Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

జాతికి జల భాగ్యం కోసం...

అనేక విధాలుగా జాతి నెత్తిన జలగండం ఉరుముతున్న వేళ ఇది. అతివృష్టితో ముంబయి, నాసిక్‌ మునుగుతుంటే, చెన్నై సహా పలు నగరాలు నీటి కటకటతో అల్లాడుతున్నాయి. కలుషిత నీటి సేవనంతో రోగాలూ రొష్ఠుల పాలబడి ఏటా రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని నీతిఆయోగ్‌ నివేదికే వెల్లడించింది. భారత్‌ సహా ఎన్నో ప్రపంచ దేశాలు నీటి నిర్వహణ రంగంలో సంక్షుభిత స్థితిని ఎదుర్కొంటున్నాయని ప్రతిష్ఠాత్మక ‘స్టాక్‌హోం వాటర్‌ ప్రైజ్‌’ విజేత ఆచార్య అసిత్‌ కె.బిశ్వాస్‌ ఎన్నో ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యల్లోని వాస్తవం ఇప్పుడే అవగతమైనట్లుగా కేంద్రప్రభుత్వంలో కొత్త కదలిక మొదలైంది. నీటితో ముడివడిన భిన్న విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి కేంద్రంలో జల్‌శక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన మోదీ ప్రభుత్వం- వాన నీటి పరిరక్షణపై స్థానిక సంస్థలకు తాజాగా మార్గదర్శకాల్ని క్రోడీకరించింది. జల్‌శక్తి అభియాన్‌ కింద ఒక్క నీటి వనరునైనా పునరుద్ధరించేందుకు ప్రతి పట్టణమూ చర్యలు చేపట్టాలంటూ వర్షపునీటిని ఒడిసిపట్టే ప్రక్రియపై గట్టి పర్యవేక్షణ కోసం ఓ విభాగాన్ని ఏర్పాటు చెయ్యాలనీ సూచించింది. భూగర్భ జలాల వెలికితీత, పునఃపూరక (రీఛార్జి) తీరును మున్సిపల్‌ విభాగాలు పర్యవేక్షించాలని, భవిష్యత్తులో భవన నిర్మాణ అనుమతులకు ఇంకుడు గుంతల నిర్మాణాల్ని తప్పనిసరి చేయాలన్న మార్గదర్శకాలు కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లోని 1,592 బ్లాకుల్లో భూగర్భ జలమట్టాలు ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు ఈసరికే గుర్తించిన కేంద్రం వడివడిగా దిద్దుబాటు చర్యలకు సమకడుతోంది. జులై ఒకటి నుంచి సెప్టెంబరు 15 దాకా, అక్టోబరు ఒకటి నుంచి నవంబరు చివరిదాకా రెండంచెల్లో వాననీటి సంరక్షణ, నీటి వనరుల పునరుద్ధరణ, వ్యర్థ జలాల పునశ్శుద్ధి-వినియోగం, మొక్కలు నాటడం వంటివాటిపై ఆయా పురపాలక సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్రం సూచిస్తోంది. జిల్లాకో ప్రత్యేక అధికారిని నియమించి మోదీ సర్కారు చేస్తున్న కసరత్తు ఏ మేరకు ప్రభావాన్వితం అవుతుందో చూడాలి!

