Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

మృగోన్మాదంపై వేటు

దేశంలో నునులేత మొగ్గల్లాంటి పిల్లల బతుకుల్ని కర్కశంగా చిదిమేసే మానవ మృగాల పైశాచిక నేరాల విస్తృతి, ఉద్ధృతి దిగ్భ్రాంతపరుస్తున్నాయి. లైంగిక దాడులు, వేధింపుల బారినుంచి బాలబాలికల్ని రక్షించే లక్ష్యంతోనే 2012లో ‘పోక్సో’ చట్టం రూపుదిద్దుకొంది. ఎనిమిదేళ్ల నిస్సహాయ బాలికపై ఆరుగురు అత్యాచారానికి తెగబడి క్రూరంగా హింసించి హతమార్చిన కఠువా కేసు నేపథ్యంలో- ఈ ఏడాది మొదట్లో ‘పోక్సో’ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ తెచ్చిన బిల్లు, పదహారో లోక్‌సభ కాలావధి ముగియడంతో మురిగిపోయింది. దాని స్థానే కేంద్రం కొత్తగా సిద్ధపరచిన సవరణ బిల్లు, పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడేవాళ్లకు మరణశిక్ష విధించాలంటోంది. చిన్న పిల్లలతో అశ్లీల చిత్రాలు తీయడం, వాటిని ప్రచారం చేయడం, లైంగిక కార్యకలాపాల రొంపిలో దింపడానికి హార్మోన్‌ ఇంజక్షన్లతో శారీరక ఎదుగుదలకు పాల్పడటం తదితరాలన్నింటికీ జైలుశిక్ష, జరిమానా తప్పవంటున్న బిల్లులో తొలిసారి కీలక నిర్వచనమొకటి పొందుపరచారు. ఇప్పటిదాకా ఐటీ సెక్షన్‌ 67, ఐపీసీ సెక్షన్‌ 293 బాలల అశ్లీల చిత్రాలంటే ఏమిటో ఇదమిత్థంగా పేర్కొనని లోటు పూడ్చడానికంటూ సవరణ బిల్లులో ఆ అంశాన్ని పేర్కొనడం ఏ మేరకు ప్రయోజనకరమో- చట్టం అమలయ్యాక నిగ్గు తేలాల్సి ఉంది. ఇటీవల మదోన్మాదానికి బలైన వరంగల్‌ పసికందు కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ విచారణ జరిపించాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యులు సూచించడం తెలిసిందే. వాస్తవానికి ‘పోక్సో’ కేసులన్నింటా శీఘ్రతర విచారణ చేపట్టాలని ఏడాది క్రితమే సుప్రీంకోర్టు పిలుపిచ్చింది. పేరుకుపోతున్న అత్యాచార, ‘పోక్సో’ కేసుల్ని చకచకా ఒక కొలిక్కి తేవడానికి 18 రాష్ట్రాల్లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు యత్నాలు చురుకందుకుంటున్నాయి. సత్వర విచారణ చేపట్టి దోషులకు కఠిన శిక్షలు విధించి ఏమాత్రం జాప్యానికి తావివ్వకుండా అమలుపరిస్తేనే- ఈ సవరణలకు, ఫాస్ట్‌ట్రాక్‌ వ్యూహాలకు అర్థం, పరమార్థం!

ఈ గడ్డమీద ప్రతి గంటకు కనీసం నలుగురు పిల్లలు లైంగిక హింసకు గురవుతున్నట్లు అధికారిక గణాంకాలే చాటుతున్నాయి. స్వచ్ఛంద సంస్థ ‘క్రై’ లెక్కల ప్రకారం, పదేళ్ల కాలంలో పిల్లలపై లైంగిక నేరాలు అయిదు రెట్లు పెరిగాయి. ‘పోక్సో’ చట్టం కింద ఒక్క 2016 సంవత్సరంలోనే 36వేల కేసులు నమోదయ్యాయని, ఆ ఏడాది చివరికి సుమారు 90వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నట్లు కేంద్రం గత నెలలో లోక్‌సభాముఖంగా వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే పిల్లలపై పాశవిక అత్యాచారాలకు సంబంధించి దేశం నలుమూలలా దాఖలైన ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)ల సంఖ్య 24వేలకు పైబడింది. ఈ తీవ్రతను పరికించి కలవరపాటుకు గురైన సర్వోన్నత న్యాయస్థానం తనంతతాను (సు మోటు)గా ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదు చేయాల్సిన దుస్థితి- యావత్‌ జాతీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిణామం! లైంగిక నేరారోపణలు విరివిగా వెలుగు చూస్తున్న రాష్ట్రాల జాబితాలో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ముందు వరసలో ఉన్నాయి. ఆరేళ్లలోపు బాలికలపై అత్యాచారాల్లో తెలంగాణ రెండు, ఆంధ్రప్రదేశ్‌ అయిదో స్థానాల్లో నిలిచాయన్న గణాంకాలు మృగాళ్ల విశృంఖలత్వాన్ని కళ్లకు కడుతున్నాయి. ఎనిమిదేళ్ల పాపపై హత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడికి భోపాల్‌ కోర్టు 32 రోజుల్లోనే మరణశిక్ష ఖరారు చేసిన తాజా ఉదంతం లాంటివి అత్యంత అరుదైన ఉదాహరణలుగా మిగులుతున్నాయి. పిల్లలపై నేరాల్లో ఏటా సుమారు 26శాతం వృద్ధి నమోదవుతుండగా, శిక్షల రేటు పాతికశాతంలోపే ఉంటోంది. చాలా చోట్ల అసలు ఫిర్యాదులే స్వీకరించని, తీసుకున్నా చురుగ్గా స్పందించని అవ్యవస్థ బాధిత కుటుంబాల్ని మరింత కుంగదీస్తోంది. లైంగిక నేరాలకు శిక్షల పరిధిలో ఉరినీ చేర్చడంవల్ల కేసుల నమోదు చతికిలపడుతుందన్న భయాందోళనలపై ప్రభుత్వమే దీటుగా స్పందించాలి!

