Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

తప్పుడు అభ్యర్థులపై తూటా

* ప్రాముఖ్యం పెరిగిన ‘నోటా’

గుజరాత్‌ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు ‘నోటా’ (నన్‌ ఆఫ్‌ ద అబోవ్‌) శక్తిని మొట్టమొదటిసారిగా విస్పష్టంగా చాటి చెప్పాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ నచ్చనప్పుడు, తమ ప్రతినిధిగా ఎన్నికయ్యే అర్హత వారిలో ఎవ్వరికీ లేదని భావించినప్పుడు - పై వారెవరికీ ఓటు వేయడం లేదంటూ తేటతెల్లం చేయడానికి ఓటర్లకు కల్పించిన విశిష్ట సదుపాయమిది. ఎన్నికల యంత్రం మీది ‘నోటా’ మీటను నొక్కడం ద్వారా ఓటరు ఈ సదుపాయాన్ని వినియోగించుకొంటున్నాడు. బరిలోని అభ్యర్థుల పట్ల తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాడు. నిరసన ప్రకటిస్తున్నాడు. దేశంలో రానున్న ప్రధాన ఎన్నికలు అన్నింటిలోనూ ‘నోటా’ గణనీయ పాత్ర పోషించగలదనడానికి గుజరాత్‌ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం.

ఓటర్ల నిరసన
2013లో ఒక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దరిమిలా దేశంలో ‘నోటా’ శకం ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై ‘నోటా’ మీటను ఏర్పాటు చేయవలసిందిగా ఎన్నికల కమిషన్‌ను అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. బరిలో ఉన్న అభ్యర్థులెవరికీ ఓటు వేయకుండా ఉండే హక్కు ఓటరుకు ఇవ్వాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అది అత్యంత ముఖ్యమని ఆనాడు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అభ్యర్థులందర్నీ తిరస్కరించే హక్కు ఓటరుకు ఇచ్చేందుకు భారత న్యాయసంఘం (లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా), ఎన్నికల కమిషన్‌ సైతం సుముఖత వ్యక్తపరిచాయి. 13 దేశాల్లో ‘నోటా’ అమలు చేస్తున్నారని, రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలబెడుతున్న తీరుపట్ల నిరసన వ్యక్తపరచడానికి, అసమ్మతి తెలియజేయడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతుందని న్యాయస్థానం వివరించింది. ఎన్నికల్లో తాము నిలబెడుతున్న అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో ప్రజలు తిరస్కరిస్తున్నారని అర్థమైనప్పుడు, రాజకీయ పార్టీల్లో క్రమానుగతంగా మార్పు వస్తుందని, ప్రజలకు ఆమోదయోగ్యులైన, చిత్తశుద్దీ విశ్వసనీయతా కలిగిన అభ్యర్థులవైపే అవి మొగ్గు చూపుతాయని వ్యాఖ్యానించింది. అప్పటినుంచే దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ‘నోటా’ను ఉపయోగిస్తున్నప్పటికీ, అది ఎంత ప్రభావశీలమైనదో 2017 గుజరాత్‌ ఎన్నికలతోనే వెల్లడైంది.

