Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

కబళిస్తున్న కల్తీ

* ప్రభుత్వాల ప్రేక్షక పాత్ర

తినే తిండి శుచిగా, రుచిగా ఉంటేనే బతుకు బండి సాఫీగా సాగుతుంది. హరిత విప్లవ నేపథ్యంలో ధాన్య సమృద్ధి, పౌష్టికాహార అవసరాల ప్రాతిపదికన దేశం చెప్పుకోదగిన ముందడుగులే వేసింది. దేశంలో ప్రజావళి పౌష్టికాహార, రక్షితాహార అవసరాలకు భరోసాగా 2006లో సురక్షిత ఆహారం-ప్రమాణాల చట్టం తీసుకువచ్చారు. అదే క్రమంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)నూ ఏర్పాటు చేశారు. ప్రజలందరికీ రక్షిత ఆహారాన్ని సమకూర్చేందుకు ప్రభుత్వాల స్థాయిలో జరుగుతున్న కృషి క్షేత్రస్థాయికి విస్తరించడం లేదు. దేశంలో ఏటా పదికోట్లకుపైగా ఆహార సంబంధ వ్యాధులు విస్తరిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 2030నాటికి ఈ సంఖ్య 15 కోట్లనుంచి 17.7 కోట్లకు పెరుగుతుందన్న అంచనాలు భయాందోళనలు రాజేస్తున్నాయి. మరో పదకొండేళ్లలో సగటున ప్రతి పదిమంది భారతీయుల్లో ఒకరు అరక్షిత ఆహారం కారణంగా వ్యాధుల బారినపడే ప్రమాదం పొంచి ఉంది. కలుషిత ఆహారం కారణంగా వ్యాధులు విస్తరించడం దేశ ఆర్థికానికి తూట్లు పొడుస్తోందని, ఆ రకంగా ఏటా లక్షా 78,100 కోట్ల రూపాయల మేర (జీడీపీలో 0.5శాతం) నష్టం వాటిల్లుతోందని ప్రపంచ బ్యాంకు అధ్యయనం వెెల్లడించింది.

ఆహారంలో కలుషితాలకు బ్యాక్టీరియా (66 శాతం), రసాయనాలు (26 శాతం), వైరస్‌ (నాలుగు శాతం), పరాన్నజీవు (నాలుగు శాతం)లు కారణమవుతున్నాయి. పాలు, పాల ఉత్పత్తులైన ఖీర్‌ వంటివి; మాంసం, చేపలు, మజ్జిగ, మిఠాయిలు, రొయ్యలవంటి సముద్ర ఉత్పత్తులు ఎక్కువగా కాలుష్యం బారినపడుతున్నాయి. వండిన అన్నం, చింతపండు, కూరగాయలు సైతం బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల కలుషితాహారంగా రూపాంతరం చెందుతున్నాయి.

నిర్దేశిత ప్రమాణాలకు దూరంగా ఉత్పత్తులు
దేశంలో అత్యధికంగా కలుషితమవుతున్న ఆహారం పాలు! ప్యాకేజింగ్‌ సందర్భంగా, పాలను నింపే క్యాన్లను డిటర్జెంట్లతో కడగడంవల్ల పాలలో కలుషితాలు చేరుతున్నాయని వివిధ సర్వేలు పేర్కొంటున్నాయి. మరోవంక పాలు చిక్కగా కనిపించడం కోసం, ఎక్కువ కాలం విరిగిపోకుండా ఉండటం కోసం యూరియా, గంజి పౌడరు, గ్లూకోజ్‌, ఫార్మాలిన్‌లను కలుపుతున్నారు. దేశంలో విక్రయిస్తున్న పాలు, సంబంధిత ఉత్పత్తుల్లో 68.7శాతం భారత రక్షిత ఆహార ప్రమాణాల సంస్థ నిర్దేశాలకు దూరంగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా పాలు, సంబంధిత ఉత్పత్తుల్లో చోటుచేసుకుంటున్న కల్తీకి అడ్డుకట్ట వేయని పక్షంలో 2025 నాటికి 87 శాతం పౌరులు క్యాన్సర్‌ వంటి తీవ్ర వ్యాధుల పాలబడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరించింది. పాల తరవాత వంట నూనెల్లో అత్యధిక కల్తీ జరుగుతోంది. దేశంలోని 15 రాష్ట్రాల్లో విక్రయిస్తున్న 85 శాతం నూనెల్లో దారుణమైన కల్తీ జరుగుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. భారత్‌లో ఆహార సంబంధ వ్యాధుల విస్తృతిని గుర్తించే యంత్రాంగమే లేదు. ఆరోగ్య సంక్షోభం ముమ్మరించిన తరవాతో లేక తీవ్ర ఆర్థిక నష్టాలు వాటిల్లినప్పుడో మాత్రమే సమస్య తీవ్రత విధానకర్తల తలకెక్కుతోంది. దేశంలో ఈ వ్యాధుల విస్తరణ తీరుతెన్నులను పరిశీలించి, విశ్లేషించే వ్యవస్థల అవసరం ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందం మేరకు పారిశుద్ధ్య నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించడంతోపాటు ఎప్పటికప్పుడు ఏయే ఆహార పదార్థాలు విష కలుషితమవుతున్నాయి, ఏ స్థాయిలో ఆ కల్తీ జరుగుతోంది అన్న సమాచారాన్ని ‘డబ్ల్యూటీఓ’కు అందజేయాల్సి ఉంటుంది. ఆహార కాలుష్యంపై సూక్ష్మ వివరాలు సేకరిస్తే తప్ప సమర్థ పరిష్కారాలను అన్వేషించడం సాధ్యం కాదు.

