Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పెట్టుబడులు రాకుంటే చీకట్లే!

* పీపీఏ సమీక్షలు అనర్థదాయకం

దేశంలో అన్ని నివాస ప్రాంతాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించామంటున్న ఎన్డీఏ ప్రభుత్వం అందరికీ నిరంతర(24 గంటల) కరెంటు సరఫరాయే తదుపరి లక్ష్యంగా ప్రకటించింది. ఈ లక్ష్యం నెరవేరాలంటే కేంద్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలూ విద్యుత్‌ రంగంలో పెట్టుబడుల పెంపుదలకు సానుకూల విధానాలు అమలుచేయాలి. పలు రాష్ట్రాల విధానాలు అలా లేవు. కొన్న విద్యుత్తుకు సకాలంలో సొమ్ము చెల్లించకుండా కొన్ని రాష్ట్రాలు సతాయిస్తున్నాయి. పీపీఏలపై వస్తున్న ఆరోపణలు, డిస్కమ్‌ల నష్టాలతో కొన్ని రాష్ట్రాలు కిందుమీదులవుతున్నాయి. దేశవ్యాప్తంగా ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’(డిస్కం)ల నష్టాలు రూ.25 వేలకోట్ల మేరకు చేరాయని కేంద్రం వెల్లడించింది. పీపీఏలపై తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. సరైన పీపీఏలు లేకుండానే రూ.1.70 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన 34 థర్మల్‌ విద్యుత్కేంద్రాల వేలం ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. వీటిలో కొన్నింటికి పీపీఏలు లేకపోవడం, మరికొన్నింటికి ఉన్నా బొగ్గు సరఫరా కొరవడటం వల్ల బ్యాంకుల అప్పులు తిరిగి చెల్లించలేక ఎగవేతదారుల జాబితాలో చేరాయని 2017లోనే కేంద్ర ఆర్థికశాఖ పార్లమెంటుకు తెలిపింది. ఈ 34 ప్లాంట్ల థర్మల్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం 40,130 మెగావాట్లు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు రోజూ వినియోగించే కరెంటు ఇంతకుమించి లేదు. వీటిని వేలం వేసి ఎలాగోలా ఉత్పత్తి ప్రారంభించి కరెంటు అమ్మితే అప్పులు తిరిగి వస్తాయని బ్యాంకులు ఎదురుచూస్తున్నాయి. పీపీఏ కుదిరిన తరవాత వాటిపై విచారణ జరిపి ఆమోదముద్ర వేసి అమలుకు అనుమతించే అధికారం ‘విద్యుత్‌ నియంత్రణ మండళ్ల’(ఈఆర్‌సీల)కు మాత్రమే ఉందని విద్యుత్‌ చట్టం స్పష్టంగా చెబుతోంది. ఈఆర్‌సీలంటే విద్యుత్‌ రంగంలో నిర్ణయాలను సమీక్షించే కోర్టుల్లాంటివి. అయినా పీపీఏల్లో అక్రమాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు విచారణలకు దిగుతున్నాయంటే లోపం ఈఆర్‌సీల్లో ఉందా లేక రాజకీయ కారణాలా అన్నది చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వాలే పీపీఏలను నిర్ణయిస్తే ఇక ఈఆర్‌సీలెందుకు?
పాత ఒప్పందాల రద్దు విధానాలతో కొత్త పెట్టుబడులొస్తాయా?
