Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ప్ర‘జల స్వామ్యం’!

‘చెరువు పూడు ఊరు పాడు’ వంటి సార్వకాలీన సామెతలు ఊరికే పుట్టలేదు. కూర్చున్న కొమ్మను తెగనరుక్కొనే పెడ ధోరణులతో ఒకవంక ప్రకృతి విధ్వంసం, ప్రాణప్రదంగా పరిరక్షించుకోవాల్సిన పరిమిత జల వనరుల వినియోగంలో మరోపక్క అలవిమాలిన అలక్ష్యం- జమిలిగా తీవ్ర జల సంక్షోభానికి అంటుకట్టాయిప్పుడు! రెండో దఫా ప్రధానమంత్రిత్వం చేపట్టాక మొట్టమొదటి మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ జల సంరక్షణ ఆవశ్యకతను ఉద్బోధించారు. దేశవ్యాప్తంగా 91 ప్రధాన జలాశయాల్లో నీళ్లు అడుగంటి, జూన్‌ తొలివారానికే పలకరించాల్సిన తొలకరి మొహం చాటేయడంతో సాధారణ వర్షపాతానికీ గండిపడి, పట్టణాలూ పల్లెల్లో నీటి ఇక్కట్లు ఏ స్థాయిలో ముమ్మరించాయో చెప్పనలవి కాదు. 2015 నవంబరు, డిసెంబరు నెలల్లో అతివృష్టి సృష్టించిన భయానక వరదల్లో చిక్కి ‘కావవే వరదా...’ అంటూ కన్నీటి పర్యంతమైన చెన్నై మహానగరం నేడు చినుకు జాడ కరవైన అనావృష్టి పరిస్థితుల్లో తాగునీటి అవసరాలూ తీరక అలమటిస్తోంది. చెన్నైలో గ్రాము బంగారం కంటే, ప్రైవేటు ట్యాంకర్‌ నీటి ఖరీదే ఎక్కువ అన్న మాన్య ఎంపీల ఆక్రోశం సాక్షిగా తమిళనాడు నెత్తిన జల సంక్షోభం ఉరుముతోంది. తరతమ భేదాలతో తక్కిన రాష్ట్రాలదీ అదే పరిస్థితి! ఏటా కురిసిపోయే వర్షాల్లో కేవలం ఎనిమిది శాతాన్నే పొదివి పట్టుకోగలుగుతున్నామన్న ప్రధాని మోదీ- జాగృత జన అక్షౌహిణులు అపర భగీరథులై జల సంరక్షణోద్యమానికి పూనుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నారు. జల సంరక్షణ ఆవశ్యకతపై ప్రజలందరిలో అవగాహన పెంచాలని, సంప్రదాయ పద్ధతుల్లోని విజ్ఞాన సారాన్ని అందరికీ పంచాలనీ, నీటి పరిరక్షణపై పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థల సమాచారాన్నీ అందించాలని ప్రధాని మోదీ సూచిస్తున్నారు. ‘నుయ్యి ఎండిపోయినప్పుడే తెలుస్తుంది నీటి విలువ’ అన్నట్లు ఏటా ఏదో ఒక సమయంలో తాగునీటి కటకట ఎదుర్కొంటున్న జనావళిలో కేవలం అవగాహన పెంచడం కాదు; జల సంరక్షణ జాతి సంస్కృతిగా పాదుకొనే బహుముఖ పటిష్ఠ కార్యాచరణను పట్టాలకెక్కించేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి!

