Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

నీటి కోసం కోటి పాట్లు

* ముంచుకొస్తున్న సంక్షోభం

భూమండలంపై గల సమస్త ప్రాణికోటి మనుగడకు జలం జీవనాధారం. ప్రపంచవ్యాప్తంగా ఏటా జనాభా వృద్ధి అవుతోంది. ఆ మేరకు తాగునీటి వనరులు పెరగకపోగా, నానాటికీ తరిగిపోతున్నాయి. ఫలితంగా నీటిఎద్దడి తీవ్రరూపం దాలుస్తోంది. వేసవిలో గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీరూ దొరకడం గగనమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా తాగడానికి ఉపయోగపడే మంచినీటి వనరులు 2.5 శాతమే ఉన్నాయి. 2050 నాటికి సగానికిపైగా ప్రపంచ జనాభా తాగునీటి ఎద్దడి ఎదుర్కోవలసి వస్తుందని ఓ అంచనా. భారత్‌ ఇప్పటికే ఈ సమస్యతో సతమతమవుతోంది.

భారత్‌ భూ భౌగోళిక విస్తరణ వైశాల్యం దాదాపు 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. ఏటా సగటు వర్షపాతం 1,170 మిల్లీమీటర్లు. ఇది ప్రపంచ సగటు వర్షపాతం (990 మీమీలు) కన్నా ఎక్కువ. ఏటా దేశంలో 3.83లక్షలకోట్ల చదరపు మీటర్లకు పైగా వర్షం పడుతుంది. అందులో అందుబాటులో ఉన్న నీరు 60 శాతం (2.30 లక్షల కోట్ల చ.మీ.లు). దీనిలో నదులద్వారా 48.7 శాతం (1.86 లక్షల కోట్ల చ.మీ.లు) ప్రవహిస్తుంది. 11.3 శాతం నీరు భూమిలోపల పొరల్లోకి ఇంకుతుంది. మిగిలిన వర్షపునీరు 40 శాతం ఆవిరవుతుంది.

దేశంలో 1951 నాటి జనాభాకు ప్రస్తుత జనాభాకు పొంతనే లేదు. దాదాపు 135 కోట్ల జనాభాతో చైనా తరవాత భారత్‌ ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. అంచనాలకు మించి జనాభా పెరిగింది. కానీ వర్షపాతం, నీటివనరుల్లో క్షీణత కనబడుతోంది. తలసరి నీటి లభ్యత 1951లో 5,177 చ.మీ.లు. 2011 నాటికి అది 1545 చ.మీ.లకు తగ్గింది. ఇప్పుడున్న అసమర్థ నీటి నిర్వహణ పరిస్థితి కొనసాగితే తలసరి నీటి లభ్యత 2025 నాటికి 1,341 చ.మీ.లకు; 2050 నాటికి 1140 చ.మీ.లకు పడిపోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తలసరి నీటిలభ్యత 1,170 చ.మీ.ల కన్న తక్కువగా ఉంటే ‘నీటి ఒత్తిడి’ని, 1000 చ.మీ.లకు దిగువగా ఉంటే ‘నీటి కొరత’ను సూచిస్తుంది. ఈ గణాంకాలు రానున్న రోజుల్లో దేశంలో నీటికొరత తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నీతిఆయోగ్‌- 2018 నివేదిక ప్రకారం దేశంలో అధిక శాతం ప్రజలు నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చాలా రాష్ట్రాల్లో నీటిఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, తమిళనాడుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, త్రిపుర, మహారాష్ట్రల్లో మధ్యస్థాయిలో, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, కేరళల్లో తక్కువస్థాయిలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 70 శాతం నీటిని వ్యవసాయరంగానికే వినియోగిస్తున్నారు. భారత్‌లో పెరుగుతున్న జనాభా ప్రభావం వ్యవసాయ ఉత్పత్తుల మీద పడింది. దీంతో అందుబాటులో ఉన్న నీటిలో దాదాపు 80 శాతం పైగా వ్యవసాయ రంగానికే ఉపయోగిస్తున్నారు. చైనాలో 65 శాతం నీటిని సేద్యానికి వాడుతున్నారు. ఇజ్రాయెల్‌లో వ్యవసాయానికి 1980లో 70 శాతం నీటిని వినియోగించగా, 2005 నాటికి 57 శాతానికి తగ్గించగలిగారు. 2025 నాటికి 52 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన నీటిలో ఎక్కువ శాతం తాగునీటికి, తక్కువ శాతం పరిశ్రమలకు వాడుతున్నారు.

