Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

బడ్జెట్‌ - రక్షణరంగం

భూతల సరిహద్దుల్లో, సముద్ర జలాల్లో, సైబర్‌ సీమలో భారత్‌ భద్రతకు పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015-'16 బడ్జెట్లో సంచలనాత్మక నిర్ణయాలు, కేటాయింపులు ప్రకటిస్తుందని ఆశించినవారికి అసంతృప్తే మిగిలింది. 2014-'15 బడ్జెట్లో రక్షణ శాఖకు రూ.2,22,370కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2015-'16 ఆర్థిక సంవత్సరానికి రూ.2,46,727కోట్లు కేటాయించారు. ఇది కేవలం రూ.23,357కోట్ల పెరుగుదల! దశాబ్దకాలంగా ఆధునికీకరణ కోసం ఎదురుచూస్తున్న మన త్రివిధ సాయుధ బలగాల ఆశలను తీర్చడానికి ఈ కొద్దిపాటి మొత్తం ఏ మూలకూ చాలదు. పైగా ద్రవ్యోల్బణ రేటు ఇప్పటికీ అయిదు శాతంగా ఉన్నందువల్ల, ఈ పెంచిన నిధుల వాస్తవిక విలువ తక్కువే ఉంటుంది. ఇది చాలదన్నట్లు, డాలర్‌తో రూపాయి మారక విలువ తగ్గగా అంతర్జాతీయ విపణిలో ఆయుధాల రేట్లు బాగా పెరిగాయి. ఈ కారణాల వల్ల రక్షణ రంగ ఆధునికీకరణకు తాజా బడ్జెట్లో కేటాయించిన నిధులతో ఒరిగేదేమీ ఉండదని అర్థమవుతుంది. 2014-'15లో రక్షణ రంగ మూలధన వ్యయంలో రూ.7,000 కోట్ల మేరకు కోత పెట్టడం, ఇప్పటికే ఆధునికీకరణ ప్రక్రియను కుంటుపరచింది.

ఇలా తెగ్గోసిన మొత్తాన్ని రెవిన్యూ వ్యయం పద్దుకు మార్చారు. సిబ్బంది జీతభత్యాలు, పింఛన్లు, రవాణాపై వ్యయాలు రెవిన్యూ పద్దు కిందకు వస్తాయి. 2014-'15 రక్షణ బడ్జెట్లో 60శాతాన్ని అంటే రూ.1,34,412కోట్లను రెవిన్యూ పద్దుకింద ఖర్చు చేశారు. 40శాతాన్ని (రూ.94,588కోట్లు) మాత్రమే మూలధన వ్యయం కింద ఆధునిక ఆయుధాల సేకరణకు వ్యయం చేశారు. ఆ సంవత్సరం ఆధునికీకరణకు కేటాయించిన నిధుల్లో రూ.12,622 కోట్లు ఖర్చుకాకుండా మిగిలిపోయాయి. 2015-'16 బడ్జెట్లో రెవిన్యూ వ్యయానికి రూ.1,52,139 కోట్లు, మూలధన వ్యయానికి మళ్లీ రూ.94,588 కోట్లనే కేటాయించారు. అయితే, ఇప్పటికే కుదుర్చుకున్న ఆయుధ ఒప్పందాలకు చాలా పెద్ద మొత్తాలు చెల్లించాల్సి ఉండటంతో- ఫైటర్‌ విమానాలు, జలాంతర్గాములు, యుద్ధనౌకల వంటి కొత్త ఆయుధాల సేకరణకు డబ్బు మిగలదు! భారత్‌లో తయారీ (మేక్‌ ఇన్‌ ఇండియా)కింద స్వదేశంలోనే ఆయుధాలను తయారుచేయాలన్న మోదీ సర్కారు సంకల్పం దొడ్డదే కానీ, అది ఇంకా ఆచరణలోకి రావాల్సి ఉంది. దరిమిలా అత్యాధునిక ఆయుధాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పడం లేదు. ఆయుధాల దిగుమతిలో భారత్‌ 2010నాటికి చైనాను మించిపోయింది. 2013లో భారత్‌ సేకరించిన విదేశీ ఆయుధాల విలువ రూ.35,400కోట్లు. భారత సాయుధ దళాల ఆధునికీకరణకు ఖర్చుచేసే నిధుల్లో సగ భాగాన్ని విదేశీ ఆయుధాల కొనుగోలుకే వెచ్చిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఈ పరిస్థితి మారేట్లు లేదు.

