Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అరచేతిలో ఈ-ఆటల బరి

* వాడవాడలా వీడియో గేమ్‌ విస్తరణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లో ప్రారంభించిన అంకుర పరిశ్రమల(స్టార్టప్‌ ఇండియా) పథకం కింద స్థాపితమైన సంస్థల సంఖ్య ఈ ఏడాది జనవరిలో 15,667కి చేరింది. సర్కారు ప్రోత్సాహానికి తోడు వ్యక్తిగత చొరవ, ప్రతిభలు దండిగా ఉంటేనే అంకురాలు విజయవంతమవుతాయి. వివిధ రంగాల్లో అలా తడాఖా చూపుతున్న అంకుర సంస్థలు వెయ్యి వరకు ఉన్నాయి. ఫైనాన్స్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌), ఈ-కామర్స్‌, వినియోగదారుల సేవలు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం వంటి రంగాల్లో అంకురాలు రాణిస్తున్నాయి. వీటికితోడు మొబైల్‌, పీసీ, కన్సోల్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగాల్లోనూ అంకురాలు విజృంభిస్తున్నాయి. మన గేమింగ్‌ పరిశ్రమ పరిమాణం 2022కల్లా 130 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.9,000 కోట్లకు) చేరనుంది. భారతీయ గేమింగ్‌ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌ కోసం ఏటా 100 గేమ్స్‌ను రూపొందిస్తున్నాయి. ఒక గేమ్‌ రూపకల్పనకు ఇతర దేశాల్లో అయ్యే వ్యయంలో సగానికే భారత్‌లో రూపొందించవచ్చు. ఇక్కడి అవకాశాలను గ్రహించి చైనాకు చెందిన అలీబాబా, టెన్సెంట్‌, యూజు కంపెనీలు, హాంకాంగ్‌కు చెందిన ఏజీటెక్‌ హోల్డింగ్స్‌, వియత్నామ్‌కు చెందిన స్టార్మ్‌ స్టూడియో, అమెరికాకు చెందిన వాల్ట్‌ డిస్నీ కంపెనీ ఇప్పటికే భారతీయ గేమింగ్‌ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాయి. ఈ పరిశ్రమలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) మరింత ప్రోత్సహించే విషయం పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. ఆ పని వెంటనే చేస్తే అత్యున్నత స్థాయి సాంకేతిక సంస్థలు భారత్‌కు వచ్చి స్వదేశీ అంకురాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాయి. ప్రతిభావంతులకు ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయి.

సరికొత్త క్రీడా ప్రపంచం
నేడు ఇంటా బయటా పిల్లలు, కుర్రాళ్లు, ఇళ్లలో గృహిణులు, బస్సులు, రైళ్లలో ప్రయాణికులు స్మార్ట్‌ ఫోన్లు చేతపట్టి గంటల తరబడి గేమ్స్‌ ఆడటం చూస్తే, ఈ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. భారతీయ పురుషుల్లో 40 శాతం, మహిళల్లో 35 శాతం వారానికి అయిదు రోజులు మొబైల్‌ గేమ్స్‌ ఆడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. 1990లలో కన్సోల్స్‌ లేదా డెస్క్‌ టాప్‌ కంప్యూటర్లు ఉంటే కానీ గేమ్స్‌ ఆడలేని స్థితి నుంచి నేడు అరచేతిలో ఇమిడే ఆటల ప్రపంచానికి వచ్చాం. గిరాకీ పెరుగుతున్నకొద్దీ కొత్త కొత్త ఆటలను అభివృద్ధి చేసే అంకురాలు అవతరిస్తాయి. 2010లో భారత్‌లో కేవలం 25 గేమింగ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలు ఉంటే 2018కల్లా అవి 250కి పెరిగాయి. ప్రభుత్వం, వెంచర్‌ పెట్టుబడిదారుల అండదండలతో మరిన్ని ఆటల అంకుర సంస్థలు ఉద్భవించనున్నాయి. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా గల భారత్‌లో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది చివరకు 53 కోట్లకు చేరనుంది. ఇది మొబైల్‌ గేమింగ్‌ పరిశ్రమకు చవులూరించే విషయం. పైగా ప్రపంచంలో అంతర్జాల వాడకందారుల సంఖ్య చైనా తరవాత భారత్‌లోనే ఎక్కువ. ఈ కారణాలన్నింటి వల్ల 2020కల్లా గేమర్ల సంఖ్య 63.8 కోట్లకు చేరనుంది. 2019లో ప్రపంచమంతటా వీరి సంఖ్య 250 కోట్లకు చేరుతుందని, వారు ఆటలపై 15,210 కోట్ల డాలర్లు (రూ.10.50 లక్షల కోట్లు) ఖర్చు చేయబోతున్నారని గ్లోబల్‌ గేమ్స్‌ మార్కెట్‌ రిపోర్ట్‌ తెలిపింది. 2023కల్లా భారత్‌లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ ఆదాయం రూ.11,900 కోట్లకు చేరుతుందని ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టెన్సీ సంస్థ కేపీఎమ్‌జీ లెక్కకట్టింది. నిరుడు ప్రపంచంలో సినిమాలు, టెలివిజన్‌, సంగీత పరిశ్రమలకు వచ్చిన ఆదాయంకన్నా గేమింగ్‌ పరిశ్రమ ఆదాయమే ఎక్కువంటే, వినోద రంగంలో సమూల మార్పులు వస్తున్నాయని అర్థమవుతుంది.

