Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అందరికీ నీళ్లు... అందక కన్నీళ్లు

* అప్రమత్తం కాని ప్రభుత్వాలు

భూమండలంలోని సమస్త ప్రాణికోటి మనుగడకు ఆధారమైన తాగునీరు తగినంత లేక అంతటా ఇబ్బందులు పెరుగుతున్నాయి. పాశ్చాత్య సమాజాలను పక్కనపెడితే- పేదదేశాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. తీవ్రమైన తాగునీటి కొరతతో ఈ దేశాలు తల్లడిల్లుతున్నాయి. దీనికితోడు పారిశుద్ధ్య సమస్యలూ తీవరిస్తున్నాయి. బలహీన ప్రభుత్వాలు; మానవ వనరులు, నిధుల కొరత ఈ దుస్థితికి ప్రధాన కారణాలు. ఈ పరిస్థితుల్లో సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్య వ్యవస్థలను తక్షణం బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. లేనట్లయితే సరికొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఐరాస జల సంస్థ ప్రమాద ఘంటికలు మోగించాయి. నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి. తగినన్ని మరుగుదొడ్లు, చేతులు శుభ్రం చేసుకునే సౌకర్యాలు లేక ప్రజలు అంటువ్యాధులకు గురవుతున్నారు. ఇది ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. అంతేకాక వారి ఆర్థిక ప్రగతినీ దెబ్బతీస్తోంది. వ్యాధుల నివారణకు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్య వ్యవస్థలు పాదుకొంటే ప్రజల ఆరోగ్యం బాగుపడటంతోపాటు- సుస్థిర సమాజాభివృద్ధీ సాధ్యమవుతుంది. ఐరాస జల సంస్థ ‘గ్లాస్‌’-2019 (గ్లోబల్‌ ఎసెస్‌మెంట్‌ అండ్‌ ఎనాలసిస్‌ ఆఫ్‌ శానిటేషన్‌ అండ్‌ డ్రింకింగ్‌ వాటర్‌) పేరిట విడుదల చేసిన నివేదిక 115 దేశాల్లో పరిస్థితులపై సర్వే చేసింది. ఆ దేశాల్లో 450 కోట్ల మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. 19 దేశాల్లో నిధుల కొరత తీవ్రంగా ఉంది. అవసరానికి, లభ్యతకు మధ్య దాదాపు 60 శాతం వ్యత్యాసం ఉంది. పథకాల అమలుకు సరిపడా నిధులు, మానవ వనరులు 15 శాతంలోపు దేశాలకు మాత్రమే ఉన్నాయి. భారత్‌ ఇందుకు మినహాయింపు కాదు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా దేశ ప్రజల అవసరాల మేరకు మంచినీరు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి ‘హర్‌ ఘర్‌ జల్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హర్‌ ఘర్‌ జల్‌ అంటే... ప్రతి ఇంటికీ తాగునీరు అందించడం. 2024 నాటికి ఈ లక్ష్యాన్ని సాకారం చేయాలన్న పట్టుదలతో కేంద్రం ముందుకు సాగుతోంది. పట్టణాలు, నగరాల్లో కొద్దోగొప్పో మంచినీటి సరఫరా వ్యవస్థ ఉంది. అందువల్ల ఈ పథకాన్ని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే అమలు చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం విజయవంతమైతే ఆధునిక భారత చరిత్రలో అది ఒక కొత్త అధ్యాయం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వ్యవసాయానికి అధిక వినియోగం
భారత ఉపఖండంలోని ప్రత్యేక శీతోష్ణ పరిస్థితుల వల్ల సంవత్సరంలో ఏ ప్రదేశంలో అయినా రెండు నెలల్లోనే 70 శాతం వర్షం కురుస్తుంది. అందువల్ల ఉపరితల నీటి వనరులను సంరక్షించుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఈ నీరు ఎక్కువగా వ్యవసాయానికే ఉపయోగపడుతోంది. దీంతో భూగర్భజలాన్ని వాడుకునే ధోరణి ప్రారంభమైంది. క్రమంగా దీనిపై ఆధారపడటం ఎక్కువైంది. కుళాయిల ద్వారా ఇళ్లకు నీరందించే సౌకర్యం గతంలో మహారాజులకు, జమీందార్లకే ఉండేది. విజయనగర సామ్రాజ్య రాజధాని నగరం హంపిలో నేటికీ ఆ సౌకర్యాలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సింధు నాగరికతలో ఉన్న అటువంటి ఏర్పాట్లు మళ్లీ ఆంగ్లేయుల కాలంలో కనిపించసాగాయి. కోల్‌కతా నగరాన్ని నిర్మించినపుడు అక్కడ ఇళ్లకు నీటి పంపులు వేశారు. కాలక్రమంలో జనాభా పెరిగే కొద్ది వాటి సామర్థ్యం తగ్గింది. నేడు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 18 శాతం ఇళ్లకు మాత్రమే పంపుల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. సిక్కిమ్‌లో 99 శాతం ఇళ్లకు నీరు నేరుగా సరఫరా చేసే ఏర్పాట్లు ఉన్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశాలలో ఈ సౌకర్యం అయిదు శాతం లోపే ఉంది. దేశవ్యాప్తంగా మూడుకోట్ల ఇళ్లకు పంపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అంచనా. మిగతా కుటుంబాల వారు సమీప ప్రాంతాల నుంచి నీరు పొందుతున్నారు.

