Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

జనారోగ్యంపై జాతీయ వ్యూహం

ఆరోగ్యమే మహాభాగ్యమని విశ్వసించే భారతీయ సమాజంలో సాంక్రామిక, సాంక్రామికేతర వ్యాధుల ఉరవడితో ఏటా కోట్లాది బడుగు జనావళి భాగ్యరేఖలు చెదిరిపోతున్నాయి. గాలి విషధూమమై, నేల రసాయన అవశేషాల నిలయమై, నీరు కాలుష్య కాసారమైపోగా ఎక్కడికక్కడ అనారోగ్యకర వాతావరణం- సీజన్లతో నిమిత్తం లేకుండా రోగాలూ రొష్ఠులను ఎగదోస్తోంది. పేదరికాన్ని దాని కవలలైన ఆకలి అనారోగ్యాల్ని అంతమొందించాలన్న స్వాతంత్య్ర భానూదయం నాటి సదాశయ ప్రకటన ఎంత వీనులవిందుగా ఉందో- వైద్య ఖర్చులు భరించలేకే ఏటా కోట్లమంది పేదరికంలోకి జారిపోతున్న వాస్తవం అంతగా గుండెల్ని పిండేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నవజాత శిశు మరణాల్లో 27శాతం, అయిదేళ్లకే నూరేళ్లు నిండిపోతున్న పిల్లల్లో 21శాతం, అంతర్జాతీయ వ్యాధుల భారంలో అయిదోవంతు దాకా భారత్‌ పద్దులోనే జమపడుతున్నాయన్న గణాంకాలు- దేశంలో గూడుకట్టిన దుర్భర వేదనకు ఆనవాళ్లు. ‘అందరికీ ఆరోగ్యం’లో ఇండియాను అంతర్జాతీయ నమూనాగా ఆవిష్కరించడమే లక్ష్యమంటున్న కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ వ్యాఖ్యలు- సుదూర స్వప్నాలు! ఈ నేపథ్యంలోనే, భారతీయ వైద్య పరిశోధన మండలి, వ్యాధుల నియంత్రణ జాతీయ కేంద్రం శాస్త్రవేత్తలు అత్యంత ప్రమాదకరమైన పది వైరల్‌ ఇన్‌ఫెక్షన్లపై పారాహుషార్‌ పలుకుతున్నారు. ఎబోలా, ఎల్లో ఫీవర్‌, ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వంటివి జనారోగ్యానికి ఎంత చేటు చెయ్యగలవో ప్రస్తావిస్తూ ముందస్తు సన్నద్ధత అవసరంపై హెచ్చరిస్తున్నారు. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న కాంగోలో ఎబోలా కేసులు 2,592 నమోదు కాగా, 1,743 మంది మృత్యువాత పడ్డారంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. 70శాతం కేసుల్లో రోగిని మృత్యు పరిష్వంగానికి ఈడ్చేస్తున్న ఆ మహమ్మారి ఉగాండాలోనూ కనిపిస్తోందని, అక్కడి నుంచి భారతీయుల రాకపోకలపై అప్రమత్తంగా ఉండాలన్నది శాస్త్రవేత్తల హెచ్చరిక. టైఫాయిడ్‌ మలేరియా లాంటివీ మృత్యుఘంటికలు మోగిస్తున్న ఇండియాలో అలాంటి ప్రమాదకర వైరస్‌లు ప్రవేశిస్తే- ఇంకేమైనా ఉందా?