2017లో ప్రపంచంలో ఆన్‌ లైన్‌ మొబైల్‌ గేమింగ్‌లో అమెరికా, రష్యా, చైనా, బ్రెజిల్‌ తరవాతి స్థానాన్ని భారత్‌ ఆక్రమించింది. 5జి వచ్చాక అన్ని దేశాల్లో గేమింగ్‌ పరిశ్రమ వృద్ధికి ఆకాశమే హద్దు కానుంది. పబ్జి, లీగ్‌ ఆఫ్‌ లెజెండ్స్‌, పోకెమాన్‌ వంటి ఆటలకు ఇప్పటికే ఉన్న ఆదరణ మరింత విజృంభిస్తుంది. జులై 31 నుంచి భారత వైమానిక దళం తన సొంత మొబైల్‌ గేమ్‌ విడుదల చేసి యువతను ఆకర్షించాలని చూస్తోంది. రిలయన్స్‌ జియో కూడా ఈ-స్పోర్ట్స్‌ రంగంలో ప్రవేశిస్తోంది. మిగతా టెలికం కంపెనీలూ ఇదే బాట పట్టడం ఖాయం. నేడు వైఫై, మొబైల్‌ నెట్‌వర్కుల ద్వారా వేగంగా గేమింగ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, వాటికి మొబైల్‌ ఫోన్ల ద్వారానే చెల్లింపులు జరపడం సునాయాసమై, లక్షలాదిమందిని గేమింగ్‌ వైపు లాగుతోంది.

