Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

మత్తు వదలాలి!

మనుషుల్ని మత్తులో ముంచి నిలువునా చిత్తుచేసి మద్యమహమ్మారి ఎంతటి మహావిషాదం సృష్టించగలదో ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికాంశాలు నిరుడు కళ్లకు కట్టాయి. దేశదేశాల్లో రెండు వందలకుపైగా రోగాలకు ఉత్ప్రేరకంగా మారిన మద్య రక్కసి 13కోట్ల 26లక్షల సంవత్సరాల ప్రయోజనకర జీవనాన్ని కాటేసిందన్న విశ్లేషణలు అప్పట్లో గగ్గోలు పుట్టించాయి. ఇండియాలో మద్యం విపణి 2026 సంవత్సరం నాటికి అయిదు లక్షల కోట్ల రూపాయలకు మించనుందన్న అంచనాలూ వెలుగుచూశాయి. ‘అంతర్జాతీయ ఔషధ విధాన జర్నల్‌’లో ప్రచురితమైన తాజా అధ్యయనం మరింత భీతావహ దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. 2011 లగాయతు 2050 సంవత్సరం వరకు మద్యం కారణంగా భారత్‌ కనీసం 25కోట్ల 80లక్షల సంవత్సరాల ప్రయోజనకర జీవనాన్ని కోల్పోనుందని, ఆర్థికంగా ఏటా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 1.45శాతం మేర నష్టం వాటిల్లుతుందన్న గణాంకాలు బెంబేలెత్తిస్తున్నాయి. మద్యం విక్రయాలపై పన్ను రాబడులను గణించినా ఆల్కహాల్‌ సంబంధిత అనారోగ్యాల మూలాన ఇతరత్రా జాతి చెల్లించాల్సి వచ్చే మూల్యం ఎకాయెకి రూ.97.89 లక్షలకోట్లన్న ప్రాథమిక అంచనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. ఏటికేడు ఎక్సైజ్‌ సుంకాల బాదుడు పెరుగుతున్నా, దేశీయంగా మద్య వినియోగంలో 38శాతందాకా వార్షిక వృద్ధిరేటు- వ్యసనం తాలూకు మహాకర్షక శక్తిని, అంతకుమించి సర్కార్ల కక్కుర్తిని చాటుతోంది. తాగుడు జోరెత్తేకొద్దీ కాలేయ వ్యాధులు, క్యాన్సర్లు, రహదారి ప్రమాదాలు పెచ్చరిల్లుతున్నట్లు వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నా- ‘గిరాకీ హేతుబద్ధీకరణ’ అంశాన్నే ప్రస్తావిస్తున్న ప్రభుత్వాలు, ప్రత్యేక పద్దుగా లిక్కర్‌ ఆదాయాన్ని ముద్దుచేస్తున్నాయి. తద్వారా కోట్లాది కుటుంబాల్లో ఆరని కన్నీటి కాష్ఠాల్ని ప్రజ్వరిల్లజేస్తున్నాయి.

భారత రాజ్యాంగంలోని నలభై ఏడో అధికరణ ‘దేశంలో లిక్కర్‌ వినియోగం క్రమేణా తగ్గుతూపోయి- అంతిమంగా నిషేధం లాంటి పరిస్థితి నెలకొనేలా చూడటం ప్రభుత్వాల విధి’గా పేర్కొంటోంది. ఆ స్ఫూర్తి పరగడుపున పడిపోయిందన్న ఆవేదనతో సర్వోన్నత న్యాయస్థానమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగ విహిత బాధ్యతను పదేపదే గుర్తుచేసినా ఒరిగిందేముంది? 1997-98లో ఉమ్మడి ఏపీ ఎక్సైజ్‌ ఆదాయం వెయ్యి కోట్ల రూపాయలుగా నమోదైంది. రెండు దశాబ్దాల తరవాత ఉభయ తెలుగు రాష్ట్రాల ఎక్సైజ్‌ రాబడి రూ.30వేల కోట్లకు పైబడింది. పొరుగున కర్ణాటక పదకొండేళ్ల వ్యవధిలో మద్య విక్రయాల్లో 77 శాతం, రెవిన్యూలో 273 శాతం ‘విశేష వృద్ధి’ని సాధించింది. మద్యం ఖాతా కింద చేతనైనంత రాబట్టడంలో రాష్ట్రాల మధ్య పోటాపోటీ పర్యవసానంగా- దేశ జనాభాలో ఆల్కహాల్‌ వినియోగదారులు దాదాపు పదిహేను శాతానికి విస్తరించారు. మద్యానికి బానిసలైన అయిదు కోట్ల 70 లక్షలమందిలో మూడు కోట్ల 20 లక్షల మందికి అత్యవసర వైద్యసేవలందించాల్సి ఉందని ఎన్‌డీడీటీసీ (జాతీయ డ్రగ్‌ డిపెండెన్స్‌ చికిత్సా కేంద్రం) ఇటీవలి సర్వే స్పష్టీకరించింది. మరో ఏడెనిమిది శాతం జనాభా భిన్నమార్గాల్లో మాదక ద్రవ్యసేవనంతో జోగుతోందనీ అది దిగ్భ్రాంతరకర వాస్తవాన్ని బహిరంగపరచింది. 2005 సంవత్సరం నాటికి దేశంలో 2.4 లీటర్లున్న లిక్కర్‌ తలసరి వినియోగం తరవాతి అయిదేళ్లలో 4.3 లీటర్లకు, 2016లో 5.7 లీటర్లకు ఎగబాకింది. ఛత్తీస్‌గఢ్‌, త్రిపుర, పంజాబ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, గోవా మద్యసేవనంలో రికార్డులు బద్దలుగొడుతున్నాయి. యూపీ, ఏపీ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ వంటివి ఆల్కహాల్‌ సంబంధిత సమస్యల నిలయాలవుతుండగా- సూదుల ద్వారా మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డవారి జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాలు నాలుగైదు స్థానాల్లో కొలువుతీరడం తీవ్రంగా ఆందోళనపరచేదే. ఒక్కముక్కలో, ఇది జాతికి పెను ఉత్పాతమే!

