Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

భళా... డిజిటల్‌ కేరళ!

* ఇక మొబైల్‌ పాలన దిశలో...
దేశంలో రెండున్నర లక్షల గ్రామాలను 2016నాటికి డిజిటల్‌ ఇండియా కార్యక్రమం కింద బ్రాడ్‌బ్యాండ్‌ సేవలతో అనుసంధానించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షిస్తుండగా, కేరళ అంతకన్నాముందే భారతదేశపు మొట్టమొదటి డిజిటల్‌ రాష్ట్రంగా అవతరించడం విశేషం. ఈ విషయంలో గోవాతో పోటీపడి మరీ నెగ్గింది. కేరళ ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీ స్వాతంత్య్ర దిన వేడుకల్లో సగర్వంగా ప్రకటించిన ఈ విజయం వెనక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కృషి ఇమిడిఉంది. ఉదాహరణకు 2001-2010 మధ్య కేంద్రప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కేరళలో 20వేల కిలోమీటర్ల దూరం ఆప్టికల్‌ ఫైబర్‌ లైన్లు వేయగా రిలయన్స్‌ 8,500 కి.మీలు, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌, టాటా, ఐడియా సంస్థలు కలిసి 3,225 కి.మీ.ల మేర లైన్లు వేశాయి. ఇవే కేరళలో జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ యంత్రాంగం(ఎన్‌ఓఎఫ్‌ఎన్‌)కు వెన్నుదన్నుగా నిలిచాయి. ఈ యంత్రాంగం పునాదిపైనే జనవరిలో ఇడుక్కి జిల్లాలో దేశంలోనే ప్రప్రథమంగా అధిక వేగ గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్‌ (ఇంటర్నెట్‌) సేవలు ప్రారంభమయ్యాయి. తమ రాష్ట్రంలో నేడు ప్రతి పంచాయతీకి బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు విస్తరించాయని ముఖ్యమంత్రి చాందీ వివరించారు. 3.2కోట్ల రాష్ట్ర జనాభాలో 3.1కోట్లమందికి మొబైల్‌ కనెక్షన్లు, 3.19కోట్ల మందికి బ్యాంకు ఖాతాల్లో డిజిటల్‌గా అనుసంధానించిన ఆధార్‌ కార్డులు ఉన్నాయి. జనాభాలో 1.23కోట్లమంది ఇంటర్నెట్‌ కనెక్షన్లు పొందారు. కేరళలో అన్ని పంచాయతీలు, జిల్లాలకు అక్షయ ప్రాజెక్టుల కింద ఈ-(ఎలక్ట్రానిక్‌) అక్షరాస్యత, ఈ-పరిపాలనలు విస్తరించాయి. రాష్ట్రప్రభుత్వం చాలాకాలం నుంచి అమలు చేస్తున్న అక్షయ, ఐటీ ఎట్‌ స్కూల్‌, డిజిటల్‌ మౌలిక వసతుల కల్పన, రాష్ట్ర డేటా కేంద్ర ప్రాజెక్టులే కేరళను డిజిటల్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దాయి.

