Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

మాదాలకు కారణాలెన్నో...

* భద్రతకు భరోసా ఇవ్వని మోటారు వాహన చట్టం

ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశంగా భారత్‌ చెడ్డపేరు మూటగట్టుకుంది. ఇక్కడ సగటున ఏటా లక్షన్నర మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుంటే, మరో అయిదు లక్షలమంది గాయపడుతున్నారు. వారిలో కొందరు జీవితాంతం వికలాంగులుగా మిగిలిపోతున్నారు. ఈ దుస్థితిని మార్చడానికంటూ కేంద్రం మోటారు వాహనాల సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రపంచంలో మహా అధ్వానమైన రహదారులున్న దేశంగా ఒకప్పుడు చైనా ఉండగా, 2006లో ఆ స్థానాన్ని భారత్‌ భర్తీ చేసింది. వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పెరుగుతున్న మోటారు వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు, మరణాలు పెచ్చరిల్లుతున్నాయి. కొత్త చట్టాన్ని ఉపయోగించి రహదారులపై వాహనచోదకుల నడతను మార్చాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. తాగి కారు నడిపేవారికి భారీ జరిమానాలు, జైలుశిక్షలు విధించడం, వాహన తయారీలో నిర్దేశిత ప్రమాణాలు పాటించని ఉత్పత్తిదారులకూ భారీ జరిమానా వడ్డింపు వంటివి చట్టంలో పొందుపరచారు. లైసెన్సు లేకుండా వాహనం నడపడం, అతి వేగం, ప్రమాదకర డ్రైవింగ్‌, పర్మిట్లు లేకుండా బండి తోలడం, తాగి నడపడం వంటి నేరాలకు లోగడకన్నా భారీ జరిమానాలను ప్రతిపాదించారు. ఆంబులెన్సు, అగ్నిమాపక వాహనాలకు దారి ఇవ్వకపోవడం, సీటు బెల్టు, హెల్మెట్లు ధరించకపోవడం వంటి ఉల్లంఘనలకు జరిమానాలు, జైలుశిక్షలు విధిస్తారు.

లోతైన విశ్లేషణ అవసరం
భారీ వడ్డనలు వాహనదారుల్లో కొంతవరకు జంకు కలిగించవచ్చునేమో కాని, కేవలం జరిమానాలతోనే ఆశించిన మార్పు వచ్చేస్తుందనుకోవడం పొరపాటు. రోడ్డు భద్రతకు ఇతర దేశాల్లో విజయవంతంగా అనుసరించిన నమూనాలను అధ్యయనం చేసి, వాటిలో మన దేశానికి పనికొచ్చే అంశాలను ఆచరించాలని సామాజిక మాధ్యమాల్లో అనేకమంది సర్కారుకు హితబోధ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు కేవలం చోదకుల నిర్లక్ష్యమే కారణమని తీర్మానించడం సబబు కాదు. రోడ్ల ఆకృతి, నిర్మాణాల్లో లొసుగులూ ఓ ముఖ్య కారణం. అయినా అలాంటి రోడ్లు వేసిన గుత్తేదారులపై కాని, వారికి పనులు అప్పజెప్పిన ప్రభుత్వంపై కాని చర్యలు తీసుకోవడానికి మన చట్టాల్లో అవకాశం లేకపోవడం నిజంగా చోద్యం. ప్రధాన రహదారులపై గుంతలు, మరేవైనా లోపాలు ఏర్పడిన వెంటనే వాటిని సరిచేయకపోవడం వల్లనే తీవ్ర ప్రమాదాలు జరిగి మరణాలు పెరిగిపోతున్నాయి. ఎందరో గాయాలపాలవుతున్నారు. రహదారులు నిర్మించే సంస్థలు గుంతలు పూడ్చటంపై శ్రద్ధపెట్టవు. ట్రాఫిక్‌ లైట్లు, వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా అని పట్టించుకోవు. రహదారులపై చెట్లు, శిథిలాలు పడినా వాటికేం పట్టదు. ఈ లోపాల వల్ల వాహనాలు చోదకుల అదుపు తప్పి ప్రమాదాలు జరిగిపోతున్నాయి. అందుకే రోడ్డు ప్రమాదాలకు పూర్తిగా డ్రైవర్లనే బాధ్యులను చేయడం తగదని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించారు. రోడ్ల ఆకృతి, నిర్మాణ నిర్వహణల్లో లోపాలూ ప్రమాద హేతువులు అవుతున్నాయని ఆయన చెప్పింది నిజం. దేశంలో 786 ప్రాంతాల్లో గల రోడ్లపై ఇలాంటి లోపాలు ఉండి తరచూ అవి తీవ్ర ప్రమాదాలకు నెలవులు అవుతున్నాయని, ఈ లోపాలు సరిచేయడానికి తమ శాఖ రూ.14,500 కోట్లు మంజూరు చేసిందని గడ్కరీ వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిధిలోని రహదారుల ఇంజినీరింగ్‌ను పునస్సమీక్షించి, లోపాలను తక్షణం సరిదిద్దాలి. కొత్త చట్టం వాహన చోదకుల నిర్లక్ష్యాన్ని శిక్షించడానికి ప్రాధాన్యమిచ్చిందే తప్ప, పైన చెప్పుకొన్న లోపాలపై సరిగ్గా దృష్టిపెట్టలేదని విమర్శలు వచ్చాయి. గుత్తేదారులు, అధికారులు సరైన ఇంజినీరింగ్‌ డిజైన్లు, ప్రమాణాలతో రహదారులు నిర్మించకపోతే రోడ్డు ప్రమాదాలకు, మరణాలకు వారిని బాధ్యుల్ని చేయాలన్న నిబంధనను చట్టంలో పొందుపరచారు.

