Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

తీరప్రాంతాలకు గుండె కోత

* సముద్రతలం-పర్యావరణ ప్రకోపం

భారతదేశానికి మూడువైపులా ఉన్న సముద్ర తీరం దేశాభివృద్ధికి ఆయువుపట్టుగా నిలుస్తోంది. సముద్ర వాణిజ్యం, అపార మత్స్య సంపద, పెట్రోలియం నిల్వలు, తీర ప్రాంతాల్లో పర్యాటకం తదితర అంశాలతో కీలక ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, భూతాపం పెరుగుదలతో తీరం పలు మార్పులకు గురికావడం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశంలోని సముద్రతీర ప్రాంతాల్లో దాదాపు 25 కోట్ల మంది నివాసం ఉంటున్నారని అంచనా. ముంబయి, కొచ్చి, మంగళూరు, గోవా, చెన్నై, విశాఖ, పరదీప్‌ తదితర నగరాలన్నీ సముద్ర తీరంలోనే ఉన్నాయి. ఏటా సముద్ర మట్టం పెరుగుతుండటంతో పాటు, భారీ అలల తాకిడికి తీరం తీవ్ర కోతకు గురవుతోంది. దీనిపై చెన్నైలోని తీరప్రాంత పరిశోధన కేంద్రం నిర్వహించిన అధ్యయనంలో పలు ఆందోళనకర అంశాలు వెల్లడయ్యాయి. 1990-2016 మధ్యకాలంలో దేశ తీర ప్రాంతాలు ఏ విధంగా మార్పునకు గురయ్యాయో ఈ పరిశోధనలో వివరించారు. ప్రకృతిసిద్ధంగా, మానవ ప్రమేయంతో ఏర్పడుతున్నవిగా మార్పులను వర్గీకరించారు. ఏటా పెరుగుతున్న సముద్ర మట్టం తీరంపై విశేష ప్రభావం చూపిస్తోంది. శతాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం 40 సెం.మీ. పెరిగింది. వందలాది దీవులు, తీర ప్రాంతాలు సంద్రంలో కలిసిపోయాయి. మరో వందేళ్లలో నీటిమట్టం 60 సెం.మీ. అధికమయ్యే సూచనలున్నాయి. భూతాపం కారణంగా ఏటా 1.5 మి.మీ. నుంచి 10 మి.మీ. వరకు సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.

తీరప్రాంత క్షయానికి సహజమైన గాలులు, అలలు, సముద్ర తరంగాలు, తుపానులు కారణమవుతున్నాయి. తీర ప్రాంతాల్లో మడ అడవులను నిర్మూలించడంతో నీటి తాకిడి పెరిగే అవకాశముంది. నౌకాశ్రయాల నిర్మాణంలో భాగంగా సముద్రాన్ని పూడ్చివేస్తున్నారు. దీనివల్ల అలలు పక్కన ఉన్న తీరంపై దూకుడుగా వెళ్తాయి. ఈ క్రమంలో మరికొంత ప్రాంతం సముద్రంలో కలిసిపోయే ప్రమాదముంది. బీచ్‌ల సుందరీకరణ పేరిట నిర్మాణాలు, ఖనిజాన్వేషణ కార్యకలాపాలు తీరప్రాంతాన్ని తీవ్రంగా ధ్వంసం చేస్తున్నాయి. దేశంలో తొమ్మిది రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు తీర రేఖ ఉంది. దశాబ్దకాలంలో పశ్చిమ్‌ బంగలో క్రమక్షయంద్వారా దాదాపు 99 చ.కి.మీ. తీర ప్రాంతం కనుమరుగైంది. తీరప్రాంత కోత వల్ల మత్స్యకార ఆవాసాలు దెబ్బ తింటున్నాయి. కేరళ తీరంలో జనసాంద్రత ఎక్కువ. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొన్నేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల కారణంగా భారీ అలలు వెల్లువెత్తి పలు నివాసాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. లక్షలాది కుటుంబాలు కట్టుబట్టలతో నిష్క్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారికి ప్రత్యామ్నాయ ఆవాసాలు సమకూర్చడం ఆయా ప్రభుత్వాలకు భారమవుతోంది.

