Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సైబర్‌ నేరగాళ్ల బరి

ఆధునిక జీవన వేగానికి దీటుగా దేశంలో కంప్యూటర్లు, అంతర్జాలం, స్మార్ట్‌ఫోన్ల వినియోగం, డిజిటల్‌ లావాదేవీలు జోరెత్తుతున్న కొద్దీ- మోసగాళ్ల చేతివాటం పెరిగి సైబర్‌ నేరాలూ ఇంతలంతలవుతున్నాయి. మెక్సికో, ఫ్రాన్స్‌ల తరవాత ఇండియాలోనే నిరుడు అత్యధికంగా 76శాతం వాణిజ్య సంస్థలు సైబర్‌ దాడులకు గురయ్యాయన్న విశ్లేషణ అయిదు నెలల క్రితం వెల్లడైంది. భారత్‌లో సైబర్‌ దాడుల మూలాలు అమెరికా, ఐరోపా, బ్రెజిల్‌, టర్కీ, చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో ఉన్నట్లు 2015 జనవరి నాటి ‘అసోచామ్‌’ నివేదిక చాటింది. సరికొత్తగా వెలుగు చూసిన గణాంకాలు మరింత ఆందోళనకర దృశ్యాల్ని ఆవిష్కరిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య దేశీయంగా అంతర్జాల నేరాల్లో 22శాతం వృద్ధి నమోదైందని, గత రెండు త్రైమాసికాల్లోనూ ఇలా దాడులకు గురైన దేశాల జాబితాలో ఇండియాదే ప్రథమ స్థానమంటున్న ‘సుబెక్స్‌’ అధ్యయనం ప్రకారం- ముంబై, దిల్లీ, బెంగళూరులే ప్రధాన బాధిత నగరాలు. వాటిపై చెక్‌ రిపబ్లిక్‌, పోలాండ్‌, స్లొవేనియాలకు చెందిన సైబర్‌ నేరగాళ్లు తరచూ పంజా విసరుతున్నారు. అత్యధిక చరవాణులు దురుద్దేశపూరిత సాఫ్ట్‌వేర్‌ (మాల్‌వేర్‌) పాలబడిన వరసలో బంగ్లాదేశ్‌, నైజీరియా, ఇరాన్‌, టాంజానియా, చైనాల తరవాత నిలిచిన ఇండియా- సైబర్‌ నేరాల ఉద్ధృతిలో పైపైకి ఎగబాకడం తీవ్ర ఆందోళనకర పరిస్థితిని సూచిస్తోంది. డిజిటల్‌ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఆన్‌లైన్‌ లావాదేవీల విశ్వసనీయతను పరిరక్షించేందుకు, అంతకు మించి వ్యక్తిగత సమాచార భద్రతకు ఎటువంటి విఘాతం వాటిల్లకుండా కాచుకోవడానికి ప్రజాప్రభుత్వాలు అగ్ర ప్రాధాన్యం ఇచ్చి తీరాలి. కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం అర్థవంతమైన సమన్వయంతో సైబరాసురులపై ఉక్కుపాదం మోపాలి!

దేశాల మధ్య దూరాభారాల్ని చెరిపేస్తూ ప్రపంచాన్నే ఓ కుగ్రామంగా మార్చేసిన సమాచార సాంకేతిక విప్లవం మాటున నక్కి భీతిల్లజేస్తున్న చీకటి కోణం, సైబర్‌ నేరం. కేవలం ఎనిమిదేళ్ల వ్యవధిలోనే 700 కోట్లకుపైగా ఆన్‌లైన్‌ ఖాతాలు, ఒక్క 2016లోనే 110 కోట్ల ఖాతాలు చోరుల పాలబడ్డాయన్నది రెండేళ్లనాటి సిమాంటెక్‌ సంస్థ అధ్యయన సారాంశం. మూడేళ్ల క్రితం దేశంలోనే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకులకు చెందిన 32 లక్షల డెబిట్‌ కార్డుల సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేజిక్కిందన్న సమాచారం పెను గగ్గోలు పుట్టించింది. అంతకు ముందు సంవత్సరం అమెరికాలో రెండున్నర కోట్లమందికిపైగా పౌరుల వివరాల్ని చోరులు సర్కారీ రికార్డులనుంచి తస్కరించారు. ఇటీవలి కాలంలో ఇక్కడ ఖాతాదారుల్ని రకరకాలుగా బురిడీ కొట్టించే మరెన్నో మోసాలు వెలుగులోకి వచ్చాయి. చౌక రుణాలిస్తామంటూ ఆన్‌లైన్‌లో మాయవల విసిరి ఆరు నెలల కిస్తీ ముందే చెల్లించాలంటూ దండుకుని అదృశ్యమయ్యే దళాలు కొన్ని. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల్ని నవీకరిస్తున్నామంటూ బురిడీ కొట్టించి వివరాలు గుంజుకుని నెత్తిన టోపీ పెట్టే ముఠాలు ఇంకొన్ని. బెంగళూరు, ముంబై, హైదరాబాదుల్లో పోటెత్తుతున్న ఫిర్యాదుల సంఖ్య, కోట్ల రూపాయల మేర సొమ్ము పోగొట్టుకుని విలపిస్తున్న బాధితుల ఉదంతాలు దిమ్మెరపరుస్తున్నాయి. ఇండియా సహా వివిధ దేశాల్లో సైబర్‌ దాడుల మూలాన వచ్చే అయిదు సంవత్సరాల్లో కార్పొరేట్‌ సంస్థలకు ఎకాయెకి రూ.370 లక్షల కోట్ల దాకా భారీ నష్టం దాపురించనుందని అగ్రగామి ఐటీ సేవల సంస్థ ‘యాక్సెంచర్‌’ ఇటీవల మదింపు వేసింది. సైబర్‌ నేరగాళ్ల చొరబాటును పకడ్బందీగా అడ్డుకునే కార్యాచరణ ప్రణాళిక చురుగ్గా పట్టాలకు ఎక్కితేనే, ఆ నష్ట తీవ్రతను సాధ్యమైనంత మేర కట్టడి చేయగల వీలుంటుంది.

