Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

దిల్లీ నేర్పుతున్న పాఠాలు!

భారత ఓటర్ల దృక్పథంలో విప్లవాత్మక పరివర్తన చోటుచేసుకుంటోందనడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం ఒక ప్రబల సంకేతం. తమ ఆకాంక్షలకు పట్టం కడుతుందన్న పార్టీకే ప్రజలు విజయహారం వేసి గౌరవించే ప్రజాస్వామ్య సంస్కృతికి దిల్లీ క్షేత్రంలో పాదుపడింది. ఈ ఓటమి నుంచి భాజపా, కాంగ్రెస్‌లు సరైన పాఠాలు నేర్చుకొనకపోతే, మున్ముందు వాటికి గడ్డు పరిస్థితి తప్పదంటున్న వ్యాసమిది...

దిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌) సాధించిన అఖండ విజయం భారత రాజకీయ చరిత్రలోనే మహత్తరమైంది. ప్రధాన జాతీయ పార్టీలు మరీ ఇంత అవమానకరంగా ఓడిపోవడం ఎన్నడూ జరగలేదు. వాటిలో ఒక పార్టీ (కాంగ్రెస్‌) కనీసం ఒక్క సీటైనా గెలుచుకోలేకపోయింది. భారతీయ జనతాపార్టీ(భాజపా) మూడంటే మూడు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో ఏదో ఒక్కపార్టీకే పూర్తి మెజారిటీ కట్టబెట్టడం మంచిదని ఓటర్లు స్వల్వ కాలంలోనే రెండోసారి నిశ్చయించారు. వారి నిర్ణయం దేశ రాజకీయాలపై ప్రగాఢ ప్రభావం చూపుతుంది. భారతీయ ఓటర్లలో కేవలం రెండు శాతానికే దిల్లీ ప్రాతినిధ్యం వహిస్తోంది కాబట్టి ఫలితాలను పెద్దగా పట్టించుకోనక్కర్లేదని ఒకవేళ భాజపా భావిస్తే, అంతకన్నా పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. దిల్లీ యావత్‌ దేశానికే అధికార పీఠం. దేశమంతటి నుంచీ వలస వచ్చిన ప్రజలకు నివాస కేంద్రమైన ఈ నగరంలో భారతదేశ సూక్ష్మ రూపాన్ని దర్శించవచ్చు.

సుస్థిరత్వానికే మొగ్గు

ఆలకించడానికి సిద్ధంగా ఉన్నవారికి చరిత్ర ఎన్నో ముఖ్యమైన పాఠాలు బోధిస్తుంది. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన రాజకీయ పండితులు, దేశంలో 30ఏళ్ల తరవాత మొదటిసారి సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని సంబరపడ్డారు. 1984లో కాంగ్రెస్‌ సొంతంగా సంపూర్ణ మెజారిటీ సాధించి, ఏక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగింది. ఆ తరవాత నుంచి కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారై, కేంద్రంలో అన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడ్డాయి. ఓటర్లు ఎంతో తెలివైనవారని ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఒక పార్టీ సంప్రదాయ ఓటర్లు కూడా ఆ పార్టీ పాలనాపరంగా విఫలమైందని భావిస్తే, దాన్ని అధికారం నుంచి సాగనంపడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు. తప్పు చేసినా, ఒప్పు చేసినా అదే పార్టీకి ఓటువేసే రోజులు పోయాయి. అందుకే, 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి నూకలు చెల్లాయి. ఈసారి దిల్లీ ఓటర్లు భాజపాను శిక్షించి ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌)కి పట్టం కట్టారు. ఇది మారిన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఓటర్లలో వచ్చిన ఈ మార్పు మున్ముందు అన్ని ఎన్నికల్లో మళ్ళీ మళ్ళీ దర్శనమివ్వవచ్చు.

దిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. పేరుకు అది జాతీయ పార్టీయే కానీ, రానూరానూ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోతోంది. మున్ముందు జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీగా కాంగ్రెస్‌ స్థానాన్ని భాజపా ఆక్రమించవచ్చు. అప్పుడు భాజపా ఒక పక్క, మిగతా పార్టీలన్నీ వేరొకపక్క మోహరించి ఎన్నికల పోరాటాలు జరిపే పరిస్థితి నెలకొనవచ్చు. దేశంలో ప్రాంతీయ పార్టీల శకం అంతరించలేదని దిల్లీ ఫలితాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. అదీకాకుండా ఒక ప్రాంతీయ పార్టీతోకన్నా కాంగ్రెస్‌తో తలపడినప్పుడే భాజపాకు ఎక్కువ సీట్లు లభించాయి. హరియాణా, మహారాష్ట్రల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాల పట్ల వ్యతిరేకతతోనే ఓటర్లు భాజపాకు ఓట్లు వేశారు. కానీ, ఝార్ఖండ్‌లో ఒక ప్రాంతీయ పార్టీ గట్టిగా పోటీ ఇచ్చినందువల్ల అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భాజపా కష్టపడాల్సి వచ్చింది. భాజపాను కాంగ్రెస్‌కన్నా ఒక ప్రాంతీయ పార్టీయే సమర్థంగా ఎదుర్కొనగలదని దిల్లీలో నిరూపితమైంది.

పార్టీలో కీచులాటల వల్లనే ఓడిపోయామంటూ భాజపా నాయకులు ఒకరినొకరు నిందించుకునే అవకాశముంది. కానీ, అక్కడ సంప్రాప్తించిన ఘోర ఓటమికి కీచులాటలు మాత్రమే కారణమనడం వట్టి కుంటిసాకు మాత్రమే. దిల్లీలో ఆప్‌ 52శాతం ఓట్లు సంపాదించింది. ఇది భాజపాకు వచ్చినదానికన్నా 25శాతం ఎక్కువ. అదీకాకుండా భాజపా ఓట్ల శాతం 2013నుంచి దాదాపు ఒకే స్థాయిలో ఉంటోంది. పరిస్థితిని నిష్పాక్షికంగా విశ్లేషిస్తే, నరేంద్ర మోదీ సర్కారు తన పద్ధతులను మార్చుకోవాలని అర్థమవుతుంది. మిత్రపక్షాల పట్ల మరింత గౌరవంగా ప్రవర్తించాలి. విజయంలోనూ ఔదార్యం ప్రదర్శించాలి. ఒక జాతీయ పార్టీగా నమ్మకమైన పొత్తులు కుదుర్చుకోవాలనే తప్ప, అవసరార్థ మిత్రుడిగా వ్యవహరించకూడదు. మోదీ అధికార పగ్గాలు చేపట్టి తొమ్మిది నెలలైనా, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలేమీ భాజపా తరఫున ప్రచారం చేయకపోడం గమనార్హం. ఎన్నికల్లో గెలవడానికి సకల శక్తియుక్తులు కేంద్రీకరించాల్సి ఉంటుంది. తమ మద్దతుదారులతోపాటు మిత్రపక్షాల బలగాలనూ ఏకతాటి మీద నడిపించాల్సి ఉంటుంది. మిత్రపక్షాలను దూరం చేసుకుంటే, అవి మనస్ఫూర్తిగా ఎన్నికల పోరాటం పాల్గొనలేకపోతాయి. అవి ఎన్నికల బరిలో దిగకుండా ఇంటిపట్టు ఉండిపోయినా నష్టం జరిగిపోతుంది.

