Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

వికాస బీజం భాషా మాధ్యమం

* విద్యావిధానం - త్రిభాషా సూత్రం

ప్రథమ గురువు అమ్మ నోటి నుంచి వెలువడే కమ్మనైన పదాలే బిడ్డకు మాతృభాషగా మాధుర్యాన్ని పంచుతాయి. బిడ్డకు తల్లిపాలు తేజస్సును ఇస్తే, అమ్మ భాష విజ్ఞాన బీజాలను నాటుతుంది. తల్లిభాషలో అభ్యసనం జరిగితే విద్యార్థి మనోవికాసం సవ్యదిశలో సాగుతుందన్నది నిపుణుల నిశ్చితాభిప్రాయం. ప్రపంచ విద్యారంగాన్ని నిశితంగా పరిశీలించిన ఐక్యరాజ్య సమితి విద్యాసాంస్కృతిక సంస్థ (యునెస్కో) తల్లిభాషలో శ్వాసించకపోతే గాలి లేనట్లే, నడవకపోతే భూమి లేనట్లే, మాట్లాడకపోతే ప్రపంచం లేనట్లేనని రెండు దశాబ్దాల క్రితమే స్పష్టీకరించింది. భిన్న భాషలు, సంస్కృతులు గల మన దేశంలో బుడుగులు ఎన్ని భాషలు నేర్చుకోవాలి, బోధన మాధ్యమం ఏ మోతాదులో ఉండాలన్న చర్చకు తెరతీసింది కస్తూరి రంగన్‌ నేతృత్వంలో రూపుదిద్దుకున్న జాతీయ విద్యావిధానం ముసాయిదా. ఇందులో ప్రతిపాదించిన త్రిభాష సూత్ర సూచనపై కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలలో ప్రారంభమైన ఈ వ్యతిరేకత పశ్చిమ్‌ బంగ, మహారాష్ట్రలకు పాకడంతో కేంద్రం దిగివచ్చింది.

ప్రపంచీకరణ తరవాత విద్యావిధానంలో మార్పులు వచ్చాయి. భాషాభ్యాసాలపై అనేక దేశాలు మార్పులు చేసుకొన్నాయి. చైనా తమ మాతృభాష ప్రాధాన్యం తగ్గించకుండా ఆంగ్ల బోధనకు రెండు దశాబ్దాల క్రితమే చోటు కల్పించింది. ఆంగ్లేయులు 1840లో భారత్‌లో ఆంగ్లాన్ని బోధన మాధ్యమంగా ప్రవేశపెట్టారు. నేడది దేశవ్యాప్తంగా విస్తరించింది. రాజ్యాంగంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చడంతో రాష్ట్రాలు, కేంద్ర విద్యాలయాలతో పోటీపడి, తమ పాఠశాలలు, కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన ప్రవేశపెట్టాయి. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీకి సంస్కృతం మూలమైనా దానిపై ద్రవిడ, తర్కిస్‌, పార్శి, అరబిక్‌, పోర్చుగీస్‌, ఆంగ్లభాషల ప్రభావం ఉంది. భారతీయులను ఏకం చేయడానికి హిందీ ఒక్కటే మార్గం. అందువల్ల ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవలసిన అవసరం ఉంది. బలవంతంగా రుద్దరాదన్నది దిల్లీ ఆలోచన. రాజ్యాంగంలో ఏ భాషకూ జాతీయ హోదా లేదు. దేవనాగరి లిపిలో హిందీ, ఆంగ్లం అధికార భాషలుగా ఉండవచ్చని మాత్రమే అది చెబుతోంది. తమ సొంత అధికార భాషను నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందువల్ల కేంద్రం ఏ విషయాన్నీ ఏ రాష్ట్రంపైనా బలవంతంగా రుద్దలేదు. స్వాతంత్య్రానికి పూర్వం 1938లో హిందీని ఒక పాఠ్యాంశంగా మద్రాసు ప్రావిన్స్‌లో కేంద్రం ప్రవేశపెట్టింది. 1940లో హిందీ తప్పనిసరి బోధన భాషగా ఉండాలన్న కేంద్ర నిర్ణయాన్ని మద్రాసు ప్రావిన్స్‌ అంగీకరించలేదు. ఇటువంటి ప్రయత్నాలను తరవాత 1959, 1965లో తమిళులు తిప్పికొట్టారు. హిందీ నేర్చుకునేవారిని ప్రోత్సహించడానికి దాదాపు వందేళ్ల క్రితం ప్రారంభించిన దక్షిణ భారత హిందీ ప్రచారసభ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉండగా అందులో మెజారిటీ సభ్యులు తమిళులే అన్న విషయం ఇక్కడ గమనార్హం.