అక్షయతో అనంత లాభాలు

ప్రజలకు కంప్యూటర్‌ వినియోగం గురించి కనీస అవగాహన లేకనే ఈ-పరిపాలన విఫలమవుతోందని గ్రహించిన కేరళ ప్రభుత్వం, ఈ లోపాన్ని సరిదిద్దడానికి 2002లో అక్షయ ప్రాజెక్టును చేపట్టింది. డిజిటల్‌ అంతరాలను అధిగమించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును మొట్టమొదట మలప్పురం జిల్లాలో ప్రారంభించారు. ఇది దేశంలో ప్రప్రథమ జిల్లాస్థాయి ఎలక్ట్రానిక్‌ అక్షరాస్యత కార్యక్రమం. ఈ జిల్లాలో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్‌లో నివసిస్తున్నారు. వారితో ఇంటర్నెట్‌ ద్వారా చౌకగా సంభాషించవచ్చునని ప్రజల్లో ప్రచారం చేయడం ద్వారా ఈ-అక్షరాస్యత గురించి అవగాహన పెంచారు. మలప్పురం జిల్లాలో అన్ని పంచాయతీలకు 7,000 కంప్యూటర్లను లీజు మీద ఇవ్వాలని జిల్లా అధికారులు రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. వారు ఈ ప్రాజెక్టు కోసం రూ.60లక్షలు సమీకరించారు కూడా. అయితే కంప్యూటర్లను లీజు మీద ఇవ్వడంకన్నా స్థానిక నిరుద్యోగ యువతను కంప్యూటర్‌ కేంద్రాల నిర్వాహకులుగా మార్చడం భేషుగ్గా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. వారికి బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా చూసింది. స్థానిక సంస్థలు అక్షయ ప్రాజెక్టు కింద శిక్షణ పొందిన ప్రతి వ్యక్తికి రూ.140చొప్పున లెక్కగట్టి నిర్వాహకులకు చెల్లించాలని నిర్ణయించింది. 2006లో కేంద్రప్రభుత్వం ఈ-పరిపాలన పథకాన్ని చేపట్టిన తరవాత అక్షయ కేంద్రాలకు ఉమ్మడి సేవల కేంద్రాలు(సీఎస్‌సీ)గా పునఃనామకరణం చేశారు. మలప్పురంలో ప్రారంభమైన అక్షయ ప్రాజెక్టు, తరవాత రాష్ట్రమంతటికీ విస్తరించడంతో నేడు కేరళలో 2,300 అక్షయ సీఎస్‌సీలు ఏర్పడ్డాయి. ఇవి ఈ-అక్షరాస్యతతో పాటు ఈ-పరిపాలనను అందించే కేంద్రాలుగానూ ఆవిర్భవించాయి. విద్యుత్‌, తాగునీరు, టెలిఫోన్‌ బిల్లుల చెల్లింపు మొదలుకొని కుల, జనన మరణ, వివాహ, ఆదాయ ధ్రువపత్రాల వరకు 23 సేవలను అక్షయ కేంద్రాలు అందిస్తున్నాయి. మొత్తం 1.4కోట్ల ధ్రువపత్రాలను ఈ కేంద్రాల ద్వారా జారీ చేశారు. పౌరులు తమ డిజిటల్‌ పత్రాలను భద్రపరచుకోవడానికి 'డిజిటల్‌ లాకర్‌' వ్యవస్థ కూడా ఏర్పాటైంది. అక్షయ కేంద్రాల్లో ఇంతవరకు 2.46 లక్షల జననాలు, 1.10 లక్షల మరణాలను నమోదు చేశారు. అక్షయ కేంద్రాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద నెలకు రూ.214కోట్ల సామాజిక భద్రత పింఛన్లను చెల్లించడంవల్ల ప్రభుత్వానికి రూ.91కోట్ల మేరకు మనీఆర్డర్‌ కమిషన్లు మిగులుతున్నాయి. అక్షయ కేంద్రాలను నడిపే అర్హత పొందాలంటే అభ్యర్థులు ఒక ప్రవేశ పరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది. ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒకటి చొప్పున అక్షయ కేంద్రాన్ని నిర్వహించే అవకాశం ఉత్తీర్ణులకు లభిస్తుంది. అక్షయ కేంద్రాలు రాష్ట్రంలో ఇంతవరకు 33లక్షల కుటుంబాలకు కనీస కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని అందించాయి. ఈ కేంద్రాలు స్థానిక యువతీయువకులకు వ్యవస్థాపకులుగా, శిక్షకులుగా ఉపాధి అవకాశాలు కల్పించాయి.

అక్షయ ప్రాజెక్టు వయోజనులను కంప్యూటర్‌ అక్షరాస్యులుగా మార్చుతుంటే, ఐటీ ఎట్‌ స్కూల్‌ ప్రాజెక్టు కేరళలో ఏటా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్తీర్ణులయ్యే నాలుగు లక్షల విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం అందజేస్తోంది. రెండు ప్రాజెక్టులూ 2002లోనే ప్రారంభం కావడం గమనార్హం. ఐటీ ఎట్‌ స్కూల్‌ ప్రాజెక్టు ఇంతవరకు 12,600 పాఠశాలల నుంచి 39లక్షల మంది విద్యార్థులను ఈ-అక్షరాస్యులుగా తీర్చిదిద్దింది. ఇంకా దేశవిదేశాల విద్యావేత్తల ఆడియో వీడియో పాఠాల్లో డిజిటల్‌ సహకార పాఠ్యగ్రంధాల (డీసీటీ)లను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. వీటితోపాటు సామాన్య పాఠ్యగ్రంథాల స్కాన్‌ కాపీలను కూడా డిజిటల్‌ రూపంలో అందిస్తోంది. రాష్ట్రంలోని అయిదు వేల ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది ఉపాధ్యాయులు, 37లక్షలమంది విద్యార్థులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ పాఠశాలలకు త్వరలోనే 'వైఫై' సౌకర్యాన్నీ కల్పించబోతున్నారు.

