ్ర వడగాడ్పులకు లోనవుతారు. దేశంలో సాధారణ ఉష్ణోగ్రత ఒక్క రోజు 35 డిగ్రీలు దాటితే ఆ ఏడాది మరణాలు 0.74 శాతం పెరుగుతాయని అంచనా. అయితే అమెరికాలో మరణాలు కేవలం 0.03 శాతం మాత్రమే పెరుగుతాయని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (ఏప్రిల్‌ 2017) అధ్యయనం పేర్కొంది. అధిక ఉష్ణోగ్రత ఫలితంగా నగరాల్లోకన్నా గ్రామీణ భారతంలో మరణాలు మూడు రెట్లు అధికమని ఈ అధ్యయనం వెల్లడించింది.

భూతాపంతో కరవు విస్తరిస్తోంది. ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరిగితే ఏడాదిలో కరవు కాలం రెండు నెలలు, రెండు డిగ్రీలు పెరిగితే నాలుగు నెలలు ఉంటుందని 2018 నాటి ఐపీసీసీ నివేదిక పేర్కొంది. ఉష్ణోగ్రత పెరుగుదలను రెండు డిగ్రీలు దాటకుండా చేయగలిగినా పంటల దిగుబడి తగ్గి 8.4 శాతం ఆదాయం తగ్గుతుందని 2001 నాటి భారత శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడించాయి. 2006 నాటి పరిశోధనల ప్రకారం ఒక సెంటిగ్రేడు ఉష్ణోగ్రత పెరిగితే వరి 5.4 శాతం, గోధుమలు 8.1 శాతం, మొక్క జొన్న 10.4 శాతం, జొన్న 18 శాతం, వేరు శనగ 8.7 శాతం దిగుబడి తగ్గుతాయి. భూతాపం వల్ల 2020 నాటికి దేశంలో వర్షపాతం ‘సహజ మార్పుల’ దశ దాటి ‘ఆకస్మిక మార్పుల’ దశకు చేరుతుంది. వర్షపాతం అధిమవుతుంది. కానీ అకాల వర్షాల వల్ల అధిక పంట నష్టం జరుగుతుందని మార్చి 11, 2019 అమెరికా జాతీయ అకాడెమీ పత్రిక తెలిపింది.

అమెరికాకు చెందిన టమ్మా కార్లేటాన్‌ అనే మహిళా పర్యావరణవేత్త భారతీయ రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేశారు. 47 సంవత్సరాల రైతుల ఆత్మహత్యల సమాచారం సేకరించి ఆమె విశ్లేషించారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే కొద్దీ పంటల దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల దిగుబడులు తగ్గడం రైతుల ఆత్మహత్యలకు దారితీస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం పడి, రైతన్నల ఆత్మహత్యలు 6.8 శాతం పెరిగినట్లు గుర్తించారు.

భూతాపంతో ప్రభావం చూపని రంగమేదీ లేదు. 2017లో ఆర్థిక వ్యవస్థపై ఉష్ణోగ్రత ప్రభావాన్ని సోలమన్‌ సియాంగ్‌ అనే పర్యావరణవేత్త అంచనా వేశారు. భారత్‌, పాకిస్థాన్‌లలో సాధారణం కంటే పెరిగిన ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రత ఆర్థిక వృద్ధిని ఒక శాతం తగ్గిస్తుందన్నది ఆయన అభిప్రాయం. భూతాపంతో అత్యధికంగా నష్టపోయే దేశం భారత్‌. అధిక ఉష్ణోగ్రతల వల్ల దక్షిణాసియాలో 80 కోట్ల ప్రజల జీవితాలు దుర్భరమవుతాయనీ, అందులో 10 కోట్ల మంది దుర్భర దారిద్య్రానికి గురవుతారని 2018 నాటి ప్రపంచబ్యాంక్‌ నివేదిక వివరించింది. పేదలు మరింత పేదలవుతారని పేర్కొంది.

విస్తరిస్తున్న ప్రజా ఉద్యమం
భూతాప వేగం విజ్ఞాన శాస్త్రానికి సైతం అందడం లేదు. కెనడా ఆర్కిటిక్‌ మహా సముద్ర ప్రాంతంలోని పెర్మాఫ్రాస్ట్‌ 2090 వరకూ కరగడం మొదలు కాదని తొలుత అంచనా వేశారు. కానీ ఈ అంచనాలు తలకిందులయ్యాయి. 70 ఏళ్ల ముందుగా ఈ ఏడాది నుంచే కరగడం ప్రారంభమైంది. గ్రీన్లాండ్‌లో మంచు కరిగే వేగం అంచనాలను మించిపోయింది. ఈ నెల 13న ఒకే రోజులో 200 కోట్ల టన్నుల మంచు కరిగింది. భూతాపం అంచనాలకు మించి పెరుగుతున్నా ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. పాత విధానాలకు కాలం చెల్లిందన్న విషయాన్ని అవి గ్రహించడం లేదు. సమూల మార్పులతోనే ఈ ప్రమాదాన్ని నివారించగలం. భూతాపాన్ని నివారించడానికి బ్రిటన్‌లో మొదలైన శాంతియుత ప్రజా ఉద్యమం ఇతర దేశాలకు విస్తరిస్తోంది. బ్రిటన్‌, ఐర్లాండ్‌ వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. ఐరోపా సమాఖ్య దేశాలు అత్యవసర పరిస్థితి ప్రకటన దిశగా అడుగులు వేస్తున్నాయి. నానాటికీ పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించే దిశగా భారత్‌తోపాటు వివిధ దేశాలు కార్యాచరణకు ఉపక్రమించడం తక్షణ కర్తవ్యం!


- డాక్టర్‌ కలపాల బాబూరావు
Posted on 28-06-2019