Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

బుసలుకొడుతున్న కసితనం

విషతుల్య సామాజిక వాతావరణంలో, అందమైన బాల్యానికీ నేరస్వభావ మకిలంటుతోంది. నునులేత వయసులోనే రేపటి పౌరులు కొందరు తీవ్ర నేరాలకు తెగబడుతున్న ఉదంతాలు నిశ్చేష్టపరుస్తున్నాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న కూతుర్ని అనుచిత మగ స్నేహం వద్దని వారించిన పాపానికి బెంగళూరులో ఓ తండ్రి కన్నబిడ్డ చేతిలోనే కడతేరిపోయాడు. స్నేహితుడితో కలిసి తండ్రిని కత్తులతో పొడిచి చంపి మృతదేహాన్ని పెట్రోలు పోసి తగలబెట్టడానికీ వెనుదీయనంతటి క్రౌర్యం ఆ అమ్మాయిలో గూడుకట్టుకుంది! కొడైకెనాల్‌ పాఠశాల ఆవరణలో క్రికెట్‌ ఆడుతూ గొడవపడి తన సహాధ్యాయిని ఓ పదో తరగతి విద్యార్థి కత్తెరతో పొడిచి చంపేశాడు. ఇటీవల మహారాష్ట్రలోని భివాండీ జిల్లాలోనూ అటువంటి దుర్ఘటనే వెలుగు చూసింది. రాజస్థాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన దాదాపు నలభైమంది మహిళా ప్రొఫెసర్లకు ఫోన్లు చేసి అసభ్యంగా వేధించాడన్న ఆరోపణలపై ఒక కుర్రాణ్ని జైపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పది, పదకొండేళ్ల వయసులోని మైనర్‌ బాలురు అయిదు సంవత్సరాల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన దుర్మార్గం గత నెలలో దేశరాజధాని దిల్లీ నగరంలో గగ్గోలు పుట్టించింది. తల్లిని దూషించాడన్న కోపంతో చల్లపల్లి వసతి గృహంలో తనతోపాటు ఉంటున్న మూడోతరగతి పిల్లవాణ్ని చాకుతో హతమార్చిన పదో తరగతి విద్యార్థి దూకుడు, తిరుపతిలో డిగ్రీ, పీజీ విద్యార్థులు మరో కళాశాలలో చదువుతున్నవాణ్ని బీరు సీసాలతో పొడిచి చంపేసిన ఉదంతం, ద్విచక్ర వాహనాలు చోరీచేస్తూ ముగ్గురు బాలురు హైదరాబాద్‌ పోలీసుల చేజిక్కిన వైనం... తెలుగు గడ్డపై నేరగ్రస్త బాల్యానికి మచ్చతునకలు. పదేళ్లవాడిపై లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హతమార్చిన పదిహేడేళ్ల బాలనేరస్థుడికి రెండు నెలల క్రితం నాంపల్లి కోర్టు జీవితఖైదు విధించడం తెలిసిందే. ఈ నేరగ్రస్త బాలభారతంలో ప్రస్ఫుటమవుతున్నది సామాజిక విలువల ఘోర పతనమే!

