Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

మహా సమరానికి సమాయత్తం

* ప్లాస్టిక్‌ వ్యర్థాలపై సరికొత్త నిషేధాస్త్రాలు

ప్లాస్టిక్‌ వ్యర్థాలను పెద్దయెత్తున ఉత్పత్తి చేస్తూ, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య కారకాలుగా పేరొందిన ఎన్నో నగరాలు, ప్రాంతాలు భారత్‌లో ఉండటం కలవరపరచే అంశం. ఈ నేపథ్యంలో రానున్న అక్టోబరు రెండో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ‘ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌’పై నిషేధం విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల స్వాతంత్య్రదిన వేడుకల్లో మాట్లాడుతూ ప్లాస్టిక్‌ నుంచి దేశానికి విముక్తి కలిగించాలని, ఈ దిశగా రానున్న అక్టోబరు రెండున అందరూ ముందడుగు వేయాలని పిలుపిచ్చారు. ప్లాస్టిక్‌తో చేసిన సంచులు, కప్పులు, ప్లేట్లు, సీసాలు, స్ట్రాలు, కొన్ని రకాల ప్యాకెట్లు (సాచెట్స్‌) నిషేధిత జాబితాలో ఉంటాయి. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువుల్లో ఈ ఆరింటి మీదా నిషేధం అమలైతే దేశవ్యాప్తంగా జరుగుతున్న 1.40 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వినిమయం 10 శాతం తగ్గుతుంది. ప్రభుత్వం విధించనున్న సమగ్ర నిషేధం దిశగా ఇది తొలిఅడుగు అవుతుంది. ఈ వస్తువుల ఉత్పత్తి, వినియోగం, దిగుమతులన్నింటినీ నిషేధిస్తారని అంతా భావిస్తుండటమే అందుకు కారణం. పునశ్శుద్ధికి(రీసైక్లింగ్‌)కి అవకాశం ఉండే ప్లాస్టిక్‌ను మాత్రమే వినియోగించే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యాపారవర్గాలపై ఒత్తిడి తేనుంది. ఈ-కామర్స్‌ సంస్థల ప్యాకింగ్‌పై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దేశ వార్షిక ప్లాస్టిక్‌ వినియోగంలో 40 శాతం ఈ సంస్థల ప్యాకింగ్‌ల ద్వారా జరుగుతున్నది కావడమే ఇందుకు కారణం. చవగ్గా లభించే స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు ఆన్‌లైన్లో జోరుగా సాగుతున్నాయి. ఆహార పదార్థాలు, పుస్తకాలు, మందులు, సిగరెట్లు, సౌందర్య సాధనాలు... ఇలా ప్రతి వస్తువూ ప్లాస్టిక్‌ ప్యాకింగ్‌లలో ఇంటి ముంగిటికి చేరుతోంది. విపరీతంగా పెరిగిన అంతర్జాల వినియోగదారుల సంఖ్య, వారి ఆర్డర్ల సంఖ్య ప్లాస్టిక్‌ వినియోగాన్ని గణనీయంగా పరుగులెత్తిస్తున్నాయి.

సిద్ధమవుతున్న పెద్ద జాబితా
మంచినీటిని పొందడం ప్రజల ప్రాథమిక హక్కు కావడంతో నీటి సీసాలపై నిషేధం విధించడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. వివిధ పరిమాణాల్లోని ప్లాస్టిక్‌ నీటి సీసాలు, సీల్‌ చేసిన మంచినీటి గ్లాసుల మీదా దశలవారీగా నిషేధం విధించనున్నారని తెలుస్తోంది. ఈలోగా ప్లాస్టిక్‌ నీటి సీసాలకు ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం, వ్యాపార సంస్థలు అన్వేషించాల్సి ఉంది. ప్రస్తుతం పేర్కొన్న ఆరు వస్తువులమీదే కాకుండా, ఒకసారి వాడి పారేసే మరిన్ని ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధం కోసం ప్రభుత్వం పెద్ద జాబితానే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కృషిలో భాగస్వాములు అయ్యేలా అనేక ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలను కేంద్రం సమాయత్తపరుస్తోంది. ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం అమలైన ఆరు నెలల వరకూ ఉల్లంఘనలపై జరిమానాలు ఉండవని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈలోగా ప్రజలు ప్రత్యామ్నాయాలకు అలవాటు పడేందుకు అవకాశం ఉంటుందన్నది వారి భావన. ఆకస్మిక నిషేధం వల్ల పలు పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ప్రత్యామ్నాయ ప్యాకింగ్‌ కోసం అదనంగా యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఆహారశ్శుద్ధి(ఫుడ్‌ ప్రాసెసింగ్‌) పరిశ్రమల్లో ప్లాస్టిక్‌ కాకుండా, ప్రత్యామ్నాయ ప్యాకింగ్‌ పద్ధతుల్ని ప్రవేశపెడితే పదార్థాలు త్వరగా పాడయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఇలాంటి సమస్యలకు ప్రభుత్వం పరిష్కారాలు అన్వేషించాల్సి ఉంది. భారత్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణకు ఓ వ్యవస్థీకృత విధానం లేదు. దీనివల్ల పట్టణాలు, నగరాలు ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి దేశంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తి ఏటా 16.50 కోట్ల టన్నులకు చేరుతుందని నిపుణుల అంచనా. ఈ లెక్కన 20 ఏళ్లపాటు ఉత్పత్తయ్యే ప్లాస్టిక్‌ చెత్తను 10 మీటర్ల ఎత్తున నిల్వ చేయడానికి 66 వేల హెక్టార్ల స్థలం అవసరమవుతుంది.

