Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అమ్మ భాషలో అనంత విజ్ఞానం

* పరిశోధన పత్రాల అనువాద పథకం

ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర విజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోంది. ఏటా వేల సంఖ్యలో నూతన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. కృత్రిమ మేధ, బిగ్‌డేటా, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) తదితర రంగాల్లో పలు పరిశోధనలు కీలక మార్పులకు దోహదం చేస్తున్నాయి. పరిశోధన వ్యాసాలు- ఆంగ్లం, జర్మన్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌ తదితర భాషల్లో ప్రచురితం కావడంతో భారతదేశంలోని వివిధ భాషా మాధ్యమాల్లో విద్యను అభ్యసించిన పరిశోధకులకు అవి అందుబాటులో ఉండటం లేదు. మాతృభాషలో పదో తరగతి వరకు చదివి, ఆపై ఆంగ్ల మాధ్యమంలో ఉన్నతవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు పాఠ్యాంశాలు సమగ్రంగా అర్థం కావడం లేదని భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మాతృభాషలోనే విద్యార్థి ఎలాంటి అంశాన్ని అయినా క్షుణ్నంగా గ్రహించగలడని వివిధ పరిశోధనలు చెబుతున్నాయి. ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతిక పరిశోధన సలహా మండలి ప్రపంచంలోని వివిధ భాషల్లో ఉండే ఉన్నతస్థాయి శాస్త్ర గ్రంథాలను దేశ భాషల్లోకి అనువదించేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే రూపొందించనుంది. శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన కీలక ప్రామాణిక గ్రంథాలతో పాటు నూతన పరిశోధన పత్రాలు ఆంగ్లంతో పాటు స్థానిక భాషల్లో వెలువడాలన్నదే ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందులో భాగంగా అనువాద ప్రక్రియను భారీయెత్తున ప్రారంభించనుంది. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ పథకం చేపట్టనున్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో దశలవారీగా దీన్ని అమలు చేయనున్నారు. యంత్ర అనువాదంతోపాటు విదేశీ, స్వదేశీ భాషల్లో నిపుణులైన అనువాదకుల సేవలను వినియోగించుకోనున్నారు. ప్రసంగ, పద అనువాదాలతో పాటు అనువాదకులు పెద్దసంఖ్యలో ఈ క్రతువులో పాలుపంచుకుంటారు.