ప్రపంచ సురక్షిత ఆహార సూచీ-2018 నివేదికలో పేర్కొన్న 113 దేశాల్లో ఐర్లాండ్‌ తొలిస్థానంలో, అమెరికా ఆ తరవాత నిలుస్తుండగా- భారత్‌ 50వ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ, వరల్డ్‌ బ్యాంకు అందించిన గణాంకాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. సురక్షిత ఆహార ప్రమాణాల పరంగా సింగపూర్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది. ప్రమాణాల పర్యవేక్షణ వ్యవస్థలతోపాటు చురుగ్గా వ్యవహరించే స్వతంత్ర తనిఖీ బృందాలు ఉండటం ఆ దేశంలో ఆహార కల్తీకి ముకుతాడు వేస్తోంది. వ్యవసాయదారుడి నుంచి విక్రేత వరకూ ఆహారోత్పత్తులను ప్రతి దశలోనూ నిశితంగా తనిఖీ చేసే యంత్రాంగాలు ఆ దేశంలో ఉన్నాయి. అరక్షిత ఆహారాన్ని విక్రయిస్తున్న వారిపై న్యాయవ్యవస్థలో కేసులు నమోదు చేసేందుకూ అక్కడి చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. భారత్‌ పరిస్థితి ఇందుకు భిన్నం. 2050నాటికి మన దేశ జనాభా 170 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ పరిస్థితుల్లో తలసరి నీటి లభ్యత దారుణంగా పడిపోతుంది. అది ఆహార నాణ్యతపై ప్రతికూల ప్రభావం కనబరుస్తుంది. దానివల్ల దేశంలోని నాలుగింట మూడొంతు ప్రజల పౌష్టికాహార అందుబాటుపై ప్రభావం పడుతుంది. దాంతో ప్రజారోగ్యమూ కుంగుబాట పడుతుంది. నగరీకరణ పెరుగుతుండటం, స్థూల దేశీయోత్పత్తిలో వృద్ధి కారణంగా 2030 నాటికి సంపన్న కుటుంబాల్లో మూడింట ఒకరు ఆహార సంబంధ వ్యాధుల పాలబడే అవకాశాలున్నాయి. ధనిక కుటుంబాలు మాంసం, పళ్లు, కూరగాయలను అధికంగా ఉపయోగించడమే ఇందుకు కారణం. సురక్షిత ఆహార ప్రమాణాలను నిర్దుష్టంగా అమలు చేయాలంటే వ్యవస్థలు బలంగా ఉండాలి. అందుకోసం ప్రభుత్వ స్థాయిలో పెద్దయెత్తున నిధుల కేటాయింపు జరగాలి. ఆహార నాణ్యత ప్రమాణాలపై దేశవ్యాప్తంగా అవగాహన పెరుగుతున్నప్పటికీ- నిధుల కేటాయింపులో మాత్రం అందుకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడం బాధాకరం. ఆహార నాణ్యత ప్రమాణాల పరిరక్షణకు ప్రభుత్వాలు నిధులు పెంచాలి. దానివల్ల భారత ఆర్థిక వ్యవస్థపైనా సానుకూల ప్రభావం ఉంటుంది. ప్రభుత్వాలు సురక్షిత ఆహార విధానాలు రూపొందించి, వాటి అమలుకు సంసిద్ధమైతే- ఆ మేరకు ప్రమాణాల పర్యవేక్షణ కోసం నైపుణ్య మానవ వనరులకు ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. తద్వారా దేశంలో సేవల రంగం ఊపందుకొని ఆర్థిక వ్యవస్థ జవసత్వాలు పుంజుకొంటుంది.

