Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

రిజర్వేషన్ల పయనం ఎటు?

* రాష్ట్రాల్లో కీలక నిర్ణయాలు

ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల వ్యవహారంపై అనుకూల వ్యతిరేక వాదనలు కొత్తకాదు. ఒకవైపు నిర్విరామంగా వాదోపవాదాలు సాగుతుంటే, మరోవైపు రిజర్వేషన్లు విస్తరిస్తూపోయాయి. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతులకుతోడు వెనకబడిన తరగతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో రిజర్వేషన్లు సుస్థిరం కావడం ఇందులో ప్రధాన ఘట్టంగా చెప్పుకోవచ్చు. వీటి విస్తరణ ఒక పరిధి వరకే సాగింది. యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు తీర్పుల సందర్భంగా స్పష్టం చేయడం ఇందుకు ప్రధాన కారణం. అందుకే తమిళనాడు మినహా వివిధ రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడానికి చేసిన ప్రయత్నాలు ఎక్కడా పెద్దగా సఫలం కాలేదు. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రిజర్వేషన్ల వ్యవహారం కీలక మలుపులు తిరిగే పరిస్థితి కనబడుతోంది. ఇందుకు మూడు విషయాలను చెప్పుకోవాలి. మొదటిది, కేంద్ర ప్రభుత్వమే రిజర్వేషన్ల కల్పనకు కొత్త ప్రాతిపదికను తీసుకువచ్చి రాజ్యాంగ సవరణను చేయడం. ఆర్థిక వెనకబాటుతనం ఆధారంగా ఓపెన్‌ కేటగిరీలో (ఓసీ) ఉన్న ప్రజలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. సామాజిక, విద్యాపరమైన వెనకబాటుకు గురైన వర్గాలకే రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించింది. దీన్ని మార్చివేస్తూ చట్టం తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు ఇది వ్యతిరేకమని వచ్చిన విమర్శలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు నిర్దేశించిన పరిమితి సామాజిక-విద్యాపరమైన వెనకబాటుతనం ఆధారంగా కల్పించే రిజర్వేషన్లకు మాత్రమేనని, కొత్తవాటికి ఆ పరిమితి వర్తించదని తేల్చిచెప్పింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టు గడప తొక్కినప్పటికీ నిలుపుదల ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించింది. విషయ ప్రాధ్యానత దృష్ట్యా ఈ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సమగ్ర విచారణచేసి చరిత్రాత్మక తీర్పునిచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడానికి సుప్రీంకోర్టు గతంలో ఒప్పుకోలేదు. రాజకీయ రిజర్వేషన్లూ 50 శాతం మించడానికి వీల్లేదని స్పష్టంగానే చెప్పింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీల కోటాను తగ్గించి మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేసింది.

మహారాష్ట్రలో అధికశాతం
మహారాష్ట్రలో మరాఠీ కులస్థులకు రిజర్వేషన్లు కల్పించడం రెండో పరిణామం. విద్యారంగంలో 12 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 13 శాతం రిజర్వేషన్లను మరాఠీలకు కల్పించారు. వీటిని సమర్థిస్తూ బొంబాయి హైకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. పలు కొలమానాల ప్రకారం మరాఠీలు వెనకబడినవారేననీ తేల్చిచెప్పింది. ఈ తీర్పునూ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఇక్కడా నిలుపుదల ఉత్తర్వులు రాలేదు. మహారాష్ట్రలో మొత్తం రిజర్వేషన్లు 65 శాతానికి మించిపోయాయి. న్యాయసమీక్ష అనంతరం వీటికి తుది సమ్మతి లభిస్తే ఎన్నో రాష్ట్రాల్లో రిజర్వేషన్ల పెంపుదల కోసం డిమాండ్లు తలెత్తుతాయి. గుజరాత్‌లో పటేళ్ల ఆందోళన అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో కాపులు కూడా బీసీల్లో చేర్చాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో వ్యవసాయంలో కీలకపాత్ర పోషించి ఇన్నాళ్లు అగ్రకులాలుగా గుర్తింపు పొందిన వర్గాలూ ఇదే బాట పట్టొచ్చు.

