Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

తెలుగు నుడికి గుడి

* నేడు తెలుగు భాషాదినోత్సవం

‘తేనెతేటల నవకంపు సోనలకును సాటియగును మా తెలుగు భాషామతల్లి’ అని సురవరం ప్రతాపరెడ్డి కీర్తించినా, ‘నీ తెలుగెవ్వరిపాలు చేసితివాంధ్రా’ అని వేలూరి శివరామశాస్త్రి ఆవేదన చెందినా రెండూ వాస్తవాలే. మన తెలుగును ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అని, విభిన్న స్రవంతులను తనలో లీనం చేసుకోగల సామర్థ్యం గలదంటూ, అత్యంత సమన్వయ శక్తిసంపన్నమైనదిగా, రూపనిష్పత్తి, వైవిధ్యం గల భాషగా పాశ్చాత్య మేధావులు ప్రశంసించారు. నేటితరం మాత్రం ‘వర్తమాన అవసరాలకు మన తెలుగుభాష సరిపోతుందా?’ అని పరభాషా వ్యామోహంలో పలవరిస్తున్నది. ‘మా పిల్లలకు తెలుగు రాదు’ అని సగర్వంగా చెప్పుకొంటున్న తల్లిదండ్రుల్ని చూసి కాబోలు- కాళోజీ ‘తెల్గు బిడ్డవయ్యి తెలుగు రాదంచును సిగ్గులేకనింక చెప్పుటెందుకురా, అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అని ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. నానాటికీ ఈ తరానికి తల్లి భాష దూరమైపోతున్నదనే ఆవేదన భాషాభిమానుల్లో ఉంది.

మనిషి ఉనికికి కీలకం భాష, ప్రాణం భాష. నాగరికతా వికాసంలో భాషలదే ప్రధాన పాత్ర. ఏ భాషైనా ఆ భాష మాట్లాడే మనుషుల చారిత్రక, సామాజిక, జ్ఞాన అనుభవాలను జీర్ణించుకుని మనుగడ సాగిస్తుంది. ప్రపంచంలో ఒక నిర్ణీత ప్రదేశం, ప్రత్యేక భాష, సంస్కృతి, చరిత్ర కలిగిఉన్న జన సముదాయాన్ని ఒక జాతిగా పరిగణిస్తారు. భాషాపరంగానే జాతికి ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. భాషకు పరమ ప్రయోజనం మనుషుల మధ్య భావ ప్రసరణకు ప్రధాన వాహికగా ఉపయోగపడటమే. భాష మనుషుల హృదయ స్పందనను, బుద్ధి వైభవాన్ని వెల్లడిస్తుంది. మానవుల మధ్య సామాజిక బాంధవ్యాన్ని నెలకొల్పుతుంది. ప్రజాస్వామ్యం ఉనికికి ఆయువుపట్టు భాష. భాష కారణంగానే జనజీవనం సుసంపన్నంగా మారుతుంది.

సంస్కృతీ దర్పణం
ఒక జాతి సంస్కృతి రూపుదిద్దుకోవడంలో జాతికి ముఖం వంటి మాతృభాష ప్రధాన భూమిక పోషిస్తుంది. భాషకు అంతరంగంలా సంస్కృతి, సంస్కృతికి వెన్నెముకలా భాష ఏర్పడతాయి. ఒక జాతికి దాని భాషా సంస్కృతులకు విడదీయరాని సంబంధం ఏర్పడుతుంది. మన మాతృభాష స్థాయిని ఎంత పెంచుకుంటే మన సంస్కృతి అంత ఉచ్ఛస్థితిలో ఉంటుంది. ఈ రెండింటివల్లా సమాజం మరింత అభివృద్ధి సాధించగలుగుతుంది. ఈ విషయంలో తెలుగువారు ఇతర భాషా సమాజాలకన్నా వెనకబడి ఉన్నారనడం అహేతుకమేమీ కాదు. పొరుగున తమిళ, కన్నడ, మలయాళ, ఒడియా భాషీయులకన్నా మాతృభాషను అక్కున చేర్చుకోవడంలో తెలుగువారిది అలసత్వ ధోరణి. ‘నేను తెలుగువాడిని’ అని చెప్పుకోవడానికి తగిన వాతావరణాన్ని కల్పించుకోలేకపోయాం. ఈ తరంలో తెలుగు భాష వాడకం తగ్గిపోవడం కలవరపరుస్తోంది. కొంత కాలంగా భాషోద్యమాలు ప్రారంభమయ్యాయి. ‘తెలుగు తక్కువస్థాయి భాష... ఒకప్పుడు సంస్కృతం, తరవాత ఆంగ్లం గొప్ప భాషలు’ అనే అభిప్రాయం విద్యావంతుల్లో చోటుచేసుకుంది. సంస్కృత పదాల వాడకం పెరిగి అసలైన తెలుగు పదాలను మరచిపోతున్నాం. పండితులు చాలామంది ఇప్పటికీ సంస్కృతాన్నే ఆదరిస్తుండగా, ఆధునిక విద్యాధికులు ఆంగ్ల వ్యామోహంలో ఉన్నారు. తెలుగు పదాలను చదువు లేని గ్రామీణ ప్రజలే నేటికీ వాడుతున్నారు.