పదమూడేళ్ల క్రితం సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమే ‘రోగగ్రస్త జాతిని కాదు మనం కోరుకునేది’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసినా- మత్తు పానీయాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలై దేశంలో రోజూ సగటున పదిమంది ఆత్మహత్యకు పాల్పడే దురవస్థ ఎందుకు దాపురించినట్లు? లిక్కర్‌ రాబడిపై ప్రభుత్వాల ఎనలేని మక్కువ కోట్లాది కుటుంబాల ఆర్థిక స్థితిగతుల్ని తలకిందులు చేసి అశాంతి, అభద్రతల్ని రాజేస్తుండగా- నిఘా, పర్యవేక్షణ కొల్లబోయి మాదక శక్తుల విజృంభణతో అసంఖ్యాక తల్లిదండ్రుల కంటి దీపాలు కొడిగట్టిపోతున్నాయి. వ్యవస్థాగతమై వర్ధిల్లుతున్న అలసత్వమే మాదక ముఠాల ఉరవడికి ఎరువవుతోంది. దేశవ్యాప్తంగా గంజాయి చాక్లెట్లకు, సింథటిక్‌ డ్రగ్స్‌కు అలవాటుపడిన వారెందరో, విద్యార్థులే లక్ష్యంగా మాయవలలు విసరుతున్న ముఠాల ఆనుపానులు ఏ మేరకు విస్తరించాయో, ఆన్‌లైన్‌ కొనుగోళ్ల సంస్కృతి మారుమూల పల్లెలకూ ఎంతగా చొచ్చుకుపోయిందో ఇప్పటికీ సరైన లెక్కలు లేవు. 2023నాటికి మాదక ద్రవ్యాల గిరాకీని తగ్గించేందుకు నిరుడు జాతీయ కార్యాచరణ ప్రకటించామంటున్న కేంద్రం, రాబడి మత్తులో జోగుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా నిద్ర అభినయించడం మాని మేలుకోవాలి. దేశంలో తొలిసారి లిక్కర్‌ రుచి మరిగే వయసు 12.3 ఏళ్లకు పడిపోయింది. మాదక ద్రవ్యాలు నెట్టింట్లో అందుబాటులోకి వస్తున్నాయి. స్వస్థభారత్‌ కోసం, ఆరోగ్యకర సమాజాల నిర్మాణానికి అలవాటుగా కట్టుబాటు చాటుతున్న ప్రభుత్వాలు- మద్యప్రవాహాలు ఇల్లాళ్ల పసుపుతాళ్లను తెంచేస్తున్నా కిమ్మనకుండా ఉపేక్షించడమేమిటి? నవయువ శక్తులుగా ఎదిగి అక్కరకు రావాల్సిన రేపటితరం మత్తుకు లోబడుతున్నా అవి చేష్టలు దక్కి మౌనంగా చూస్తుండిపోవడమేమిటి? ప్రభుత్వాలు రాబడి మత్తును వదిలించుకొని, మాదక మారీచులపై ఉక్కుపాదం మోపితేనే- విషాద పరంపరకు ముగింపు, దేశానికి భవిష్యత్తు!


Posted on 17-07-2019