చైనా దూకుడు

మారుతున్న అంతర్జాతీయ భద్రతా వాతావరణంలో భారత సాయుధ బలగాల ఆధునికీకరణ జోరు పెరగక తప్పదు. భారతదేశ భూతల సరిహద్దులతో పాటు హిందూ మహాసముద్రంలో కూడా చైనా సేనల, నౌకల సంచలనం ఎక్కువైంది. ఆసియాలో తానే అగ్ర శక్తినని చాటుకోవడానికి చైనా అంతకంతకూ రక్షణ వ్యయాన్ని పెంచుతూ ఆధునిక రక్షణ పాటవాన్ని సంతరించుకొంటోంది. పాకిస్థాన్‌కు అత్యాధునిక ఆయుధాలు సమకూరుస్తోంది. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా-'నాటో' సేనల ఉపసంహరణ తరవాత పాక్‌ నుంచి, ఆ దేశం పోషిస్తున్న తీవ్రవాద శక్తుల నుంచీ ముప్పు పెరగబోతోంది. మరోవైపు ఇస్లామిక్‌ స్టేట్‌, అల్‌ఖైదాలు భారత్‌మీదా పడగనీడ ప్రసరింపజేయాలని చూస్తున్నాయి.

దీనికితోడు 'సైబర్‌ సీమ'లో చైనా, పాక్‌ల చొరబాట్లు ఎక్కువవుతున్నాయి. చైనా తన పోరాట పాటవాన్ని అంతరిక్షానికీ విస్తరించింది. ఈ ముప్పును ఎదుర్కోవడానికి భారత్‌- అంతరిక్ష, సైబర్‌, ప్రత్యేక పోరాట బలగాలకూ విడివిడిగా 'సంయుక్త కమాండ్‌'లను నెలకొల్పాలని నరేశ్‌ చంద్ర నాయకత్వంలోని కార్యాచరణ బృందం సూచించింది. తాజా బడ్జెట్లో దీని ప్రస్తావనే లేదు. అలాగే, ఒకే 'ర్యాంకు'లో పదవీ విరమణ చేసిన సైనిక సిబ్బందికి ఒకే పింఛను చెల్లించడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన మోదీ సర్కారు తాజా బడ్జెట్లో అందుకు కేటాయింపులు జరపలేదు. పింఛను ఏవిధంగా లెక్కించాలన్న అంశంపై సాయుధ దళాలకు, రక్షణ శాఖకు మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన- ఈ ఆలస్యానికి కారణం. పింఛన్లతో పాటు సిబ్బంది జీతభత్యాలు, రవాణా వ్యయం- రక్షణ రంగ రెవిన్యూ వ్యయంకిందకు వస్తాయి. యుద్ధరంగంలో అత్యాధునిక ఆయుధాలను సమర్థంగా ప్రయోగించాలంటే నిపుణులైన సైనికులు, సైన్యాధికారులు అవసరం. కానీ, సైన్యాన్ని అధికారుల కొరత పీడిస్తోంది. 13లక్షల బలగం కలిగిన భారత సైన్యానికి మొత్తం 46,614మంది సైన్యాధికారులు అవసరమైనా, ఇప్పుడు అందుబాటులో ఉన్నది 38,600మంది మాత్రమే! గయ, చెన్నైలలోని సైన్యాధికారుల శిక్షణ కేంద్రాల్లో; జాతీయ రక్షణ అకాడెమీలో శిక్షణ సౌకర్యాలను అధునాతనం చేయడానికి, మౌలిక సదుపాయాలను విస్తరించడానికి మరిన్ని నిధులు అవసరం. దీనికి కేటాయింపులు రెవిన్యూ వ్యయం నుంచే రావాలి.

