Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పట్టాలు తప్పిన చదువులు

చిన్నపాటి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలూ కొరవడి పెద్దయెత్తున పట్టభద్రులు ఉపాధివేటలో చతికిలపడుతున్న కారణంగా దేశంలో నిరుద్యోగుల సంఖ్య నాలుగున్నర దశాబ్దాల గరిష్ఠానికి చేరింది. ఎనిమిదేళ్ల వ్యవధిలో ఇక్కడ విశ్వవిద్యాలయాలు 621 నుంచి 935కి, కళాశాలలు దాదాపు 33 వేలనుంచి 40 వేలకుపైగా విస్తరించినా- ప్రమాణాల పతనం అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న దుష్పరిణామమిది. ఉన్నతవిద్యలో నాణ్యత కరవైందని గుర్తించిన కేంద్రం నైపుణ్యాల పరికల్పనపై ఇటీవల దృష్టి సారించింది. అందులో భాగంగానే కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ పలువురు నిపుణుల్ని రంగంలోకి దించిన దరిమిలా అయిదేళ్ల దార్శనిక ప్రణాళికతో కూడిన నివేదిక రూపుదాల్చింది. ‘విద్యా నాణ్యత ఉన్నతీకరణ సమ్మిళిత కార్యక్రమం (ఎక్విప్‌)’ ఉన్నత విద్యారంగాన వృత్తినైపుణ్య అంశాలు ఇతోధికంగా అంతర్భాగం కావాలంటోంది. ఒక్కముక్కలో- బియ్యే, బియ్యస్సీ, బీకామ్‌ సహా ప్రతి డిగ్రీ కోర్సులోనూ వృత్తినైపుణ్య విద్యను తప్పనిసరిగా జోడించాలన్నది ముఖ్య సిఫార్సు. ఉన్నత విద్యకు, నైపుణ్యాలను పెంపొందించే వ్యవస్థకు మధ్య సరైన అనుసంధానం ఉండాలంటున్నా- అత్యంత కీలకమైన కేటాయింపుల మాటేమిటి? పొరుగున జనచైనా ఉన్నతవిద్యకు 14,500 కోట్ల డాలర్లు, మొత్తం విద్యారంగానికి 56,500 కోట్ల డాలర్లు కేటాయించిన 2016-17లో భారత్‌ కేటాయింపులు అరకొరేనని నీతిఆయోగ్‌ సభ్యులు వీకే సారస్వత్‌ తాజాగా ఆక్షేపించారు. ఆ ఏడాది చైనాతో పోలిస్తే భారత్‌ కేటాయింపులు ఉన్నతవిద్యకు 450 కోట్ల డాలర్లు (మూడు శాతం), మొత్తం విద్యారంగానికి 1,250 కోట్ల డాలర్లే(2.2శాతమే)నంటే దేశీయ మందభాగ్యానికి ప్రబల హేతువేమిటో ఇట్టే బోధపడుతుంది. సరికొత్త బడ్జెట్‌లో ఉదారత చాటుకున్నట్లు నిర్మలా సీతారామన్‌ వెల్లడించినా ఉన్నతవిద్య పద్దు (రూ.38 వేలకోట్లు) ఇప్పటికీ 550 కోట్ల డాలర్లలోపే. మరెన్నో దేశాలూ సమధిక కేటాయింపుల్ని మానవ వనరుల నిర్మాణానికి అత్యవసర పెట్టుబడులుగా భావిస్తూ ముందడుగు వేస్తుంటే- ఇక్కడ కళ్లకు కడుతున్నది అడపాదడపా కొద్దిపాటి చొరవే!

