Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

వైవిధ్యంపై వేటు... సమతుల్యతకు చేటు

* జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకం

మున్ముందు భూమిపై జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. జీవవైవిధ్యంపై ఐక్యరాజ్య సమితి నిర్వహించిన తాజా అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. జీవ వైవిధ్యం క్షీణిస్తున్నందు వల్ల మనచుట్టూ ఉన్న ప్రకృతి, జీవావరణ వ్యవస్థలు, పెద్దసంఖ్యలో జీవజాతులు మనుగడ కోల్పోతున్నాయి. ఇందుకు మానవ కార్యకలాపాలే కారణమని ఐరాస నివేదిక పేర్కొంటోంది. అభివృద్ధి, నాగరికత పేరిట సహజ వనరుల విధ్వంసం కొనసాగుతున్నందున మానవాళికి ముప్పు పొంచి ఉందని ఆ నివేదిక హెచ్చరిస్తోంది.
స్వచ్ఛమైన ప్రాణవాయువు, రక్షిత మంచినీరు, ఆక్సిజన్‌ను విడుదల చేసే అడవులు/వృక్షాలు, ఫలదీకరణం చెందించే క్రిమికీటకాలు, ప్రోటీన్లు పుష్కలంగా లభించే చేపజాతులు, మడ-అడవులు తదితర ప్రకృతి ప్రసాదిత వనరులు నానాటికీ తరిగిపోతున్నాయి. ఆహారం కోసం, ఇతర ఉత్పాదనల కోసం జీవావరణ సమతుల్య స్థితిని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఈ విధ్వంసానికి తక్షణం తెరపడాలి. జీవుల ఆవాస, ఆవరణ వ్యవస్థలు కుదించుకుపోవడం, మానవాళి భూ వినియోగాన్ని తమకు అనుగుణంగా మార్చుకున్న తీరు, ఆహారం కోసం వేట, జంతువుల శరీర అవయవాలతో వ్యాపారం, వాతావరణ మార్పులు, పెచ్చరిల్లుతున్న కాలుష్యం ప్రస్తుత దుస్థితికి కారణాలు. భూమి మీద విలక్షణ జీవజాతులున్నాయి. అందులో అత్యధికం క్రిమికీటకాలే. వీటిలో దాదాపు పావువంతు అంతరించిపోయాయి. 2015- పారిస్‌ ఒప్పందం భూతాపాన్ని పెరగకుండా కట్టడి చేయాలని తీర్మానించింది. దీనిని అమలు చేసినట్లయితే తీవ్రమైన వేడి గాలులు, కరవు-కాటకాలు, వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలను నియంత్రించవచ్చు. ప్రజలు తమ అవసరాల కోసం అటవీ భూములు, చిత్తడి నేలలను వ్యవసాయ క్షేత్రాలుగా, భారీ జలాశయాలుగా, కాంక్రీటు నగరాలుగా మారుస్తున్నారు. ఫలితంగా ఎన్నో రకాల జంతు, వృక్ష జాతులకు ఆవాసమైన ఆవరణ వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురవుతున్నాయి. దీనికి తోడు లెక్కకు మించిన కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుండటం వల్ల జీవావరణ వ్యవస్థలన్నీ క్షీణించిపోతున్నాయి.