భారత్‌లో వ్యవసాయానికి వినియోగించే నీటిశాతం అధికమైనప్పటికి, దానివల్ల సమకూరే ఫలితాలు తక్కువే. ఇజ్రాయెల్‌లో వ్యవసాయ రంగానికి తక్కువ నీటిని వినియోగించి గణనీయ ఫలితాలు రాబడుతున్నారు. ఇజ్రాయెల్‌ మాదిరిగా తక్కువ నీటితో ఎక్కువ ప్రతిఫలం సాధించడంలో భారత్‌ విఫలమైంది. ప్రపంచంలో పెట్రోలుకు ప్రత్యామ్నాయం ఉంది కానీ నీటికి మాత్రం లేదు. అంతేకాక నీటికి పునరుత్పత్తి సైతం లేదనే విషయాన్ని గమనించాలి. వర్షం ద్వారా లభిస్తున్న నీటిలో ఎనిమిది శాతం మాత్రమే నిల్వ చేస్తున్నారు. మిగిలినది వృథా అవుతోంది. దీనికి అడ్డుకట్ట పడాలి. నీటి పొదుపునకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. సమర్థ నీటి నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వాలు సమకూర్చాలి. నీటిపొదుపు, బావులు, కుంటలు, చెరువుల్లో నీటి నిల్వపై సమగ్ర అధ్యయనం చేయడం అవసరం. ముఖ్యంగా పట్టణాల్లో వృథా అవుతున్న నీటిని అరికట్టాలి. భూ, భౌగోళిక పరిస్థితులను అనుసరించి, రాక్‌ఫిల్‌ డ్యాములు, చెక్‌డ్యాములు, వ్యవసాయ చెరువులు, గుంటలు, ఇంకుడు గుంటలు నిర్మించాలి. ఇజ్రాయెల్‌ మాదిరిగా బిందు సేద్య విధానాలు పాటించినట్లయితే నీటిని పొదుపు చేయవచ్చు. తద్వారా వ్యవసాయానికి ఉపయోగించే నీటిలో 30 నుంచి 50 శాతం వరకు పొదుపు చేయడానికి అవకాశం ఉంది. సహజ వనరులకు గండికొట్టే విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. వివిధ రకాలుగా కలుషితమైన నీటిని ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతుల ద్వారా ఇజ్రాయెల్‌ మాదిరిగా శుద్ధిచేసి వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఉద్యాన వనాలకు, ఇంటి పనులకు వినియోగించడం వల్ల నీటి ఎద్దడి ఇబ్బందులను కొంతవరకు అధిగమించవచ్చు. ఉప్పు నీటిని మంచి నీరుగా మార్చాలి. మొక్కలను పెంచడం ద్వారా వాతావరణంలోని కాలుష్యం తగ్గించి, వర్షాలు పడటానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పరచడాన్ని ప్రతి ఒక్కరూ పౌరబాధ్యత స్వీకరించాలి. ఆ మేరకు నీటి పొదుపు, సంరక్షణ, నిర్వహణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలి. వీటిని పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా భావిపౌరులకు సైతం అవగాహన కల్పించాలి. అప్పుడే నీటి సంక్షోభాన్ని కొంతవరకైనా నివారించగలం!- ఆచార్య నందిపాటి సుబ్బారావు
(రచయిత- భూగర్భ శాస్త్ర నిపుణులు)
Posted on 25-07-2019