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో 21 స్థానాల్లో మొదటి ఇద్దరూ అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా కన్నా ‘నోటా’కు పడిన ఓట్లే ఎక్కువ. ‘నోటా’ కన్నా తక్కువ ఓట్ల తేడాతో 12 స్థానాల్లో భాజపా అభ్యర్థులు పరాజయం పాలుకావడం గమనార్హం. కాంగ్రెస్‌కు ఓటువేయడం ఇష్టంలేదు. అలాగని భాజపా అభ్యర్థులకు ఓటువేయడానికి మనస్కరించని పరిస్థితి. తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యంకాని అలాంటి అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టిన భాజపాకు నిరసన తెలపడానికే ఓటర్లు ‘నోటా’కు పెద్దయెత్తున ఓటు వేశారు. వారు కాంగ్రెస్‌కు ప్రయోజనం కలుగరాదనుకొన్నారు. అదే సమయంలో తమ మనోగతమేమిటో భాజపాకు తెలియజెప్పాలనుకొన్నారు. అందుకే ‘నోటా’కు భారీగా ఓట్లు వేసి భాజపాకు గట్టి హెచ్చరిక పంపారు. ఒక విధంగా- మృదువుగానే మందలించారు. ప్రజల్లో కనుక అలాంటి అసంతృప్తి లేకుండా ఉంటే, భాజపా ఆ సీట్లన్నీ లేదా వాటిలో అత్యధికం గెలుచుకొని ఉండేది. కాంగ్రెస్‌ పార్టీ రెండు దశాబ్దాలుగా గుజరాత్‌లో అధికారంలో లేదు. కేంద్రంలోనూ అధికారం కోల్పోయింది. సుదీర్ఘపాలన కారణంగా గుజరాత్‌లో భాజపా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడటంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆ రాష్ట్రంలో మరోసారి భాజపా ప్రభుత్వమే ఏర్పాటైనప్పటికీ, ఆ పార్టీ సరైన అభ్యర్ధులను నిలబెట్టకపోవడం వల్లే పలుస్థానాల్లో అంతిమ విజేతగా ‘నోటా’ నిలబడే పరిస్థితి ఉత్పన్నమైంది. పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) కారణంగా ప్రధానంగా వ్యాపారులైన గుజరాతీల మీద దుష్ప్రభావం పడింది. ఈ చర్యలు చేపట్టి తమను ఇబ్బంది పెట్టిన భాజపాకు వారు గట్టిగా నిరసన తెలపాలనుకున్నారు. అంతే తప్ప కాంగ్రెస్‌కు కుప్పలుకుప్పలుగా ఓట్లు వేయాలనుకోలేదు. అందుకు బదులు ‘నోటా’కు ఓటు వేశారు. ‘నోటా’ ఓట్లు పెరగడానికి ఇది మరో కారణం. గుజరాత్‌లోని చాలా స్థానాల్లో ‘నోటా’ కన్నా కాంగ్రెస్‌ పార్టీ విజయానికి తోడ్పడిన ఓట్లు తక్కువ.

గుజరాత్‌ ఎన్నికల్లో భాజపా కొద్ది ఓట్ల్ల తేడాతో పరాజయం పాలైన 12 సీట్ల సంగతి చూద్దాం. ‘నోటా’ కారణంగానే ఆ సీట్లను భాజపా కోల్పోవాల్సి వచ్చింది. ఛోటా ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ 1,000కన్నా తక్కువ ఓట్ల తేడాతో గెలిచింది. అక్కడ ‘నోటా’కు పడిన ఓట్లు 5870. దాంగ్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 800 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అక్కడ నోటా మీటనొక్కినవారి సంఖ్య 2,184. దేవధర్‌లో కాంగ్రెస్‌ 1,000 ఓట్ల కన్నా తక్కువ మెజారిటీతో గెలుపొందగా, అక్కడ నోటాకు 2,988 ఓట్లు పడ్డాయి. కప్రద, మన్సా, జెట్‌పూర్‌లలోనూ అలాగే జరిగింది. ఆ స్థానాల్లోనూ భాజపాను ‘నోటా’నే ఓడించింది. అదెలాగంటే, కప్రదలో కాంగ్రెస్‌ అభ్యర్థి, భాజపా అభ్యర్థిని కేవలం 170 ఓట్ల తేడాతో ఓడించారు. అక్కడ ‘నోటా’కు పడిన ఓట్లు 3,868. మాన్సా సీటును భాజపా కేవలం 524 ఓట్ల తేడాతో కోల్పోయింది. 3,000 ఓటర్లు ‘నోటా’ మీట నొక్కారు. జెట్‌పూర్‌లో భాజపా అభ్యర్థి 3,052 ఓట్ల తేడాతో ఓడిపోగా, అక్కడ అంతకు రెండింతలు, అంటే 6,155 ఓట్లు ‘నోటా’కు పడ్డాయి. మోర్వా హదాఫ్‌, సోజిత్ర, వాంకనేర్‌, జంజోధ్‌పూర్‌, ధనేరా, తలాజ స్థానాలు సైతం ‘నోటా’ కారణంగానే భాజపా చేజారాయి. తలాజాలో కాంగ్రెస్‌పార్టీ 1,779 ఓట్ల తేడాతో విజయం సాధించగా, ‘నోటా’కు 2,918 ఓట్లు పడ్డాయి. వాంకనేర్‌ సీటును భాజపా 1,361 ఓట్ల తేడాతో కోల్పోయింది. అక్కడ ‘నోటా’కు పడిన ఓట్లు 3,170. ‘నోటా’ సదుపాయం కనుక లేకుండా ఉంటే భాజపా చాలా స్థానాల్లో మంచి విజయం సాధించి ఉండేదని అనిపిస్తోంది.