సవాళ్లను అధిగమించాలి...
మధ్యయుగాల్లో ఐరోపా ఖండంలోని సాంస్కృతిక పునరుజ్జీవనం వివిధ రంగాలపై విశేష ప్రభావం చూపింది. అనేక రచనలను ఇతర భాషల్లోకి అనువదించడం- ప్రజలు ఇతర దేశాలకు చెందిన సిద్ధాంతాలను అధ్యయనం చేసేందుకు ఇది ఉపకరించింది. అనంతర కాలంలో విభిన్న రంగాల్లో మేధావుల వర్గం ఆవిర్భవించింది. ఇలా విప్లవాత్మక మార్పులకు అప్పటి అనువాద ప్రక్రియ సహకరించింది. చైనాలోనూ శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన విదేశీ గ్రంథాలను అనువదించడం 1978 నుంచి భారీయెత్తున ప్రారంభమైంది. ఇందుకోసం చైనీస్‌ భాషతోపాటు విదేశీ భాషల్లో నైపుణ్యం కలిగిన అనువాదకులను నియమించింది. బ్రిటిష్‌ ఎన్‌సైక్లోపీడియా, శాస్త్ర విజ్ఞానం, ఇయర్‌ బుక్స్‌, ప్రముఖ నిఘంటువులు, శాస్త్రీయ గ్రంథాలను చైనా భాషలోకి తర్జుమా చేశారు. షాంఘైలోని ఒక కేంద్రంలో జపనీస్‌, ఇంగ్లిష్‌, జర్మన్‌ భాషలకు చెందిన వేల సైన్స్‌ గ్రంథాలను అనువదించారు. గత 40 ఏళ్లలో చైనావ్యాప్తంగా విదేశీభాషలను నేర్పించే కేంద్రాలను నెలకొల్పి ఔత్సాహికులైనవారికి శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం ఆ దేశంలో మూడు లక్షలకు పైగా నిపుణులైన అనువాదకులు ఉన్నారని అంచనా. వీరిలో ఎక్కువమంది శాస్త్రీయ, సాంకేతిక అంశాలను సులభంగా చైనా భాషలోకి అనువదించగలరు. 1982లోనే చైనాలో అనువాదకుల సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఏటా ఈ సంఘం కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కార్యశాలలు, సమావేశాలు, చర్చా వేదికల ద్వారా కొత్త అంశాలను అనువాదకులకు నేర్పుతారు. యంత్ర అనువాదంలో భాగంగా ఇప్పటికే ‘గూగుల్‌ ట్రాన్స్‌లేటర్లు’ ముందుకొచ్చాయి. ఇందులో ఇంగ్లిషు లేదా ఎంపిక చేసిన భాషల్లోని సమాచారాన్ని తీసుకొని మనకు కావాల్సిన భాషలోకి అనువదించమని కంప్యూటర్‌ తెరపై ‘పేస్ట్‌’ చేయాలి. క్షణాల్లో అనువాదం లభ్యమవుతుంది. ఈ అనువాదం భారతీయ భాషలకు సరిగ్గా కుదరడం లేదు. ఒక్కో భాషకు భాషా భాగాలు వేర్వేరుగా ఉంటాయి. ఆంగ్లం నుంచి దేశీయ భాషల్లోకి అనువదించే ప్రక్రియలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలోనూ బబెల్ఫిష్‌ అనే ఒక వెబ్‌సైట్‌ అప్పటికప్పుడే అనువాదాలను అందించేది. ఇందులో విదేశీ భాషలు ఎక్కువగా ఉండేవి. వీటిలో హిందీ భాష ఉన్నా, ఎక్కువ ఆదరణ పొందలేకపోయింది.

భారతదేశం ఆర్థికశక్తిగా ఆవిర్భవించాలంటే వైజ్ఞానికంగానూ పురోగతి సాధించాలి. అనువాద ప్రక్రియ దేశీయ సాహిత్యంలో కీలకభూమిక పోషిస్తోంది. దీనికి రెండు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. సంస్కృతంలోని అనేక గ్రంథాలను దేశీయ భాషల్లోకి అనువదించిన ఘనత మన కవులది. దేశీయ సాహిత్య, సంస్కృతిపై వేల అనువాదాలు జరిగాయి. కాలక్రమంలో దేశీయంగానే ఒక భాషలోని రచనలు ఇతర భాషల్లోకి వచ్చాయి. దాని వెనక నిష్ణాతులైన అనువాద పండితుల కృషి ఎంతో ఉంది. ఇలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు జాతీయ సమైక్యతకు దోహదపడతాయి. వాల్మీకి, వ్యాసమహర్షి రచించిన సంస్కృతంలోని రామాయణ, మహాభారతాలను దేశీయ భాషల్లోకి పలువురు కవులు అనువదించారు. మహాభారతాన్ని నన్నయ తెలుగులోకి అనువదించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఇతిహాస, మతపరమైన గ్రంథాలే కాకుండా వైద్యం, ఖగోళశాస్త్రం, నౌకానిర్మాణ, భవన నిర్మాణ కళ తదితర రచనలను సంస్కృతం, పాలి, ప్రాకృతం, పారశీక, అరబ్బీ భాషల నుంచి స్థానికంగా ప్రజలు మాట్లాడే భాషల్లోకి ఆయా భాషల్లో నిపుణులైన పండితులు తర్జుమా చేశారు. ఇవి స్వేచ్ఛానువాదంతో రావడంతో సామాన్యులు సైతం తేలిగ్గా చదవగలుగుతున్నారు.