స్వాతంత్య్రం అనంతరం కాంగ్రెస్‌ పార్టీ చాలా దశాబ్దాలపాటు దేశాన్ని ఒంటిచేత్తో పాలించగలిగింది. భాజపాకు అలాంటి అవకాశం లేదు. కాంగ్రెస్‌ పార్టీలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి పబ్బం గడుపుకొనే రోజులు పోయాయని భాజపా ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఉదాహరణకు నల్లధనాన్ని వెనక్కు రప్పిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన మోదీ, గెలిచిన తరవాత మాట నిలబెట్టుకోలేకపోయారని చాలామంది ఓటర్లు భావిస్తున్నారు. అలాగని దిల్లీలో భాజపా ఓటమికి ఇదే ప్రధాన కారణమని చెప్పలేం. సామాన్య మానవుల దైనందిన జీవితాలను ప్రభావితం చేసే శక్తి నల్లధన సమస్యకు లేదు. అయితే, ధరల పెరుగుదల, నగదు బదిలీ పథకాలు, కొత్త ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం వంటి సమస్యలు ప్రతి సామాన్యుడినీ బాధిస్తాయి. 2014 ఎన్నికల్లో యూపీఏ ఓటమికి ఈ సమస్యలు చాలావరకు కారణం. నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో ధరల నియంత్రణ, ఉద్యోగాల సృష్టి, సుపరిపాలనకు ప్రాధాన్యమిచ్చి ఓటర్ల ఆదరణ చూరగొన్నారు. అధికారంలోకి వచ్చాక ఈ హామీలను నిలబెట్టుకోలేకపోయారు. తమ పాలనలో ద్రవ్యోల్బణం తగ్గిందని మోదీ సర్కారు ఘనంగా ప్రకటించుకొన్నా, ఆహార ధరలు, పెట్రోలు, డీజిల్‌ ధరలు పెద్దగా తగ్గకపోవడం ఓటర్ల ఆగ్రహానికి కారణమైంది. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు సగానికి సగం తగ్గినా, భాజపా ప్రధాన మద్దతుదారులైన మధ్యతరగతి ఓటర్లు, వ్యాపారులకు వీసమెత్తు ప్రయోజనం కలగలేదు. నేడు 24 గంటల టీవీ ప్రసారాల వల్ల ప్రజలు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నారు. చమురు ధరలు ప్రపంచ విపణిలో తగ్గినా, మనదేశంలో ఎందుకు తగ్గలేదని వారికి ఆరా వస్తోంది. ఆహారం, ఇంధన ధరల పెరుగుదల సామాన్య, మధ్యతరగతి వర్గాలను బాధిస్తుంది. అందుకే వారు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏను చిత్తుగా ఓడించారు.

ఇప్పుడు ఈ వర్గాలు తమ మద్దతును ఆప్‌కు బదలాయించాయి. చమురు ధరల తగ్గుదలవల్ల కలిగిన ప్రయోజనంలో సగ భాగానైన్నా పేదలకు, మధ్యతరగతివారికి భాజపా బదిలీ చేసి ఉంటే, ఈ ఎన్నికల్లో కొంతైన లబ్ధి పొంది ఉండేది. నరేంద్ర మోదీ హయాములో ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయన్న ఆశతో 2014 ఎన్నికల్లో ఓటర్లు భాజపాకు పట్టం కట్టారు. వారి ఆశ కొంతైన నెరవేరనిదే భాజపాకు రాజకీయ లబ్ధి చేకూరడం కష్టం. ఆధార్‌ కార్డుకు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు మోదీ సర్కారు ఇస్తున్న ప్రాధాన్యం ఓటర్లకు నచ్చినట్లు లేదు. ముఖ్యంగా వంటగ్యాస్‌పై సబ్సిడీ రద్దు చేసి ఆధార్‌ కార్డుకు, నగదు బదిలీకి ముడిపెట్టడం వారికి అసలే నచ్చలేదు. గతంలో అనేక ప్రభుత్వాలు పలు పథకాల కింద పేద వర్గాలకు వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాయి. ఇప్పుడు సబ్సిడీ స్థానంలో నగదు బదిలీ పథకాన్ని చేపట్టినా, మారిన నిబంధనలు పేద మధ్యతరగతి వర్గాలకు అంతుచిక్కడం లేదు. ప్రజలు పనులు మానుకుని గ్యాస్‌ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సామాన్య మానవుణ్ని వేధిస్తున్న ఇలాంటి సమస్యల పరిష్కారానికి భాజపా ప్రాధాన్యమివ్వాలి. నేడు అన్ని పట్టణాలు, నగరాల్లో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారి జనాభా గణనీయంగా పెరిగింది. దిల్లీలో దక్షిణ భారతీయులు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పడం దిల్లీలో స్థిరపడిన ఆంధ్ర ఓటర్లకు ఆగ్రహం కలిగించింది. తూతూ మంత్రంగా రూ.850కోట్ల ప్యాకేజీ ఇచ్చి సరిపెట్టడం వారికి పుండుమీద కారం రాసినట్లయింది. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను ఒక పద్ధతి, క్రమం లేకుండా విభజించగా, భాజపా తెలుగువారికి చేసిన బాసలు మరచింది. కాబట్టి కాంగ్రెస్‌ భాజపాలు రెండింటినీ శిక్షించాలంటే ఆప్‌కు ఓటు వేయడమే ఉత్తమమని దిల్లీలో స్థిరపడిన ఆంధ్ర ఓటరు భావించడంలో ఆశ్చర్యమేముంది? తమిళనాడు, కర్ణాటకల్లో కూడా తెలుగువారు పెద్దసంఖ్యలో స్థిరపడినందువల్ల వారిని దూరం చేసుకోవడం భాజపాకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.

