Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పలు జాతులకు పెనుముప్పు

* నేడు ప్రపంచ మూలవాసుల అంతర్జాతీయ దినోత్సవం

మానవ వికాసంలో భాష ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వ్యక్తిత్వాలకు రూపు నివ్వడంలోనూ కీలక స్థానంలో నిలుస్తుంది. భాషల్లో అనేక సంస్కృతులు, వైవిధ్యాలు దాగి ఉంటాయి. ఒక భాష అంతరించిందంటే దానితోపాటు ఆ భాష మాట్లాడే జాతి సంస్కృతీ సంప్రదాయాలూ రూపుమాసినట్లే! సామాజిక ఆధిపత్యం వల్ల కొన్ని భాషలు విశేషాదరణ పొందగా, మరికొన్ని వాటి ధాటికి నిలవలేక కనుమరుగవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏటా ఆగస్టు 9న ప్రపంచ మూలవాసుల అంతర్జాతీయ దినోత్సవం (ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ది వరల్డ్‌ ఇండిజినస్‌ పీపుల్స్‌) నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి 2019ని ‘మూలవాసుల భాషా పరిరక్షణ’ సంవత్సరంగా ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో 37 కోట్ల మూలవాసులు నివసిస్తున్నట్లు అంచనా. ప్రపంచ జనాభాలో వీరు అయిదు శాతం ఉంటారు. వారి భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్లు వైవిధ్యమైనవి. విభిన్న సంస్కృతులు, భాషలకు వీరు ప్రతీకలు. ఎన్నో ప్రత్యేకతలున్న మూలవాసుల సంస్కృతి, భాషలు కాలక్రమేణ కనుమరుగవుతున్నాయి. ఏదైనా సమస్యను అంతర్జాతీయ వేదికపై చర్చించి, పరిష్కారాలు సూచించే దిశగా ఐక్యరాజ్యసమితి ఏటా ఒక ప్రత్యేక అంశంతో ముందుకొస్తోంది. 1994లో ప్రారంభమైన ఈ పరంపర నిరంతరాయంగా కొనసాగుతోంది. ‘యునెస్కో’ అంచనాల ప్రకారం అంతరిస్తున్న భాషలు భారత్‌లోనే అధికంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా మూలవాసుల భాషలు అస్థిత్వాన్ని కోల్పోయే దశలో ఉన్నాయి. ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం’ అంచనాల ప్రకారం ప్రపంచంలో అత్యంత పురాతనమైన 15 అమెజానియన్‌ భాషలు రెసిగారో (పెరూ), చూలిం (రష్యా), మడ్బుర్‌ (ఆస్ట్రేలియా), పాత్విన్‌, చెమేహుయేవి (నేటివ్‌ అమెరికన్స్‌), ఐను (జపాన్‌), చామీకరో (స్పానిష్‌), ఓడ్‌ (రష్యా, ఎస్టోనియా), మాచజ్యూయయ్‌ (బొలీవియా), జెడిక్‌ (మలేసియా), పవనే (ఒక్లహామా), డెన్సేర్‌ (ఇండొనేసియా), అలవా, నాగం గీకురుంగుర్‌ (ఆస్ట్రేలియా), పజహ (తైవాన్‌) ఇప్పటికే కనుమరుగయ్యాయి.