దేశవ్యాప్తంగా 1,592 ప్రాంతాలను భూగర్భ జల సంక్షోభ ప్రభావితమైనవిగా గుర్తించారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భూగర్భ జలం అధిక వినియోగంతో నీటిమట్టం తగ్గడం మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టాన్ని వర్షపు నీరు ఏమేరకు భర్తీ చేస్తుందో దానికి మించి తోడేస్తున్నారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసే నేల చాలా ముఖ్యం. కాంక్రీట్‌ రహదారుల నిర్మాణాల వల్ల భూగర్భజలం అంతగా ఇంకడం లేదు. తమిళనాడులో భూగర్భజలం ఇంకిన దానికన్నా 77శాతం ఎక్కువగా వెలికి తీస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో అది 77 శాతంగా ఉంది. తాగునీటి కోసం పూర్తిగా భూగర్భజలం పైనే ఆధారపడితే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో మంచినీరు వ్యాపార వస్తువుగా మారింది. సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ అథారిటి (కేంద్ర భూగర్భజల వనరుల సంస్థ) 7,426 సంస్థలకు నీటి వ్యాపారానికి అనుమతులు ఇచ్చింది. ఈ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడులో 3,717, ఉత్తర్‌ప్రదేశ్‌లో 1,203 సంస్థలు నీటి వ్యాపారం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మంచినీటి వనరుల్లో భారత్‌లో నాలుగు శాతమే ఉన్నాయి. అదే సమయంలో ప్రపంచ జనాభాలో 16 శాతం ప్రజలు భారత్‌లో జీవిస్తున్నారు. ఉపరితల నీటివనరులు కూడా అంత సురక్షితంగా లేవు. నీతి ఆయోగ్‌ అధ్యయనం ప్రకారం దేశంలో 70 శాతం మంచినీటి వనరులు కాలుష్యం బారిన పడ్డాయి. దాదాపు 60 కోట్ల మంది భారతీయులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌గ్రిడ్‌ లాగానే నీటి గ్రిడ్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ఉన్న 18 కోట్ల గృహాలలో తొమ్మిది కోట్ల గృహాలకు పంపుల ద్వారా నీరు చేరుతోందని ప్రభుత్వం చెబుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది కేవలం 35 శాతం ఉంది. ఇంటి నుంచి మైలు దూరం వెళితేగానీ మనిషికి మంచినీరు దొరకని పరిస్థితి నెలకొందని ఓ అంచనా. ‘హర్‌ ఘర్‌ జల్‌’...అద్భుతమైన కార్యక్రమం అని దీనిని విజయవంతం చేస్తామని కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెబుతున్నప్పటికీ అది అంత తేలిక కాదన్న వాదనలు వినపడుతున్నాయి. ఆచరణలో ఎన్నో ఇబ్బందులు ఎదురు కానున్నాయి. దీనికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ అడుగులు మాత్రం ఆ దిశగా పడటం లేదు. ఈ కార్యక్రమానికి కనీసం పదివేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. అన్ని ఇళ్లకు నీటి పంపులు వేయడానికి పెద్దమొత్తంలో నిధులు అవసరమవుతాయి.