కారడవిలో ఆకలిగొన్న పులులు లేడికూనల్ని వేటాడినట్లు, జనారణ్యంలో మదోన్మత్తులు అన్నెంపున్నెం ఎరుగని పిల్లల్ని యథేచ్ఛగా కబళిస్తున్న తీరు- చట్టమే ఏకైక పరిష్కారమార్గం కాదని పదేపదే నిరూపిస్తోంది. అరుంధతీరాయ్‌ వంటివారు ‘నేను పుట్టి పెరిగిన భారతావని మౌలిక సంస్కృతి ఇది కాదు’ అని ఆక్రోశించే స్థాయిలో లైంగిక నేరాలు పెచ్చరిల్లుతున్నాయి. ‘అయిదేళ్ల పసిపాప మీదా క్రూర అత్యాచారమా? ఎక్కడో ఏదో లోపం ఉంది!’ అన్న దిల్లీ హైకోర్టు ఆవేదనాభరిత స్పందన- జాతి నైతిక దిక్సూచిని సరిచేసుకుని తీరాల్సిన ఆవశ్యకతను ఉద్బోధించేదే. లైంగిక హింసోన్మాదం అపరిచితులు, సైకోలకే పరిమితమైన జాడ్యం కాదంటున్న విశ్లేషణలు- పసికందుల పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తున్నవాళ్లలో 95శాతం పరిచయస్తులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఉంటున్నారనడం... సామాజిక విలువల క్షీణతను నిరోధించాల్సిన అవసరాన్ని ఎలుగెత్తేదే. కానిపనికి పాల్పడి చట్టం పొడుగాటి చేతులనుంచి తప్పించుకోవడం అసాధ్యమన్న భీతిని న్యాయపాలిక రగుల్కొల్పడం ఎంత ముఖ్యమో, మృగప్రవృత్తిని రేకెత్తించే అశ్లీల వెబ్‌సైట్లూ మత్తు పదార్థాలపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడం అంతే కీలకం. 130 కోట్లకు పైబడిన దేశ జనాభాలో పద్నాలుగేళ్లలోపు పిల్లలు మూడోవంతు (సుమారు 43కోట్లు)గా లెక్క తేలుతున్నా, కేంద్ర బడ్జెట్‌లో వారికోసం కేటాయింపులు అయిదుశాతంలోపు. అందులోనూ పిల్లల సంరక్షణ నిధులు బొటాబొటీయేనంటున్న గణాంకాలు, దిద్దుబాటు చర్యలు ఎక్కడ మొదలుపెట్టాలో ఎలుగెత్తుతున్నాయి. స్వేచ్ఛ, రక్షణ, విశ్వాసాలతో కూడిన బాల్యదశను పొందే హక్కు దేశంలో పిల్లలందరికీ దఖలుపడే వాతావరణ పరికల్పన ప్రభుత్వాల మౌలిక బాధ్యత. బాలబాలికల్ని జాతి సంపదగా పరిగణించే విధి విధానాల కూర్పు, ఆ మేరకు యంత్రాంగాన్ని సన్నద్ధపరుస్తూ వ్యవస్థాగత మరమ్మతులు, బడి దశలోనే సంస్కార బీజాలు నాటే నైతిక విద్యాబోధన- ఈ బహుముఖ కార్యాచరణతోనే భారత్‌ శిరసెత్తుకోగలిగేది!


Posted on 13-07-2019