ప్రపంచ జనావళిలో 18 శాతానికి ఆవాసమైన ఇండియాకు నీటి వనరుల్లో నాలుగు శాతమే అందుబాటులో ఉన్నాయి. మనకన్నా ఎంతో తక్కువ నీటి వసతి ఉన్న ఇజ్రాయెల్‌ లాంటి దేశాలూ ధీమాగా పురోగమించగలుగుతుంటే, ప్రాణాధార జలాల ఆరోగ్యకర నిర్వహణను దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇండియా నేడు పెను సంక్షోభం ముంగిట నిలిచింది! ప్రపంచంలోనే అత్యల్పంగా భారత్‌ కేవలం ఎనిమిది శాతం వాన నీటినే సంరక్షించగలుగుతోంది. గ్రామసీమల్లో 23 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 88 లక్షల వాననీటి సంరక్షణ నిర్మాణాల నిమిత్తం కేంద్రం బృహత్‌ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు 2017 మార్చిలోనే సంబంధిత మంత్రి లోక్‌సభకు తెలిపారు. భూగర్భ జలశాస్త్రవేత్తలు, నిపుణుల సహకారంతో కేంద్ర భూగర్భ జల బోర్డు రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ అనుసారం గ్రామాల్లో ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాములు, కాలువ కట్టలు సహా మరెన్నింటినో ఆనాడు ప్రతిపాదించారు. యుద్ధప్రాతిపదికన ఆ ప్రణాళికలు పట్టాలకెక్కి ఉంటే- నేడు గ్రామీణ, పట్టణ ప్రాంతాలు ఒక్కతీరుగా నీటి అవసరాల కోసం గుక్కపట్టేవే కావు! దేశవ్యాప్తంగా 4,378 పురపాలికల్లో 756 (17శాతం) తీవ్ర నీటిఎద్దడి ఎదుర్కొంటున్నాయంటూ ఇప్పుడు వాటిపైనే దృష్టి సారిస్తామనడంలోని సమగ్ర దృక్పథం ప్రస్ఫుటం కావడం లేదు! వాటిలో మెజారిటీ (518) తమిళనాడు, రాజస్థాన్‌, యూపీ, పంజాబ్‌, కర్ణాటకల్లోనే పోగుపడ్డాయి. నిరుపయోగంగా మారిన జలవనరులు అత్యధికంగా కర్ణాటక (51 శాతం), రాజస్థాన్‌ (40), ఆంధ్రప్రదేశ్‌ (32), తమిళనాడు (30), ఉత్తరాఖండ్‌ (29), గుజరాత్‌ (23 శాతం)లలో ఉన్న వాస్తవాన్ని గుర్తించి, స్థానిక సంస్థలకు దన్నుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలిచి జాతికి జలసౌభాగ్యం అందించే భగీరథ యత్నాన్ని విజయవంతం చేయాలి!

అయిదు దశాబ్దాల క్రితంతో పోలిస్తే, కురిసే వానల్లో 24 శాతం కొరత కనిపిస్తోంది. తలసరి నీటిలభ్యతా నాలుగోవంతు కంటే దిగువకు పడిపోయింది. హైదరాబాద్‌, చెన్నై, దిల్లీ, బెంగళూరు వంటి 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలమట్టాలు వచ్చే ఏడాదికే సున్నాస్థాయికి చేరుకొంటాయన్న ప్రమాద ఘంటికల్ని ఏ మాత్రం పెడచెవిన పెట్టే వీల్లేదు. వచ్చే పదేళ్లలో నీటి అవసరాలు రెట్టింపు కానున్నాయన్న అంచనాలు భీతిల్లజేస్తున్నాయి. ఇంతటి సంక్షుభిత పరిస్థితుల్లో రాష్ట్రాలతో కలిసి 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఇళ్లకూ కుళాయి నీటిని అందించాలన్న మహాసంకల్పాన్ని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని సుసాధ్యం చెయ్యాలంటే దేశంలో ఏటా కురిసే 428 శతకోటి ఘనపుటడుగుల వాననీటిని సాధ్యమైనంత అధికంగా ఒడిసిపట్టాలి. ఆ మహాక్రతువు ఏదో ఒకచోట అన్నట్లు కాకుండా సంపూర్ణ ప్రజాఉద్యమ పంథాలో మొదలై నీటిపొదుపు జాతి సంస్కృతిగా స్థిరపడేలా సుదృఢ సంకల్ప దీక్షతో సాగాలి! తెలంగాణవ్యాప్తంగా 46వేల చెరువుల్ని పునరుద్ధరించిన మిషన్‌ కాకతీయ, ఏపీలో భూగర్భ జలమట్టాల్ని పెంచిన సాంకేతికత, వాటర్‌షెడ్‌, నీటిబడ్జెట్‌ నిర్వహణలో మహారాష్ట్రలోని హివారే బజార్‌ గ్రామస్తుల చైతన్యం, ఇష్టారాజ్యంగా భూగర్భ జలాల్ని తోడేయడంపై చట్టబద్ధ నిషేధం- వంటివన్నీ యావద్దేశానికీ ఆదర్శప్రాయమైనవే. పంటల సాగులో చైనా, ఇజ్రాయెల్‌, అమెరికాలతో పోలిస్తే మూడు నుంచి అయిదింతలు ఎక్కువగా నీటి వాడకాన్ని నిలువరించేలా కర్షక సోదరులకు అవసరమైన పరిజ్ఞానం, సాధన సంపత్తిని విస్తృతంగా పొలంగట్లకు చేర్చాల్సిందే! ఈ బృహత్‌ యజ్ఞం ఏ దశలోనూ నిధుల్లేక నీరసించిపోకుండా కాచుకోవాల్సింది కేంద్రప్రభుత్వమైతే, అవినీతి పాలబడి సమున్నత లక్ష్యాలు నీరు గారకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పూనిక వహించాలి.


Posted on 09-07-2019