ప్రైవేటు నిధులు ఆగితే ‘నిరంతర కరెంటు సరఫరా’ కష్టం

పెరుగుతున్న అవసరాలు
విద్యుత్‌ రంగంలో వెలుగులు విరజిమ్మాలంటే భారీగా పెట్టుబడులు రావాలి. ఇప్పటికే 34 థర్మల్‌ విద్యుత్కేంద్రాలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. బొగ్గుతో ఉత్పత్తి చేసే థర్మల్‌ కేంద్రాల స్థాపనకు వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలేవీ సొంతంగా పెట్టే స్థాయిలో లేవు. మరోవైపు దేశంలో సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు శ్రేయస్కరమనే అభిప్రాయం అంతర్జాతీయ విపణిలో ఉంది. ఇందువల్లే సంప్రదాయేతర ఇంధన రంగంలోకి అయిదేళ్ల(2014-18)లో రెండు వేలకోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు ‘అంతర్జాతీయ ఇంధన సంస్థ’(ఐఈఏ) అధ్యయనం వెల్లడించింది. అంతకుముందు అయిదేళ్లతో పోలిస్తే ఇవి వందశాతం అధికం. వాస్తవానికి భారత సంప్రదాయేతర రంగానికి 2022 నాటికి ఎనిమిది వేలకోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం. 2023-30లో ఈ పెట్టుబడులు 25 వేలకోట్ల డాలర్లకు చేరతాయని అంచనా. ఈ స్థాయిలో పెట్టుబడులొస్తేనే భారత్‌లో 2030నాటికి 500 గిగావాట్ల సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సాధ్యమవుతుందని ఐఈఏ స్పష్టం చేసింది. వచ్చే పదేళ్లలో సంప్రదాయేతర ఇంధన(ఆర్‌ఈ) ఉత్పత్తి అయిదు రెట్లు పెరుగుతుంది. ఇందులో సౌరవిద్యుత్‌ 10, పవన విద్యుత్‌ మూడు, అణు ఇంధనోత్పత్తి ఒకటిన్నర రెట్ల మేర అధికమవుతాయని ‘కేంద్రీయ విద్యుత్‌ మండలి’(సీఈఏ) తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం భారతదేశ విద్యుత్కేంద్రాల స్థాపిత ఉత్పాదక సామర్థ్యం 3.56 లక్షల మెగావాట్లు. ఇందులో ఆర్‌ఈ వాటా 36 శాతమైతే మిగతాది థర్మల్‌ విద్యుత్‌. పదేళ్లలో అన్ని రకాల విద్యుత్‌కేంద్రాల స్థాపిత ఉత్పాదక సామర్థ్యం 8.31 లక్షల మెగావాట్లకు చేరుతుందని, అందులో ఆర్‌ఈ వాటా 65 శాతానికి వెళ్తుందని అంచనా. ప్రస్తుత బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుదుత్పత్తి వాటా 77 శాతం ఉండగా, అది 2030కల్లా 52 శాతానికి పడిపోనుంది. అప్పటికి దేశంలో రోజూ సరఫరా అయ్యే మొత్తం విద్యుత్తులో సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చేదే 36 శాతానికి చేరుతుందని, ఇది ప్రస్తుత స్థాయికన్నా నాలుగు రెట్లు అధికమని తేల్చారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా బొగ్గు ఆధారిత థర్మల్‌ కేంద్రాలను తగ్గించి ఆర్‌ఈని ప్రోత్సహించాలని ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు థర్మల్‌ కేంద్రాలను బాగా తగ్గిస్తున్నాయి. భారత్‌లో ప్రస్తుతం థర్మల్‌ కేంద్రాల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం రెండు లక్షల మెగావాట్లున్నా వచ్చే పదేళ్లలో మరో 66 వేల మెగావాట్లకు మించి పెరగదు. అంటే మొత్తం 2.66 లక్షల మెగావాట్లకు స్థాపిత ఉత్పాదక సామర్థ్యానికి చేరినా పగటిపూట సౌరవిద్యుదుత్పత్తి అధికంగా ఉండే సమయంలో 40 శాతానికి మించి థర్మల్‌ విద్యుదుత్పత్తి