Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ఆపన్నుల పాలిట పెన్నిధి

* ప్రధానమంత్రి సహాయ నిధి

దేశవ్యాప్తంగా ఏటా ప్రకృతి వైపరీత్యాల్లో అపార ప్రాణ, ఆస్తి నష్టాలు చోటుచేసుకుంటున్నాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రజలు వరదల్లో చిక్కుకొని తిండీతిప్పలు లేక ఆపన్న హస్తాల కోసం ఎదురు చూసేతీరు ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఇటీవల బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ ప్రాంతంలో శీతల్‌పట్టీ గ్రామానికి చెందిన అర్జున్‌, రాజా, జ్యోతి అనే ముగ్గురు చిన్నారులు వరద నీటమునిగి మరణించారు. ముగ్గురినీ కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరయింది. వరద నీట మునిగిన చిన్నారుల్లో మూడేళ్ల బాలుడు అర్జున్‌ మృతదేహం సామాజిక మాధ్యమాల్లో అందరికీ కన్నీరు తెప్పించింది. కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా వరదలు విలయ తాండవం చేస్తున్నాయి. అసోమ్‌ను బ్రహ్మపుత్ర నదీ వరదలు ముంచెత్తాయి. ఆ రాష్ట్రంలో పేరొందిన కజిరంగ పార్కులోకి వరద నీరు ప్రవేశించడంతో వన్యప్రాణులు ఇబ్బందుల పాలయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలలో వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే బాధితులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి ద్వారా చేయూత అందిస్తున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు, క్షతగాత్రుల కుటుంబానికి యాభైవేల రూపాయలు అందజేస్తారు. 1948లో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జాతీయ సహాయనిధిని ఏర్పాటుచేశారు. ఈ నిధి నుంచి తుపాను, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల్లో మరణించిన వారికి, అల్లర్ల బాధితులకు సహాయం అందిస్తున్నారు. దాతలు అందించే విరాళాలతోనే ఈ నిధి సమకూరుతుంది. దీనికి ప్రత్యేకించి ప్రభుత్వపరంగా ఎలాంటి బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడం గమనార్హం. దీనికి విరాళాలు ఇచ్చేవారికి నూరుశాతం ఆదాయం పన్ను మినహాయింపు వర్తిస్తుంది. సహాయనిధికి ఏటా వందల కోట్ల రూపాయల విరాళాలు సమకూరుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం రూ.3,800.44 కోట్ల నిధి ఉంది. 2018-19 సంవత్సరంలో రూ.783.18 కోట్ల మేర నిధులు ప్రజల నుంచి విరాళాల రూపంలో అందాయి. విదేశీయులు సైతం ఈ నిధికి విరాళాలు ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయం.

ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు సాయం అందించడంతో పాటు తుపాను బాధిత ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాలను చేపడుతున్నారు. ముఖ్యంగా తుపాన్ల సమయంలో బాధితులకు ఆశ్రయం కల్పించేందుకు రక్షణ కేంద్రాలను దేశవ్యాప్తంగా నిర్మిస్తున్నారు. పశ్చిమ్‌బంగలోని మెడినిపుర్‌ జిల్లాలో యాభై బహుళ ప్రయోజక తుపాను రక్షణ కేంద్రాలను రూ.138.65 కోట్లతో నిర్మించారు. వాటి నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. కేరళలో బహుళ ప్రయోజక తుపాను రక్షణ కేంద్రాన్ని రూ.2.24 కోట్లతో నిర్మించారు. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షదీప్‌ ప్రాంతంలోని మినికోయ్‌ ఐస్‌ల్యాండ్‌లో రూ.3.37 కోట్లతో తుపాను రక్షణ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.

బాధితులకు సాయంతో పాటు ఇతర అవసరాలకూ ఈ నిధి నుంచి సొమ్ము వెచ్చిస్తున్నారు. జమ్ము-కశ్మీర్‌లో వరదలకు దెబ్బతిన్న పాఠ్యపుస్తకాల ముద్రణ కోసం రూ.4.08 కోట్లు ఖర్చుచేశారు. ఆరు ప్రధాన ఆసుపత్రుల్లో పరికరాల కొనుగోలు కోసం రూ.142.15 కోట్లు వెచ్చించారు. వరద బాధిత ప్రాంతాల్లో నష్టం వాటిల్లిన ఇళ్ళ మరమ్మతులకు రూ.565 కోట్లు వ్యయం చేశారు. బాధితులకు దుప్పట్ల కొనుగోలుకు అయిదు కోట్ల రూపాయలు వెచ్చించారు. ప్రకృతి ప్రకోపం వల్ల 2014-15 నుంచి నేటివరకు సుమారు 166 ప్రమాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిల్లో దాదాపు 6,289 మంది చనిపోగా 1,652 మంది క్షతగాత్రులయ్యారు. అత్యధికంగా 2017-18లో 2,035 మంది, 2014-15లో 1,089 మంది మరణించారు. బాధితులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి అయిదేళ్ళ కాలంలో రూ.167.79 కోట్లు అందజేశారు. యాసిడ్‌ దాడుల్లో గాయపడినవారికి, మరణించినవారి కుటుంబాలకు లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి ద్వారా బాధిత కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోంది. వారి జీవితాల్లో వెలుగులు చోటుచేసుకుంటున్నాయి. బాధితులు చేదు అనుభవాలను మరచి కొత్త జీవితాలను ప్రారంభించగలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సహాయనిధికి ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు ఉదారంగా విరాళాలు సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా స్వచ్ఛంద సంస్థలు ప్రజలను చైతన్యపరచాలి. ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాసంస్థలు ఇందులో భాగస్వాములు కావాలి. సహాయనిధిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. విరాళాలు బాధిత కుటుంబాలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో, తద్వారా వారి జీవితాల్లో వచ్చిన మార్పేమిటో తెలియజేయాలి. ప్రజా ప్రతినిధులు సైతం తమవంతుగా ముందుకు రావాలి. అప్పుడే ఈ నిధికి పెద్దమొత్తంలో విరాళాలు సమకూరతాయి. తద్వారా బాధిత ప్రజలకు ఉపశమనం లభిస్తుంది!


- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌
(రచయిత- ‘సెస్‌’లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)
Posted on 10-08-2019