Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

కబళిస్తున్న ఆహార కల్తీ

* ప్రమాదంలో ప్రజారోగ్యం

ఆహారోత్పత్తుల కల్తీ దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. బహిరంగ విపణుల్లో లభ్యమవుతున్న కల్తీ ఆహారాన్ని వినియోగించడంవల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఆరోగ్య సంబంధిత ఔషధాల్లోనూ నాణ్యతా ప్రమాణాలు కొడిగడుతున్నాయి. కొందరు వ్యాపారులు ఆహార కల్తీతో పాటు, వస్తూత్పత్తుల అనుకరణలనూ మార్కెట్లలో చలామణీ చేస్తున్నారు. వీటివల్ల ఎగుమతులు సన్నగిల్లే ప్రమాదం ఉంది. కల్తీ, నకిలీల మాఫియా ఒక్క భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ అక్రమ, అనైతిక కార్యకలాపాల వల్ల దేశానికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వివిధ రూపాల్లో ఆహార పదార్థాలు కలుషితమవుతున్న కారణంగా వ్యాధుల చికిత్స రూపంలో దేశంపై పడుతున్న ఆర్థిక భారం అక్షరాలా రూ.1,78,100 కోట్లని ప్రపంచ బ్యాంకు ఇటీవల ప్రకటించింది.

ఆహార నియంత్రణ చట్టాల అమలు అంతంతమాత్రంగా ఉండటాన్ని ఆహార కల్తీ మాఫియా తనకు అనుకూలంగా మలచుకుంటోంది. పాలు, గుడ్లు, బియ్యం, పప్పు ధాన్యాలు, తాగునీరు, మాంసంతో పాటు ప్యాకేజీ ఆహార ఉత్పత్తులు, అత్యవసరమైన మందులనూ వ్యాపారులు కల్తీ చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారంలోనూ కల్తీ పదార్థాలు నాణ్యతా ప్రమాణాలను దెబ్బ తీస్తున్నాయి. పశువుల దాణా, మందులనూ మాఫియా విడిచిపెట్టడం లేదు. దేశవ్యాప్తంగా 2018-19 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సేకరించిన ఆహార పదార్థాల నమూనాల్లో 26,077 కల్తీలు, అనుకరణలు ఉన్నట్లు తేలింది. ఇందులో ఉత్తర్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడు రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లలోనూ పరిస్థితి సంతృప్తికరంగా లేదు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఎన్నో లోపాలు గుర్తించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆహార శాఖ సహాయ మంత్రి ఇటీవల రాజ్యసభకు తెలిపారు. కల్తీదారులపై చట్టపరంగా కేసులు నమోదుచేసి రూ.31 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు వివరించారు. 2014 నుంచి 2017 వరకు ఆహార తనిఖీ అధికారులు వేల కేసులు నమోదు చేసినా, శిక్షలు పడిన కేసుల సంఖ్య నామమాత్రంగానే ఉంది. చట్టంలో లోపాలే ఇందుకు కారణం. బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ్‌ బంగ, ఝార్ఖండ్‌, మిజోరమ్‌ రాష్ట్రాల్లో పాల కల్తీ దారుణంగా ఉంది. పాలలో డిటర్జంట్లు, యూరియాను కలుపుతున్నారు. తినుబండారాల్లో కల్తీ నూనెలు, వనస్పతి వాడుతున్నారు. దీంతో మూత్రపిండాలు, గుండె, కాలేయ సమస్యలు ఎదురవుతున్నాయి. చూపు దెబ్బతింటోంది. ఈ పరిస్థితిని నియంత్రించకపోతే దేశంలో 2025 నాటికి ప్రజలు పెద్దయెత్తున క్యాన్సర్‌ సహా పలు వ్యాధుల బారిన పడతారన్న ప్రపంచబ్యాంకు హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఔషధాల కల్తీలు ప్రజారోగ్యాన్ని హరిస్తున్నాయి. 2017-18లో సేకరించిన మందుల నమూనాల్లో 2,783 కల్తీవి లేదా నాణ్యతా ప్రమాణాలు లోపించినవని ఇటీవల పార్లమెంటుకు కేంద్రం నివేదించింది. రోజూ మార్కెట్లలో లభ్యమవుతున్న ప్రముఖ సంస్థల ఉత్పత్తులకు ఏ మాత్రం తీసిపోని విధంగా కనిపించే నాణ్యత లేని అనుకరణలు ప్రత్యక్షమవుతున్నాయి. అధిక లాభాలు ఆర్జించాలనే దురాశ అసంఘటిత రంగంలో మాఫియా విస్తరించడానికి ప్రధాన కారణంగా కనబడుతోంది. ఉత్పత్తి, పంపిణీతోపాటు విభిన్న దశలను దాటి చివరకు వినియోగదారుడికి చేరే వస్తువుల్లో అసలుకు, నకిలీకి తేడా గుర్తించడం సామాన్యులకు కష్టసాధ్యంగా మారింది. అయిదేళ్లలోపు చిన్నారుల్లో 40 శాతం మరణాలకు కలుషిత ఆహారమే కారణమవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. నివారించదగిన మరణాల విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఇటీవల హెచ్చరించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ఉత్పాదకత కల్తీల వల్ల దెబ్బతింటోంది. అమెరికా, ఐరోపా సమాఖ్య, ఆసియా, ఆఫ్రికా, అరబ్‌ దేశాలకూ ఈ బెడద తప్పడం లేదు. కలుషితమవుతున్న ఆహారం వల్ల అమెరికాలో ఏటా నాలుగు కోట్ల మందికి పైగా అనారోగ్యం బారిన పడుతున్నారని ‘సెంటర్‌ ఫర్‌ డిసీజెస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ (సీడీసీ) తెలిపింది. ఇందులో 1.28 లక్షల మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఆస్ట్రియా, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, న్యూజిలాండ్‌లలో కలుషితాహారంతో ఏటా వేలాది మంది చనిపోతున్నారు. చట్టాలు కఠినంగా ఉండటంతో అభివృద్ధి చెందిన దేశాల్లో చర్యలు వేగంగా తీసుకుంటారు. కొన్ని ముఖ్యమైన కేసుల్లో ‘నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌’ నిబంధనలనూ అక్కడ అమలు చేస్తున్నారు.