ఏటా కుప్పలు తెప్పలుగా ఉత్పత్తవుతున్న పట్టభద్రుల్లో అత్యధికులు నిరుద్యోగులుగా కుమిలిపోవడానికి నేరుగా పుణ్యం కట్టుకుంటున్నవి, దుర్బలమైన పునాదులు. పేరుకు డిగ్రీలు, స్నాతకోత్తర పట్టాలు కలిగినవారెందరో వివిధ పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో వరస వైఫల్యాలు ఎదుర్కొంటున్నారు. దిగ్భ్రాంతపరుస్తున్న ఈ అపజయాల పరంపరకు ప్రాథమిక దశలో వ్యవస్థాగతమై వర్ధిల్లుతున్న ఎన్నో లోటుపాట్లు నిక్షేపంగా అంటుకడుతున్నాయి. పోటీ పరీక్షల్లో నెగ్గుకురావడానికి ప్రాణాధారమైన గణితం, సైన్సుతోపాటు భాషల్లోనూ విద్యార్థుల వెనకబాటుతనానికి బోధన సిబ్బంది కొరతే కారణమని పలు అధ్యయనాలు స్పష్టీకరిస్తున్నా- ఖాళీల భర్తీ నత్తనడకనే తలపిస్తోంది! ఉన్నత విద్యారంగాన పరీక్షల సంస్కరణల నిమిత్తం నిరుడు యూజీసీ నెలకొల్పిన ఆచార్య ఎమ్‌ఎమ్‌ సలోంఖే కమిటీ- అభ్యసనం ద్వారా సాధించిన నైపుణ్యాల్ని బేరీజు వేసే కొత్త వ్యవస్థ ఆవిర్భవించాలని సూచించింది. బడి చదువులు బట్టీయం జాతరగా దిగజారిన యథార్థాన్ని ఉపేక్షించి, పైయెత్తున ఎన్నిరకాల సంస్కరణలు తలపెట్టీ ప్రయోజనమేమిటి? నాలుగు దశాబ్దాలక్రితం ఉన్నత విద్యలో భారత్‌, చైనాలు ఇంచుమించు ఒకదానికొకటి నకలుగానే కనిపించేవి. విస్తృత ప్రాతిపదికన ప్రాథమిక, మాధ్యమిక అంచెలపై చైనా ప్రత్యేక శ్రద్ధ కనబరచిన తరవాతే అక్కడ ఉన్నత చదువుల పరంగా గణనీయ పురోగతి నమోదైంది. సాధారణ డిగ్రీలనేముంది- ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లోనూ ఉద్యోగార్హ లక్షణాలు నైపుణ్యాలు పెంపొందించే ప్రత్యేక కృషి పట్టాలకు ఎక్కాలన్నది, సాంకేతిక విద్యపై బీవీఆర్‌ మోహన్‌రెడ్డి కమిటీ సరికొత్త సూచన. అక్కడక్కడా ఏవో కొన్ని మరమ్మతులు కాదు, సమగ్ర విద్యాసంస్కరణలే బతికించే చదువుల్ని ఆవిష్కరించగలిగేది!

భారత్‌ను మేధావుల సమాజంగా తీర్చిదిద్దడంలో మేలిమి పాఠశాలలదే కీలక భూమికగా దశాబ్దం క్రితమే జాతీయ విజ్ఞాన సంఘం అభివర్ణించింది. మానవ పెట్టుబడుల సూచీలో నార్వే, ఫిన్లాండ్‌, స్విట్జర్లాండ్‌, డెన్మార్క్‌ ప్రభృత దేశాలు ముందంజ వేస్తుండగా, ఇండియా ఆనవాయితీగా వెలాతెలా పోతుండటానికి ప్రాథమికంగా బలహీన పునాదులే పుణ్యం కట్టుకుంటున్నాయి. విద్యార్థుల సహజ ప్రతిభకు సానపట్టి, ఒత్తిడి లేని చదువులతో నిజ జీవితంలో అన్వయించుకోగల పరిజ్ఞానాన్ని అలవరచే ఫిన్లాండ్‌ నమూనా ఏ దేశానికైనా అనుసరణీయం. దేశదేశాల స్థితిగతుల్ని మదింపు వేసిన యునెస్కో అధ్యయన పత్రం, ప్రాథమిక విద్యారంగాన ఇండియా యాభై సంవత్సరాలు వెనకబడి ఉందని మూడేళ్లనాడు తప్పుపట్టింది. అయిదో తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకమైనా చదవలేని, తమ పేరు సైతం సరిగ్గా రాయలేని దురవస్థ- పునాది చదువులకు ఎంతగా చెదలు పట్టాయో కళ్లకు కడుతోంది. ప్రాథమిక తరగతులు మూడు నాలుగింటికి ఒకరిద్దరే వేర్వేరు సబ్జెక్టులు బోధించాల్సి రావడం, మౌలిక వసతులకు నిత్యక్షామం- విద్యాప్రమాణాల్ని కుళ్లబొడుస్తున్నాయి. ఆర్థిక స్థోమత చాలకపోయినా అప్పోసప్పో చేసి తల్లిదండ్రులు పంపిస్తుంటే ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థుల్ని గౌరవంగా బతికించలేని చదువు నిరర్థకమే. ఏ దశలో విద్యార్జన ఆగిపోయినా అప్పటివరకు ఒంటపట్టింది తగిన జీవిక కల్పించేలా, బడి దశలోనే నైపుణ్యాల బోధన విధిగా అమలు కావాలి. భావి సవాళ్లపై దృష్టితో పిల్లల్లో పరిశోధన, సృజనలపై ఆసక్తి పెంపొందింపజేసేలా పాఠ్య ప్రణాళికల్ని, పరీక్షల వ్యవస్థను ప్రక్షాళించాలి. నూతన జాతీయ విద్యావిధాన ముసాయిదా లక్షిస్తున్న ‘ఉన్నత ప్రమాణాల విద్యను అందరికీ అందించడం ద్వారా గతిశీల విజ్ఞాన ఆధారిత సమాజ నిర్మాణా’నికి బడి దశలోనే పటిష్ఠ పునాదులు ఏర్పరచాలి!


Posted on 10-07-2019