Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ఉగ్ర భూతాలకు ఉరే సరి!

* మరణ దండనపై లోతైన చర్చ
కంటికి కన్ను, పంటికి పన్ను సూత్రం ప్రకారం ఒక మనిషిని చంపినవాడికి మరణశిక్ష విధించడం సబబే అయితే, అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై అత్యాచారం జరపడమూ సబబు అవుతుంది కదా! భారతదేశంలో మరణశిక్ష కొనసాగించాలా వద్దా అనే అంశంపై దిల్లీలో లా కమిషన్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అందర్నీ తొలిచిన ప్రశ్న ఇది. మరణ శిక్షను ఆ సమావేశం ముక్తకంఠంతో వ్యతిరేకించింది. దరిమిలా భారత చట్టాల నుంచి సాధ్యమైనంత త్వరగా మరణశిక్షను తొలగించాలని ప్రభుత్వానికి లా కమిషన్‌ సిఫార్సు చేసినా, ఉగ్రవాదులకూ, దేశంపై యుద్ధం ప్రకటించేవారికి మాత్రం మరణ దండన విధించవచ్చునని స్పష్టీకరించింది. అయితే, మున్ముందు మరణశిక్షను రద్దు చేయడమే భారతదేశ లక్ష్యం కావాలని సూచించింది. మన చట్టాలలో మరణశిక్షను అట్టిపెట్టాలని 1967లో సిఫార్సు చేసిన కమిషన్‌, తాజా నివేదికలో భిన్నరాగం ఆలపించడం విశేషం. 1980లో బచ్చన్‌ సింగ్‌ కేసు తీర్పులో సుప్రీం కోర్టు 'అరుదాతి అరుదైన' కేసుల్లో మాత్రమే మరణ శిక్ష విధించాలని పేర్కొనగా, అరుదాతి అరుదు అంటే ఏమిటో లోప రహితంగా నిర్వచించడం అసాధ్యమని లా కమిషన్‌ తేల్చింది. న్యాయమూర్తులు శిక్షలు విధించే తీరును వారి వ్యక్తిగత విలువలు, ఇష్టాయిష్టాలు ప్రభావితం చేయవచ్చునని గుర్తుచేసింది. 'టెర్రరిజం, దేశంపై యుద్ధానికి సంబంధించిన కేసుల్లో మరణ దండన' విధించవచ్చనే సూత్రాన్ని సమర్థిస్తూనే మరణ భయం టెర్రరిస్టులను ఆపలేదని ఒప్పుకొంది.

రద్దుకు అవకాశాలు లేనట్టే

కానీ, లష్కరే తోయిబా, ఇస్లామిక్‌ స్టేట్‌, అల్‌ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల నుంచి టెర్రరిజం ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మరణ శిక్ష రద్దుకు అంగీకరించే అవకాశం లేదు. అరుదాతి అరుదు సందర్భమేమిటో లోప రహితంగా నిర్ణయించడం కష్టమనీ, ఈ నిర్వచనం పరిధిలోనూ మరణ శిక్ష విధింపు రాజ్యాంగబద్ధమనిపించుకోదనీ లా కమిషన్‌ చేసిన వ్యాఖ్యకు సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. లా కమిషన్‌లో ప్రభుత్వ ప్రతినిధులైన కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి పికె మల్హోత్రా, లెజిస్లేటివ్‌ విభాగ కార్యదర్శి డాక్టర్‌ సంజయ్‌ సింగ్‌ కమిషన్‌ నివేదికకు తమ అభ్యంతర పత్రాలను జతచేయడం ఇక్కడ గమనార్హం. మరో సభ్యురాలు, దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉషా మెహ్రా కూడా నివేదికలోని అంశాలతో విభేదించారు. కమిషన్‌ నివేదిక హంతకుల మానవ హక్కులకు ప్రాధాన్యమిస్తూ బాధితుల హక్కులను గాలికి వదిలేసిందని ఉషా మెహ్రా వ్యాఖ్యానించారు. 'నిఠారి కేసులో హంతకునికి మరణ శిక్ష కాక మరే శిక్ష విధించాలి? కసబ్‌, అఫ్జల్‌ గురుల నేరాలను ఏ విధంగా క్షమించగలం?' అని ఆమె ప్రశ్నించారు. న్యాయ శాఖ కార్యదర్శి మల్హోత్రా మరణ శిక్షను మున్ముందు రద్దు చేయాలన్న లక్ష్యం మంచిదేనంటూనే, 'నేరానికి పాల్పడే వ్యక్తి తాను చేసిన పని ఎలాంటి పర్యవసానానికి దారితీస్తుందో గ్రహించాలి. శిక్షే ఉండనప్పుడు చట్టానికి అర్థం లేకుండా పోతుంది' అన్నారు. 'దేశ సమగ్రత, సార్వభౌమత్వాల రక్షణకు చట్టాలు చేసే అధికారాన్ని ప్రభుత్వం నుంచి దూరం చేయకూడద'ని లెజిస్లేటివ్‌ విభాగ కార్యదర్శి సంజయ్‌ సింగ్‌ ఉద్ఘాటించారు. మరణ శిక్ష రద్దయితే నేరస్థుల్లో చట్టమంటే భయం పోయి దారుణ నేరాలు పెరుగుతాయన్నారు.

