Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

‘ఈశాన్య’పవనాలపై కమలనాథుల ఆశలు

* మూడు రాష్ట్రాల్లో కీలక ఎన్నికలు

సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలంటే అంతగా ఆసక్తి ఉండదు. జాతీయ జనజీవన స్రవంతికి దూరంగా ఉండే ఈ ప్రాంత ఎన్నికల ఫలితాలు దిల్లీ రాజకీయాలపై చూపే ప్రభావం పెద్దగా ఉండకపోవడమే ఇందుకు కారణం. కాంగ్రెస్‌ పార్టీనో, ఇతర ప్రాంతీయ పార్టీలో గద్దెనెక్కడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దఫా పరిస్థితి మారనుంది. వచ్చే నెలలో జరగనున్న త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌, సీపీఐ(ఎం)లకు అగ్నిపరీక్ష కానున్నాయి. అధికారాన్ని సాధించడం, లేదా కనీసం బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించడం భాజపా లక్ష్యం. మేఘాలయలో ప్రస్తుత ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కాంగ్రెస్‌ ముందున్న కర్తవ్యం. త్రిపురలో సీపీఐ(ఎం) సర్కారుదీ ఇదే పరిస్థితి. 60 స్థానాలు గల ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం అక్కడికే పరిమితం కాదు. వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లో కర్ణాటక ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇవి పార్టీలకు బలాన్నిస్తాయి.

అభివృద్ధే ప్రచారాస్త్రం
2014 వరకు ఈశాన్య రాష్ట్రాల్లో ఉనికే లేని భాజపా అనంతర కాలంలో అక్కడ బలమైన పునాదులే వేసుకుంది. 2016లో జరిగిన అసోం ఎన్నికల్లో సొంతబలంతో అధికారాన్ని సాధించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. నిరుడు మణిపూర్‌లో మెజారిటీకి చేరువై ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ ఫిరాయింపుల ద్వారా సర్కారును స్థాపించింది. ఆ వూపుతో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ల్లోనూ విజయం సాధిస్తామని కమలనాథులు ఢంకా బజాయిస్తున్నారు. వాస్తవానికి ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కడా భాజపా గతంలో అధికారంలో లేదు. 2013 ఎన్నికల్లో పెద్దగా ఉనికి చాటలేదు. ఈ రాష్ట్రాల్లోని క్రిస్టియన్లు, గిరిజనులు మొదటి నుంచీ భాజపాకు దూరమే. ఈసారి ప్రజల్లో మార్పు వచ్చిందని, తమ పట్ల సానుకూలంగా ఉన్నారని ఆ పార్టీ విశ్వసిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, నరేంద్ర మోదీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్థానిక ప్రభుత్వాలపై ఉండే వ్యతిరేకత తమకు కలిసి వస్తాయని కమలం పార్టీ అంచనా వేస్తంది. కేవలం లెక్కలు, అంచనాలతోనే సరిపెట్టకుండా అందుకు తగ్గటు కార్యాచరణ కూడా చేస్తోంది. ప్రధాని మోదీ ఇప్పటికే ఈ ప్రాంతంలో పర్యటించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తాజాగా గత వారంలో మేఘాలయలో నూతన రహదారి ప్రారంభించారు. వచ్చే రెండేళ్లలో రూ.90వేల కోట్ల వ్యయంతో జాతీయ రహదారులు నిర్మిస్తామని ప్రకటించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజును నాగాలాండ్‌, మరో కేంద్రమంత్రి కె.జె.అల్ఫోన్స్‌ను మేఘాలయ, అసోం ఆర్థికమంత్రి హిమంత్‌ బిశ్వశర్మను త్రిపుర ఎన్నికల పర్యవేక్షకులుగా ఎప్పుడో నియమించింది. వారు తెరవెనక కసరత్తు మొదలు పెట్టారు. మేఘాలయ, నాగాలాండ్‌ల్లో క్రిస్టియన్లు ఎక్కువ. త్రిపురలో హిందువులు, గిరిజనులు దాదాపు సరిసమానంగా ఉన్నారు. అందువల్లే హిమంత్‌కు త్రిపుర బాధ్యతలు అప్పగించారు. పూర్వాశ్రమంలో కాంగ్రెస్‌ నాయకుడైన ఆయన ఎన్నికలకు ముందే భాజపాలో చేరారు. అసోం, మణిపూర్‌ల్లో ఎలాంటి బలం లేనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించామని, ఇదే మాదిరిగా ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లోనూ గెలుస్తామని భాజపా వర్గాలు ధీమాగా ఉన్నాయి.