సాధ్యం కాదని సీఈఓ అధ్యయనం తేల్చింది. అప్పటికి థర్మల్‌కు సమాంతరంగా సౌర, పవన వంటి ఆర్‌ఈ ఉత్పత్తి సామర్థ్యం మూడు లక్షల మెగావాట్లకు పైగా అదనంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. దీన్నిబట్టి సంప్రదాయేతర ఇంధనానికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉందని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యల్ప వ్యయానికి సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే దేశంగా భారతదేశం ఎదుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం 2010-18 మధ్యకాలంలో సౌరవిద్యుత్కేంద్రాల ఏర్పాటు వ్యయం 80 శాతం వరకు తగ్గడమేనని ఇరీనా సంస్థ అధ్యయనం తేల్చింది. దేశంలో 2010లో సౌరవిద్యుత్కేంద్రాల స్థాపిత సామర్థ్యం 10 మెగావాట్లుంటే, ఇప్పుడు 30 వేల మెగావాట్లకు చేరింది. 2022నాటికి లక్ష మెగావాట్లకు చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో సౌరవిద్యుత్తు ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గడానికి ‘ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం’(పీపీపీ) విధానమే ప్రధాన కారణం. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్‌ అయిదో స్థానానికి చేరిందంటే ప్రైవేటు పెట్టుబడులే ప్రధాన కారణం. 2010లో జాతీయ సౌరవిద్యుత్‌ మిషన్‌(ఎన్‌ఎస్‌ఎం) కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించినప్పుడు దేశంలో ఉత్పత్తి చేసిన సౌరవిద్యుత్తును యూనిట్‌ రూ.17కు కొనేందుకు పీపీఏలు జరిగాయి. అదే సౌరవిద్యుత్‌ యూనిట్‌ ధర కనిష్ఠంగా రూ.2.44కు తగ్గింది. సౌరవిద్యుత్‌ ఉత్పత్తిని పెంచుకోవడానికి పలు రాష్ట్రాలు పోటాపోటీగా కొత్త విధానాలు తెస్తున్నాయి. సౌరవిద్యుత్‌ ఉత్పత్తిని పెంచడానికి ఎన్‌ఎస్‌ఎం కింద ఎన్నో రకాలుగా రాయితీలు, ప్రోత్సాహకాలను 2010-15 మధ్య కేంద్రం ఇవ్వడం ఇప్పుడు ధర తగ్గడానికి దోహదపడింది. మనదేశంలో ఏడాదిలో 240 రోజులకు పైగా మంచి ఎండ కాసే ప్రాంతాలు అనేకం ఉన్నందువల్ల సౌరవిద్యుదుత్పత్తికి అపార అవకాశాలున్నాయి.

హేతుబద్ధంగా ఆలోచించాలి
సౌరవిద్యుత్‌ ఉత్పత్తి వ్యయం పదేళ్ల క్రితంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. దేశంలో సౌరవిద్యుత్‌ ఉత్పత్తి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు భారత సౌరవిద్యుత్‌ సంస్థ(ఎస్‌ఈసీ) పనిచేస్తోంది. 2016లో డిస్కమ్‌లు కుదుర్చుకున్న పీపీఏలను సమీక్షిస్తామన్న ఏపీ ప్రభుత్వ చర్యలను ఈ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2016లో అప్పటి ఏపీ ప్రభుత్వ డిస్కమ్‌లు యూనిట్‌ సౌరవిద్యుత్‌ను రూ.4.43కు కొనడానికి చేసుకున్న పీపీఏలను ఇప్పటి ఏపీ ప్రభుత్వ తప్పుపట్టడాన్ని ఎస్‌ఈసీ ఆక్షేపించడం సహేతుకమే. పైగా 2016లో అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అదే చాలా తక్కువ ధర. అదే స్థాయి ధరలకు జాతీయ స్థాయిలో ఎన్టీపీసీ, గుజరాత్‌ విద్యుత్‌ సంస్థలూ పీపీఏలను చేసుకున్నాయి. ఈ పీపీఏలయ్యాక మరెక్కడో యూనిట్‌ రూ.2.44కు