Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ఓడుతున్న క్రీడాస్ఫూర్తి

పోటీదారులపై అనైతిక ఆధిక్య సాధనను, మెరుగైన పాటవ ప్రదర్శనను లక్షించి క్రీడాకారులు నిషేధిత ఉత్ప్రేరక పదార్థాలు వాడే నైచ్యం- డోపింగ్‌. దేశీయంగా అటువంటి కానిపనుల్ని నివారించడం కోసం నెలకొల్పిందే జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ(నాడా). ఆ వ్యవస్థ పరిధిలోకి తనవంటి మేరువు చేరడమేమిటని కొన్నేళ్లుగా మొండివాదన వినిపిస్తున్న భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కడకు బెట్టు సడలించి మెట్టు దిగిరాక తప్పలేదు! ‘నాడా’ నిబంధనలు ఆటగాళ్ల వ్యక్తిగత గోప్యతకు భంగకరంగా ఉన్నాయని, అది నిర్వహించే పరీక్షల నాణ్యతపై తనకు నమ్మకం లేదని, సకాలంలో ఫలితాల వెల్లడికి అనువైన ఏర్పాట్లు కొరవడ్డాయని... ఎప్పటికప్పుడు అభ్యంతరాలు వల్లెవేసిన బీసీసీఐకి ఇటీవల యువ క్రికెటర్‌ పృథ్వీ షా ఉదంతం అమాంతం గాలి తీసేసింది. డోప్‌ పరీక్షలో పట్టుబడిన షా తాను వేసుకున్న దగ్గుమందులో నిషేధిత ఉత్ప్రేరకం ఉందంటూ ఇచ్చిన వివరణతో ‘సంతృప్తి’ చెందిన బీసీసీఐ అతడిపై ఎనిమిది నెలల నిషేధం విధించిన సమాచారం, జులై నెలాఖరులో వెలుగుచూసింది. ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌)లో ఆడేందుకు వీలుగానే అతడి డోప్‌ పరీక్ష ఫలితాల్ని అప్పటిదాకా తొక్కిపట్టి ఉంచారన్న ఆరోపణలు, దోషిగా తేలిన దరిమిలా నిషేధాన్ని మార్చి నెల నుంచే అమలుపరచడంపట్ల తీవ్ర అభ్యంతరాలు- బోర్డును ఇరకాటంలోకి నెట్టేశాయి. నిరుడు జనవరిలో మరో క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ కేసులోనూ నిషేధ కాలాన్ని వెనక్కి జరిపి లెక్కించి ‘శిక్ష’ను పరిహాసాస్పదం చేసిన బీసీసీఐకి, ఈసారి ఇష్టారాజ్యంగా చలాయించుకునే అవకాశం దక్కలేదు. బర్మింగ్‌హామ్‌ వేదికగా 2022నాటి కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళా క్రికెట్‌ జట్టు పాల్గోవాలంటే ‘నాడా’ గొడుగు కిందకు చేరకతప్పదన్న సంకేతాలు అందాకనే బీసీసీఐ గాడిన పడిందన్నది విశ్లేషకుల అంచనా. ఇకమీదట దేశవాళీ పోటీలప్పుడు తనంత తానుగా, ద్వైపాక్షిక సిరీస్‌లూ ప్రపంచకప్‌ పోటీల సందర్భంగా ఐసీసీ ఆదేశాలపై ఆటగాళ్ల నుంచి శాంపిళ్ల సేకరణ బాధ్యత ‘నాడా’కు దఖలుపడింది. ఈ పరిణామం భారత క్రికెట్‌ ముఖచిత్రాన్ని ఏ మేరకు తేటపరచగలదో చూడాలి.

సుమారు మూడు దశాబ్దాల క్రితం సియోల్‌ ఒలింపిక్స్‌ వంద మీటర్ల పరుగు పందెంలో చిరుతలా దూసుకుపోయి విశ్వరికార్డు నెలకొల్పిన బెన్‌ జాన్సన్‌ డోపింగ్‌ పరీక్షలో దోషిగా నిలవడం యావత్‌ క్రీడాప్రపంచాన్నీ దిగ్భ్రాంతపరచింది. అనంతర కాలంలో నిషేధిత ఉత్ప్రేరక ద్రవ్యం సేవించినట్లు నిర్ధారణై తమతమ దేశాలకు అప్రతిష్ఠ తెచ్చిన అథ్లెట్ల పేర్లెన్నో వెల్లడయ్యాయి. ఓటమిని హుందాగా స్వీకరించడమే అసలైన క్రీడాస్ఫూర్తి. అది సాంతం కొరవడి ఎలాగైనా నెగ్గాలన్న దుగ్ధ దేశదేశాల్లో ఎందరినో డోపింగ్‌కు పురిగొల్పిన బాగోతాలెన్నో పోగుపడ్డాయి. పందొమ్మిదేళ్ల క్రితం సీమా పునియా, 2008లో రెంజీత్‌ మహేశ్వరి, 2010లో సనమాచ చాను, మూడేళ్ల క్రితం నర్సింగ్‌ ప్రభృతుల పేర్లు అలా మకిలి జాబితాలో చేరినవే. పునస్సమీక్షానంతరం కొంతమందిని దోషారోపణల నుంచి విముక్తుల్ని చేస్తున్నా, భిన్న క్రీడాంశాల్లో డోపింగ్‌ భల్లూకం పట్టు బిగుస్తూనే ఉంది. వివిధ శ్రేణుల్లో జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్లు ముగ్గురితోపాటు కబడ్డీ, జావెలిన్‌ త్రో, దేహదారుఢ్య పోటీలు తదితరాల్లో పతక వీరులుగా మెరుస్తున్న ఇంకొందరూ ‘నాడా’ తాజా జాబితాలో దోషులుగా నిలిచారు! దిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మక ‘ఖేలో ఇండియా’ పోటీల బరిలోకి దూకినవారిలో పన్నెండు మంది అథ్లెట్లు డోపీలుగా పట్టుబడిన ఘటన- చాప కింద నీరులా విస్తరిస్తున్న ముప్పును కళ్లకు కట్టింది. ఏ క్రీడాంశాలకు చెందినవారైనా తప్పనిసరిగా నిర్దిష్ట విధినిషేధాలకు లోబడి తీరేట్లు అన్ని అంచెల్లోనూ నట్లు బిగిస్తేనే తప్ప డోపింగ్‌ ప్రహసనాలు తగ్గుముఖం పట్టవు.