అనుక్షణం అప్రమత్తం
ఈశాన్య రాష్ట్రాల పేరు చెప్పగానే ముందుగా శాంతిభద్రతల అంశం తెరపైకి రావడం సహజం. నిత్యం వివిధ వర్గాలు, తెగలు- పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకొంటాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 30 వేలమంది పోలీసు బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పరిస్థితి ప్రస్తుతానికి ప్రశాంతంగానే ఉంది. శాంతిభద్రతల పరిస్థితి సంతృప్తికరంగా ఉండటంతో త్రిపురలో కేంద్రం 2015లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించింది. నాగాలాండ్‌ పరిస్థితి నేటికీ సమస్యాత్మకమే. ఇక్కడ సాయుధ దళాల చట్టం ఇప్పటికీ అమలులో ఉంది. నాగాలకు, ఇతర వర్గాలకు గొడవలు; నాగావర్గాల్లో అంతర్గత ఘర్షణల కారణంగా రాష్ట్రంలో పరిస్థితి ఎప్పుడూ కత్తిమీద సాములాగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో అవసరమైతే బలగాల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. మేఘాలయ కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. ఇక్కడా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అమలులో ఉంది. రాష్ట్రంలో వివిధ తెగల మధ్య అంతర్గతంగా విభేదాలు నెలకొన్నాయి. ఇటీవల భోపాల్‌లో జరిగిన పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల పరిస్థితిపై చర్చించారు. తాజాగా ఎన్నికల ప్రకటన నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచన మేరకు 150మందికి పైగా పోలీసు అధికారులను బదిలీ చేశారు. నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఈ చర్య దోహదపడుతుందని ఎన్నికల సంఘం అభిప్రాయపడుతోంది.

త్రిపురపైనే ఆసక్తి
నాగాలాండ్‌, మేఘాలయకన్నా త్రిపురపైనే జాతీయస్థాయిలో ఆసక్తి నెలకొంది. 60 స్థానాలు గల ఈ రాష్ట్రంలో రెండు దశాబ్దాలకు పైగా సీపీఐ(ఎం)కు ఎదురులేదు. ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ నీతినిజాయతీ, నిరాడంబరత, వ్యక్తిగత ప్రతిష్ఠ పార్టీకి పెట్టనికోటలా ఉన్నాయి. గతంలో నృపేన్‌ చక్రవర్తి, దశరథ్‌దేవ్‌ వంటి సీపీఐ(ఎం) ముఖ్యమంత్రులు పార్టీకి గట్టి పునాదులు వేశారు. ఒక్క 1988-93 మధ్యకాలంలో మాత్రమే ఇక్కడ సీపీఐ(ఎం) ఓడిపోయింది. అప్పట్లో కాంగ్రెస్‌ తరఫున సుధీర్‌ రంజన్‌ మజుందార్‌, సమీర్‌ రంజన్‌ బర్మన్‌ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 2013 ఎన్నికల్లో భాజపాకు లభించిన ఓట్లు కేవలం 1.4 శాతం. అనంతర కాలంలో కాంగ్రెస్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుని బలపడింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. వివిధ కారణాల వల్ల కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ బలహీనపడటంతో వాటి స్థానంలో బలపడాలన్నది కమలం వ్యూహం. ప్రస్తుత ఎన్నికల్లో సీపీఐ(ఎం)కు భాజపానే బలమైన ప్రత్యర్థి. రాష్ట్రంలో పార్టీకి శక్తిమంతులైన నాయకులు లేరు. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్‌ వైఫల్యం, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, హిందూత్వ నినాదాలతో ముందుకు వెళ్లాలన్నది కమలం వ్యూహం. ఇండీజినియస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపీఎఫ్‌టీ)తో పొత్తు పెట్టుకుని బలపడేందుకు ప్రయత్నిస్తోంది. సీపీఐ(ఎం) సర్కారు హామీ మేరకు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించలేదని, ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయలేదని, ఇవన్నీ తమకు కలసివచ్చే అంశాలని అంచనా వేస్తోంది. మరోపక్క అధికారాన్ని కాపాడుకునేందుకు సీపీఐ(ఎం) సర్వశక్తులు ఒడ్డుతోంది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, మాణిక్‌ సర్కార్‌ వ్యక్తిగత ప్రతిష్ఠతో అది ముందుకు వెళుతోంది. పార్టీ జాతీయ నాయకత్వం కూడా పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు లోక్‌సభ స్థానాలనూ కైవశం చేసుకున్న సీపీఐ(ఎం) క్షేత్రస్థాయిలో బలంగానే ఉంది. పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ గుళ్లూగోపురాలు సందర్శిస్తున్నారు. భాజపా హిందూత్వ నినాదాన్ని బలహీనపరచాలన్న లక్ష్యంతో గుజరాత్‌ ఎన్నికల సమయంలో రాహుల్‌ గాంధీ మాదిరిగా, మాణిక్‌ సర్కార్‌ చేస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల భావన. ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో మాదిరి కాకుండా శాంతికి మారుపేరుగా త్రిపుర మారిందని ఘనంగా ప్రకటిస్తున్నారు. తమ సిఫార్సు మేరకు కేంద్రం 2015 జూన్‌లో రాష్ట్రంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేయడమే ఇందుకు నిదర్శనమని వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్‌ పరిస్థితి అచేతనంగా ఉంది. రాహుల్‌ గాంధీ ప్రచారంపైనే అది ఆధారపడనుంది. పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పరిస్థితీ అంతే. బంగలో మాదిరిగా త్రిపురలోనూ సీపీఐ(ఎం)ను గద్దె దించాలన్నది దీదీ లక్ష్యమైనప్పటికీ, సమీప భవిష్యత్తులో అది సాధ్యం కాదన్నది ఆమెకు తెలియనిది కాదు.