తగ్గిందని పాత పీపీఏలను ఇప్పటి ప్రభుత్వం సమీక్షించి రద్దు చేస్తాననడమూ విద్యుత్‌ రంగంలో పెట్టుబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇంత తక్కువ ధర ఒక టెండర్‌లో వచ్చిందంటే ఆ సమయంలో అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు కారణమని ఎస్‌ఈసీ చేస్తున్న వాదనలో నిజముంది. అదే ధరను దేశమంతా వర్తింపజేయాలనడమూ సరికాదు. ఏ వస్తువుకూ అన్నీ ప్రాంతాల్లో ఒకే ధర ఉండదు. ఒకప్పుడు థర్మల్‌ విద్యుత్‌ యూనిట్‌ రెండు రూపాయలకే వచ్చేది. ఇప్పుడు బొగ్గు, భూముల వ్యయం, అప్పులపై వడ్డీలు పెరగడం వల్ల థర్మల్‌ విద్యుత్‌ యూనిట్‌ ధర కొత్త కేంద్రాల్లో ఆరేడు రూపాయల వరకూ పడుతోంది. దీంతో పోలిస్తే కొత్త సౌరవిద్యుత్‌ కేంద్రాల్లో తక్కువకే కరెంటు వస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా పీపీఏల సమీక్షలు, రద్దు విధానాలు చేపడుతుంటే మొత్తం దేశంలో కొత్త విద్యుత్కేంద్రాల స్థాపనకు పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు రంగం సంశయిస్తుంది. కొత్తగా థర్మల్‌ విద్యుత్కేంద్రం స్థాపించాలంటే సగటున మెగావాట్‌కు ఏడు కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతోంది. సమీప భవిష్యత్తులో ఇది రూ.10 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. పాత థర్మల్‌ కేంద్రాల్లో కాలుష్య నియంత్రణకు అధునాతన పరికరాలు అమర్చడానికి అదనంగా లక్ష కోట్ల పెట్టుబడులు రూపాయల దాకా పెట్టుబడులు పెట్టాలి. దేశంలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరుగుతున్న క్రమంలో ఉత్పత్తి కేంద్రాలు పెద్దయెత్తున రావాలి. అందుకోసం 11 ఏళ్లలో కనీసం రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు విద్యుత్‌ రంగానికి అవసరం. ప్రైవేటు పెట్టుబడిదారులు నిధులు గుమ్మరిస్తేనే విద్యుత్‌ వెలుగులు సాధ్యం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఏ ప్రభుత్వమైనా నిర్ణయాలు తీసుకోవాలి. తాత్కాలిక ప్రయోజనాల కోసం మొత్తం రంగాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలంలో దేశ ప్రగతిపై అది ప్రతికూల ప్రభావం చూపుతుంది. పీపీఏ ఎవరు కుదుర్చుకున్నా అందులోని వాస్తవికాంశాలన్నీ సమీక్షించి ఆమోదముద్ర వేసే ఈఆర్‌సీలో న్యాయమూర్తులు, విద్యుత్‌ రంగ నిపుణులుంటారు. వారు ఆమోదించిన పీపీఏలో తప్పులుంటే వాటిపై విచారణ జరిపేందుకు హైకోర్టు, సుప్రీంకోర్టులున్నాయి. నిరంతర విద్యుత్‌ సరఫరా కలిగిన దేశాలే ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నాయి. విద్యుత్‌ రంగంలో అస్థిరతలు, కరెంటు కోతలున్న ఏ రాష్ట్రమూ, దేశమూ అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. డిమాండు అధికంగా ఉన్నప్పుడు గతేడాది ఇంధన ఎక్స్ఛేంజీలో రోజువారీ తాత్కాలిక అమ్మకాల్లో యూనిట్‌ ధర రూ.16 దాటింది. విద్యుత్కేంద్రాల పీపీఏల్లో తప్పులున్నాయంటూ వాటిని మూసేస్తే- భవిష్యత్తులో అధిక ధరలకు కరెంటు కొనలేక కోతలు విధించాల్సి రావచ్చు!


- మంగమూరి శ్రీనివాస్‌
Posted on 28-07-2019