Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

మగ్గాల్లోనే మగ్గిపోతున్న కళ

* నేడు జాతీయ చేనేత దినోత్సవంు

‘పేదరికంపై పోరాటానికి శక్తిమంతమైన ఆయుధం చేనేత. స్వాతంత్య్ర పోరాటంలో స్వదేశీ సాధనంగా మనకు స్వేచ్ఛను ప్రసాదించిన ఘనత దీనిది. జాతి ఔన్నత్యానికి చిహ్నంగా దీన్ని కాపాడుకుందాం. పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణలో దీని ప్రాధాన్యాన్ని చాటుదాం’- 2015 చెన్నైలో తొలి జాతీయ చేనేత దినోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య ఇది. ప్రధాని ప్రకటన ఆశాజనకంగా ఉన్నా ఆచరణలో అది సాధ్యపడలేదు. విక్రయాల్లో వృద్ధి సాధించలేదు. ఉత్పత్తి తగ్గుతోంది. మొత్తంగా వృత్తిని నమ్ముకునేవారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణులే ఇందుకు కారణమన్నది చేదు నిజం. సామాజిక పరిణామాలు, అనేక ఇతర సమస్యల వల్ల ఈ రంగం ప్రస్తుతం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. యంత్రాలపై తయారైన ఉత్పత్తులు చేనేతలుగా చలామణీ కావడం ఈ రంగం పాలిట శాపంగా పరిణమించింది. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో చేనేతకు రూ.456.80 కోట్లు, జౌళి రంగానికి రూ.4,375 కోట్లు కేటాయించారు. ఈ అంతరమే చేనేతకు కేంద్రం ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందో చెప్పకనే చెబుతోంది. అయిదేళ్లుగా చేనేతకు కేంద్రం నుంచి బడ్జెట్‌పరంగా తగిన చేయూత లభించడం లేదు. 2016-17లో రూ.710 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు 2018-19లో రూ.386 కోట్లకు తగ్గింది. మరమగ్గాలు, యంత్రాలతో కూడిన జౌళి రంగానికి కేటాయింపులు, రాయితీలు, ప్రోత్సాహకాలు పెంచుతున్న కేంద్రం చేనేతకు అండగా నిలవడం లేదు. చేనేత వృత్తిదారుల సంఖ్య ఏటేటా తగ్గుతోంది. 2009-10లో నిర్వహించిన జాతీయ స్థాయి చేనేత సర్వేలో కేవలం 43.31 లక్షల మంది ఈ వృత్తిలో ఉన్నట్లు తెలిసింది. ఇందులో గ్రామీణులు 36.33 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోనివారు రూ.6.98 లక్షలు ఉన్నారు. 2017లో నిర్వహించిన సర్వేలో మొత్తం కార్మికుల సంఖ్య మరో 40 శాతం తగ్గినట్లుగా వెల్లడైంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో సుమారు 40 వేలమందే చేనేత కార్మికులు ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారని సర్వే నిగ్గు తేల్చడం బాధాకర పరిణామం. తరతమ భేదాలతో దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అసోం, మధ్యప్రదేశ్‌, పశ్చిమ్‌ బంగ, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, బిహార్‌, ఒడిశా, యూపీ వంటి రాష్ట్రాల్లోని పేరొందిన ప్రాంతాల్లోనే దాని ఉనికి కొనసాగుతోంది. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ భారం, అనారోగ్యం ఇతర కారణాలవల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక మొదటి రెండేళ్లలోనే ఆయన నియోజకవర్గం వారణాసిలో 50 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.