కాంగ్రెస్‌కు ఎదురుగాలి
మేఘాలయలో ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా నాయకత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలో పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే. గత ఎన్నికల్లో 30 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌ మిత్రపక్షమైన యూడీపీ మద్దతుతో నెట్టుకొస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు స్థానాలనూ కాంగ్రెస్‌ గెలుచుకున్నప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. 2010 నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ముకుల్‌ సంగ్మాపైనే కాంగ్రెస్‌ పార్టీ ఆధారపడుతోంది. రాహుల్‌ గాంధీ ప్రచారానికి వచ్చినప్పటికీ సంగ్మానే కీలకం కానున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, పార్టీలో అంతర్గతంగానూ ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎంపై తమ అసంతృప్తిని అధిష్ఠానం పట్టించుకోనందుకు నిరసనగా ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఎన్నికల సమయంలో పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. వీరిలో కొందరు భాజపాలో, మరి కొందరు నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ)లో చేరారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ పీఏ సంగ్మా కుమారుడైన కాన్‌రడ్‌ కె.సంగ్మా ఈ పార్టీకి సారథి. ప్రస్తుతం ఇదే ప్రధాన ప్రతిపక్షం. ఎన్‌డీఏలో ఎన్‌పీపీ భాగస్వామి అయినప్పటికీ ప్రస్తుతం భాజపాతో పొత్తు పెట్టుకోరాదని నిర్ణయించింది. అరవై స్థానాలు గల నాగాలాండ్‌లో మొదటి నుంచీ రాజకీయ అస్థిరత నెలకొంది. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) ఆధ్వర్యంలోని సంకీర్ణ సర్కారు పనిచేస్తోంది. ఇందులో భాజపా భాగస్వామి. ముఖ్యమంత్రి టీఆర్‌ జెలియాంగ్‌ పార్టీకి పెద్దదిక్కు. మళ్ళీ గెలిచేందుకు జెలియాంగ్‌ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. భాజపా, ఎన్‌పీఎఫ్‌ సంబంధాలు సజావుగా లేవు. ఎన్‌పీఎఫ్‌ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి నైఫియు రియోతో పొత్తు కోసం భాజపా పావులు కదుపుతోంది. మోదీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూపి ముందుకు వెళ్లాలని చూస్తోంది. కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా ఉంది. దానికి సరైన నాయకులు లేరు. ప్రస్తుత ఎన్నికల్లో నాగా శాంతి ఒప్పందం కీలకం కానుంది. మొత్తం మీద మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ప్రాంతీయ పార్టీల కన్నా జాతీయ పార్టీలకే ఎక్కువగా ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

- గోపరాజు మల్లపరాజు
Posted on 20.01.2018