అంతర్జాతీయంగా అనేకమంది క్రీడాకారుల జట్లు పోటీపడే వీడియో గేమ్స్‌ (ఈ-గేమ్స్‌) పెరిగిపోతున్నాయి. ఈ టోర్నమెంట్లలో గెలిచే జట్లకు భారీ నగదు బహుమతులు లభిస్తున్నాయి. ముంబయి నగరంలో కొన్ని సంస్థలు వీడియో గేమర్ల జట్లను నిర్వహిస్తూ, బహుమతి మొత్తాలను 70:30 నిష్పత్తిలో పంచుకుంటున్నాయి. ఇందులో 70 శాతం ఆటగాళ్లకే లభిస్తోంది. అంతేకాదు, ఆటగాళ్లను రూ.25,000 నుంచి రూ.40,000 వరకు నెల జీతంపై నియమించుకుని గృహవసతీ కల్పిస్తున్నాయి. ఈ-స్పోర్ట్స్‌ టోర్నమెంట్లు జోరుగా సాగే దక్షిణ కొరియా, అమెరికా, ఐరోపా దేశాల్లో మేటి క్రీడాకారులు ఏడాదికి 20 లక్షల నుంచి 30 లక్షల డాలర్ల వరకు సంపాదిస్తున్నారు. అనేక దేశాల క్రీడాకారులు పోటీ పడే ఈ క్రీడలను పెద్ద స్టేడియాల్లో భారీ తెరలపై వీక్షిస్తారు. భారత్‌లో ఈ-స్పోర్ట్స్‌ ప్రేక్షకుల సంఖ్య 2021కల్లా రెండు కోట్లకు చేరవచ్చని కేపీఎమ్‌జీ సంస్థ అంచనా. ఇంటర్నెట్‌, మొబైల్‌, స్టేడియాలతోపాటు టీవీ ఛానళ్లలో కూడా ఈ-స్పోర్ట్స్‌ను చూసే రోజు ఎంతో దూరంలో లేదు. 2014-16 మధ్యకాలంలో భారతీయుల గేమ్‌ డౌన్‌లోడ్స్‌ రెట్టింపయ్యాయి. భారతీయులు ఇదివరకటిలా ఉచిత గేమ్స్‌ కోసం వెతకడం తగ్గించి మొబైల్‌ చెల్లింపులతో కావలసిన గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొంటున్నారు. దీనివల్ల గేమింగ్‌ పరిశ్రమకు ఆదాయం పెరుగుతూ దినదినాభివృద్ధి చెందుతోంది. ఫలితంగా కొత్త పెట్టుబడులు ప్రవహిస్తూ యువతకు ఉపాధి, ఆదాయం పుష్కలంగా లభించనున్నాయి. పలువురు చిత్రకారులు, ప్రోగ్రామర్లు, డిజైనర్లు, ఆడియో ఇంజినీర్లు, గేమ్‌ డెవలపర్లు కలిస్తేనే ఒక వీడియో గేమ్‌ తయారవుతుంది. ప్రతిభ గలవారికి ఈ విభాగాలన్నింటిలో గిరాకీ ఉంటుంది. ఇక అంతర్జాతీయ టోర్నమెంట్లలో గెలిచేవారికి ఆదాయమే ఆదాయం. నేడు భారత్‌లో ఈ-స్పోర్ట్స్‌ అథ్లెట్ల సంఖ్య పెరగడంలో ఆశ్యర్యమేముంది? సాధారణ అథ్లెట్ల మాదిరిగా వీడియో గేమర్స్‌కు శారీరక దారుఢ్యం అక్కర్లేదు కానీ, మానసిక నైపుణ్యాలు అవసరం. వేగం చాలా చాలా అవసరం.

పతకం గెలిచిన భారతీయుడు
కన్సోల్స్‌, కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ వేదికలుగా రకరకాల గేమ్స్‌ పుట్టుకొస్తున్నాయి. వ్యక్తిగతంగా ఆడుకునే ఆటలకు తోడు అనేకమంది పోటీ పడే ఎలక్ట్రానిక్‌ స్పోర్ట్స్‌ (ఈ-స్పోర్ట్స్‌) నేడు విజృంభిస్తున్నాయి. 2018లో ఇండొనేసియాలో జరిగిన ఆసియన్‌ గేమ్స్‌లో హార్త్‌ స్టోన్‌ అనే ఈ-స్పోర్ట్‌లో భారత్‌కు చెందిన తీర్థ్‌ మెహతా కాంస్య పతకం గెలిచాడు. ఈ గేమ్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినందువల్ల అధికారిక పతకాల పట్టీలో చూపలేదు. అయితే 2022 ఆసియన్‌ గేమ్స్‌లో ఈ ఆటను అధికారిక క్రీడగా ప్రవేశపెట్టబోతున్నారు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ లో ఈ-స్పోర్ట్స్‌ను ప్రయోగాత్మక క్రీడగా ప్రవేశపెట్టడానికి చర్చలు జరుగుతున్నాయి. నేడు ఈ-స్పోర్ట్స్‌ను స్టేడియాలలో భారీ తెరలపై అసంఖ్యాక వీక్షకులు చూడటం బట్టి వాటి ప్రాచుర్యమేమిటో అర్థం చేసుకోవచ్చు. 40 లక్షలమంది భారతీయులు ఈ-స్పోర్ట్స్‌ను ఆదరిస్తున్నారు. భారత్‌లో పెరుగుతున్న యువ జనాభా, స్మార్ట్‌ ఫోన్ల వినియోగం, కారుచౌక మొబైల్‌ డేటా రేట్లు, 4జి చలవతో పెరిగిన డేటా వేగం- గేమింగ్‌ పరిశ్రమను కొత్త శిఖరాలకు చేరుస్తున్నాయి. నగరాల నుంచి గ్రామాల వరకు మొబైల్‌ ఫోన్ల చలవతో మహిళలు కూడా విరివిగా ఈ ఆటలు ఆడుతున్నారు. క్యాండీ క్రష్‌ భారతీయ మహిళలను విపరీతంగా ఆకట్టుకున్న ఆట.