మరణ శిక్షకు నేర నిరోధక స్వభావం ఉందనడం తప్పని మరోవైపు మానవ హక్కుల ఉద్యమకారులు వాదిస్తున్నారు. యావజ్జీవ శిక్ష కన్నా మరణ శిక్షే నేరాలను సమర్థంగా నిరోధిస్తుందన్న వాదన నిరూపితం కాలేదని 1988లో ఐక్యరాజ్య సమితి సర్వే స్పష్టం చేసింది. 1976లో కెనడాలో మరణ శిక్షను రద్దుచేసిన తరవాత హత్యా నేరాలు 44శాతం తగ్గాయి. మరోవైపు అమెరికాలో గడచిన 20ఏళ్లలో మరణ శిక్షను అమలు చేయని రాష్ట్రాల్లోకన్నా ఆ శిక్ష విధించే రాష్ట్రాల్లో 48నుంచి 100శాతం ఎక్కువ హత్యా నేరాలు నమోదవుతున్నాయని 2000 సంవత్సరంలో 'న్యూయార్క్‌ టైమ్స్‌' పత్రిక సర్వే తేల్చింది. అందుకే నేడు ప్రపంచంలోని 198 దేశాలకుగాను 150 దేశాల్లో మరణ శిక్షను రద్దు చేశారు. ఈ దేశాల్లో టెర్రరిస్టు నేరాలకు సైతం మరణ దండన విధించడంలేదు. 2012 డిసెంబరులో మరణ శిక్షపై మారటోరియం విధిస్తూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానానికి 111 దేశాలు సమ్మతి తెలిపాయి.