ఆచితూచి వేయాలి అడుగు

దిల్లీ ఎన్నికలు క్షమాపణకున్న శక్తిని చాటిచెప్పాయి. ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ గతంలో తాను 49రోజులకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం తప్పేనని పదేపదే ఓటర్ల ముందు లెంపలు వేసుకున్నారు. దీంతో భాజపాకు ఆయన అర్ధంతర రాజీనామాను ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకొనే వీలు లేకుండా పోయింది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తప్పు చేశానని కాంగ్రెస్‌ కూడా పదే పదే క్షమాపణ చెబితే, 2019నాటికి ఓటర్లలో వ్యతిరేకత తగ్గుతుందా అన్నది ప్రశ్న. దీనికితోడు విభజన చట్టంలో తెలుగు రాష్ట్రాలకు చేసిన వాగ్దానాలను భాజపా నిలబెట్టుకోలేకపోతే ప్రజల ఆగ్రహం ఆ పార్టీ మీదకు మళ్లుతుంది. దాన్ని వాటంగా తీసుకుని ఓటర్లను మంచి చేసుకోవడానికి కాంగ్రెస్‌ ప్రయత్నించవచ్చు. ఇలా పొంచి ఉన్న ప్రమాదాలను భాజపా గ్రహించుకుని మెలగాలి. దిల్లీ ఎన్నికల ఫలితాలు బిహార్‌పై తక్షణ ప్రభావం చూపుతాయి. వచ్చే ఎన్నికల్లో అక్కడ కూడా భాజపా వ్యతిరేక శక్తులు ఏకమై పోరాడటానికి స్ఫూర్తినిస్తాయి. ఇలాంటి ముఖాముఖి పోరాటాల్లో భాజపా మొదటినుంచీ నష్టపోతోంది. సబ్సిడీల స్థానంలో నగదు బదిలీ పథకాలను ప్రవేశపెట్టడానికి హడావుడి పడుతున్న భాజపా, ఈ విషయంపై పునరాలోచన చేయాలి. ఆహారం, ఎరువులు, వంట గ్యాస్‌ సబ్సిడీల స్థానంలో నగదును అందించే ప్రత్యక్ష లబ్ధి బదిలీ(డీబీటీ) పథకం రేపు ధరవరల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో వూహించలేం. దీనివల్ల వినియోగదారులకు నష్టం జరిగితే దానికి భాజపా రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ అంశాలన్నింటినీ గుర్తెరిగి భాజపా ఆచితూచి అడుగులు వేయాలి. దిల్లీ ఎన్నికల్లో ఓటమి వల్ల వచ్చిపడిన సంక్షోభం నుంచి పాఠాలు నేర్వాలి.

(రచయిత - డాక్టర్ ఎస్.అనంత్)
Posted on 13.02.2015