బహుభాషల భారతం
భారతదేశం బహుభాషలకు నిలయం. 2011 జనాభా లెక్కల ప్రకారం పది వేలమందికి పైగా మాట్లాడే భాషలు దేశంలో 121 ఉన్నాయి. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో 22 భాషలు ఉన్నాయి. దేశీయ భాషల్లో అనువాద రచనలు ఇప్పటికీ వెలువడుతున్నాయి. ఇవి ఎక్కువగా సాహిత్యానికి సంబంధించినవి కావడం గమనార్హం. దేశంలో 4జీ విప్లవంతో అంతర్జాల సేవలు కోట్ల మందికి అందుతున్నాయి. దీంతో స్థానిక భాషల్లోనూ వెబ్‌సైట్లు వస్తున్నాయి. అధిక భాగం వెబ్‌సైట్లు ఆంగ్లంలో ఉంటున్నాయి.

ఉద్యమాలకు ఊపిరి
18, 19 శతాబ్దాల్లో దేశంలో చోటుచేసుకున్న పలు సంఘ సంస్కరణ ఉద్యమాల వెనక ఆంగ్ల ఉదారవాద రచనల ప్రభావం ఉంది. భారత ఉపఖండానికి చెందిన పలు సంస్కృత గ్రంథాలను విదేశీ భాషల్లోకి అనువాదం చేయడంలో ‘ఆసియాటిక్‌ సొసైటీ’ కృషి ఉంది. ఫ్రెంచి విప్లవం నినదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలు అనువాద రచనల ద్వారా భారత జాతీయవాదుల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించాయి. బ్రిటిషువారి పాలన ప్రభావంతో పలు గ్రంథాలను దేశీయ భాషల్లోకి అనువదించారు. ఇదే స్ఫూర్తితో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన వివిధ విదేశీ గ్రంథాలను అనువదించే ప్రక్రియను వేగవంతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఆంగ్లంతో పాటు జర్మన్‌, స్పానిష్‌, చైనీస్‌, జపనీస్‌ తదితర భాషల్లో ఉద్దండులైనవారికి ప్రభుత్వం ఒక వేదిక కల్పించాలి. విదేశీ సాహిత్యానికి సంబంధించిన రచనలు ఇప్పటికే లభ్యమవుతున్నాయి. ఇదే రీతిలో శాస్త్రీయ విజ్ఞాన గ్రంథాలను దేశీయ భాషల్లోకి త్వరితగతిన అనువదించాలని నిపుణులు కోరుతున్నారు. అయితే సుక్షితులైన అనువాదకులు తగిన సంఖ్యలో లేకపోవడంతో ‘యాంత్రిక అనువాదం’పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా అంకుర సంస్థలను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అంకుర సంస్థల రాకతో అనువాద కార్యక్రమం వేగవంతమయ్యే అవకాశముంది. అంతేకాక బహుభాషల్లో ప్రావీణ్యం ఉన్నవారికి ఈ వినూత్న పథకం ద్వారా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేవలం విద్యార్థుల కే కాకుండా ఉపాధ్యాయులు, రచయితలు, ప్రచురణకర్తలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, సాధారణ పాఠకులకు అనువాదాలు లబ్ధి చేకూర్చనున్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ‘సారా’ అనే అనువాద సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీన్ని ఉపయోగించి తొలిసారిగా కన్నడ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించగా 80-90 శాతం కచ్చితత్వంతో ఫలితం లభించింది. నూటికి నూరు శాతం అనువాద ప్రక్రియ పూర్తయ్యేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి పరచేందుకు యత్నిస్తున్నారు. వీటితోపాటు దేశవ్యాప్తంగా విదేశీ, స్వదేశీ భాషల్లో నిపుణులైన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. దీంతో శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన ప్రామాణిక గ్రంథాలను దేశీయ భాషల్లోకి అనువదించే కార్యక్రమం విజయవంతం చేయవచ్చు. యంత్ర అనువాదం, ఆంగ్లంతో పాటు దేశీయ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారిని ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇది సజావుగా పూర్తయితే శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన పరిశోధన, బోధనలకు చెందిన పలు అంశాలు విద్యార్థులు, ఉపాధ్యాయులకు అందుబాటులోకి రానున్నాయి. జాతీయస్థాయి కార్యక్రమం కావడంతో అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన విజ్ఞాన సమాచారం ఇక స్థానిక భాషల్లోనే లభ్యమయ్యే అవకాశం ఉంది!


- కొలకలూరి శ్రీధర్‌
Posted on 03-08-2019