పార్టీలకు హెచ్చరిక
‘నోటా’ సంగతెలా ఉన్నా, గుజరాత్‌ ఎన్నికల పలితాలు ఇతర రాష్ట్రాల కన్నా భిన్నమైనవనడంలో సందేహం లేదు. సాధారణంగా రెండు పార్టీల మద్య ఓట్ల తేడా పదిశాతం వరకు ఉంటే, విజేతగా నిలిచే పార్టీ శాసనసభలో 75 నుంచి 80 శాతం దాకా స్థానాలు గెలుచుకొంటుంది. విజయఢంకా మోగిస్తుంది. కానీ గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో అలా ఎన్నడూ జరగలేదు. ఉదాహరణకు రాజస్థాన్‌లో 2013లో జరిగిన శాసనసభ ఎన్నికల సంగతి చూద్దాం. ఆ రాష్ట్రంలో మొత్తం శాసనసభ స్థానాలు 200. కాంగ్రెస్‌కు 33 శాతం ఓట్లు వచ్చాయి. 45 శాతం ఓట్లు పొందిన భాజపా 163 సీట్లు (80 శాతం) సాధించింది. కాంగ్రెస్‌కు దక్కిన సీట్లు 21 మాత్రమే. అదే ఏడాది మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలూ జరిగాయి. భాజపా కాంగ్రెస్‌కన్నా 8.5 శాతం ఎక్కువగా 45 శాతం ఓట్లు సాధించింది. శాసనసభలోని మొత్తం 230 స్థానాల్లో 165 (70 శాతం) కైవసం చేసుకొంది. కాంగ్రెస్‌కు 58 సీట్లు దక్కాయి. గుజరాత్‌తోపాటు హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపా కాంగ్రెస్‌ కన్నా ఏడు శాతం ఎక్కువగా, 49 శాతం ఓట్లు పొందింది. మొత్తం 68 స్థానాల్లో 44 సీట్లు కైవసం చేసుకొని మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. గుజరాత్‌లో సైతం భాజపాకు కాంగ్రెస్‌ కన్నా దాదాపు అదేస్థాయిలో ఎక్కువ ఓట్లు లభించినప్పటికీ, సీట్ల సంఖ్య కోసుకుపోయింది. గుజరాత్‌ ఎన్నికలు విభిన్నమైనవనడానికి ఇదే నిదర్శనం. ఆ రాష్ట్రంలో భాజపాకు ఏడు శాతం ఓట్లు అధికంగా లభించినప్పటికీ, ‘నోటా’ కారణంగా అనేక స్థానాల్లో ఆ పార్టీ విజయావకాశాలకు గండిపడింది. అన్ని రాజకీయ పార్టీలకూ ఈ పరిస్థితి ఒక హెచ్చరిక. ‘నోటా’ కారణంగా భారత ఎన్నికల రాజకీయాల స్వరూప స్వభావాలే మారిపోతున్న దృశ్యం కట్టెదుట స్పష్టాతిస్పష్టంగా కనిపిస్తోంది.

Posted on 04.01.2018