పాతుకుపోయిన ఆంగ్లం
భాషా పండితుల అభిప్రాయం ప్రకారం ప్రథమ భాషంటే మాతృభాష; ద్వితీయభాష అంటే ఆ దేశంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన భాష. తృతీయ భాషంటే విదేశీ భాష. నేడు ఆంగ్లం దేశంలో ద్వితీయభాషగా ప్రాధాన్యం సంతరించుకుని తాను విదేశీ భాషను కానని నిరూపించుకుంది. రెండు శతాబ్దాలుగా ఆంగ్లం భారతీయుల జీవితాలతో పెనవేసుకుపోయింది. కొన్ని వస్తువులు, పదార్థాలకు తమ ప్రాంతీయభాషల్లో పదాలున్నాయన్న సంగతి తెలియక పోవడం, కొన్నింటికి భారతీయ భాషల్లో పదాలు లేకపోవడంతో ఆంగ్లం ముందు ప్రాంతీయ భాషలు తేలిపోతున్నాయి. గ్రీకు, లాటిన్‌, ఫ్రెంచ్‌ వలస సామ్రాజ్య భాషలను పదహారో శతాబ్దానికి ముందే ఆంగ్లేయులు వదిలించుకున్నారు. బ్రిటిష్‌ పార్లమెంట్‌లో ప్రత్యేక తీర్మానం పెట్టి ఆంగ్లాన్ని జాతీయ భాషగా ప్రకటించుకున్నారు. నేడు ఆంగ్లానికి తగిన ప్రాధాన్యం ఇస్తూనే చైనీయులు తమ భాషను శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో అర్థవంతంగా ఉపయోగిస్తున్నారు. ఇంగ్లాండ్‌, చైనాలతో బేరీజు వేసుకోవడానికి భారత్‌ ఏక భాష దేశం కాదు. భిన్న సంస్కృతులు గల భారత్‌కు చైనా మాదిరిగా సవాలు విసరడం సాధ్యమయ్యేది కాదు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడచినా భారతీయ విశ్వవిద్యాలయాల గ్రంథాలయాల్లోని పుస్తకాల్లో సింహభాగం ఆంగ్లమాధ్యమానివే. ప్రామాణిక గ్రంథాలు స్థానిక భాషల్లోకి తర్జుమా కాలేదు. ఆంగ్లంలోనే ఉన్నత విద్య అభ్యసనకు అలవాటుపడిన మన విద్యావ్యవస్థ తర్జుమాపై అంతగా దృష్టి పెట్టలేదు. ప్రాంతీయ భాషలో ఉన్న గ్రంథ సాహిత్యం అనువాదానికి నోచుకోకుండా వెనకబడి ఉంది. గురజాడ వారి కన్యాశుల్కం అందుకో ఉదాహరణ. ఇది ఆంగ్లానువాదానికి దాదాపు శతాబ్దం పట్టింది.

ప్రపంచవ్యాప్తంగా 150కు పైగా రాజ్యాంగాల్లో జాతీయభాష లేదా అధికారభాష ప్రస్తావన ఉంది. భారత్‌లో ఒక భాషను జాతీయభాషగా ప్రకటించాలంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం అవసరం. ప్రస్తుతం దేశంలో 10 రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో హిందీ ప్రాథమిక అధికార భాషగా ఉంది. 2010లో గుజరాత్‌కు చెందిన సురేశ్‌ కచాడియ కేంద్రం, రాష్ట్రం ఒక వస్తువు తయారీపై ధర, తయారీ తేదీ, మూలవస్తు వివరాలు తప్పనిసరిగా హిందీలోనే ప్రచురించాలన్న నిబంధనపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అందుకు స్పందించిన గుజరాత్‌ హైకోర్టు దేశంలో ఎక్కువమంది హిందీ మాట్లాడుతున్నందువల్ల దానినే జాతీయభాషగా భావిస్తారని, కానీ అలా చెప్పడానికి లిఖిత పూర్వక ఆధారాలు లేవని స్పష్టీకరించింది. 90 శాతానికి పైగా ఆంగ్లం మాట్లాడే అమెరికా రాజ్యాంగంలో ఆంగ్లాన్ని జాతీయభాషగా ప్రస్తావించలేదు. 11 అధికార భాషలు కలిగిన దక్షిణాఫ్రికాలోనూ జాతీయభాష ప్రస్తావన లేదు. 1979లో పాకిస్థాన్‌లో ఉర్దూ వ్యాప్తికి ఏర్పాటైన భాషాసంఘం ఎంత ప్రయత్నం చేసినా చట్టాలు, అధికార పత్రాలను ఆంగ్లం నుంచి ఉర్దూలోకి మార్చడంలో విఫలమైంది.

