Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

చదువులకు అత్తెసరు నిధులు

విద్యాసంస్థలు నాణ్యతాప్రమాణాలను పెంచుకోవడానికి ప్రభుత్వ ఆర్థికపరమైన ప్రోత్సాహం ఎంతో అవసరం. మానవ వనరుల అభివృద్ధిలో ఎంతో కీలకపాత్ర పోషించే ఈ రంగానికి సరిపడా నిధులు కేటాయించాలని గతంలో అనేక కమిషన్లు చెప్పినా, దురదృష్టవశాత్తు పాలకులు పెడచెవిన పెడుతున్నారు. విద్యారంగానికి జీడీపీలో కనీసం ఆరుశాతం నిధులు కేటాయించాలని 2019 నూతన జాతీయ విద్యావిధాన ముసాయిదా సూచించింది. నూతన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే క్రమంలోనైనా ఆ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోలేదనడానికి ఇటీవలి బడ్జెట్‌లో విద్యారంగానికి చేసిన కేటాయింపులే నిదర్శనం. బడ్జెట్‌ మొత్తం రూ.27.86 లక్షల కోట్లలో విద్యారంగానికి రూ.94,854 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే, మొత్తం బడ్జెట్‌లో విద్యారంగానికి దక్కింది 3.4 శాతం నిధులే! గత ఏడాది మొత్తం బడ్జెట్‌ రూ.24.42 లక్షల కోట్లు కాగా, విద్యారంగానికి రూ.85,010 కోట్లు కేటాయించారు. నిరుటితో పోలిస్తే మొత్తం బడ్జెట్లో విద్యకు కేటాయింపు ఈసారి 0.5 శాతం మేర కోతపడింది. ఇలాంటి అరకొర కేటాయింపుల వల్ల విద్యారంగం ఏ విధంగా పురోగతి చెందుతుందో పాలకులకే తెలియాలి. ‘ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ కో-ఆపరేషన్‌ డెవలప్‌మెంట్‌’ ఇటీవల విడుదల చేసిన 2018 వార్షిక నివేదిక ప్రకారం బ్రెజిల్, చిలీ, మెక్సికో, న్యూజిలాండ్‌ దేశాలు విద్యారంగానికి 16 నుంచి 19 శాతం వరకు నిధులు అందజేస్తున్నాయి. అతి తక్కువగా గ్రీస్‌ ఆరు శాతం నిధులు కేటాయిస్తోంది. అంటే గ్రీస్‌ దేశంకన్నా తీసికట్టుగా మనదేశంలో నిధుల కేటాయింపు ఉండటమే విషాదం!

పాఠశాల విద్యకు బడ్జెట్లో రూ.56,537 కోట్లు ప్రత్యేకించారు. నిరుటి ప్రతిపాదిత నిధులకంటే ఇది 12.8 శాతం ఎక్కువ. ఇది మంచి పరిణామమే. మానవ వనరుల అభివృద్ధిశాఖ సంపూర్ణ విద్యావిధానాన్ని సాధించేందుకు 2018 జులైలో సమగ్ర శిక్షా అభియాన్‌ అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌లను విలీనం చేశారు. వీటితోపాటు ఉపాధ్యాయ విద్య కూడా సమగ్ర శిక్షా అభియాన్‌ పథకం కిందనే పనిచేయనుంది. ఈ పథకానికి రూ.36,322 కోట్లు కేటాయించారు. స్వయంప్రతిపత్తిగల సంస్థలైన కేంద్రీయ విద్యాలయ సంఘటన్, జాతీయ విద్యాపరిశోధన శిక్షణ సంస్థలకు రూ.8,290 కోట్లు ఇచ్చారు. ఈ కేటాయింపులు నిరుటికన్నా 3.5 శాతం తక్కువ. పరిశోధన సంస్థలకు నిధులు తగ్గిస్తూ ఉండటం వల్ల ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు పరిశోధనలకు వెనకడుగు వేస్తున్నాయి. దేశంలో 2017 నాటికి ప్రాథమిక పాఠశాలల్లో తొమ్మిది లక్షల పోస్టులు, మాధ్యమిక పాఠశాలల్లో సుమారు లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బడ్జెట్‌ కేటాయింపులు పూర్తిస్థాయిలో లేకపోవడం వల్లనే నియామకాలూ ఉండటంలేదు. టీచర్ల కొరత వల్ల అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దానివల్ల ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక బోసిపోతున్నాయి. ప్రభుత్వాలు చేసేదేమీలేక పాఠశాలల హేతుబద్ధీకరణకు సిద్ధమవుతున్నాయి. దీనివల్ల అణగారిన వర్గాలకు చెందిన పేదపిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