ఏటికేడు ఎదిగే జనసంఖ్య అవసరాలకు దీటుగా ప్రకృతి ప్రసాదిత వనరులా... పెరిగేవి కావు. దేశీయంగా దాదాపు 450 నదులు ప్రవహిస్తున్నా వాటిలో సగానికిపైగా తాగునీటి అవసరాలకు పనికిరావు! స్వాతంత్య్రం సిద్ధించే నాటికి 6,042 ఘనపు మీటర్లుగా ఉన్న తలసరి నీటి లభ్యత 2021 నాటికి 1,340 ఘ.మీటర్లకు కుదించుకుపోనుందని సర్కారీ గణాంకాలే చాటుతున్నాయి. నిరుడీ రోజుల్లో నీతి ఆయోగ్‌ కళ్లకు కట్టిన భారతావని జలదృశ్యం- ఎకాయెకి 60 కోట్ల జనావళి తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతోందని, 2030నాటికి నీటి లభ్యతకంటే గిరాకీ (అవసరాలు) రెండింతలు అధికం కానుందనీ భయానక వాస్తవాల్ని వెల్లడించింది. గ్రామీణ భారతంలో 84 శాతం జనావళికి కుళాయి నీళ్లు అందుబాటులో లేవని, 70శాతం జలాలు కలుషితమైపోవడంతో ఏటా రెండు లక్షలమంది అర్ధాయుష్కులవుతున్నారనీ నీతి ఆయోగ్‌ నివేదించింది. ఎక్కువకాలం గుక్క తడవకపోతే ప్రాణం పోతుంది. అలాంటిది గొంతులోకి జారే నీరే గరళమై ప్రాణాల్ని తోడేయడాన్ని మించిన విషాదం ఏముంది? తాగునీరు పొందడాన్ని ఈ దేశ పౌరుల జీవన హక్కుగా సుప్రీంకోర్టు స్పష్టీకరించినా, జీవనదులైన గంగా యమునలు ప్రాణమున్న చట్టబద్ధ జీవులని, ఓ మనిషికి ఉండే చట్టబద్ధ హక్కులన్నీ వాటికీ ఉంటాయని ఉత్తరాఖండ్‌ హైకోర్టు వినూత్న తీర్పు ఇచ్చినా- వాస్తవంలో ఏం ఒరిగింది? వచ్చే ఏడాదికల్లా 21 ప్రధాన నగరాలు దాహార్తితో అలమటించే దుర్భర స్థితి దాపురించనుందన్న నీతి ఆయోగ్‌ హెచ్చరికల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం- జలశక్తి మంత్రిత్వశాఖను కేంద్రంలో కొత్తగా కొలువుతీర్చింది. దానివల్ల ప్రయోజనం పరిమితమే. తమ వంశాంకురాలు క్షామం బారినపడకుండా క్షేమంగా ఎదగాలంటే తక్షణం నీటి సంరక్షణకు తాను నడుం కట్టాల్సిందేనన్న నవ చేతన ప్రతి ఒక్కరిలో పురివిప్పేలా- నిశ్చయంగా సాగాల్సింది భగీరథయత్నమే!

‘దేశంలో నీటికి కొరత లేదు... ఆ అమూల్య వనరును వినియోగించుకోవడంలో లోటుపాట్ల కారణంగానే తీవ్ర అవస్థల పాలవుతు’న్నామన్న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యలు అక్షర సత్యం. ఏటా వంద రోజుల్లోనే కురిసిపోతున్న 70శాతం వానల మూలాన వరదలు పోటెత్తి అపార జలరాశి వృథాగా ఉప్పు సముద్రం పాలవుతూనే ఉంది. అవసరమైనప్పుడల్లా భూగర్భాన్ని నీటికోసం తొలిచేస్తుండటం, ఆ వెలితిని పూరించకుండా నిర్లక్ష్యం వహిస్తుండటంతో- దేశవ్యాప్తంగా 160 జిల్లాల్లో భూగర్భ వనరు ఉప్పు నీటిమయమై పోగా, 230 జిల్లాల్లో ఫ్లోరైడ్‌ భూతం జడలు విరబోసుకొంది. మానవాళి చరిత్రలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న కలుషిత జలవాడకం ఇండియాలో యథేచ్ఛగా సాగుతోంది! ఈ దుర్భర దురవస్థ ఇంకానా? ఈ అవ్యవస్థను రూపుమాపే రాజ్యాంగ విహిత బాధ్యత ప్రభుత్వాలది కాదా? ‘ప్రతి నీటి బొట్టుకు మరింత ఉత్పాదన’ (పర్‌ డ్రాప్‌ మోర్‌ క్రాప్‌) వంటి నినాదాలు కాదు కావాల్సింది; బిందు సేద్య పరిజ్ఞానం, పనిముట్లు రైతులకు అందుబాటులోకి రావాలి. పరిమిత నీటితోనే పనులు చక్కబెట్టుకోగల ఉపకరణాల్ని ప్రజలకు చేరువ చెయ్యాలి. ‘బతుకు కోసం-భవిత కోసం’ జల సంరక్షణ యజ్ఞం వ్యక్తి స్థాయిలో నిష్ఠగా, సామాజిక స్ఫూర్తితో సమష్టిగా సాగేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటునందివ్వాలి. ప్రజాస్వామ్యం ప్ర‘జలస్వామ్యం’గా పరిఢవిల్లే సంస్కృతికి అన్ని చోట్లా బీజావాపనం జరగాలి!
Posted on 02-07-2019