ఆహార భద్రత, ఆరోగ్య పరిస్థితులపైనా ప్రభావం
పర్యావరణ విధ్వంసానికి గల కారణాలను ఐక్యరాజ్య సమితి తాజా అధ్యయనం మరింత లోతుగా విశ్లేషించింది. వాతావరణ మార్పులు ఏవిధంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయో అది వెల్లడించింది. ప్రకృతి, జీవావరణ వ్యవస్థలు తీవ్రస్థాయిలో విచ్ఛిన్నానికి గురవుతున్నాయి. భావితరాల ఆహారభద్రత, ఆరోగ్య పరిస్థితులపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రకృతి-జీవ వైవిధ]్య సంక్షోభంపై ప్రపంచస్థాయిలో గడచిన 15 ఏళ్లలో మొదటిసారిగా జరిగిన ఈ అధ్యయనంలో వెల్లడైన విషయాలు ముప్పు తీవ్రతను చాటిచెబుతున్నాయి. అంతర్జాతీయంగా సంభవిస్తున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో భూతాపం తీవ్రతను 1.5 డిగ్రీల సెల్సియస్‌ మేరకు తగ్గించాలన్నది ఐరాస అంతర్‌ ప్రభుత్వ వాతావరణ మార్పుల కమిటీ నిర్దేశిత లక్ష్యం. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే అంతర్జాతీయంగా పర్యావరణపరమైన అత్యవసర పరిస్థితి నెలకొన్నట్లు ఉంది. పర్యావరణ పరిరక్షణ, సంరక్షణల దృష్ట్యా రానున్న రెండేళ్లూ అత్యంత కీలకమైన సమయంగా పరిగణించవచ్చు. ప్రకృతి-జీవవైవిధ్య పరిరక్షణకు, వాతావరణ మార్పులకు పరిష్కారం కనుగొనే దిశగా ప్రపంచ దేశాలన్నీ 2020లో రెండు ప్రతిష్ఠాత్మక సదస్సులను నిర్వహించే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాయి. జీవవైవిధ్యంపై ఐక్యరాజ్య సమితి కార్యాచరణ సదస్సు 2020లో చైనాలోని కుమ్మింగ్‌ నగరంలో జరగనుంది. 2010లో జపాన్‌ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాల స్థానంలో మరో 20 ఏళ్లపాటు అనుసరించాల్సిన సమగ్రవ్యూహ రూపకల్పనకు ఈ సదస్సులో శ్రీకారం చుట్టనున్నారు. వాతావరణ మార్పులపై ఐరాస కార్యాచరణ సదస్సులో ‘పారిస్‌ ఒప్పందం’ అమలు-తీరుతెన్నులను సమీక్షించనున్నారు. జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు కృషి, సమగ్ర విధివిధానాలు నిర్దేశించుకోవడం తదితర అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ‘జీవావరణ వ్యవస్థలన్నీ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయంటూ’ వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫోరం చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి.

అంతరించిపోతున్న జీవజాతుల సంరక్షణకు సమగ్ర విధానాలు రూపొందించాలి. పెరుగుతున్న భూతాపం వల్ల కలుగుతున్న వాతావరణ మార్పులు, ప్రకృతి- జీవ వైవిధ్య క్షీణతను నిలువరించడానికి సమాన ప్రాధాన్యం కల్పించాలి. సుస్థిరమైన మనుగడ-అభివృద్ధి కావాలంటే రానున్న పదేళ్లలో మన దృక్కోణాన్ని మార్చుకోవాలి. గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలి. సాంకేతిక, ఆర్థిక, సామాజిక రంగాల వారీగా మౌలిక, విధానపరమైన పునర్విభజనతో కూడుకున్న విలువ ఆధారిత లక్ష్యాలు నిర్దేశించుకోవడం అవసరం. భవిష్యత్‌ ప్రయోజనాల దృష్ట్యా ఆవరణ వ్యవస్థల మధ్య యథాతథస్థితిని కొనసాగించడం ద్వారా జీవవైవిధ్య సంరక్షణకు పాటుపడాలి. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా చర్యలను చేపట్టడం ద్వారా కొంతవరకైనా మార్పుతేవచ్చు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి. కేవలం పర్యావరణ శాఖ అధికారులనో లేక ఆశాఖ మంత్రినో బాధ్యులను చేయడం సమస్యకు పరిష్కారం కాదు.