ఆదాయ మార్గం
గేమర్లు టోర్నమెంట్లతోపాటు, యూట్యూబ్‌లో, అమెజాన్‌కు చెందిన ట్విచ్‌లో తమ గేమ్‌లను ‘లైవ్‌ స్ట్రీమింగ్‌’ చేయడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. బెంగళూరులో ఒక యువతి తాను ఆడే పబ్జీ, ఓవర్‌ వాచ్‌ వంటి గేమ్స్‌ను లైవ్‌ స్ట్రీమ్‌ చేస్తూ నెలకు రూ. 20,000 సంపాదిస్తోంది. ఆటలో తాను వేసే ఎత్తులను యూట్యూబ్‌లో వివరిస్తూ లైవ్‌స్ట్రీమ్‌ చేయడం వల్ల ఆసక్తి కలవారు ఆమెకు నెలకు కొంత రుసుము చెల్లించి, ఆమెతో సంభాషిస్తూ ఆట నేర్చుకుంటున్నారు. ఇలాంటి చందాదారులు లక్షలమంది ఉంటే నెలసరి ఆదాయం కనీసం లక్ష రూపాయలవుతుంది. నేడు భారత్‌లో ఈ-స్పోర్ట్స్‌ టోర్నమెంట్లు పెరిగిపోతున్నాయి. ఈ పోటీల్లో నగదు బహుమతి అయిదు లక్షల రూపాయల వరకూ చేరింది. ఇలాంటి టోర్నమెంట్లలో గెలవాలంటే ఆటగాడి కంటికి, చేతికి మధ్య మెరుపు వేగంతో సమన్వయం ఉండాలి. ఆ లక్షణాన్ని 26 ఏళ్ల వయసు దాటాక కోల్పోతాం. మొబైల్‌, కన్సోల్‌, కంప్యూటర్‌ తెర- దేనిమీదైనా సరే అదేపనిగా గేమ్స్‌ ఆడితే శారీరక, మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. ఇంటర్నెట్‌ చూడటం, వీడియో గేమ్స్‌ ఆడటం పెద్ద వ్యసనంగా మారిపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గేమ్స్‌ ఆడే పిల్లల్లో హ్రస్వదృష్టి పెరుగుతోందని వార్తలు రావడంతో చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌, గేమింగ్‌ పరిశ్రమపై ప్రభుత్వ పర్యవేక్షణ పెంచారు. భారత్‌లో పబ్జి గేమ్‌ హింసా ప్రవృత్తిని ప్రేరేపిస్తోందని గుజరాత్‌ ప్రభుత్వం ఆ ఆటను నిషేధించింది. హైదరాబాద్‌లో తొమ్మిదో తరగతి చదివే ఒక పిల్లవాడి పబ్జి వ్యసనాన్ని వదిలించడానికి మానసిక చికిత్సా నిపుణుడు మందు ఇవ్వాల్సివచ్చిన ఉదంతం వెల్లడైంది. ఇలాంటి అనారోగ్యకర ధోరణులను అధిగమించడానికి పిల్లలు ఎంతసేపు గేమ్స్‌ ఆడాలో తల్లిదండ్రులే నిర్ణయించే విధంగా ‘గేమ్‌ యాప్స్‌’ తయారవుతున్నాయి. మున్ముందు ఈ పరిశ్రమ విజృంభణకు పల్లెటూర్లే పట్టుగొమ్మలు కానున్న దృష్ట్యా ఇలాంటి జాగ్రత్తలు మరెన్నో తీసుకోవాలి!


- కైజర్‌ అడపా
Posted on 25-07-2019