Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

కవి పండిత గురుపీఠం

ఉత్తమమైన కవిత్వం అలవడితే సామ్రాజ్యాలను ఆశించవలసిన పనిలేదని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. సాహిత్యం ఒక విశాల సామ్రాజ్యం. దానికి అధినేత మహాకవి. భారతీయ వాంగ్మయంలో ఎందరో సాహితీ సామ్రాజ్య చక్రవర్తులు ఉన్నారు. తెలుగు కవిత్వాన్ని ఊరూరా, వాడవాడలా ఊరేగించి తెలుగు పద్యానికి పట్టాభిషేకం చేయించిన జంట కవిరాజులు- తిరుపతి వేంకట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట కవి. చెళ్లపిళ్లవారు తిరుపతి శాస్త్రి కన్నా వయసులో ఏడాది పెద్ద అయినా వారు పరమపదించిన తరవాత మూడు దశాబ్దాలు జీవించారు. ఆ కాలంలోనూ చెళ్లపిళ్లవారి రచనా వ్యాసంగం తిరుపతి వేంకటీయంగానే సాగింది. అవధానాల రూపంలో ఈ జంట కవులు పద్యకవిత్వాన్ని ప్రదర్శనాత్మకమైన కళగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. తెలుగు నేలపై సంచారం చేస్తూ అష్టావధాన, శతావధానాలు నిర్వహించారు. తెలుగునాట వీరు దర్శించని రాజాస్థానాలు లేవు. కాలుమోపని నగరాలు, గ్రామాలు లేవు. ఈ కవుల ‘పాండవోద్యోగ విజయాలు’ నాటకం పేరు చెప్పగానే తెలుగువారు ఆత్మీయంగా పులకరిస్తారు. ఈ నాటక పద్యాలు పండిత, పామరుల నాలుకపై నర్తిస్తాయి. వీరిద్దరూ చర్ల బ్రహ్మయ్య శాస్త్రి శిష్యులు. వీరు మహాకవులు, బహు గ్రంథకర్తలు, శాస్త్రద్రష్టలు, తాత్త్వికులు, లోకజ్ఞులు.

వేంకటశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా కడియంలో 8-8-1870న జన్మించారు. తల్లిదండ్రులు చంద్రమ్మ, కామయ్యలు. వీరికి తల్లిదండ్రులు పెట్టిన మొదటి పేరు వేంకటాచలం. బాల్యంలో బడికి వెళ్లకుండా తోటి పిల్లలతో గోళీలు, కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ విచ్చలవిడిగా తిరిగినా, కాలక్రమంలో బుద్ధి కలిగి ఏళ్లలో నేర్వదగిన విద్య నెలల్లో ఆర్జించారు. ‘శాస్త్రి సామాన్యం ఎత్తు, చామనఛాయ, బహు చురుకైన మొహం, పిల్ల జుట్టు, కంచు గంట లాంటి గొంతుక, పండిత శాలువా పైనవేసుకొని, పంచ ధరించేవారు. చేతనున్న బంగారు కడియం కవితా దిగ్విజయాన్ని సూచిస్తుంది’ అని ‘నా వాంగ్మయ మిత్రులు’ గ్రంథకర్త టేకుమళ్ళ కామేశ్వరరావు చెళ్లపిళ్లవారి మూర్తిని కళ్ళకు కట్టించారు. తిరుపతి శాస్త్రి గారిది కవితాధారణ అయితే, చెళ్లపిళ్లవారిని లౌక్య ప్రజ్ఞకు ప్రసిద్ధులుగా చెబుతారు. తిరుపతి శాస్త్రి గారిది సంస్కృత ప్రకర్ష అని, వేంకట శాస్త్రి గారి కవిత్వంలో తెనుగుదనం జాస్తి అని వారిని బాగా తెలిసినవారు చెబుతారు. వేంకట కవి బందరు హిందూ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పని చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రథమాంధ్ర ఆస్థాన కవి పదవి వీరిని వరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో వీరిని సత్కరించింది.