వనరుల వినియోగంలో హేతుబద్ధత
పర్యావరణ, జీవవైవిధ్య విధ్వంసానికి, క్షీణతకు కారణమవుతున్న వ్యవసాయ, రవాణా, ఇంధన వనరుల వినియోగంలో హేతుబద్ధత అవసరం. విలక్షణత సంతరించుకున్న జీవజాతులు, వాటి ఆవాసాల సంరక్షణకు గట్టి చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయా జీవులు, జంతువులు, వాటి శరీరావయవాలతో అక్రమ వ్యాపారం, అక్రమ రవాణాను అరికట్టడంపై దృష్టి సారించాలి. కర్బన ఇంధనాల వినియోగ దశ నుంచి జీవ ఇంధనాలవైపు ప్రపంచం దృష్టి మరల్చిననాడు కాలుష్యం, భూతాపాలకు అడ్డుకట్ట వేయవచ్చు. అందుకు జీవఇంధనాల పంటలను పండించాలి. దీనికి భారీస్థాయిలో భూములు కావాలి. దీనివల్ల మరో ప్రమాదం ఉంది. భూములన్నింటినీ ఈ పంటల వినియోగానికే మళ్లిస్తే ఆహార ఉత్పత్తిలో కోతపడే అవకాశం ఉంది. వ్యవసాయోత్పత్తుల ఆవశ్యకత, జీవ, వృక్ష జాతుల సంరక్షణకు సమ ప్రాధాన్యమిస్తూ; విలక్షణ జీవజాతులున్న రక్షిత ప్రాంతాల విస్తరణ, అడవుల పెంపకం, భూతాపం, వాతావరణ మార్పులను నియంత్రించడం ద్వారా జీవవైవిధ్యాన్ని సంరక్షించుకోవచ్చు. వైవిధ్యభరితమైన, విలక్షణమైన జీవ, వృక్ష జంతు జాతుల మనుగడపైనే ప్రకృతి సమతుల్యత ఆధారపడి ఉంది. జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవడం ద్వారానే నానాటికీ పెరుగుతున్న భూతాపం, వాతావరణ మార్పుల నుంచి భూమండలాన్ని కాపాడుకోవచ్చు. వాతావరణ మార్పులు, ప్రకృతి విధ్వంసంపై ప్రజల్లో శాస్త్రీయ విజ్ఞాన స్పృహను పెంపొందించడం ద్వారా రాజకీయ పక్షాల్లోనూ కదలిక తీసుకురావచ్చు. ఇటీవలి కాలంలో దాదాపు 12 దేశాల్లోని పది లక్షల మందికి పైగా పాఠశాల విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టడం పర్యావరణ చైతన్యానికి నిదర్శనం. ప్రజలు-పాలకులు సమన్వయంతో వ్యవహరించి, సమగ్ర కార్యచరణ దిశగా అడుగులు వేయాల్సి ఉంది. అప్పుడే విలక్షణ జీవజాతులతో కూడిన ప్రకృతి సమతుల్యతను పరిరక్షించగలం!

ఉద్గారాలతో వెతలు
ఐరాస నివేదికలోని ముఖ్యాంశాలు...
* సూక్ష్మస్థాయి వ్యవసాయం ఫలితంగా ఫలదీకరణ నష్టంతో పంట దిగుబడులు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంది.
* ప్రపంచ భూభాగంలో మూడోవంతు ఆహార ఉత్పత్తికే వినియోగిస్తున్నారు. భూమిపై లభిస్తున్న జలవనరుల్లో 75 శాతం ఆహార పంటల సేద్యానికే వాడుతున్నారు.
* 25 శాతం ఉద్గారాలు మానవ కార్యకలాపాలు, వ్యవసాయం వల్ల విడుదలవుతున్నాయి. ఇందులో అత్యధికంగా మాంసం ఉత్పత్తి నుంచే వస్తున్నాయి. ఇవి ఇవి హానికరం.
* చేపల వేట మితిమీరిపోతోంది. అక్రమంగా చేపలవేట కొనసాగుతోంది.
* ఏటా సముద్రాలు, నదీజలాల్లో భారలోహాలు, విషపదార్థాలు, ఇతర వ్యర్థాలను వదిలేస్తున్నారు. ఫలితంగా ఇవి కలుషితమవుతున్నాయి.
* మానవ కార్యకలాపాల వల్ల 75 శాతం భూభాగం, 40 శాతం సముద్రాలు, 50 శాతం నదులు తీవ్రప్రభావానికి గురై దెబ్బతింటున్నాయి.
* తొమ్మిదో దశకం నుంచి ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వినియోగం పది రెట్లు పెరిగింది. ఇది అనర్థాలకు దారి తీస్తుంది.
* విపరీతమైన కాలుష్యం వల్ల సముద్ర జలాలు స్వచ్ఛత కోల్పోతున్నాయి.
* భూభాగం మీదున్న జీవజాతుల్లో అయిదు శాతం అంతరించిపోయే ప్రమాదముంది.
* 2100 నాటికి భూతాపం 4.3 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరగనుంది. దీనివల్ల భూమిమీదున్న జీవజాతుల్లో ఆరో వంతు అంతరించిపోయే అవకాశం ఉంది.
* శాస్త్రవేత్తలు, నిపుణులు చేపడుతున్న పరిశోధనలు ఫలిస్తే- 2100 నాటికి భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు కట్టడి చేసి జీవవైవిధ్యాన్ని సంరక్షించవచ్చు!


Posted on 12-07-2019