ఆడుతూ పాడుతూ విద్యార్జన సాగించాల్సిన వయసులో హత్యలకు తెగబడేంతటి హింసాత్మక ధోరణులు పిల్లల్లో ఎందుకు ప్రబలుతున్నాయి? బాల్య, కౌమార దశల్లోని మాధుర్యం, మానవ సంబంధాల ప్రాముఖ్యం బొత్తిగా తెలియకుండాపోవడం రేపటి తరంలో విపరీత ప్రవర్తనకు ప్రధాన కారణమవుతోంది. నిరంతర హడావుడి జీవనశైలి మూలాన తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడటం, కుటుంబ సభ్యుల చెడు వ్యసనాలు, పరిసరాల్లో హింసాపూరిత వాతావరణం... ఇవన్నీ కలివిడిగా విడివిడిగా పిల్లల సహజసిద్ధ భావోద్వేగాల్ని అణిచేసి కక్ష, ద్వేషం, ప్రతీకార భావనల్ని పెంపొందిస్తున్నాయన్నది మానసిక నిపుణుల ఉమ్మడి మాట. నూనూగు మీసాలైనా రాని మైనర్లూ జల్సాలు, వ్యసనాలకు బానిసలై ముఠాలు కట్టి చోరీల్లో రాటుతేలుతున్నారు. విద్యాసంస్థలు, దుకాణ సముదాయాలున్న ప్రాంతాల్లో యువతుల్ని వేధిస్తూ దొరికిపోతున్నవారిలో 40శాతం మైనర్లేనని ‘షీ టీమ్స్‌’ ధ్రువీకరిస్తున్నాయి. లోగడ ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయన నివేదిక- దేశదేశాల్లో దాదాపు అయిదోవంతు బాలలు, యుక్తవయస్కులు రకరకాల కారణాలతో దారితప్పి నేరస్వభావంతో సమాజానికి పెనుభారమవుతున్నట్లు స్పష్టీకరించింది. దేశీయంగానూ బాలబాలికల్లో యువతలో నేరప్రవృత్తి పెచ్చరిల్లుతున్న వేగం దిగ్భ్రాంతపరుస్తోంది. పుట్టుకతో ఏ బిడ్డా దుష్టుడు కాడు. కొన్నేళ్లుగా బహిర్గతమవుతున్న నేరాలు నేరుగా బాలల ఖాతాలో జమపడుతున్నా- అందుకు ముఖ్య బాధ్యత తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది, మౌనంగా మిగిలిపోతున్న సమాజానిది! అసంఖ్యాక బాలలు చెడు వింటూ, చెడు కంటూ, చెడు అంటూ గాడితప్పి దుష్ప్రభావాలకు లోనవుతున్న దశలో- సత్వర దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే, ఏమైపోతుందీ దేశం?

‘భారతరత్న’ సచిన్‌ తెందుల్కర్‌ అభివర్ణించినట్లు- బిడ్డల సరైన ఎదుగుదలతో నవసమాజ నిర్మాణానికి అమ్మ లాలన, నాన్న పాలన, ఆహ్లాదకరమైన పరిసరాలు అత్యంత కీలకమైనవి. నేటి బాలలు ఆనందభరితులుగా, ఆరోగ్యవంతులుగా, వివేకశీలురుగా మారితే భావి భారతావని దృఢతరమవుతుంది. ఒక్క ముక్కలో, బాలభారతమే భాగ్యభారతం! వాస్తవంలో బాల నేరస్థుల్లోని మూడింట రెండొంతుల మంది 16-18 ఏళ్ల వయసులోపువారేనన్న నేరగణాంకాలు, బాల్యం ఎంతటి దురవస్థలో కునారిల్లుతున్నదో కళ్లకు కడుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై, దూరాలు పెరిగి ఇంట్లో ఆప్యాయతానుబంధాలు పుటుక్కున తెగిపోయే దారప్పోగులు కావడంలో- మాదక ద్రవ్యాలు, స్మార్ట్‌ఫోన్లు, అశ్లీల చిత్రాలది తిలాపాపం తలా పిడికెడు. అంతర్జాల విప్లవం దరిమిలా దేశంలోని 8-16 ఏళ్ల వయస్కుల్లో అత్యధికులు సామాజిక ప్రసార మాధ్యమాలకు అలవాటుపడ్డారని, వారిలో అయిదోవంతు పిల్లల్లో విపరీత ధోరణులు చోటుచేసుకుంటున్నాయని అధ్యయనాలు ఎలుగెత్తుతున్నాయి. తొమ్మిదేళ్ల చెల్లెల్ని బలాత్కరించిన పదిహేడేళ్ల అన్న, ‘పబ్‌ జీ’ ఆడనివ్వడం లేదన్న కోపంతో సోదరుడి తలను గోడకు బాది కడుపులో కత్తెరతో పొడిచి చంపేసిన పదిహేనేళ్ల తమ్ముడు... విశృంఖల సంస్కృతి తాలూకు విష పర్యవసానాలకు ప్రబల నిదర్శనలు. పసిపిల్లలకు తొలిబడి ఇల్లే. ఆపై దేశభవితవ్యాన్ని తీర్చిదిద్దే బాధ్యత అందిపుచ్చుకోవాల్సింది తరగతి గదే. రేపటి తరాన్ని పెనువిధ్వంసం బారినుంచి కాపాడేలా వాటిని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దాల్సిన భూరి కసరత్తు ఇక ఎంతమాత్రం ఉపేక్షించరానిది. స్వేచ్ఛ, రక్షణ, విశ్వాసాలతో కూడిన బాల్యదశ దేశంలో పిల్లలందరికీ విధిగా దఖలుపడేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు కాచుకుంటేనే- బాలభారతం తెప్పరిల్లుతుంది!


Posted on 21-08-2019