వాయిదాల చెల్లింపులు ఎలా?

ఇక ఆధునికీకరణకు మూలధన పద్దునుంచి నిధులు ఖర్చుచేయాలి. ఎన్డీయే ప్రభుత్వం గడచిన తొమ్మిది నెలల్లో లక్షా ఎనభైవేల కోట్ల రూపాయల వ్యయంతో కొత్త ఆయుధాల సేకరణ ప్రతిపాదనలకు పచ్చ జెండా వూపింది. హిందూ మహాసముద్రంలో చైనా యుద్ధనౌకల సంచారాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం మరిన్ని కొత్త జలాంతర్గాములను, 'స్టెల్త్‌' యుద్ధనౌకలనూ సమకూర్చుకోవాలి. కానీ, భారత్‌లో జలాంతర్గాముల నిర్మాణం నాలుగేళ్లు ఆలస్యంగా నడుస్తోంది. వీటిని విదేశాల నుంచి కొనాలంటే తగినన్ని నిధులు లేవు. రక్షణ బడ్జెట్‌ మూలధన వ్యయంలో అధిక భాగం విదేశీ ఆయుధోత్పత్తిదారుల బకాయిలను తీర్చడానికి, ఇంతకుముందు సేకరించిన ఆయుధాలకు వాయిదా మొత్తాలు చెల్లించడానికే సరిపోతోంది. ఉదాహరణకు అమెరికా నుంచి అదనంగా ఆరు సి-130జే సూపర్‌ హెర్క్యులిస్‌ రవాణా విమానాలను కొనుగోలు చేయడానికి 2013లో రూ.6000కోట్ల మేరకు ఒప్పందం కుదురింది. దానిలో మొదటి వాయిదాను పూర్తిగా చెల్లించడానికి భారత్‌ చేతిలో డబ్బు లేకుండా పోయింది. మరెన్నో అత్యాధునిక ఆయుధాల కొనుగోలు ఆర్డర్లు 'పెండింగు'లో ఉన్నాయి.

భారత వైమానిక దళానికి మొత్తం 39స్క్వాడ్రన్ల ఫైటర్‌ విమానాలు అవసరం కాగా, ప్రస్తుతం 33స్క్వాడ్రన్లే ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి ఫ్రాన్స్‌ నుంచి 2000కోట్ల డాలర్లతో 126రాఫేల్‌ ఫైటర్‌ విమానాలు కొనాలని భారత్‌ యోచిస్తోంది. ఈ ఒప్పందం ఖరారైతే మొదటి వాయిదా కింద రూ.10,000కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అమెరికా నుంచి 22 అపాచీ అటాక్‌ హెలికాప్టర్లు (140కోట్ల డాలర్లు), 15 చినూక్‌ హెవీలిఫ్ట్‌ హెలికాప్టర్లు (100కోట్ల డాలర్లు), 145 ఎం-777 అల్ట్రాలైట్‌ హొవిట్జర్‌ ఫిరంగుల (88.50కోట్ల డాలర్లు) కొనుగోలుకు ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిపై సంతకాలు కాగానే మొదటి వాయిదాల కింద భారీ మొత్తాలు చెల్లించాల్సి ఉంటుంది. బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించలేదు. ఈశాన్య సరిహద్దుల్లో చైనా దూకుడు ఎదుర్కోవడానికి '17వ కోర్‌' పేరిట 90,274మంది సైనికులతో పర్వత పోరాటదళం ఏర్పాటుకు వచ్చే ఏడేళ్లలో రూ.64,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అత్యాధునిక ఆయుధాల సంగతి అటుంచితే, మన సైన్యాన్ని ఫిరంగి గుళ్ల కొరత పీడిస్తోంది. 1999 కార్గిల్‌ యుద్ధంలో బోఫోర్స్‌ ఫిరంగులకు కావలసిన గుళ్లన్నింటినీ తయారుచేసుకునే సత్తా మనకు లేకుండా పోయింది. దీనితో 50,000 గుళ్లను దక్షిణాఫ్రికా నుంచి హడావిడిగా దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. మన సైన్యానికి ఆరులక్షల చేతి బాంబుల (గ్రెనేడ్ల) కొరత ఉంది.

