Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

మాదక ఉగ్రవాద పంజా!

మాదక ద్రవ్య మహమ్మారినుంచి మానవాళికి ముంచుకొస్తున్న పెను ముప్పుపై ఏనాడో 1909లోనే షాంఘైలో మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు జరిగింది. దరిమిలా నూటపదేళ్లలో మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, దుర్వినియోగాలను అదుపు చేసే బహు పాక్షిక వ్యవస్థల నిర్మాణం జరిగిందంటున్నా- కోట్లాది పచ్చని కుటుంబాలపై పెను చీకట్లను పరచేస్తూ మాదక రక్కసి సాగిస్తున్న మహా విధ్వంసం గుండెల్ని పిండేస్తోంది. మాదక ద్రవ్యాల వినిమయం అక్రమ రవాణాల నిరోధాన్ని లక్షిస్తూ 1987నుంచే అంతర్జాతీయ దినోత్సవాన్ని (ఏటా జూన్‌ 26) నిర్వహిస్తున్న సమితి ఆధ్వర్యంలోనే పదేళ్లనాడు రాజకీయ సంకల్ప ప్రకటన, కార్యాచరణ ప్రణాళికలూ వెలుగు చూశాయి. వాటి దారి వాటిదే కాగా, చాపకింద నీరులా మత్తు పానీయాలు మాదక ద్రవ్యాలు సృష్టిస్తున్న విలయ తీవ్రతకు సమితి తాజా నివేదికే అద్దం పట్టింది. మాదక ద్రవ్య సంబంధిత రోగాలతో మూడున్నర కోట్లమంది వైద్య సేవలకోసం అలమటిస్తున్నారని, ప్రతి ఏడుగురు బాధితుల్లో ఒకరికే చికిత్స లభిస్తోందని సమితి నివేదిక నిర్ధారించింది. ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు, సమాజాల ఆయురారోగ్యాల మీద, ఆయా దేశాల సుస్థిరాభివృద్ధి, భద్రతలపైనా మాదక శక్తుల పంజా దెబ్బ తీవ్రతను ప్రస్తావిస్తూ- నేర న్యాయ వ్యవస్థ, ఆరోగ్య విభాగాలు, సామాజిక సేవల యంత్రాంగాలు సమన్వయంతో ఉమ్మడి పరిష్కారాలకోసం పని చేయాలని సమితి పిలుపిస్తున్నా- ఇండియాలాంటి వర్ధమాన దేశాల్లో దానికి మన్నన దక్కుతున్నదెక్కడ? జంట తలల విష భుజంగంలాంటి మత్తుపానీయాలు, మాదక ద్రవ్యాలు దేశ వర్తమానాన్నే కాదు- భవిష్యత్తునూ కసిగా కబళిస్తున్నాయనేందుకు నాలుగు నెలల క్రితం నాటి సర్కారీ సర్వేయే తిరుగులేని దాఖలా! మాదక ద్రవ్యాల గిరాకీ తగ్గింపును లక్షించిన జాతీయ కార్యాచరణ పథకం కొరగానిదని పదేపదే రుజువవుతున్న నేపథ్యంలో- పటిష్ఠ వ్యూహాన్ని పట్టాలకెక్కించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వీయ బాధ్యతను దులపరించేసుకోలేవు!

