Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సమగ్ర చికిత్సతోనే సాంత్వన

దేశంలో జనరిక్‌ మందుల లభ్యత, ఔషధ ధరల నియంత్రణలపై పార్లమెంటులో ఎదురైన ప్రశ్నకు సంబంధిత శాఖామాత్యుల వివరణాత్మక సమాధానం, దిగ్భ్రాంతకర యథార్థాన్ని వెల్లడించింది. వైద్య చికిత్సకయ్యే వ్యయం, మందుల ఖర్చు అంతకంతకు పెరుగుతుండటంవల్ల ఏటా 75లక్షల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నట్లు కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తాజా ప్రకటన స్పష్టీకరిస్తోంది. ఒక్కో కుటుంబంలో సగటున అయిదుగురు సభ్యుల్ని లెక్కేసినా- విపరీత వైద్యచికిత్సా వ్యయభారం దేశంలో ప్రతి సంవత్సరం మూడుకోట్ల 75లక్షలమందిని దారిద్య్రరేఖ దిగువకు నెట్టుకుపోతున్నట్లు ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించినట్లయింది! సాధారణంగా అధికారిక అంచనాలు సమస్య వాస్తవిక తీవ్రతను ప్రతిబింబించని దృష్ట్యా, నికర బాధితుల సంఖ్య మరింతగా ఉండవచ్చు. కుటుంబ సభ్యులెవరైనా అనారోగ్యం పాలబడితే చికిత్స, మందుల నిమిత్తం ఖర్చులు భరించలేక దేశంలో ఏటా అయిదున్నర కోట్లమంది పేదరికంలో కూరుకుపోతున్నారన్నది- నిరుడు ‘బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌’లో ప్రచురితమైన అధ్యయన సారాంశం. ఈ గడ్డమీద ప్రతి పౌరుడికీ జీవించే హక్కును రాజ్యాంగమే ప్రసాదించినా- పీల్చేగాలి, తినేతిండి, తాగేనీరు... దేనికదే విషతుల్యమై రకరకాల ఆరోగ్య సమస్యలు జనాన్ని ముట్టడిస్తున్నాయి. కొద్దిపాటి అస్వస్థత దాపురించినా అందుకు ఇదమిత్థ కారణమేమిటో నిర్ధారించే పేరిట వైద్య పుంగవులు రాసే లెక్కకు మిక్కిలి పరీక్షలు చేయించుకోలేక, తడిసిమోపెడవుతున్న ఖర్చుల్ని తప్పించుకోలేక అసంఖ్యాక కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. దురదృష్టవశాత్తు, కుటుంబంలో ఏ ఒక్కరికి దీర్ఘకాల వ్యాధి సోకినా మందుల రూపేణా నెలకు మూడు నాలుగువేల రూపాయల కనీస ఖర్చు దిగువ, మధ్యతరగతి వర్గీయుల సంసారాన్ని గుల్లబారుస్తోంది. ఈ దురవస్థ- ప్రజారోగ్య పరిరక్షణపరంగా ప్రభుత్వాల వ్యూహాల్లో సమూల మార్పు రావాల్సిన అత్యావశ్యకతను ఎలుగెత్తుతోంది.

