Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అరాచక శక్తులకు అడ్డేదీ?

* కలవరపెడుతున్న అదృశ్యం కేసులు

మేధోవికాసం, సాంకేతిక ప్రగతిలో ముందడుగు వేస్తున్న భారత్‌ మానవీయ విలువల పరిరక్షణలో విఫలమవుతోంది. దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్న వ్యక్తుల అపహరణ, అదృశ్య ఘటనలు ఇందుకు నిదర్శనలుగా నిలుస్తున్నాయి. సాక్షాత్తూ దేశ రాజధాని నగరమైన దిల్లీలో గత మూడేళ్లలో అయిదు వేలకు పైగా చిన్నారులు అదృశ్యమయ్యారు. వారి జాడ ఇప్పటికీ తెలియలేదు. గత ఏడాది కేరళలో 12,453 మంది అదృశ్యమైనట్లు నమోదైన సంఘటనల్లో ఇంకా 692 మంది ఆచూకీ దొరకలేదు. ఆంధ్రప్రదేశ్‌లో నిరుటి నుంచి ఇప్పటివరకు 661 మంది పిల్లలు కనపడకుండాపోయారు. వారిలో ఇంకా 245 మంది జాడ తెలియాల్సి ఉంది. తెలంగాణలో జూన్‌ మొదటి తొమ్మిది రోజుల్లోనే 545 అదృశ్య కేసులు నమోదవడం ఆందోళన కలిగించే పరిణామం. కనిపించకుండా పోతున్నవారిలో విద్యార్థులు, ప్రేమికులు, చిన్నపిల్లలతోపాటు వృద్ధులూ ఉన్నారు.

పరీక్షల ఫలితాలొచ్చే సమయంలో విద్యార్థుల అదృశ్య ఘటనలు నమోదవుతున్నాయి. ర్యాంకులు, మార్కుల మోజులో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను సతాయిస్తున్నారు. దీంతో పిల్లలు భయంతో బాహ్య ప్రపంచంలోకి వెళుతున్నారు. పెద్దల ఆవేశం సద్దుమణిగాక కొంతమంది తిరిగొస్తున్నారు. సహజ ప్రతిభను తొక్కిపడేస్తున్న బట్టీ చదువులు వారి భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారాయి. ఈ వాస్తవాలు కళ్లెదుటే కనిపిస్తున్నా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ పెద్దల మార్గదర్శకత్వం, ఆత్మీయత కొరవడటంతో తమను ఊరడించే వారు లేక పిల్లలు ఆందోళన చెందుతున్నారు. ఉద్వేగాల నియంత్రణ, వ్యవహార దక్షత, ఇతరుల హక్కులను, అభిప్రాయాలను గౌరవించడం, ఓర్పు వంటి లక్షణాలను పిల్లలకు నేర్పడంలో కుటుంబాలు విఫలమవుతున్నాయన్నది చేదు నిజం.

వికటించిన యువతీ యువకుల ప్రేమ వ్యవహారాలూ అదృశ్య ఘటనలకు కారణమవుతున్నాయి. ఆకర్షణకు, అసలైన ప్రేమకు మధ్య గల వ్యత్యాసాన్ని పిల్లలకు వివరించాల్సిన బాధ్యతను నేటి పెద్దలు విస్మరిస్తున్నారు. ఫలితంగా అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. కౌమార దశ నుంచి కలిగే శారీరక, మానసిక మార్పులు, స్త్రీపురుష వైవిధ్యాలు, విశిష్టతలను బిడ్డలకు వివరించాల్సిన బాధ్యతను ఈనాటి తల్లిదండ్రులు గుర్తించడం లేదు. దీంతో యుక్త వయస్కులు దారి తప్పుతున్నారు. కన్నవారి మనసులను కష్ట పెడుతున్నారు.