భారత రాజ్యాంగంలోని 47వ అధికరణ- ప్రజల జీవన ప్రమాణాలు, పౌష్టికాహార స్థాయి, ప్రజారోగ్యం మెరుగుదల ప్రభుత్వాల ప్రాథమిక విధుల్లో భాగమని స్పష్టీకరిస్తోంది. వైద్యపర అవసరాల్ని మినహాయించి ప్రజారోగ్యానికి చెరుపు చేసే మత్తుపానీయాలు, మాదక ద్రవ్యాల్ని ప్రభుత్వాలు నిషేధించాలనీ సూచించింది. శ్రేయోరాజ్య భావనకు గొడుగు పట్టిన ఆ రాజ్యాంగ అధికరణను క్రూరంగా అపహసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెలగబెడుతున్న నిర్వాకం- కోట్లాది పచ్చని కుటుంబాల్లో ఏటా లిక్కర్‌ చిచ్చుపెడుతోంది. 2010-’17 నడిమికాలంలో ఇండియాలో ఆల్కహాల్‌ వినిమయం 38శాతం, అంటే- ఏటా తలసరి 4.3నుంచి 5.9 లీటర్లకు పెరిగిందని అంతర్జాతీయ అధ్యయనం ఎలుగెత్తి చాటింది. 2025నాటికి గరళ సదృశమైన ఆల్కహాల్‌ వినిమయాన్ని 10శాతం తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్షించినా- ఇండియాలాంటి చోట్ల లిక్కర్‌ వినియోగం పెరుగుతూపోతున్న తీరు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధననే మసకబారుస్తోంది. ఇండియాలో మందుబాబులు 2016లో ఆల్కహాల్‌పై వెచ్చించిన మొత్తం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు; 2026నాటికి 1400 కోట్ల లీటర్ల సరకు వినియోగంతో మందు మార్కెట్‌ పరిమాణం అంతకు రెట్టింపు కానుందన్న అంచనాలున్నాయి. బొక్కసాలు నింపడానికి లిక్కర్‌ రాబడులపైనే ఆధారపడుతున్న సర్కార్లకు తెలియదేమో- దేశవ్యాప్తంగా అయిదు కోట్ల 70లక్షలమంది మందుకు బానిసలైపోవడంతో అన్ని కుటుంబాలు నిత్య నరకం అనుభవిస్తున్నాయి. కుటుంబాల్నే కూల్చేస్తున్న మద్య రక్కసికి కోరలూ కొమ్ములూ మొలిపించి తరిస్తున్న ప్రభుత్వాలు- పాఠశాలల దాకా పాకిపోయి చాక్లెట్ల రూపంలో పసివాళ్లనూ వ్యసనపరులుగా మార్చేస్తున్న మాదక శక్తులపై అక్షరాలా శీతకన్నేస్తున్నాయి!

అఫ్గానిస్థాన్‌, మియన్మార్‌, కొలంబియా, మెక్సికో, పాకిస్థాన్లతోపాటే ఇండియా సైతం మాదక ద్రవ్య వాణిజ్య కూడలిగా మారిందన్న నిజాన్ని అమెరికా ప్రభుత్వ నివేదిక మొన్నామధ్య బయటపెట్టింది. ముంజేతి కంకణానికి అద్దమెందుకన్నట్లు ప్రధాన నగరాల్ని దాటి చిరు పట్టణాలకూ మాదక శక్తుల విస్తరణ విస్తుగొలుపుతోంది. కౌమార ప్రాయంలోని పిల్లల్నీ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మార్చి, వాటికోసం ఏం చేయడానికైనా వెనకాడని పరిస్థితి కల్పించి, వారినే సరఫరాదారులుగా ఉపయోగించే భయానక సాలెగూడు తరహా వ్యవస్థ దేశవ్యాప్తంగా చిలవలు పలవలు వేసుకుపోతోంది. దాదాపు నాలుగు లక్షల 60వేల మంది 17ఏళ్లలోపు పిల్లలు పీల్చే మత్తు పదార్థాలకు బానిసలయ్యారని నాలుగు నెలల క్రితం ‘ఎయిమ్స్‌’ అధ్యయనమే వెల్లడించింది. దేశీయంగా రెండు కోట్ల 70 లక్షలమంది మాదక ద్రవ్యాలను వాడుతున్నారన్న నివేదికాంశాలు కాదు- నానాటికీ ఆ సంఖ్య ఇంతలంతలయ్యేలా సాగుతున్న మాదక మారీచుల వాణిజ్య సరళే భయభ్రాంతం చేస్తోందిప్పుడు! ఆరువారాల క్రితం నొయిడాలోని ఓ ఐపీఎస్‌ అధికారి ఇంటినుంచి స్వాధీనం చేసుకొన్న 1818 కిలోల సూడో ఎఫిఢ్రిన్‌, రెండు కిలోల కొకైన్‌ విలువ- అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలు! మాదక ఉగ్రవాదాన్ని మట్టుపెట్టేలా జాతీయ విధాన రూపకల్పనకు ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ అభ్యర్థిస్తే- పంజాబ్‌, కశ్మీర్‌లకోసం సవిస్తృత వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. దేశానికే పెనుముప్పుగా దాపురించిన మాదక మాఫియా వెన్ను విరవాలంటే, అన్ని రాష్ట్రాలతో కలసి కేంద్రం విస్పష్ట కార్యాచరణతో కదన భేరి మోగించాలి. మత్తుపానీయాల ఉరవళ్లకూ అడ్డుకట్ట వేసేలా రాష్ట్రాలనూ దారికి తీసుకురాగలిగినప్పుడే సంక్షేమ భారతం సాక్షాత్కరించేది!


Posted on 29-06-2019