ప్రతి ఉత్పత్తీ నాశనమయ్యేందుకు కొంత సమయం తీసుకుంటుంది. దురదృష్టవశాత్తూ ప్లాస్టిక్‌ భూమిలో పూర్తిగా కలిసిపోయేందుకు 500 నుంచి వెయ్యి సంవత్సరాలు పడుతుంది. అందులోని పాలిమర్ల సంక్లిష్టతే ఇందుకు కారణం. ఆ కారణంగానే ఇప్పటివరకూ ఉత్పత్తయిన, వాడిన ప్లాస్టిక్‌ వస్తువుల వ్యర్థాలన్నీ ఏదో ఒక రూపంలో ఈ భూమిపైనే పేరుకుపోయి ఉన్నాయి. ఇప్పుడిది తీవ్ర సంక్షోభస్థాయికి చేరింది. ప్రస్తుతం భారత్‌ ఏటా 56 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది. ఒక్క దిల్లీ నగరంలోనే రోజుకు 9,600 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. దేశంలో వ్యర్థాల నిర్వహణ అత్యంత క్లిష్టమైన వ్యవహారంగా మారేందుకు మితిమీరిన ప్లాస్టిక్‌ వినియోగమూ ఓ కారణం. పలుచటి ప్లాస్టిక్‌ సంచులు పర్యావరణానికి ఎక్కువ ప్రమాదకరం కావడంతో ప్రస్తుతం 50 మైక్రాన్లకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ సంచులను వాడకూడదనే నిబంధన భారత్‌లో విధించారు. అన్ని రకాల ప్లాస్టిక్‌ సంచులనూ నిషేధించకపోవడంతో, వాటి వాడకం ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంది. దిల్లీ, ముంబయి, కార్వార్‌, తిరుమల, వాస్కో(గోవా)లతో సహా రాజస్థాన్‌, కేరళ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించినా, అమలు అంతంతమాత్రంగానే ఉంది. దిల్లీలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా కొన్ని రకాల ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని నిషేధించింది. ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో అది సక్రమంగా అమలు కాలేదు. ఈ పరిణామాల ఫలితంగా ప్రపంచంలో ప్లాస్టిక్‌ ఉత్పత్తి, వినియోగాల్లో ముందున్న నాలుగు దేశాల్లో ఒకటిగా భారత్‌ నిలిచింది. పెద్ద బ్రాండ్లను విక్రయించే సంస్థల ప్రతినిధులు, ఎందరో వ్యాపారులు ప్లాస్టిక్‌ వాడకాన్ని నిరుత్సాహపరచడంలో భాగంగా ప్లాస్టిక్‌ సంచులకు సొమ్ము వసూలు చేస్తున్నారు. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. వాస్తవానికి వినియోగదారుల నుంచి ప్లాస్టిక్‌ సంచులకు వ్యాపారులు సొమ్ము వసూలు చేయాలన్న నిబంధనే ఎక్కడా లేదు.

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ కాలుష్య నియంత్రణపై శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా సముద్రాలను కాపాడటం తక్షణ కర్తవ్యంగా అన్ని దేశాలూ భావిస్తున్నాయి. ఒకసారి వాడి పారేస్తున్న ప్లాస్టిక్‌ అంతిమంగా సముద్రాలను చేరుతోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో 50 శాతం సముద్రాల్లోనే కలుస్తున్నాయి. ఈ గరళం సముద్ర జీవులను నాశనం చేయడమే కాకుండా, ఆహారం ద్వారా మానవుల శరీరంలోకి ప్రవేశిస్తోంది. సముద్రంలోని ప్రతి చదరపు మైలు విస్తీర్ణంలో 46 వేల ప్లాస్టిక్‌ ముక్కలు లేదా వస్తువులు తేలుతున్నట్లు అంచనా. ఈ ధోరణులు కొనసాగితే 2050 నాటికి సముద్రాల్లో చేపలకంటే ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం’ అధ్యయనం ప్రమాదఘంటిక మోగిస్తోంది. సముద్రాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో భారత్‌ నుంచి ఉత్పత్తవుతున్నవే 60 శాతం ఉంటాయని అంచనా.