యాంటీబయాటిక్స్‌ కొనుక్కోవడానికి పేదలెవరైనా రెండు రోజులపాటు పస్తులుండాల్సి వస్తోందని లోగడ సర్వోన్నత న్యాయస్థానమే ఛీత్కరించడం, ప్రభుత్వాల ప్రాథమ్య క్రమంలో తీవ్ర లోటుపాట్లను పట్టిచ్చేదే. గ్రామీణ వైద్యంలో 79శాతం మేర ఖర్చు ఔషధాల పద్దులోనే నమోదవుతుండగా- అందులో ఎక్కువ భాగం రోగులు సొంతంగా భరిస్తున్నదే. వైద్యావసరాలకోసం వెచ్చించే సొమ్ములో అంతర్జాతీయంగా ప్రజానీకం సొంత వ్యయం సగటున 18శాతం. ఇక్కడ 68శాతందాకా వైద్య ఖర్చును భారతీయులే నెత్తికెత్తుకోవాల్సి రావడం- వారి జేబుల్ని బతుకుల్ని కాల్చేసి, కుటుంబ బడ్జెట్లను తలకిందులు చేస్తోంది. గ్రామీణులకు టెలీ వైద్య సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌, అందరికీ ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షల వసతి ప్రవేశపెట్టిన తెలంగాణ, బడుగు జనావళికి తక్షణ వైద్య పేవలు సమకూరుస్తున్న కేరళ వంటివి కొంతమేర రాణిస్తున్నా- తక్కిన చోట్ల కుటుంబ సభ్యులెవరు అస్వస్థులైనా అది వారికి ఆర్థికంగా పిడుగుపాటే అవుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ వైద్య సదుపాయాలు సవ్యంగా లేవంటూ జాతీయ మానవ హక్కుల సంఘంలో ఇటీవల నమోదైన ఫిర్యాదు- దేశవ్యాప్త దుస్థితిని చెప్పకనే చెబుతోంది! ఆరువేల రకాల మందులు అందుబాటులో ఉన్న ఇండియాలో సుమారు వెయ్యి ఔషధాల ధరలనే నియంత్రిస్తున్న ప్రభుత్వం, తద్వారా పేద రోగులపై రూ.11వేల కోట్లకుపైగా భారాన్ని తగ్గించగలిగినట్లు ఆరేడు నెలల క్రితం సభాముఖంగా వెల్లడించింది. విరివిగా జనరిక్‌ ఔషధాల వినియోగం మూలాన దశాబ్దకాలంలో రూ.94 లక్షల కోట్ల మేర ఆదా చేయగలిగామన్న అమెరికా ప్రకటన వ్యూహకర్తల దృష్టికి రాలేదేమో! దేశంలో ఇప్పుడున్న సుమారు 5000 జన్‌ ఔషధి దుకాణాల సంఖ్యకు ఏడాదిలో ఇంకో 2500 జోడిస్తామంటున్న కేంద్రం- జనరిక్‌ మందులకు విశేష ప్రాచుర్యం కల్పించి సమధికంగా సరఫరాలు పెంపొందిస్తే ఎన్నో కోట్లమంది తెరిపిన పడతారు.

ప్రస్తుతం వేర్వేరు ఆరోగ్య పథకాల కింద రమారమి కోటి కుటుంబాలకు కల్పిస్తున్న వైద్య సేవల్ని సార్వజనీన స్వాస్థ్య సంరక్షణ పథకం గొడుగు కిందకు తీసుకురావాలని తెలంగాణ సర్కారు ప్రణాళికలు అల్లుతోంది. దేశవ్యాప్తంగా ‘ఆయుష్మాన్‌ భారత్‌’ రమారమి 50 కోట్లమందికి ఆరోగ్య బీమా రక్షణ ప్రసాదిస్తుందంటున్న కేంద్రం- బొటనవేలి ముద్రతో 15వేల ఆస్పత్రుల్లో ఎక్కడైనా సేవలు పొందవచ్చునని అభయమిస్తోంది. పథకాలు సిద్ధమైనా క్షేత్రస్థాయిలో నాణ్యమైన సేవలు తథ్యమన్న ధీమా ఏది? దేశంలో 30శాతం దాకా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 20శాతానికిపైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒక్క వైద్యుడితోనే నెట్టుకొస్తున్నట్లు ఇటీవలి ఆర్థిక సర్వే కుండ బద్దలుకొట్టింది. ఝార్ఖండ్‌లో 10శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 20శాతానికిపైగా పీహెచ్‌సీలు అసలు వైద్యుడు లేకుండానే నడిచిపోతున్నాయి! ఇంచుమించు 70 రకాల మందులుండాలని నిబంధనలు సూచిస్తున్నా- గాజు గుడ్డకు, జ్వరం గోళీలకు సైతం ఠికాణా లేని ఆరోగ్య కేంద్రాలెన్నో లెక్కేలేదు. సార్వత్రిక ఆరోగ్య రక్షణ పథకాలు అమలుపరుస్తున్న జర్మనీ, ఇటలీ, చైనా, గ్రీస్‌ వంటివి వైద్య సేవల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడానికి పోటీపడుతున్నాయి. స్వీడన్‌, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ తదితరాలు స్థూల దేశీయోత్పత్తిలో ఎనిమిది శాతానికిపైగా నిధుల్ని ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేకిస్తుండగా- దేశీయ కేటాయింపులు జీడీపీలో ఒకటిన్నర శాతంలోపే పరిమితమవుతున్నాయి. ఇతోధిక బడ్జెట్‌ కేటాయింపులు, వైద్య సిబ్బంది నియామకాలు, తగినన్ని మౌలిక సదుపాయాలతో అన్ని అంచెల్లో ఆరోగ్య సేవలు పరిపుష్టమయ్యే వాతావరణంలోనే సామాన్య పౌరులకు సాంత్వన దక్కేది!


Posted on 11-07-2019