మరాఠీ ప్రజల చరిత్ర చాలా ఆసక్తికరమైంది. మహారాష్ట్ర జనాభాలో 30 శాతానికి కొంచెం అటూఇటూగా ఉంటారు. గడిచిన 70 ఏళ్లల్లో మరాఠీ వర్గం నుంచి మహారాష్ట్రలో 12మంది ముఖ్యమంత్రులు అయ్యారు. గ్రామీణ ప్రాంతంలో భూములపై గణనీయ హక్కులున్న బలమైన కులం మరాఠీలదే. ఛత్రపతి శివాజీ లాంటి బలమైన రాజులు మరాఠీల నుంచి వచ్చినవారే. 17, 18 శతాబ్దాల్లో మరాఠీ నాయకులు భారత చరిత్రను గణనీయంగా ప్రభావితం చేశారు. మొఘలు సామ్రాజ్యం పతనం తరవాత చక్రం తిప్పినది మరాఠీలే. యూరోపియన్లు మన దేశానికి రాకపోయి ఉన్నట్లయితే విశాల భూభాగంలో మరాఠా సామ్రాజ్యం ఏర్పడి ఉండేదే! ప్రతి రాష్ట్రంలో సంప్రదాయకంగా మూడు నుంచి అయిదు వరకు అగ్రకులాలు ఉంటాయి. సారవంతమైన భూములు వారి చేతుల్లో ఉండటంవల్లే అగ్రకులాలుగా పేరు వచ్చింది. వ్యవసాయ సమాజంలో భూమే పెద్ద ఆర్థిక వనరు. అది ఎక్కువగా ఎవరి చేతుల్లో ఉంటే వారే ఆ ప్రాంతంలో పెద్ద కులస్థులు. వ్యవసాయేతర రంగాల్లోనూ క్రమేపీ భూమ్మీద పట్టున్న కులాలే పైచేయి సాధించాయి. 1960ల నుంచి రాజకీయంగా వారి జైత్రయాత్ర మొదలైంది. సంఖ్యాపరంగా ఈ కులాల్లో ఎవరూ చాలాచోట్ల పది శాతానికి మించరు. మరాఠీల పరిస్థితి దీనికి భిన్నం. అక్కడ కాలక్రమేణా వ్యవసాయం మీద పట్టున్న కులాలు కలిసిపోయి మరాఠీ కులంగా ఏర్పడ్డాయి. సంఖ్యాపరంగా మరాఠీలకు సరిసాటైన అగ్రకులం ఏ రాష్ట్రంలో లేదు. ఇక మండల్‌ కమిషన్‌ మొదలుకుని పలు బీసీ కమిషన్లు మరాఠీలను వెనకబడిన తరగతుల్లో చేర్చడానికి గతంలో అంగీకరించలేదు.

తీవ్ర మార్పుల వైపు?
ఆంధ్రపదేశ్‌లో స్థానికులకు ప్రైవేటు పరిశ్రమల్లో, సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలను విధిగా కల్పించాలని చట్టం తీసుకు రావడం మూడో కీలక పరిణామం. దేశంలో ఏ రాష్ట్రం ఇంతవరకూ ఈ తరహా చట్టాన్ని తీసుకురాలేదు. కొత్త పరిశ్రమలకే కాకుండా ఇప్పటికే ఉన్న అన్ని ప్రైవేటు పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా చట్టం నిర్దేశిస్తోంది. అర్హతలున్న కార్మికులు, ఉద్యోగులు దొరక్కపోతే మూడేళ్లలోపు తగు శిక్షణ ఇచ్చి అలాంటివారిని తయారు చేసుకోవాలి. ఆ శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. చట్ట ప్రకారం స్థానికులకు ఉద్యోగాలు కల్పించారా లేదా అన్నదీ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది. స్థానికుల్లో జిల్లా, జోన్‌వారీ శాతాలను ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఇందుకు సంబంధించి విధివిధానాలను త్వరలో విడుదల చేయనుంది. పరిశ్రమల కోసం భూములు కోల్పోతున్నవారికి న్యాయం చేయాలన్న సంకల్పంతో చట్టం తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అభివృద్ధి ఫలాలు స్థానికులకు అందాలన్న విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌ దారిలోనే ఇతర రాష్ట్రాలూ ఇలాంటి చట్టాలు తెస్తే మాత్రం పరిస్థితి సంక్లిష్టం అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇదే తరహా చట్టం తెస్తే హైదరాబాద్‌లో చాలా మందికి ఇబ్బందులు వస్తాయి. అలాగే దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరుల్లో ఈ తరహా స్థానిక రిజర్వేషన్లు వస్తే ఎన్నో సమస్యలు రావచ్చు. ఒకే దేశం, ఒకే విపణి అంటూ ఒక వైపు ముందుకెళ్తూ, మరోవైపు స్థానికులకే సింహభాగమనడం వైరుధ్యంగానే ఉంటుంది. ఆంధ్ర తరహాలో తమిళనాడులో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా చట్టం తీసుకురావాలన్న డిమాండు అప్పుడే మొదలైంది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ప్రైవేటు రంగంలో స్థానికులకు 70 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా అది సమగ్ర చట్టరూపం దాల్చలేదు. మరోవైపు ప్రైవేటు రంగంలో కుల ప్రాతిపదికపైనా రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండు ఎప్పటి నుంచో ఉండనే ఉంది. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు దీనికంత ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అది డిమాండ్‌గానే మిగిలిపోయింది. ఏ కోణం నుంచి చూసినా రిజర్వేషన్ల వ్యవహారం రానున్న రోజుల్లో తీవ్ర మార్పులకు లోనయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. న్యాయసమీక్షకు ఈ రిజర్వేషన్లు నిలబడినా చరిత్రాత్మకమే! నిలబడకపోయినా చరిత్రాత్మకమే!!‌- ఎన్‌.రాహుల్‌ కుమార్‌
Posted on 30-07-2019