ఒక దేశమే పతకాల కోసం పతనమైన వైనాన్ని నాలుగేళ్ల నాటి ‘వాడా’ (ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ) నివేదిక సోదాహరణంగా తెలియజెప్పింది. అథ్లెట్ల చేత రష్యా నిషేధిత ఉత్ప్రేరక పదార్థాలను ఉద్దేశపూర్వకంగానే వాడిస్తున్నట్లు నిగ్గుతేల్చిన ఆ అధ్యయనం, 2012 ఒలింపిక్స్‌ సహా పలు అంతర్జాతీయ పోటీల్లోనూ అలా అనుచిత లబ్ధి పొందినట్లు ధ్రువీకరించింది. ఆ దెబ్బతో ప్రపంచ అథ్లెటిక్‌ సమరంతోపాటు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికీ రష్యాకు దారులు మూసుకుపోయాయి. ఒక్క రష్యా అనేముంది- ఎన్నోచోట్ల అంతర్జాతీయ అథ్లెటిక్‌ సంఘాలు గడ్డి తింటున్నాయన్న ఆరోపణలు, ఎక్కడికక్కడ క్రీడాస్ఫూర్తి క్షతగాత్రమై నిలువునా నెత్తురోడుతున్న దయనీయ దృశ్యాల్ని ఆవిష్కరిస్తున్నాయి. కెన్యాలో పదుల సంఖ్యలో అథ్లెట్లు డోపింగ్‌ పరీక్షల్లో దొరికిపోయారు. ఆ జాబితాలో టర్కీ, ఫ్రాన్స్‌, ఇండియా, బెల్జియం, ఇటలీ, స్పెయిన్‌, పోలండ్‌, కజకిస్థాన్‌, దక్షిణాఫ్రికాల పేర్లూ చోటుచేసుకోవడం డోపింగ్‌ విస్తృతి ఎంతటిదో స్పష్టీకరిస్తోంది. ‘నాడా’లో బీసీసీఐ చేరిక సానుకూల పరిణామమని సంబరపడుతున్న భారత క్రీడామంత్రిత్వ శాఖ- ఇన్నేళ్లూ అథ్లెటిక్స్‌ నుంచి కుస్తీ వరకు, జూడో నుంచి వాలీబాల్‌ దాకా డోపింగ్‌ కేసులు ఇంతలంతలవుతుంటే ఏం చేసినట్లు? రష్యాలో ప్రభుత్వ యంత్రాంగమే చేజేతులా అనుచిత విధానాలను ప్రోత్సహించి, తీరని భంగపాటు కొనితెచ్చుకోగా- దేశంలో మంత్రిత్వ శాఖ, క్రీడాసమాఖ్యల అలసత్వం వాటి మధ్య సమన్వయరాహిత్యం దారుణ అవ్యవస్థను స్థిరీకరిస్తున్నాయి. అత్యధిక డోపింగ్‌ ఉల్లంఘనల ప్రాతిపదికన రష్యా ఇండియా సంయుక్తంగా ఆరో స్థానాన నిలిచాయంటున్న ‘వాడా’ గణాంకాలు- క్రీడల్ని శ్వాసించి సమాదరించే భారతీయులెందరికో తలవంపులు. ఈ దుస్థితిని బదాబదలు చేసేలా ‘నాడా’, బీసీసీఐ, ఇతర క్రీడాసమాఖ్యల ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక పదునుతేలాలి. అంచెలవారీగా విస్తృత కసరత్తుతో అద్భుతాలు సాధిస్తున్న చైనా అనుభవం చాటుతున్నట్లు- నిషేధిత ఉత్ప్రేరక పదార్థాలు కాదు... నిరంతర కఠోర సాధన, అకుంఠిత దీక్షతో శిక్షణలే జగజ్జేతలను సృష్టిస్తాయి!

Posted on 13-08-2019