ఈ వర్షకాలంలో సరైన వానలు లేవుగాని, వ్యాధుల ముసురు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ దట్టంగా అలముకొంది. డయేరియా, తట్టు, గవదలు, టైఫాయిడ్‌, పచ్చకామెర్లు, మలేరియా, డెంగీల తాకిడితో జనారోగ్యానికి తీవ్రంగా తూట్లు పడుతున్నాయి. నిరుడు ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల 27వేలమంది తట్టు (మీజిల్స్‌) వ్యాధిన పడితే లక్షా 36 వేలమంది మరణించారన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ 2017తో పోలిస్తే 47 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయని మొన్న ఫిబ్రవరిలో ప్రకటించింది. అల్ప మధ్యాదాయ వర్గాల ఇళ్లూ ఒళ్లూ గుల్లచేసేలా స్వైన్‌ఫ్లూ, డెంగీల విజృంభణపై ఎంత చెప్పినా తక్కువే. ఇటీవలే బిహార్‌, అసోమ్‌లలో ఎక్యూట్‌ ఎన్‌కెఫలైటిస్‌ సిండ్రోమ్‌ (ఏఈఎస్‌) వ్యాధి ప్రబలి వందలమంది పిల్లల్ని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే! దానిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో- వైద్య సదుపాయాలు, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం వంటి కీలకాంశాలపై సుప్రీంకోర్టు బిహార్‌ ప్రభుత్వంతోపాటు కేంద్రాన్నీ ప్రతివాదిగా చేర్చింది. జపనీస్‌ ఎన్‌కెఫలైటిస్‌ గానూ వ్యవహరించే ఈ వ్యాధి ఏటా వేలమంది పిల్లల ప్రాణాల్ని బలిగొంటున్నా దాని సామూహిక మారణకాండను నిలువరించే సన్నద్ధత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కొరవడటమే గుండెల్ని మెలిపెట్టే విషాదం. తినడానికి ఏమీలేక లిచీ పండ్లతో కడుపు నింపుకొన్న పిల్లలు ఆ ప్రాణాంతక వ్యాధికి బలైపోవడం- కడు పేదరికం కోరల్లో కొట్టుమిట్టాడే బుడతల బతుకులు అక్షరాలా గాలిలో దీపాలుగా మారిపోవడమే హృదయశల్యం! పదేళ్ల కాలావధిలో ఇండియా 27కోట్ల జనావళిని రెక్కపుచ్చుకొని దారిద్య్రరేఖ ఎగువకు లాక్కొచ్చిందని ఇటీవల ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. వైద్యఖర్చులు భరించలేక మధ్యాదాయ వర్గాలూ పేదరికంలోకి జారిపోతున్న వాతావరణం సలక్షణంగా వర్ధిల్లుతున్నప్పుడు- వినాశకారి వైరస్‌ల ముట్టడి పెనుసామాజిక సంక్షోభాన్నే సృష్టిస్తుంది!

సౌదీ అరేబియాలో తొలిసారి 2012లో కనుగొన్న భిన్న వైరస్‌ శ్వాసకోశ పరమైన ఇబ్బంది సృష్టించి అంతిమంగా రోగికి చెందిన వివిధ అవయవాలు పనిచేయకుండా చూసి చావును కొనితెస్తుంది. ఆ వైరస్‌ 26 దేశాలకు వ్యాప్తి చెందిందంటున్న శాస్త్రవేత్తలు- ఇండియాలో ఇప్పటిదాకా దాని జాడ కనపడలేదంటున్నారు. ఇప్పటికే ప్రపంచ శ్వాసకోశ వ్యాధుల భారంలో 32 శాతాన్ని భరిస్తున్న ఇండియాలోకి అలాంటి వైరస్‌ చొరబడితే భయానక పరిణామాలు తథ్యం. వ్యాధులపై సమీకృత నిఘా కార్యక్రమం ద్వారా రోగాల విజృంభణను పసిగడుతుంటామని, అందుకు దారి తీసిన పరిస్థితులపై పరిశోధనలకు అదనపు సిబ్బందిని, వారికి శిక్షణను సమకూరుస్తుంటామని, ప్రయోగశాలలను పటిష్ఠీకరించి, సంబంధిత సమాచార నిర్వహణ- అధ్యయనం చేపడతామని కేంద్రం చెబుతున్నా- ప్రమాదకర వైరస్‌లపై యుద్ధం వీటితోనే సాధ్యపడుతుందా? ఆరోగ్యం అన్నది రాష్ట్రాల జాబితాలోని అంశమని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ చెబుతున్నారు. మరోవంక- సాంక్రామికేతర వ్యాధుల వల్ల మరణాలు దాదాపు 62 శాతానికి చేరుకొన్నాయంటూ వాటిపై జాతీయోద్యమమే సాగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మూన్నాళ్ల క్రితం పిలుపిచ్చారు. తరచిచూస్తే దేశవ్యాప్తంగా ఆరోగ్యకర ఆత్యయిక పరిస్థితి నెలకొని ఉంది. స్థూల దేశీయోత్పత్తిలో పట్టుమని ఒకటిన్నర శాతం కూడా లేని ఆరోగ్యరంగ వ్యయపద్దు నిరుపేదల జీవన హక్కునే కాలరాసేస్తోంది. ఆయుష్మాన్‌ భారత్‌ లాంటి పైపూత పథకాలతో రోగాలకు చికిత్స సాధ్యం కాదు. ప్రాథమిక వైద్య సేవల పటిష్ఠీకరణ, విస్తరణల్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి, గాలి నేల నీరుతోపాటు తినే ఆహారంలోనూ స్వచ్ఛతా ప్రమాణాలకు చోటుపెట్టి బహుముఖ వ్యూహంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగేయాల్సిన సమయమిది!

Posted on 25-07-2019