దేశంలో గుజరాత్‌ తరవాత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాలతోపాటు సముద్రతీరంలో ఇసుక దిబ్బలు, ఎర్రమట్టి, బీచ్‌లోని రాతి ప్రాంతాలు వైవిధ్యంగా ఉంటాయి. ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని తీరంలో భారీగా విస్తరించిన మడ అడవులు భూమిని కోతకు గురికాకుండా కాపాడుతున్నాయి. తుపానుల తీవ్రతను తగ్గిస్తున్నాయి. కొంతకాలంగా చేపలు, రొయ్యల చెరువుల పేరుతో మడ అడవులను తొలగించడంతో సహజసిద్ధమైన రక్షణ కొరవడుతోంది. భారీ నౌకాశ్రయం ఉన్న విశాఖ, మరో తొమ్మిది రేవులు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధికి ఆలంబనగా నిలుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల కాలంలో సంభవించే భారీ తుపాన్లతో పాటు, పారిశ్రామిక విస్తరణతో తీరం ఒత్తిడికి లోనవుతోంది. దేశ పశ్చిమ ప్రాంతంతో పోలిస్తే తూర్పుతీరంలో క్రమక్షయం ఎక్కువగా ఉంది. తరచూ తుపాన్లు రావడం, సహజసిద్ధమైన అటవీప్రాంతాల నిర్మూలనతో తీరంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్రం వెనక్కివెళ్ళడంతో, నదులు తీసుకువచ్చే మట్టితో తీరం పెరిగింది. డెల్టాలు, నదులు సముద్రంలో సంగమించే ప్రదేశాల్లో కొత్తగా మట్టిచేరిక వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలగవు. సముద్రపు నీటిపై ఆధారపడిన పలు జంతువుల మనుగడకు ప్రమాదం, అటవీ సంపదకు నష్టం వాటిల్లుతాయి. కొత్తగా ఏర్పడే నేలలు చిత్తడిగా ఉండటంతో నివాసాలకు, వ్యవసాయానికి అనుకూలించవు. విశాఖతీరంలోని యారాడ కొండలు ప్రకృతి సిద్ధంగా రక్షణ కల్పించడంతో అక్కడి తీరంలో కోత ప్రభావం తక్కువగా ఉంది. పశ్చిమాన కేరళ తీరంలోని దిగువ భాగంలో క్రమక్షయం వేగంగా జరుగుతోంది. అక్కడ సముద్రం కల్లోలంగా ఉండటంతో అలల తాకిడి ఎక్కువగా ఉంది. సముద్రతీరాల్లో నౌకాశ్రయాలు నిర్మించడం, అక్కడ తీసిన పూడిక మట్టిని సముద్రంలోనే వేయడమూ అలల ఉద్ధృతికి కారణమవుతోంది.

తీరప్రాంతాల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలి. దేశంలో ప్రధాన నగరాలు తీర ప్రాంతంలోనే ఉన్నాయి. సముద్రమట్టం పెరిగితే పరిసర నివాసిత ప్రాంతాలు ప్రభావితమవుతాయి. సముద్రమట్టం పెరుగుదల అంతర్జాతీయ అంశం కాబట్టి, ప్రపంచ దేశాలతో కలిసి భూతాపం పెరగకుండా చూసేందుకు తగిన విధానాలను రూపొందించాలి. మడ అడవులను పెద్దయెత్తున పెంచడం, తీరప్రాంత నియంత్రణ చట్టాలను సమర్థంగా అమలు చేయడం అవసరం. పర్యాటకం పేరిట కొనసాగుతున్న విచ్చలవిడి కాంక్రీట్‌ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలి. తీరంలో ఇసుక, ఇతర ఖనిజాల తవ్వకాలను పూర్తిగా నిషేధించాలి. నౌకాశ్రయాల నిర్మాణాలకు తవ్విన మట్టిని తీర ప్రాంతాల్లోనే పోసే విధంగా నిబంధనలు తీసుకురావాలి. కొత్త నౌకాశ్రయాల నిర్మాణంవల్ల పరిసర ప్రాంతాల్లో పర్యావరణం ఎలాంటి దుష్ప్రభావానికి గురికానుందో అంచనా వేసిన తరవాతే వాటికి అనుమతులు ఇవ్వాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. క్రమక్షయ నివారణలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో రాళ్ళతో నిర్మాణాలు ఏర్పాటుచేశారు. ఈ నిర్మాణంతో అక్కడ తీరానికి రక్షణ కలిగినా పక్కప్రాంతాల్లో క్రమక్షయం ఎక్కువగా ఉంది. ఇలాంటి తాత్కాలిక నిర్మాణాలకు స్వస్తిపలికి శాశ్వత నివారణ పథకం రూపొందించి, అమలు చేస్తే దేశంలోని తీరప్రాంతానికి రక్షణ కల్పించినట్లవుతుంది.

- కొలకలూరి శ్రీధర్‌
Posted on 03-07-2019