పథనిర్దేశం కరవు

టిబెట్‌లో చైనా నిర్మిస్తున్న కొత్త రైలు, రోడ్డు, విమాన క్షేత్రాలకు దీటుగా ఈశాన్య భారతంలో 14కీలక రైలు ప్రాజెక్టులు నిర్మించాలని భారత్‌ తలపెట్టినా, యథాప్రకారం నిధుల కొరత అడ్డువస్తోంది. ఈ ప్రాజెక్టులకయ్యే వ్యయాన్ని రైల్వే, రక్షణ, ఆర్థిక శాఖల్లో ఎవరు భరించాలన్నది ఇంతవరకు తేలలేదు. వీటిలో 9 రైల్వే లైన్లకే రూ.55,831కోట్లు ఖర్చవుతుంది. చైనా సరిహద్దుల్లో 73రోడ్లను నిర్మించాలని దశాబ్దంక్రితమే నిర్ణయించినా, వాటిలో 17రోడ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇక్కడ మౌలిక వసతుల నిర్మాణానికి రూ.26,155కోట్లు కావాలి. 'మన ట్యాంకు, ఫిరంగి దళాలు; గగనతల రక్షణ వ్యవస్థ, పదాతి దళం, ప్రత్యేక బలగాలు, సిగ్నల్స్‌, ఇంజినీర్స్‌- ఇలా ఏ పోరాట విభాగాన్ని తీసుకున్నా పరిస్థితి దారుణంగాఉంది. శత్రు ట్యాంకులను తుత్తునియలు చేయడానికి కావలసిన గుళ్లు మన ట్యాంకులకు లేవు. మన గగనతల రక్షణ వ్యవస్థలో 97శాతానికి కాలం చెల్లిపోయింది' అని రెండేళ్ల క్రితం అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు రాసిన లేఖలో నాటి ప్రధాన సైన్యాధికారి వీకే సింగ్‌ వాపోయారు. తరవాత ఆయన భారతీయ జనతాపార్టీలో చేరి నేడు కేంద్రంలో ఈశాన్య భారత వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. అయినా పరిస్థితిలో మార్పేమీ లేదు! సిబ్బంది, ఆయుధాలు, మౌలిక వసతులు సమకూర్చుకోవడానికి ఏ ఏటికాయేడు హెచ్చు నిధులు కేటాయించాల్సి ఉన్నా- రక్షణరంగానికి నిధులు నానాటికీ తగ్గిపోతున్నాయి. 1997-'98లో రక్షణకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.24శాతం నిధులు కేటాయించగా; అది 2014-'15లో 1.78శాతానికి, తాజా బడ్జెట్లో 1.74శాతానికి తగ్గిపోయింది. ఈ లోటును భర్తీచేయడానికి రక్షణ పరిశ్రమల్లో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను 26శాతం నుంచి 49శాతానికి పెంచినా- ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రావడంలేదు. ఈ పరిమితిని 51శాతానికి పెంచితే విదేశీ సంస్థలు ఆకర్షితం కావచ్చు. 'మేక్‌ ఇన్‌ ఇండియా' కింద భారత్‌లో ఆయుధాల ఉత్పత్తికి ప్రస్తుత బడ్జెట్‌ సరైన పథ నిర్దేశం చేయలేకపోవడం శోచనీయం!

(రచయిత - వరప్రసాద్‌)
Posted on 02-03-2015