ఫ్రాన్స్‌ ఆదర్శం
‘యూరోపియన్‌ యూనియన్‌’ 2021 నాటికి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువుల్లో స్ట్రాలు, ఫోర్కులు, చాకులు, కాటన్‌ బడ్స్‌ వంటివి నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనా వాణిజ్య కేంద్రమైన షాంఘై ఇలాంటి కట్టుబాటునే చాటుతోంది. చైనాకు చెందిన హైనన్‌ ప్రావిన్స్‌ 2025కల్లా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. ప్లాస్టిక్‌ నిషేధంపై ఫ్రాన్స్‌ 2016లో ఒక చట్టం చేసింది. దీని ప్రకారం 2020నాటికి కప్పులు, ప్లేట్ల వంటి రోజువారీ వినియోగంలో ఉండే అన్ని రకాల వస్తువులనూ పూర్తిగా నిషేధించాలి. 2025 నాటికి ప్లాస్టిక్‌ సంచుల వినియోగాన్ని సగానికి తగ్గించాలి. ఈ దిశగా తొలి అడుగేసిన దేశం ఫ్రాన్స్‌ మాత్రమే. ఈ చట్టంలోని మరో ప్రయోజనకర అంశం ఏమంటే, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా తయారయ్యే ఏ వస్తువైనా సేంద్రియ విధానాల్లో తయారై, భూమిలో కలిసిపోయేలా ఉండాలి. అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లాగే ఆఫ్రికా దేశమైన రువాండా ప్లాస్టిక్‌ కాలుష్యంతో సతమతమైంది. అక్కడ కోట్లాది ప్లాస్టిక్‌ సంచులు నీటి వనరుల్లో చేరి పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. నదుల్లో నీటి పారుదలను స్తంభింపజేశాయి. ఈ సమస్యతో పోరాడేందుకు భూమిలో కలవని ప్లాస్టిక్‌ను ఆ దేశం నిషేధించింది. 2008 నుంచి నిషేధం అమలులో ఉంది. ప్లాస్టిక్‌ సంచులను పూర్తి స్థాయిలో నిషేధించిన మొదటి దేశం రువాండాయే. కానీ, సరైన పర్యవేక్షణ కొరవడి చట్టం సక్రమంగా అమలు కావడం లేదు. వనరుల పునర్వినియోగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన స్వీడన్‌... ప్లాస్టిక్‌ నిషేధంపై కంటే ప్లాస్టిక్‌ పునర్వినియోగంపైనే దృష్టి నిలిపింది. ప్రపంచంలోనే అత్యుత్తమ పునర్వినియోగ వ్యవస్థ పాదుకున్న స్వీడన్‌లో ఆ యూనిట్లు నిరంతరం వర్థిల్లాలంటే అక్కడ చెత్త అవసరం కూడా ఎక్కువే. అందుకే స్వీడన్‌ ఇతర దేశాల నుంచి చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తోంది. నగరీకరణలో సర్వవ్యాప్తమైన ప్లాస్టిక్‌ను ఎలా వదిలించుకోవాలో ప్రపంచానికి ఆచరణాత్మకంగా చూపించిన దేశం ఐర్లాండ్‌. 2002లో ఐర్లాండ్‌ ప్లాస్టిక్‌ సంచులపై భారీ పన్ను విధించింది. కొన్ని వారాల్లోనే వినియోగదారులు పన్ను చెల్లించలేక ప్లాస్టిక్‌ సంచుల కొనుగోలుకు స్వస్తి పలికారు. దీంతో ప్లాస్టిక్‌ సంచుల వినియోగం అక్కడ 94 శాతం మేర తగ్గింది. ప్రస్తుతం ప్లాస్టిక్‌ సంచుల వాడకం అక్కడ ఆమోదనీయం కాదు. ప్లాస్టిక్‌ వినియోగ నియంత్రణకు చైనా 2008లో చట్టం తెచ్చింది. వ్యాపారులు ప్లాస్టిక్‌ సంచులను వినియోగదారులకు ఉచితంగా ఇవ్వడం ఇప్పుడక్కడ నేరం. లాభాల కోసం అధిక రుసుములు వసూలు చేసుకోవచ్చు. ఈ నిబంధన వల్ల రెండేళ్లలో ప్లాస్టిక్‌ సంచుల వినియోగం 50 శాతం మేర తగ్గింది. అంటే, వందల కోట్ల సంచులు వ్యర్థాలుగా మారి భూమిలోకి ఇంకిపోయే ప్రమాదం తప్పింది. ఓ చిన్న వివేకవంతమైన ఆలోచనను అమలు చేయడం ద్వారా పెద్ద విజయం సాధించవచ్చు. పలు దేశాలు ఈ సూత్రాన్ని ఆచరించి చూపాయి. భారత్‌లోనూ ఈ తరహా తరుణోపాయాలను అన్వేషించి, కఠినమైన నిబంధనలు విధించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అంతేకాదు, ఆ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాల్సిన అవసరమూ ఉంది.

Posted on 08-09-2019