భాషల అంతర్ధానానికి అభివృద్ధి పేరిట సాగే సంస్కృతీ విధ్వంస విధానాలు, నగరీకరణ, సామాజిక ఆధిపత్య ధోరణులు, సామాజిక మాధ్యమాలు, సినిమాలు కారణాలు. ‘ఫస్ట్‌ పీపుల్స్‌ కల్చరల్‌ కౌన్సిల్‌-బ్రిటిష్‌ కొలంబియా’ సంస్థ అధ్యయనం ప్రకారం నాలుగు శాతం మూలవాసులు, అదీ 65 ఏళ్ళకు పైబడినవారే తమ మాతృభాషను స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు. దేశంలో మొత్తం 705 మూలవాసుల సమూహాలు ఉండగా, అందులో 75 అత్యంత వెనకబడిన జాతులుగా ప్రభుత్వం గుర్తించింది. ‘లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ అంచనాల మేరకు హిమాలయ ప్రాంతం; మధ్య, పశ్చిమ భారతం; దక్షిణాది, అండమాన్‌ దీవుల్లో మొత్తం 780 మూలవాసుల భాషలు ఉన్నట్లు గుర్తించారు. ప్రఖ్యాత ఆదివాసీ హక్కుల రచయిత గణేష్‌ నారాయణ్‌దాస్‌ దేవి 780 భాషలపై అధ్యయనం చేసి, అందులో దాదాపు 600 అస్థిత్వాన్ని కోల్పోయే దశలో ఉన్నాయని వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 250 భాషలు పూర్తిగా అంతరించిపోయినట్లు తెలిపారు. భాషలు అంతరించడానికి ప్రధాన కారణం వలసవాదుల పాలన ప్రభావమేనని తన అధ్యయనంలో పేర్కొన్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో సంచార జాతుల భాషలైన వడరు, కుర్మి, కొల్హటి, గొల్ల, గీసారి; ఆదివాసుల భాషలైన పౌరి, కొరకు, హల్దీ, మావిచి, అసోమ్‌లో మొరేన్‌, ట్యాంగీసా, ఐతుం అంతరించిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఆదివాసీ భాషలైన కోలమి, కోయ, గోండి, కువి, కుయి, ఎరుకల, సవర, పర్జి, కుపి కనుమరుగయ్యాయి. పూర్వం ఆధుని, డిచ్చి, ఘల్లు, హెల్గో, కటగి భాషలు ఉండేవి. వాటితోపాటు అండమాన్‌ దీవుల్లోని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ‘భోృ’, సిక్కిమ్‌లోని ‘మాజహి’ భాషలుఇటీవల కాలంలో అంతరించిపోయాయి.

రాజ్యాంగం మైనారిటీల భాషా పరిరక్షణను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఆదివాసీ సంస్కృతిని కాపాడాలని నొక్కి చెబుతోంది. సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించాలంటే అంతరిస్తున్న భాషల లిపిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాషా పరిరక్షణ ఒక అంశం. తొమ్మిదో దశకం తరవాత ప్రపంచీకరణ విస్తృతమైంది. ప్రజలు కుల వృత్తులను వీడి ఉద్యోగాల్లో చేరడం, వలసల వల్ల భాషా విధ్వంసానికి పునాదులు పడ్డాయి. మనిషులు ఆధునికతను అందుకునే క్రమంలో తన వ్యక్తిత్వంలోకి అనేక మార్పులను ఆహ్వానించారు. ఇందులోనే సాధారణ భాష, ఆహారపు అలవాట్లు మిళితమై ఉన్నాయి. అత్యధిక ఆదివాసీ జనాభా కలిగిన మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ప్రైవేటు పాఠశాలలు ఆంగ్ల మాధ్యమ బోధన పేరుతో స్థానిక భాషలను భావితరాలకు దూరం చేస్తున్నాయి. పిల్లల తల్లితండ్రులు సైతం ఆంగ్ల మాధ్యమం పట్ల ఆసక్తి చూపుతున్నారు. దీంతో మాతృభాషల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. ఐక్యరాజ్యసమితి భాషా పరిరక్షణలో భాగంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని (ఫిబ్రవరి 21న) నిర్వహిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేసి అంతరిస్తున్న భాషల ప్రతులను తయారు చేయడం శుభసూచకం. సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ (మైసూర్‌) నిరంతరం భాషా పరిరక్షణకు కృషి చేయడం హర్షించదగిన విషయం. భాషా పరిరక్షణను సిలబస్‌లో భాగం చేయాలి. నిఘంటువులు ప్రచురించాలి. భాషా కోర్సులకు తగిన ప్రాధాన్యం కల్పించి, యువతరం వాటిని అధ్యయనం చేసేలా ప్రోత్సహించాలి. ప్రఖ్యాత భాషా నిపుణుడు నోమ్‌చామ్‌స్కీ చెప్పినట్లు... భాష మన మనసుకు ప్రతిబింబం. అందులో మన గతం, వర్తమానం, భవిష్యత్తు దాగి ఉంటాయి. వాటిని కాపాడినప్పుడే భాష అస్థిత్వం నిలుస్తుంది!

- డాక్టర్‌ రమేష్‌ బుద్దారం
(రచయిత- మధ్యప్రదేశ్‌లోని గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు)
Posted on 09-08-2019