కన్నబిడ్డల నిర్లక్ష్యానికి గురై, ఆత్మాభిమానం దెబ్బతిన్న కొంతమంది వృద్ధ తల్లిదండ్రులు సైతం ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు. 32శాతం మాత్రమే వృద్ధుల సంరక్షణపట్ల బాధ్యతగా ఉంటున్నారు. మిగిలిన వారు అలక్ష్యంగా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారని దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అప్పులు, తప్పులు చేసినవాళ్లు సమస్యలను ఎదుర్కోలేక, అపరాధభావంతో తోటివారికి ముఖం చూపలేక ఇల్లొదిలి వెళ్లిపోతున్నారు. ఫలితంగా వారి కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులు వర్ణనాతీం. అదృశ్య సంఘటనలకు ముఖ్యమైన మరో కారణం అపహరణ ముఠాల కిరాతకం. వాళ్లను కట్టడి చేయడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శను తోసిపుచ్చలేం. పోలీసులు వీరిని ఉక్కుపాదంతో అణచి వేయాల్సి ఉంది. నేరస్తుల పీచమణచి ప్రజల్లో విశ్వాసాన్ని కలగజేయడంలో పోలీసు వ్యవస్థ ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచలేకపోతోంది. ఫిర్యాదుదారులపట్ల నిర్లక్ష్య ధోరణి, తారతమ్యాలు చూపడం వంటి ఆమోదయోగ్యం కాని ధోరణుల వల్ల పోలీస్‌ శాఖ విశ్వసనీయతను కోల్పోతోంది. సామాన్యుల కోసం పని చేసినప్పుడే అది ప్రజల మన్ననలను చూరగొంటుంది. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని పోలీసులు కోరడం సమంజసమే. అలా సహకరించేవారికి పోలీసుల అండ ఉంటుందా అన్న అనుమానం కలుగకమానదు. ఇటీవల హైదరాబాద్‌లో ఒక యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న రౌడీషీటర్‌ను ఎదురొడ్డి నిలిచిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరిగినప్పుడు బాధితుల తరఫున మాట్లాడేందుకు మరొకరు ముందుకు రాలేరు. అదృశ్య, అపహరణ సంఘటనలను నామరూపాల్లేకుండా చేయడంలో పోలీసు శాఖ మాత్రమే కాక ప్రభుత్వాలు, సామాజిక వ్యవస్థలు, వ్యక్తులు భాగస్వాములు కావాల్సిన అవసరముంది. ఎవరో అదృశ్యమైతే నాకేంటనే నిర్లిప్తత తగదు.

ప్రేమ, తోడ్పాటు, గుర్తింపు, సంతోషం లభించే క్షేత్రాలుగా ఇళ్లు, కుటుంబాలు మారితే అదృశ్య ఘటనలకు అసలు తావే ఉండదు. ఈ విషయంలో చొరవ చూపాల్సింది కుటుంబ పెద్దలే. కఠినమైన ఆంక్షలతో కాకుండా సానుకూల ఆలోచనా ధోరణులతోనే పిల్లల్లో మార్పు తీసుకురాగలమన్న వాస్తవాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. భావిపౌరులను తీర్చిదిద్దడంలో పాఠశాలల పాత్ర తిరుగులేనిది. విద్యాలయాలు వారికి సామాజిక బాధ్యతలపట్ల అవగాహన కలిగించాలి. ఉపాధ్యాయులు నైతిక విలువల ప్రాధాన్యాన్ని తెలియజేయాలి. అపహరణ ముఠాలు, నేరస్తులపై కఠిన చర్యలు అవసరం. తద్వారా పరిస్థితిని కొంతవరకైనా నియంత్రించవచ్చు. అదృశ్య కేసులలో బాధితుల జాడను పసిగట్టి, వారిని ఇంటికి చేర్చినప్పుడే అసలైన న్యాయం జరుగుతుంది. తమవాళ్లు దూరమైనప్పుడు వారి కుటుంబ సభ్యులు అనుభవించే బాధ వర్ణనాతీతం. అరాచక శక్తులపై అనుక్షణం ఓ కన్నేసి ఉంచాలి. అపహరణ, వ్యక్తుల అదృశ్యం వంటి ఘటనలను నియంత్రించడంలో అందరూ కలసి పనిచేయాలి. ఆ బాధ్యత పోలీసులదో, ప్రభుత్వానిదో అని భావించరాదు. ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు సమకూరతాయి!- వంగీపురం శ్రీనివాసాచారి
(రచయిత - జీవన నైపుణ్యాల నిపుణులు, విశ్లేషకులు)
Posted on 02-07-2019