డిజిటల్‌ కేరళకు మూడో మూలస్తంభం- డిజిటల్‌ మౌలిక వసతుల వ్యవస్థ. దీనికింద రాష్ట్రమంతటా ఆప్టికల్‌ ఫైబర్‌ లైన్ల యంత్రాంగాన్ని నిర్మించి అన్ని పంచాయతీలను అనుసంధానించారు. దీనివల్లనే అక్షయ, ఐటీ ఎట్‌ స్కూల్‌ పథకాలు విజయవంతమయ్యాయి. ఎన్‌ఓఎఫ్‌ఎన్‌ కింద ఏర్పడిన ఆప్టికల్‌ ఫైబర్‌ యంత్రాంగం టెలికం, ఇంటర్నెట్‌, కేబుల్‌ టీవీ ఆపరేటర్ల సేవల విస్తరణకు తోడ్పడి, స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచుతుంది. కేరళ డిజిటలీకరణకు నాలుగో మూల స్థంభం- ఇంతకాలం టెక్నోపార్క్‌లో ఉన్న రాష్ట్ర డేటా కేంద్రాల్ని 'క్లౌడ్‌'కు మార్చడం. దీనివల్ల ప్రతి ప్రభుత్వ విభాగానికీ ప్రత్యేక సర్వర్‌ ఉండవలసిన అగత్యం తప్పుతుంది. భారతదేశంలో ఈ విధమైన 'క్లౌడ్‌ డేటా సర్వీసు' ఉన్న రెండో రాష్ట్రం కేరళ. రాష్ట్రంలో దాదాపు అందరికీ మొబైల్‌ ఫోన్లు అమరడంతో ప్రభుత్వం ఈ-పరిపాలన నుంచి మొబైల్‌ పరిపాలనకు మారడానికి సిద్ధమవుతోంది. మొబైల్‌ ద్వారా విద్యుత్‌ బిల్లుల చెల్లింపు మొదలుకొని వివిధ ధ్రువపత్రాలు పొందడానికి ఒక 'యాప్‌'ను రూపొందించారు.

విజన్‌ 2020

దీని రెండోదశ కింద వచ్చే అయిదేళ్లలో మొబైల్‌ పరిపాలనతోపాటు స్థానిక సంస్థల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో 'వైఫై' సౌకర్యాలను కల్పిస్తారు. మరో నెల రోజుల్లో 100 పంచాయతీలకు 'వైఫై' సదుపాయం ఏర్పడనుంది. 2016నాటికి ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితాల అవసరం లేకుండా చేయాలని సంకల్పించారు. కుటుంబాలకు, పరిశ్రమలకు, విద్యా సంస్థలకు రెండు నుంచి 20 ఎంబీపీఎస్‌ వేగంతో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ అనుసంధానత కల్పించడానికి కేంద్రప్రభుత్వం చేపట్టిన భారత్‌ నెట్‌ పథకాన్నీ కేరళ సద్వినియోగం చేసుకుంటుంది. అన్నింటినీమించి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం యువజన సవాల్‌ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి విశ్వవిద్యాలయం నుంచి కనీసం ఒక స్టార్టప్‌ (కొత్త సంస్థ) ఆవిర్భవించేలా అండదండలందిస్తున్నారు. విద్యార్థుల వినూత్న భావాలకు కార్యరూపమిచ్చే ప్రాజెక్టు ఇది. కేరళను మూడేళ్లలో సంపూర్ణ డిజిటల్‌ రాష్ట్రంగా మారుస్తానని రాష్ట్రప్రభుత్వం 2012 డిసెంబరులో ప్రకటించింది. అనుకున్న గడువులోపే ఆ లక్ష్యాన్ని సాధించి భళీ అనిపించుకుంది.

(రచయిత - వరప్రసాద్‌)
Posted on 29-08-2015