మరణ శిక్షను ఉంచాలా, రద్దు చేయాలా అనే అంశంపై తర్కమూ, భావోద్వేగాలూ సంఘర్షిస్తున్నాయి. తార్కికంగా చూస్తే తీర్పులో పొరపాట్లకు ఎంతో ఆస్కారం ఉంది. దీనికి ఉదాహరణగా లా కమిషన్‌ 2002నాటి అక్షర్‌ ధామ్‌ ఆలయ దాడిని ప్రస్తావించింది. ఈ కేసులో నిందితులకు విచారణ కోర్టు విధించిన మరణ శిక్షను హైకోర్టు నిర్ధరించినా, చివరకు తప్పుడు సాక్ష్యాధారాల ప్రాతిపదికపై మరణ శిక్ష విధించారని సుప్రీం కోర్టు తేల్చింది. ఇదేమీ కొత్త కాదు. న్యాయవాదులకు బోలెడు డబ్బు ధారపోసి, తమ కేసులు వాదించుకోలేని పేద, బలహీన వర్గాల నిందితులకు అభూత కల్పనల్లాంటి సాక్ష్యాల పునాదిపై మరణ శిక్షలు విధించడం సర్వసాధారణం. యావజ్జీవ శిక్ష విధించగలిగిన కేసుల్లో మరణ శిక్ష విధించిన సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం టెర్రరిజం కేసుల్లో మరణ శిక్షకు గురైనవారిలో 93.5 శాతం మంది దళితులూ, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకూ చెందినవారే. నిందితులను చిత్రహింసలు పెట్టి నేరం ఒప్పించే అలవాటు, ఏవో కట్టుకథలు అల్లి సాక్ష్యాలుగా చెలామణి చేసే నేర్పు మన పోలీసులకు పుష్కలమని మానవ హక్కుల ఉద్యమకారులు వాదిస్తుంటారు. పోలీసులు నేర పరిశోధనలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి అమాయకులపై కేసులు బనాయిస్తుంటారనే ఆరోపణ తరచూ వినవస్తున్నదే. 'నిందితులు శక్తిమంతులైనప్పుడు బాధితులను, సాక్షులను బెదిరించో, ఇతర విధాలా బలప్రయోగం చేసో వారి నోరు మూయిస్తున్నారు. దీన్ని నివారించడానికి సాక్షుల రక్షణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని లా కమిషన్‌ సూచించింది. సముచిత సందర్భాలలో బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి భారతీయ నేర శిక్షాస్మృతి (1973) తమకు ఇచ్చిన అధికారాన్ని కోర్టులు ఉపయోగించుకోవాలని లా కమిషన్‌ సూచించింది. క్షమాభిక్ష అర్జీలను పెట్టుకునే అవకాశాన్ని 72వ, 161వ రాజ్యాంగ అధికరణలు ఇస్తున్నా, మరణ శిక్షల విధింపులో న్యాయ భంగం జరగకుండా అవి ఆపలేకపోయాయని కమిషన్‌ పేర్కొంది. 1950 జనవరి 26నుంచి ఇంతవరకు రాష్ట్రపతులు 306 క్షమాభిక్ష పిటిషన్లను ఆమోదించి, 131 పిటిషన్లను తోసిపుచ్చారని గుర్తు చేసింది. క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి తోసిపుచ్చినప్పుడు, ఆయన నిర్ణయాన్ని పరిమిత కారణాలపై న్యాయస్థానాల్లో సవాలు చేయవచ్చునని గతంలో సుప్రీం కోర్టు పేర్కొనడం నిజంగా ప్రగతిశీల చర్య. ఇలా చట్టాల్లో, రాజ్యాంగంలో న్యాయపాలనకు కొన్ని ఏర్పాట్లు చేసినా చివరకు మరణశిక్ష విధించడం, దాన్ని రద్దుచేయడమనేది న్యాయ నిర్ణేతల వ్యక్తిగత తర్కం మీద ఆధారపడి ఉంటుంది.

మరోవైపు సమాచార సాధనాలు అపారంగా విస్తరించిన ఈ రోజుల్లో మరణ శిక్షల అమలు చుట్టూ తీవ్ర భావోద్వేగాలు ముప్పిరిగొనడం సర్వసాధారణమైపోయింది. ఇక్కడ తర్కం ఎవరికీ పట్టదు. 'ప్యూరిటన్లు సుఖం, ఆనంద భావనలను దరిచేరనీయని స్వచ్ఛతావాదులు. ఎలుగుబంటిని గుంజకు కట్టి దాని మీదకు వేటకుక్కలను ఉసిగొల్పే హింసాత్మక క్రీడను వారు వ్యతిరేకించారంటే కారణం- ఆ మూగజీవి ఆక్రందనలను వినలేక కాదు. ప్రేక్షకులు ఆనందం పొందకూడదనే' అని 19వ శతాబ్ది బ్రిటిష్‌ విద్యావేత్త థామస్‌ మెకాలే వ్యాఖ్యానించారు. బహుశా లా కమిషన్‌కూ ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయేమో తెలియదు. కానీ, టెర్రరిస్టు దాడుల పట్ల ప్రజాగ్రహాన్నీ, మీడియా తమాషానూ లా కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంది. ఇలాంటి కేసుల గురించి ప్రజలకు సంపూర్ణ సమాచారం అందే అవకాశం లేదు. అరకొర సమాచారం మీద ఆధారపడి వారు అపరిపక్వ నిర్ధరణలకు వస్తుంటారు. కాబట్టి ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే టెర్రరిస్టులకు శిక్ష విధించామనడం ఒట్టి అభూత కల్పన అని లా కమిషన్‌ తేల్చింది. కానీ, టెర్రరిస్టుల దాడులపై జనంలో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకడం, ప్రతిపక్షాలు ఈ దాడులను ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని దుయ్యబట్టడం కాదనలేని సత్యం. ఈ భావోద్వేగ వాతావరణంలో టెర్రరిస్టులకు మరణ శిక్ష విధింపు రాజకీయ, ఎన్నికలపరమైన అనివార్యతగా పరిణమిస్తోంది.