నాణ్యత ప్రశ్నార్థకం
నీటి సరఫరాకు భూమిలో అమర్చిన పైపుల నాణ్యత కీలకం. ప్రస్తుతం వాటి నిర్వహణ సరిగా లేక నీరు వృథాగా పోతోంది. సరైన మౌలిక సౌకర్యాలు లేక దేశ రాజధాని నగరం దిల్లీలో సరఫరా అయ్యేనీటిలో 40 శాతం వృథాగా పోతోంది. అన్ని నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా ఏ నగరంలోనూ 24 గంటలు నీటి సరఫరా ఉండటం లేదు. పంజాబ్‌-హరియాణా ఉమ్మడి రాజధాని నగరం చండీగఢ్‌లో గరిష్ఠంగా 12 గంటల పాటు సరఫరా జరుగుతోంది. మిగతా నగరాల్లో రెండు మూడు గంటలకు మించి ఉండటం లేదు. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఇటీవల చేసిన ఒక సర్వే ప్రకారం ప్రధానమైన 20 నగరాల్లో రోజుకు నాలుగు గంటలు మాత్రం ఇళ్లకు నీటి సరఫరా చేస్తున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కేవలం కొన్ని నిమిషాలపాటే నీరు సరఫరా అవుతోంది. అన్ని నగరాల్లో నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఫలితంగా నీరు కలుషితమవుతోంది. నీటి నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఈ మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయడం తలకు మించిన పనే. ఇరుకు నగరాల్లో పంపులను మార్చడం, కొత్తవి వేయడం, వృథాను అరికట్టడం వంటి చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. జలాశయాల సంరక్షణకు వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయాలి. విద్యుత్తులా నీటిని సైతం ప్రజలకు ప్రభుత్వం ఠంచనుగా అందించగలిగితేనే భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అయిదుగురిలో ఒకరికి మాత్రమే పంపులద్వారా నీరు సరఫరా అవుతోందని ప్రభుత్వమే పార్లమెంటులో పేర్కొనడం గమనార్హం. హర్‌ ఘర్‌ జల్‌ పథకం విజయవంతం కావాలంటే ముందుగా ప్రభుత్వం తగిన మేరకు నిధులు సమకూర్చాలి. ఆచరణలో ఎదురయ్యే ఇతరత్రా సమస్యలను అధిగమించినప్పుడే అందరికీ మంచినీళ్లు అన్న సమున్నత లక్ష్యం సాకారమవుతుంది!

సాకారం కాని ఐరాస సంకల్పం
ప్రపంచవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు అవసరమైన మంచినీరు నేరుగా ఇళ్లకే అందించాలని ఐక్యరాజ్య సమితి, ‘యునిసెఫ్‌’ సంకల్పించాయి. శుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు పౌరుల ప్రాథమిక హక్కు. అయినా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి ఇవి అందుబాటులో లేవు. 2010లోనే మంచినీరు ప్రాథమిక హక్కుగా గుర్తించినప్పటికీ చెప్పుకోదగ్గ మార్పురాలేదు. పారిశుద్ధ్య సౌకర్యాలు, మంచినీటి సరఫరా ప్రజల ఆరోగ్యానికి కీలకమైనవి. ఏటా మూడు లక్షలమంది చిన్నారులు అతిసారం, జీర్ణకోశ వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగులలో 21శాతం అపరిశుభ్రమైన నీటిని సేవించినవారే కావడం గమనార్హం.

ఉత్తమ సేవలకు పురస్కారం
కొన్ని ప్రభుత్వేతర సంస్థలు తాగునీటి రంగంలో చాలా కృషిచేస్తున్నాయి. 2009లో ‘సులభ్‌’ సంస్థ స్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌, 2015లో నీటి వనరులపై విశేషంగా కృషి చేసిన రాజేంద్రసింగ్‌లకు స్టాక్‌హోమ్‌ వాటర్‌ పురస్కారం లభించింది. దేశంలోని సగం ప్రాంతంలో వర్షాధారిత వ్యవసాయం కొనసాగుతోంది. మిగతా సగానికి మాత్రమే నీటి వసతి ఉంది. పొలాలకు సరఫరాచేసే సాగునీటిలో పదిశాతం పొదుపు చేసుకోగలిగినా నగరాల్లో తాగునీటి సమస్యను అధిగమించవచ్చని కొన్ని ప్రభుత్వేతర సంస్థల పరిశోధనలు నిరూపిస్తున్నాయి.- డాక్టర్‌ పి.వి.రంగనాయకులు
Posted on 02-09-2019