మూడు దశాబ్దాల క్రితమే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (వరల్డ్‌ వైడ్‌ వెబ్‌) ఆవిష్కృతమైంది. 1991లో మొట్టమొదటి వెబ్‌సైట్‌ ఊపిరి పోసుకుంది. నేడు విశ్వవ్యాప్తంగా వెబ్‌సైట్లు 190 కోట్లకు పైబడి నిరంతరం విస్తరిస్తూనే ఉన్నాయి. దేశదేశాల్లో 2015నాటికి 200 కోట్లకు చేరిన అంతర్జాల వినియోగదారుల సంఖ్య తరవాతి మూడేళ్లలోనే రమారమి 400 కోట్లకు పెరిగింది. సమాచార శకం విస్తృతి ఇంతగా మోసులెత్తుతుందన్న దూరదృష్టితో దశాబ్దాల క్రితమే సాంకేతిక పాలనకు మళ్ళిన బ్రిటన్‌ వంటివి అత్యుత్తమ డిజిటల్‌ సేవలకు మారుపేరుగా మన్ననలందుకుంటున్నాయి. సైబర్‌ నిపుణుల రూపకల్పనకు ఒకటిన్నర పుష్కరాలనాడే ప్రణాళికలల్లిన ఘనత ఇజ్రాయెల్‌ది. ఐక్యరాజ్య సమితి సైబర్‌ భద్రత సూచీ ప్రాతిపదికన ముందు వరసలో స్థానానికి సింగపూర్‌, మలేసియా, ఎస్తోనియా, మారిషస్‌, ఆస్ట్రేలియా, జార్జియా తదితరాల పోటాపోటీ- బాధితులు వరదలెత్తుతున్న భారత్‌కు కనువిప్పు కావాలి. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల మోసాలు, ఆన్‌లైన్‌ నేరాలు, సామాజిక మాధ్యమాలను అడ్డుపెట్టుకుని మహా వంచనలు మంచినీళ్లప్రాయంగా చెలరేగుతున్న సైబరాసురుల భరతం పట్టే దుర్భేద్య యంత్రాంగాల నిర్మాణం చురుగ్గా సాగాలి. అంతర్జాల దాడుల విశ్లేషణలో 15వేల నూతన మాల్‌వేర్‌ల ఆచూకీ బహిర్గతమైన దృష్ట్యా, యుద్ధ ప్రాతిపదికన సైబర్‌ నిపుణుల తయారీ కసరత్తు ఇకనైనా ఊపందుకోవాలి. దేశీయంగా వ్యాపార, సైనిక సమాచారాన్ని కంటికి రెప్పలా సంరక్షించుకునే నిమిత్తం పదిలక్షల మంది సైబర్‌ సైనిక దళం ఆవశ్యకమని ‘నాస్కామ్‌’ (సాఫ్ట్‌వేర్‌ సేవా సంస్థల జాతీయ సంఘం) గతంలోనే లెక్క కట్టింది. 2025నాటికి దేశంలో సైబర్‌ భద్రత విపణి రెండున్నర లక్షల కోట్ల రూపాయలకు పైబడనుందన్న అంచనాల వెలుగులో, సుశిక్షిత సైబర్‌ సైన్యాన్ని కదం తొక్కించడానికి సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ భారతావని సకల శక్తియుక్తుల్నీ వడివడిగా కూడగట్టుకోవాల్సి ఉంది!


Posted on 16-08-2019