రాజకీయాలు, ఒత్తిళ్లు...

ఇదే ఉద్వేగ వాతావరణం అమరవీరులనూ సృష్టిస్తుందని భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు వరుణ్‌ గాంధీ వ్యాఖ్యానించారు. మతపరమైన, సైద్ధాంతికపరమైన టెర్రరిస్టు చర్యలకూ, రాజకీయ హత్యలకూ పాల్పడినవారిని వారి మద్దతుదారులు అమరవీరులుగా కొనియాడతారు. ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరు హత్యా స్థలంలోనే హతమారగా, రెండో హంతకుడిని ఉరితీశారు. ఆ ఇద్దరినీ (బియాంత్‌, సత్వంత్‌ సింగ్‌లను) సిక్కు మతం కోసం ప్రాణాలర్పించిన వీరులుగా 2008లో అకాల్‌ తఖ్త్‌ ప్రకటించింది. ఆపైన బియాంత్‌ సింగ్‌ కుటుంబం రాజకీయాల్లోకి ప్రవేశించి రాణించింది. రాజీవ్‌ గాంధీ హంతకులను ఉరికంబం నుంచి తప్పించడానికి తమిళనాడు ముఖ్యమంత్రి తీవ్రంగా కృషిచేశారు. యాకూబ్‌ మెమన్‌ అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో జనం హాజరుకావడాన్ని చూస్తే, అతడి పట్ల వివిధ వర్గాల్లో ఎంత సానుభూతి ఉన్నదో అర్థమవుతుంది. కానీ, నిర్భయ కేసులో ముద్దాయిల పట్ల ఎవరికీ సానుభూతి లేదు.

ప్రాణాలపై ఆశ వదిలేసి దాడులకు పాల్పడే టెర్రరిస్టులకు ఇతరుల సానుభూతితోకానీ, క్షమాభిక్షలతో కానీ పని లేదు. మతపరమైన ఉగ్రవాదులు పరులను చంపి, తామూ చద్దామనుకొంటారు. దీనివల్ల ఎకాయెకి స్వర్గానికి వెళ్లిపోతామని నమ్ముతారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ప్రభుత్వం, లా కమిషన్‌ భావిస్తున్నాయి. పోనీ, మానవ హక్కుల ఉద్యమకారులు సూచిస్తున్నట్లు వారిని యావజ్జీవం జైలులో ఉంచుదామా అంటే, దానిలోనూ బోలెడు చిక్కులున్నాయి. వారికి జైలులో బుద్ధి వచ్చే మాట అటుంచి, వారి విడుదల కోసం సాటి ఉగ్రవాదులు మరిన్ని అఘాయిత్యాలకు పాల్పడటం ఖాయం. భారతీయ జైలులో ఉన్న మౌలానా మసూద్‌ అజహర్‌, షేక్‌ ఒమర్‌లను విడిపించుకోవడానికి పాక్‌ ఉగ్రవాదులు భారతీయ విమానాన్ని కాందహార్‌కు హైజాక్‌ చేసిన ఘటనను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఏతావతా టెర్రరిస్టులతో, దేశంపై యుద్ధం ప్రకటించేవారితో భారతీయులకు ఎలాంటి భావోద్వేగ బంధమూ ఉండదు. అలాంటి బంధాలూ ఉంటే గింటే సరిహద్దుకు ఆవల నివసించేవారికే ఉంటాయి. వారి మనోభావాలను గౌరవించి మరణ శిక్షలు రద్దుచేయాల్సిన అవసరం కానీ, అగత్యం కానీ భారత ప్రభుత్వానికి లేవు.

(రచయిత - ఆర్య)
Posted on 17-10-2015