మారుతున్న ఆహార అలవాట్లు
ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహార అలవాట్లు నెమ్మదిగానైనా గుణాత్మకంగా రూపాంతరం చెందుతున్నాయి. పోషక విలువలు కొరవడిన రోజువారీ ఆహారం నుంచి ప్రజలు క్రమంగా మాంసం, పళ్లు, కూరగాయలు వంటి పౌష్టికాహారాల వైపు మరలుతున్నారు. పౌష్టిక విలువలు సమృద్ధిగా ఉండే ఈ ఆహారంలో నాణ్యత ప్రమాణాలు వేగంగా కొడిగడుతున్నాయి. ప్రమాణాలకు సంబంధించి ఈ పతనాన్ని తక్షణం నిలవరించకపోతే పౌష్టిక విలువలు కలిగిన ఈ ఆహారాన్ని స్వీకరించడానికి ప్రజలు విముఖత చూపుతారు. అది ఒకరకంగా ప్రజల ఆహార హక్కును హరించడమే అవుతుంది. నగరీకరణపైన, ఆర్థిక వృద్ధిపైన ఈ పరిణామం పెను ప్రభావం కనబరుస్తుందనడంలో మరోమాట లేదు.

సింగపూర్‌ విధానం ఆదర్శనీయం
దేశంలో ఆహార ఉత్పత్తులు వినియోగానికి అనుకూలంగా, సురక్షితంగా ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఆ మేరకు ఆహార పదార్థాల నిర్దిష్ట ప్రమాణాలను అమలయ్యేట్లు ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలి. నాణ్యత ప్రమాణాలను నిర్ధారించేందుకు అవసరమైన మౌలిక వసతులను విస్తరించాలి. అందుకోసం సుశిక్షత మానవ వనరులను పెంచాలి. రైతు మొదలు విక్రేత వరకూ వివిధ దశల్లో ఆహార నాణ్యతను ధ్రువీకరించే వ్యవస్థలుండాలి. వ్యవసాయదారులు, విక్రేతలు, ప్రభుత్వం మధ్య మెరుగైన సమన్వయం ఏర్పడాలి. ప్రభుత్వ, ప్రైవేటు అన్న తేడా లేకుండా కలుషిత ఆహారాన్ని అందించే ప్రతి ఒక్కరిపైనా చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఆహార ప్రమాణాలను పరీక్షించే ప్రయోగశాలల సంఖ్యను పెంచాల్సి ఉంది. 130కోట్లకు పైబడిన ప్రజల ఆహార అవసరాలను నెరవేర్చడం ఎంత ముఖ్యమో- నాణ్యమైన ఆహారాన్ని అందించడం అంతకంటే కీలకం! ఆ మేరకు సింగపూర్‌ తరహా పారదర్శక, జవాబుదారీ, సమర్థ వ్యవస్థలను నెలకొల్పి ప్రమాణాల పర్యవేక్షణకు పూనుకోవాలి. కలుషిత ఆహారం వల్ల దేశవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలు ప్రబలుతున్నాయి. ఆహార పదార్థాలను సరిగ్గా నిల్వ చేయకపోయినా, వండకపోయినా, అపారిశుద్ధ్య వాతావరణంలో ఉంచినా బ్యాక్టీరియా, వైరస్‌, ప్రమాదకర రసాయనాలు అందులో చేరిపోతాయి. ఆహారంలో చేరిన ఈ బ్యాక్టీరియాను దాని రుచి, రంగును బట్టి గుర్తించడం సాధ్యమయ్యే పనికాదు. జాతి ఆరోగ్యానికి పెను సవాలుగా నిలుస్తున్న ఈ సమస్యను ఎదుర్కోవడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ వ్యవస్థలూ ఈ క్రమంలో ప్రభుత్వానికి తోడ్పాటుగా నిలవాలి. ప్రపంచ జనాభాలో 10శాతం లేదా 60 కోట్లమంది ప్రజలు కలుషిత ఆహారం కారణంగా ఏటా అనారోగ్యం పాలవుతున్నారు. వీరిలో సుమారు నాలుగు లక్షలమంది మరణిస్తున్నారు. ‘సమితి’ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు జనావళికి నాణ్యమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచడం అత్యావశ్యకం. ప్రణాళికాబద్ధంగా ముందుకు కదిలితే తప్ప జాతి భవితకు పెను ప్రమాదంగా పరిణమిస్తున్న ఈ సమస్యను ఎదుర్కోవడం సాధ్యం కాదు!Posted on 02-07-2019