ఇక ఉన్నత విద్యకు బడ్జెట్లో రూ.38,317 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది 14.3 శాతం ఎక్కువ. ఉన్నత విద్యకు కేటాయించిన మొత్తం నిధుల్లో అత్యధికంగా 48 శాతం కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, విశ్వవిద్యాలయ గ్రాంట్స్‌ కమిషన్‌తోపాటు ఏఐసీటీఈలకు కేటాయించారు. నిరుడు యూజీసీ, ఏఐసీటీఈలకు కేటాయించిన నిధులతో పోలిస్తే రెండు శాతం తగ్గాయి. నిరుటి కంటే ఈ సంవత్సరం కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు, ఐఐటీలకు 12 శాతం మేర నిధులు పెరిగాయి. రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాలు ఇతర మార్గాల ద్వారా నిధులు సేకరించుకోవాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ స్టాండింగ్‌ కమిటీ సూచించింది.

విశ్వవిద్యాలయాల మౌలిక వసతుల కల్పన కోసం ఏర్పాటు చేసిన మూలధనం కింద రూ.21 వేల కోట్లు కేటాయించారు. ఇది గతం కంటే 24 శాతం తక్కువ. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు రూ.16.75 కోట్లు మాత్రమే ఇచ్చారు. తెలంగాణలో ఏర్పాటుచేసిన గిరిజన విశ్వవిద్యాలయాలకు కేవలం నాలుగు కోట్ల రూపాయలు ప్రత్యేకించారు. దేశంలో గతంలో ఏర్పాటు చేసిన కొత్త విశ్వవిద్యాలయాలకు గత ఏడాదిలో రూ.446 కోట్లు కేటాయించగా, ఈ ఏడాదిలో కనీసం ఒక్క పైసా అయినా ఇవ్వలేదు. నూతన విశ్వవిద్యాలయాలపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది.

విద్యార్థుల స్థూల నమోదు ఏటా పెరుగుతున్నప్పటికీ, మరింత పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనదేశం వెనకంజలో ఉంది. విద్యార్థుల స్థూల నమోదు అత్యధికంగా అమెరికాలో 85.5 శాతం ఉండగా రష్యాలో 80.4 శాతం, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో 56.5 శాతం, చైనాలో 43.4 శాతం ఉన్నాయి. భారత్‌లో ఇది 25.8 శాతమే. ఇప్పటికీ అనేక విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. ఈ ప్రభావం వల్ల వివిధ విశ్వవిద్యాలయాలు ప్రత్యేక గుర్తింపునకు నోచుకోకుండా పోతున్నాయి. అందువల్ల ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులను పొందలేకపోతున్నాయి. అంతేకాదు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న అత్యధిక శాతం విద్యార్థులకు తగిన నైపుణ్యాలు లేకుండా పోతున్నాయని మానవవనరుల శాఖ స్థాయీసంఘం అభిప్రాయపడింది. విద్యారంగంపై ప్రత్యేకదృష్టి సారించినప్పుడే మన విశ్వవిద్యాలయాలు మేటి సంస్థలతో పోటీపడగలుగుతాయి.- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌
Posted on 15-07-2019