భారత్‌లో ఆహార పరిశ్రమ భారీ టర్నోవర్‌తో వెలుగులీనుతోంది. పారిశ్రామికీకరణతో ప్రజల్లో వినియమ శక్తి పెరిగింది. ‘వెంటనే తినడానికి’ వీలున్న, ‘వేడి చేసుకుని తినే’ అవకాశం ఉన్న ఆహారోత్పత్తులకు గిరాకీ బాగా పెరిగింది. దేశంలో ఇలాంటి ఆహార పదార్థాల ఉత్పత్తిలో దాదాపు 35 వేల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నిమగ్నమై ఉన్నాయి. ఆహార పదార్థాల ఉత్పత్తులను భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ పర్యవేక్షిస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించని వ్యాపార సంస్థలకు జరిమానాతో పాటు మూడేళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో శిక్షాకాలం ఆరు సంవత్సరాలకు పెరగవచ్చు. కానీ, కలుషితాహార నియంత్రణ చట్టం-1954 నామమాత్రంగానే అమలవుతోంది. 2018లో తీసుకువచ్చిన వినియోగదారుల రక్షణ బిల్లు సామాన్యులకు కాస్తంత వెసులుబాటు కల్పించింది. వ్యాపార కేంద్రంలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాల్లో నాణ్యత లోపిస్తే విక్రేతే బాధ్యుడవుతాడని దిల్లీ హైకోర్టు గతేడాది ఇచ్చిన ఒక తీర్పులో పేర్కొంది. సిబ్బంది కొరత ఉందనో, నమోదవుతున్న కేసులు న్యాయస్థానంలో నిలబడలేకపోతున్నాయనో అధికార యంత్రాంగం ప్రజలను మభ్యపెట్టలేదు. కల్తీ ఉత్పత్తులు అమ్మినవారిని తక్షణం కఠినంగా దండించడమే సమస్యకు పరిష్కార మార్గం!

- ఎమ్‌ఎన్‌వీ ప్రసాద్‌
Posted on 29-07-2019