మనం తెలుగు నుడికారాన్ని మరచిపోతున్నాం. తెలుగు సంస్కృత భాషాజన్యమని కొందరు పండితులు భావిస్తే, తెలుగు మూల ద్రావిడ భాషలోంచి పుట్టిందని పాశ్చాత్య భాషావేత్తలు, భారతీయ భాషా శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. తెలుగు ద్రావిడ భాష అనే వాదనే ప్రబలంగా ప్రాచుర్యంలో ఉంది. మారేపల్లి రామచంద్రశాస్త్రి 90 ఏళ్ల క్రితం ‘తెలుగు స్వతంత్ర భాష’ అని ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ద్రావిడ భాష తెలుగుకు తల్లి కాదని, తోబుట్టువని అన్నారు. ఆయన ఎన్నో అచ్చ తెలుగు పదాలను సృష్టించారు. ‘నుడిదండ’ పుస్తకం రాశారు. ‘తెలుగు నుడికడలి’ తయారు చేయడానికి నాలుగు దశాబ్దాలు శ్రమించారు. అందులో చాలా భాగం పాడైపోవడం తెలుగు జాతి దురదృష్టం. ఆదిభట్ల నారాయణదాసు ‘వెన్నుని వేయి పేరుల వినుకలి’ పేరుతో విష్ణు సహస్రనామాలను తెలుగు చేశారు. ‘తల్లి-విన్కి’ పేరుతో లలితా సహస్రనామాలను పద్య, గద్యాత్మకంగా తెలుగులో రాశారు. శ్రామికజనుల నిత్య వ్యవహారంలో ఆయా వృత్తులకు సంబంధించిన పారిభాషిక పదాలు లభిస్తాయి. గతంలో వృత్తి పదకోశాలు వెలువడకపోలేదు. ప్రజల భాషను, వివిధ వృత్తులవారి పదజాలాన్ని నిఘంటువుల్లో చేర్చాలి. వాటికి ప్రామాణికత కల్పించాలి. మాండలికాలను, యాసలను ‘గ్రామ్యం’గా భావించడం తగదు. ‘తెనుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది’ అని చెళ్ళపిళ్ళవారు భావించారు. తెలుగు భాషకు సమగ్ర నిఘంటువు రావలసి ఉంది.

ప్రపంచంలో నాగరికత, విజ్ఞానం పెరుగుతున్నప్పుడు ప్రజల అవసరాల మేరకు కొత్త వస్తుసామగ్రి వాడకంలోకి వస్తుంది. ఇతర దేశాల సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుతుంది. ఆ వస్తు సముదాయాన్ని వ్యక్తీకరించే పదజాలం మన భాషలో లేకపోవచ్చు. దాన్ని రూపొందించుకోవాలి. అంతవరకు ప్రసిద్ధంగా ఉండే అన్యదేశ్యాలను ఉపయోగించుకోవడం తప్పు కాదు. తెలుగుభాషను సాంకేతికంగా వైజ్ఞానికంగా తీర్చిదిద్దాలి. సంగీత, సాహిత్య, నాట్యాది కళా ప్రక్రియల వైభవానికి ఆలంబనగా నిలిచిన భాష... ఆధునిక భావజాల వ్యక్తీకరణకు పనికిరాదనే వాదన సరికాదు.

అభినవ వాగనుశాసనుడు
‘దేశానికి స్వాతంత్య్రం ఎటువంటిదో, ప్రజలకు భాషా స్వాతంత్య్రం అటువంటిదే. స్వాతంత్య్రాన్ని నిరుపయోగమో, దురుపయోగమో చేయకూడదు కదా...’ అన్నారు గిడుగు రామమూర్తి. ఆయన తెలుగులో తొలి భాషా శాస్త్రజ్ఞుడు. వ్యావహారిక భాషోద్యమంతో ప్రజల భాషకు పట్టం కట్టడానికి జీవితాంతం కృషి చేశారు. తెలుగు వాడుకభాషకు గౌరవం కల్పించడమే గిడుగు ఏకైక లక్ష్యం. ‘దేశ క్షేమానికి భాషా క్షేమం పునాది’ అని ఆయన భావించారు. ఆయన జయంతిని తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. తెలుగు భాషను రక్షించుకోవడం తెలుగువారి ఆత్మగౌరవ సమస్య. ఈ విషయంలో సామాజిక చైతన్యం పెరగాలి. తల్లిభాషలో విద్య నేర్చుకునే విద్యార్థిలో సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ, నేర్చుకునే గుణం, చదివే తత్వం పెరుగుతాయనే వాస్తవాన్ని అందరూ గుర్తించేలా చేయాలి. తల్లి భాషను కాపాడుకోవడమంటే తల్లిని గౌరవించడమే. జాతి సంపదను సంరక్షించుకోవడమే!


- డి. భారతీదేవి
Posted on 29-08-2019