సమస్యల సుడిగుండం
చేనేత రంగంలో కొత్త నీరు చేరడంలేదు. సంప్రదాయ వృత్తిదారులు మినహా కొత్తవారు చేరడం లేదు. తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుంటున్నవారు ఆరోగ్యం సహకరించినంత వరకు ఇందులోనే కొనసాగుతున్నారు. ఈ రంగంలో ఉన్నవారికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాతకాలం నాటి మగ్గాలపై వస్త్రాలను తయారు చేయాల్సి వస్తోంది. గుంత మగ్గాల్లో రోజంతా కష్టపడుతున్నారు. చేనేతకారులకు కుటుంబంలోని మహిళల సహకారమూ ఎంతో అవసరం. రంగులు, రసాయనాలు, కుట్లు, అల్లికలతో వారంతా కుస్తీ పడుతున్నారు. ముడిపదార్థాలైన నూలు, పట్టు, పత్తి, ఉన్ని తదితరాల ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. ఉత్పత్తి చేసిన వస్త్రాలకు సరైన ధరలు రావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో సహకార సంస్థల ద్వారా వస్త్రాల కొనుగోళ్లు సాగుతున్నాయి. మిగిలినవారు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. స్థిరమైన మార్కెటింగ్‌ వ్యవస్థ లేదు. సంతలు, విపణి వీధుల్లో కాళ్లు అరిగేలా తిరుగుతున్నా వస్త్రాలు కొనుగోలు చేసేవారు కరవవుతున్నారు. శ్రమకు తగిన ప్రతిఫలం కార్మికులకు దక్కడంలేదు. గత పదిహేనేళ్ళలో జీవన వ్యయం విపరీతంగా పెరిగింది. ద్రవ్యోల్బణం ఎక్కువైంది. చేనేత కార్మికుల సంపాదనలో ఎటువంటి పెరుగుదల లేకపోవడం వల్ల రుణభారం మోయలేనిదిగా పరిణమిస్తోంది. మరమగ్గాల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీలో చేనేతదే వెనకంజ అవుతోంది. ధర తక్కువగా ఉండటం, తేలిగ్గా ఉత్పత్తి, విస్తృతమైన విపణి అవకాశాలు- మరమగ్గాల వస్త్రాలకు సానుకూలంగా ఉన్నాయి. చేనేత రిజర్వేషన్‌ చట్టం కింద కొన్ని వస్త్రాలను మరమగ్గాల నుంచి మినహాయించినా ఆచరణలో అది ఘోరంగా విఫలమవుతోంది. చేనేత, మిల్లు వస్త్రాలకు తేడా తెలుసుకోవడం కష్టమవుతోంది. ఇదే మిల్లు వస్త్రాల పాలిట వరమవుతోంది. చేనేత పేరిట ప్రధానంగా మిల్లు వస్త్రాలే విపణులను ముంచెత్తుతున్నాయి. చేనేత రంగంలో పరిశోధనలూ బుట్టదాఖలా అవుతున్నాయి. అధునాతన డిజైన్ల కొరత సైతం చేనేత పురోభివృద్ధికి అడ్డంకి అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...
తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికుల పరిస్థితి ఆశాజనకంగా లేదు. వృత్తికి భరోసా లేదు. కార్మికుల్లో 60 శాతం రాష్ట్ర ప్రభుత్వ చేనేత సహకార సంస్థలైన ఆప్కో, టెస్కో పరిధిలో పని చేస్తున్నారు. మరో 40 శాతం సహకారేతర రంగంలో ఉన్నారు. ఆప్కో, టెస్కోలు కార్మికులకు నూలు ఇచ్చి ఉత్పత్తులు చేయించి ప్రభుత్వ శాఖలకు పంపిణీ చేస్తున్నా, వాటికి సకాలంలో బిల్లులు మంజూరు కావడంలేదు. దీంతో సంఘాలకు నిధులు, కార్మికులకు వేతనాలు అందడంలేదు. సంఘాల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. సహకారేతర రంగంలోకి కార్మికులు ఉత్పత్తులను విక్రయించడానికి నానా కష్టాలు పడుతున్నారు. చేనేత కార్మికులకు మార్కెటింగ్‌ ప్రోత్సాహ పథకం అమలులో స్తబ్ధత ఏర్పడింది. కేంద్రం ప్రోత్సాహకాలను నిలిపేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలూ చేతులెత్తేశాయి. రెండు రాష్ట్రాల్లో రుణమాఫీ ఊరట కలిగించే అంశమైనా కార్మికులకు అవసరమైన ఆర్థిక భరోసా కలగకపోవడం ప్రభుత్వాల వైఫల్యమే. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని ఇచ్చిన పిలుపు అమ్మకాలపై కొంత సానుకూల ప్రభావం చూపింది.