బ్రెసీలియా ప్రకటనగా పేరొందిన ఐక్యరాజ్య సమితి రహదారి భద్రతా దశాబ్ది కార్యాచరణ ప్రణాళికపై సంతకం చేసిన దేశాల్లో భారత్‌ కూడా ఉంది. 2011 నుంచి 2020 వరకు అమలులో ఉండే ఆ ప్రకటన కింద 2020కల్లా స్వదేశంలో రోడ్డు ప్రమాదాలను సగానికి సగం తగ్గిస్తానని వాగ్దానం చేసినా, అది ఇప్పట్లో నెరవేరుతుందన్న ఆశ లేదు. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 11 శాతం భారత్‌లో చోటుచేసుకుంటున్నాయి. వీటిని నివారించడానికి కొత్త చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంతోపాటు రహదారి భద్రతా వసతులనూ ఆధునికీకరించాలి. పట్టణీకరణ, వాహనాల సంఖ్య విజృంభించడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరగడం దురదృష్టకరమైతే, వాటిలో చనిపోతున్నవారిలో అత్యధికులు యువజనులు కావడం ఎంతో విచారకరం. ఇది దేశ భవిష్యత్తు మీద, ఉత్పత్తి ఉత్పాదకతలపైన అత్యంత తీవ్ర ప్రభావం చూపుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బ్రెసీలియా ప్రకటన అయిదు అంశాలకు ప్రాధాన్యమిచ్చింది. అవి- రహదారి భద్రత నిర్వహణ, భద్రమైన రహదారులు, భద్రంగా బండి నడిపే చోదకులు, భద్రమైన వాహనాలు, ప్రమాదానంతరం శీఘ్ర స్పందన. ప్రభుత్వం కేవలం జరిమానాలు, శిక్షల మీదనే దృష్టిపెట్టకుండా వీటన్నింటి అమలుకు పూనుకోవాలి. ప్రజల్లో రహదారి భద్రత గురించి అవగాహన పెంచాలి. నియమ నిబంధనల గురించి విస్తృత ప్రచారం చేయాలి. అశాస్త్రీయ డిజైన్‌లతో రోడ్ల నిర్మాణానికి తావులేకుండా చూడాలి. దేశంలో 80 శాతం కార్లు అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు సరితూగవు. ఈ లోపాలను సరిదిద్దాలి.

సాంకేతికతతో నివారణ చర్యలు
వాహనాల్లో ఎలక్ట్రానిక్‌ స్థిరత్వ వ్యవస్థ (ఈఎస్పీ)ని అమర్చితే, రోడ్లపై బండి జారడం వల్ల సంభవించే ప్రమాదాల్లో 70 శాతాన్ని నివారించవచ్చని బాష్‌ సంస్థ పరిశోధన తేల్చింది. భారత్‌లో బండి అదుపు తప్పడం వల్ల సంభవించే చావులు మొత్తం రోడ్డు ప్రమాద మరణాల్లో 12 శాతంగా ఉన్నాయి. ఐరోపా దేశాల్లో ఈఎస్పీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఎంతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌)ను అమర్చినప్పుడు 20 శాతం కారు ప్రమాదాలను, 33 శాతం ద్విచక్ర వాహన ప్రమాదాలను నివారించినట్లూ బాష్‌ పరిశోధన తెలిపింది. భారత్‌ కూడా ఇలాంటి వ్యవస్థలను చేపట్టాలి. సింగపూర్‌లో జన, వాహన సాంద్రత చాలా ఎక్కువే అయినా భద్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించగలుగుతోంది. వాహన చోదకుల్లో అవగాహన పెంచడంతోపాటు ఆటొమేటిక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, అలారం వ్యవస్థ వంటి సాంకేతిక అమరికలతో ప్రమాదాల సంఖ్యను బాగా తగ్గించగలిగింది.

రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించడానికి స్వీడన్‌ 1997లో చేపట్టిన ‘విజన్‌ జీరో’ను అన్ని ఐరోపా దేశాలూ అనుసరిస్తున్నాయి. రోడ్ల నిర్మాణంలో వేగంకన్నా భద్రతకు స్వీడన్‌లో అధిక ప్రాధాన్యమిస్తారు. పట్టణాల్లో వాహనాలు చాలా తక్కువ వేగంతో వెళ్లాలని నిబంధన విధించారు. సైకిళ్లకు, మోటారు వాహనాలకు వేర్వేరు లైన్ల నిర్మాణం, పాదచారులకు ప్రత్యేకించిన కాలిబాటలు రహదారి ప్రమాదాలను దాదాపు పూర్తిస్థాయిలో నివారించాయి. స్వీడన్‌, సింగపూర్‌ల నుంచి భారత్‌ నేర్చుకోవలసింది ఎంతో ఉంది.

- నీరజ్‌ కుమార్‌
Posted on 01-09-2019