సులభ బోధన మార్గాలు
దేశవ్యాప్తంగా ప్రాంతీయ భాషల బోధనపై భిన్నాభిప్రాయాలున్నా ఆంగ్ల బోధనపై అభ్యంతరాలు లేవు. కొన్ని రాష్ట్రాలు త్రిభాషా సూత్రం పాటిస్తుండగా తమిళనాడు వంటి రాష్ట్రాలు ద్విభాషా సూత్రాన్ని ఎంచుకున్నాయి. అన్ని సూత్రాల్లోనూ ఆంగ్లం పదిలంగానే ఉంది. ఆంగ్ల బోధన మాతృభాషా బోధనలా సాధ్యం కాదు. విద్యార్థి పాఠశాలలో అడుగిడక ముందే మాతృభాషలో ప్రాథమిక నైపుణ్యాలైన వినడం, మాట్లాడటంతో పరిచయం ఏర్పడి ఉంటుంది. ద్వితీయ నైపుణ్యాలైన చదవడం, రాయడం బడిలో నేర్చుకుంటాడు. ఆంగ్లం అభ్యసనానికి ప్రస్తుతం భారతీయులు ఉపయోగిస్తున్న పద్ధతులు ఒక్కటీ వారు ప్రవేశపెట్టినవి కావు.

చాలా ఐరోపా భాషల వాక్య నిర్మాణం దాదాపు ఒకేలా ఉంటుంది. అందువల్ల వారు ప్రతిపాదించిన పద్ధతులు రెండో ఐరోపా భాష నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఆంగ్ల వాక్య నిర్మాణం, భారతీయ భాషల వాక్య నిర్మాణం ఒకే పోలికను కలిగి ఉండవు. కొత్త భాష నేర్చుకోవాలంటే ఆరు నెలల వ్యవధి సరిపోతుందన్నది భాషా పండితుల అభిప్రాయం. కానీ మెజారిటీ భారతీయ ఆంగ్లభాషా అభ్యాసకులు దశాబ్దంపైగా సాధన చేసినా పట్టురాకపోవడానికి కారణం ఈ బోధన పద్ధతులేనని గ్రహించాలి. ఆర్య భాషలు మాతృభాషలుగా కలిగిన విద్యార్థుల ఆంగ్లభాష అభ్యసనకు ఒక బోధన పద్ధతి ఉండాలి. ద్రవిడ భాషలవారికి మరో బోధన పద్ధతి అవసరం. లేకుంటే భారతీయులకు మాత్రమే ఒక ప్రత్యేక ఆంగ్ల అభ్యసన పద్ధతి ప్రవేశపెట్టాలి. ఆ దిశగా భాషా పండితులు, ఆచార్యులు పరిశోధనలు సాగించాలి.

ప్రాంతీయ సమస్యలు
దక్షిణాది ఉద్యోగులు ఉత్తర భారతాన పని చేయాల్సి వచ్చినప్పుడు అనతికాలంలోనే హిందీని అర్థం చేసుకుంటున్నారు. అదే ఉత్తరాది ఉద్యోగులు దక్షిణాదిన పనిచేస్తున్న సమయంలో ప్రాంతీయ భాషలు అర్థంకాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నైలోని దక్షిణ మధ్య రైల్వే కేంద్రం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం చెన్నై డివిజన్‌లో స్టేషన్‌ మాస్టర్లు, కంట్రోలు రూం సిబ్బంది, లోకో పైలట్లు, హిందీ లేదా ఆంగ్లంలోనే సంప్రతింపులు జరపాలి. తమిళం వంటి ప్రాంతీయ భాషల్లో మాట్లాడకూడదు. ఇటీవల తమిళనాట ఓ రైల్వేస్టేషన్‌ మాస్ట్టారుకు తమిళం రాకపోవడంతో సంప్రతింపులు సాగక రెండు రైళ్లు ఒకే ప్లాట్‌ఫాం మీదకు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాలు మాతృభాషను కాపాడుకుంటూ ఆంగ్లమాధ్యమంలో బోధనకు ప్రాధాన్యం పెంచాయి. అందువల్ల రెండు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక అధికమైంది. ప్రాథమిక విద్యను ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి ముందు నిపుణులైన ఉపాధ్యాయుల నియామకం, మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యం. ఆంగ్ల మాధ్యమంపై సరైన అవగాహన లేనట్లయితేే విద్యార్థులకు ఆంగ్లంలోనే గణితం, సాంఘిక, సామాన్య శాస్త్రాల అభ్యసన గుదిబండవుతుంది. నగర, పట్టణ ప్రాంతాల విద్యార్థులు వారి కుటుంబ నేపథ్యం ఫలితంగా కొంతవరకు నెట్టుకువచ్చినా గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లమాధ్యమం భారమవుతుంది. బట్టీ విధానం నుంచి బయటపడి ఆటపాటలతో కూడిన ఆచరణాత్మక అభ్యసన పద్ధతులు, మౌఖిక నైపుణ్యాలను ఆహ్లాదకర వాతావరణంలో బోధిస్తే ఆంగ్ల అభ్యసనపై భయం పోతుంది. ఇందుకోసం ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం. సరైన సమయంలో సరైన మాధ్యమంలో అభ్యసన జరిగితే విద్యార్థి నైపుణ్యాలు పెంచుకుని జ్ఞానాన్ని సముపార్జించి సమాజానికి, దేశానికి ఉపయోగపడతాడు. ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు సరైన ప్రణాళికలు రూపొందించినప్పుడే ఇది సాధ్యమవుతుంది!

- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి
(రచయిత- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సహ ఆచార్యులు)
Posted on 12-09-2019