చేనేత రంగానికి ప్రభుత్వాల ఆసరా కొరవడింది. చేనేత కార్మికులకు పొదుపు నిధి, మగ్గాల నవీకరణ, నూలు సబ్సిడీ, విపణి ప్రోత్సాహకాల వంటి పథకాలు అమలులో ఉన్నా, కార్మికులకు ఏం ఒరగడం లేదు. ఆదాయం లేకపోవడం వల్ల పొదుపు అన్నమాటే ఉత్పన్నం కాదు. మగ్గాల నవీకరణ తీరని వ్యధగా మారింది. నూలు రాయితీ సరిగ్గా అమలు కావడం లేదు. చేనేత వస్త్రాల విక్రయం తరవాత బిల్లులు అందజేస్తే పది నుంచి 20 శాతం రాయితీగా ఇస్తామని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా అది కూడా ఆచరణకు నోచుకోవడం లేదు. జబ్బు పడుతున్న కార్మికులకు ఆరోగ్య సాయం అందడం లేదు. ఫ్యాషన్‌ రంగం కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఎగుమతుల ద్వారా ఆదాయ అవకాశాలు ఉన్నప్పటికీ సరైన మార్గదర్శనం, ప్రోత్సాహం లేకుండాపోతున్నాయి. జౌళి రంగం లాభదాయకమైనదిగా భావించి కేంద్రం దాన్ని జీఎస్టీ పరిధిలో చేర్చింది. జీఎస్టీని చేనేతకూ వర్తింపజేయడం ఈ రంగాన్ని మరింత దెబ్బతీసింది. ఈ-కామర్స్‌ ద్వారా అమ్మకాలు పెంచే మార్గాలు పేద కార్మికులకు మేలు చేయడం లేదు. ‘భారత్‌లో తయారీ’ కింద చేనేతకు పెద్దయెత్తున చేయూత ఇవ్వాల్సి ఉన్నా ఆ సాయమూ అందడం లేదు. ‘ముద్ర’ పథకం పరిధిలో చిరువ్యాపారులను చేర్చిన కేంద్రం చేనేత కార్మికులను పట్టించుకోలేదు. చేనేత రంగానికి సంబంధించిన అన్ని పథకాలకు బడ్జెట్‌ కేటాయింపులు 36శాతం మేర తగ్గాయి. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, జౌళి రంగానికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల చేనేత రంగం బాగా దెబ్బతింటోంది. చేనేతకు రుణమాఫీ అత్యావశ్యకమైనా కేంద్రం నుంచి చొరవ లోపిస్తోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ ప్రకటించినా వాటిలోని నిబంధనలు పూర్తిస్థాయిలో అమలుకు ప్రతిబంధకంగా మారాయి. మారిన పరిస్థితుల దృష్ట్యా జౌళి నుంచి చేనేత రంగాన్ని వేరు చేయాల్సిన అవసరం ఎంతైనాఉంది. వాస్తవంలో అది మాటలకే పరిమితమవుతోంది. కొత్త పార్కుల ఏర్పాటు సైతం జౌళి రంగానికే పరిమితమవుతోంది. చేనేత ప్రాభవం, కళాత్మకత గురించి విస్తృత ప్రచారం కొరవడటంతో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి బహుళజాతి సంస్థలు, పారిశ్రామికవేత్తలు ముందుకురావడం లేదు.

ఆదుకునే మార్గాలు
సంక్షోభ పరిస్థితుల కారణంగా దేశంలో చేనేత రంగం ఆరిపోయే దీపంలా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగాన్ని కాపాడేందుకు చిత్తశుద్ధి కనబరచాలి. విప్లవాత్మక చర్యలకు, విధానపరంగా సమూల మార్పులకు పూనుకోవాలి. జౌళి నుంచి వేరుచేసి చేనేత కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి. బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి. చేనేత కార్మికులకు ఉపాధి హామీ పథకం అమలు చేయాలి. ప్రతి నెలా నికరంగా కనీసం రూ.15 వేల ఆదాయం సమకూరేలా చూడాలి. వృత్తిలో కొత్తతరం చేరేందుకు వీలుగా ప్రోత్సాహకాలు ప్రకటించాలి. వృత్తి విద్యాకోర్సుల్లో సంబంధిత పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలి. మార్కెటింగ్‌ అవకాశాలను ముమ్మరం చేయాలి. ఎగుమతులకు ప్రోత్సాహాన్ని అందించాలి. ‘ముద్ర’ వంటి పథకాల ద్వారా రుణసాయం అందించాలి. నూలు, రసాయనాలపై రాయితీలు ఇవ్వాలి. కార్మికులకు పనిభద్రత, స్థిరాదాయం, ఉత్పత్తి ప్రోత్సాహక విధానాన్ని దేశవ్యాప్తంగా చేపడితే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలి. ఏది చేనేత, ఏది మిల్లు వస్త్రమో స్పష్టత ఇవ్వాలి. స్వచ్ఛమైన చేనేత వస్త్రాలపై జీఎస్టీని ఎత్తివేయాలి. చేనేత భారతీయతకు చిహ్నం. అనాదిగా ఈ రంగాన్ని నమ్ముకున్న చేనేతకార్మికుల బతుకులు వ్యధాభరితం, బాధలమయం కారాదు. జాతీయ చేనేత దినోత్సవం స్ఫూర్తితో ఈ కళ నిత్యం వెలుగులు విరజిమ్మేలా మార్గం చూపడం పాలకుల తక్షణ కర్తవ్యం!

- ఆకారపు మల్లేశం
Posted on 07-08-2019