‘కవనార్థంబుదయించితిన్‌ సుకవితా కావ్యంబె నా వృత్తి’ అని చెప్పుకొన్నారు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి. పద్య పఠనంలో ఆయనది ఒక కొత్త తీరు. ఆయనలా పద్యాలు చదవాలని ఎందరో ప్రయత్నించినా, ఆ కంచు కంఠం అందరికీ రాదు కదా. ప్రతి విషయంలో తనదొక ప్రత్యేకత అన్నట్టు వేంకటశాస్త్రి వ్యవహరించేవారు. ఆయన కామేశ్వరి శతకం, ఆరోగ్య కామేశ్వరి శతకం రచించారు. తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు కామేశ్వరీ దేవిని ప్రార్థిస్తూ వీరు రాసిన ఆరోగ్య కామేశ్వరి శతకంలో స్వవిషయాలు, తిరుపతి కవి గురించిన పద్యాలు ఉన్నాయి. అనంతర కాలంలో వెలువడిన ఆరోగ్య శతకాలకు వీరి శతకం మార్గదర్శనమైంది. తాను వ్రణంతో బాధపడుతున్నప్పుడు శారీరక బాధను, మానసిక వేదనను కామేశ్వరి శతకంలో దేవికి విన్నవించుకున్నారు.

వేంకటశాస్త్రి గొప్ప వక్త. అమిత భాషి. యౌవనంలో ఆయన ఉపన్యాస వాణి మేజువాణి. షష్టిపూర్తి తరవాతా వారి కంఠంలో ఝంకారం, మాధుర్యం తగ్గలేదు. ఆయనది శాఖాచంక్రమణం. అనేక విషయాల్లోకి చొచ్చుకుపోయేవారు. పద్యాలను, పిట్ట కథలను, సంఘటనలను, గానాన్ని, హాస్యాన్ని మేళవించి పంచామృతంగా ఉపన్యాసం అందించేవారు. ఏం మాట్లాడినా అది ధ్వని కావ్యం.

వేంకట కవికి గణనీయమైన గొప్ప శిష్యగణం ఉంది. ఆయన బందరు పర్రల్లో కవుల్ని సృష్టించారని ఆ రోజుల్లో చెప్పుకొనేవారు. పింగళి, కాటూరి, వేటూరి శివరామశాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ వంటి వీరి శిష్యులు విద్వత్‌ కవులుగా వాసికెక్కారు. పింగళి, కాటూరి కవులు తమ సౌందరనంద కావ్యాన్ని చెళ్లపిళ్ల వారి షష్టిపూర్తి సందర్భంలో సమర్పిస్తూ వారిని ‘అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాత’గా సంభావించారు.

శాస్త్రి గ్రాంథిక భాషా కవిత్వంలో పుట్టి పెరిగినా, చివరి దశలో వ్యావహారిక భాషను ఆదరించారు. వచనంలోనూ అమూల్యమైన రచన చేశారు. కృష్ణా పత్రికలో ప్రచురితమైన వారి కథలు, గాథలు మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. అవి తెలుగు భాషా సాహిత్యాలకు విజ్ఞాన సర్వస్వాలు. వ్యావహారిక భాషా సౌందర్యానికి తరగని గనులు. వారి ‘కాశీయాత్ర’ యాత్రా సాహిత్యంలో విశిష్టమైనది. ఆధునిక, సాంఘిక చరిత్రకు విలువైన ఆధార గ్రంథం. ఆనాటి ఉత్తర హిందూస్థానం విశేషాలు, నాటి సామాజిక పరిస్థితులు ఈ గ్రంథంలో చూడవచ్చు. కవిగారి చరమ దశను గురించి మధునా పంతులు ఇలా రాశారు. ‘కడకాలమున విజయవాడ గవర్నరుపేట యందలి యద్దెయింట గుక్కి మడత మంచంపై కౌపీనధారియై పరుండియుండెడి యా జరఠమూర్తి నెందఱెందఱో దర్శించి పోవుచుండెడివారు. ఆయన మెట్టిన ప్రదేశమే యొక దివ్యతీర్థము. మనసు వచ్చినచో వచ్చిన మానిసిని బలుకరించును; లేనిచో బలుకరించుటకూడ నుండదు. వచ్చినవాడు వచ్చి కవిగారి చరణములు కనుల కద్దుకొని చక్కబోవును. ఆ యాగంతకునకదే పదివేలు’. చెళ్లపిళ్లవారు 1950లో యశఃకాయులయ్యారు.- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు
Posted on 08-08-2019