Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

జాతీయ వైఫల్యం... ప్రాంతీయ అవకాశం

* మూడో ప్రత్యామ్నాయం... ముందున్న సవాళ్లు

ప్రధాన జాతీయ పార్టీలు రెండూ దేశం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను తీర్చలేకపోయాయని- రాష్ట్రాల ప్రయోజనాలను, హక్కులను హరిస్తున్నాయని వీటి పరిష్కారానికి మూడో ప్రత్యామ్నాయంగా ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ రావాలని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. దానికి తానే సారథ్యం వహిస్తానంటూ, అందుకు కావాల్సిన భూమిక కోసం ప్రయత్నాలు మమ్మురం చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశానికి పరిష్కార మార్గంగా చూపే ప్రయత్నమూ జరుగుతోంది. సాగునీటి ప్రాజెక్టులకు భారీ పెట్టుబడులు, కాకతీయ కాలంనాటి చెరువుల పునరుద్ధరణ, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా, ప్రతి రైతుకు రూ.8000 వ్యవసాయ పెట్టుబడి, భూ రికార్డుల నవీకరణ తదితర విషయాల్లో సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించిన తీరు దేశ ప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆకట్టుకుందనే భావనతో తెలంగాణ నమూనాను ముందుకు తీసుకువచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనలో గుజరాత్‌లో జరిగిన అభివృద్ధిని 2014 ఎన్నికల్లో మోదీ ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో అనేక సంస్కరణలు చేపట్టి గణనీయమైన అభివృద్ధి సాధించింది. పరిపాలనకు సాంకేతికతను జోడించడంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తరవాతŸ ప్రధానంగా వ్యవసాయరంగంపై ఆధారపడాల్సి వచ్చింది. పారిశ్రామిక, సేవారంగాలు గణనీయంగా లేకపోవటం వనరుల సమీకరణకు అడ్డంకి అయ్యింది. అయినా తన పరిపాలనా దక్షతతో ఈ ఏడాది బడ్జెటును రెవిన్యూ మిగులుగా మార్చగలగడం గత నాలుగు సంవత్సరాల అవిశ్రాంత కృషికి ఫలితమనే చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల ఆవేదన
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవలి కాలంలో కేంద్రప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. విభజన చట్టంలోని అంశాలు, అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీలు అమలు కాలేదన్న ఆవేదన ప్రజల్లో చోటుచేసుకుంది. ముస్లిం, గిరిజన రిజర్వేషన్‌ కోసం అసెంబ్లీ తీర్మానం చేసినా కేంద్రం అనుమతి ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యమే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు ప్రధాన కారణంగా కనపడుతోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌పై తెలుగుదేశం తన వైఖరేమిటో ఇంతవరకూ స్పష్టం చేయలేదు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కేంద్రంపై ధ్వజమెత్తుతున్నారు. మమతాబెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ విషయంలో ముందున్నారు. ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నాయి. శివసేనకు చెందిన ఉద్ధవ్‌ ఠాక్రే బహిరంగంగా అసమ్మతి ప్రకటించారు. నితీశ్‌ కుమార్‌ కూడా తమ రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సహాయంపై పెదవి విరుస్తున్నారు. బిహార్‌కు ప్రత్యేక హోదా కావాలని ఆయన డిమాండు చేస్తున్నారు. భాజపాకు చెందిన రాష్ట్రాల ముఖ్యమంత్రులూ లోలోపల తాము ఆశించిన రీతిలో నిధులు రావడంలేదనే భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే రాష్ట్రాలకు ఆర్థిక సాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై పూర్తి సంతృప్తితో ఉన్న రాష్ట్రం ఒక్కటీ లేదు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పరిశీలిస్తే మొత్తం కేటాయింపుల్లో 24శాతం కేవలం అంతకుముందు తెచ్చిన అప్పులపై వడ్డీలు, అసలు వాయిదాలు చెల్లించడానికే ఖర్చు చేయనున్నట్లు కనబడుతోంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 42 శాతం నిధులు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు తమ వాటా చెల్లించాలి. మిగతా వనరులను వివిధ రంగాలకు, రాష్ట్రాలకు కేటాయించాలి. ఈ సంవత్సరం జీఎస్‌టీ అమలుతో పరోక్ష పన్నులు కేవలం 11 నెలలకే అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రాల అసమ్మతిని తగ్గించడం కేంద్రానికి కత్తిమీద సాములాంటిదే.
రాష్ట్రాల అసంతృప్తే ఫెడరల్‌ ఫ్రంట్‌ వైపు ఆలోచనలు సాగేలా చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దాదాపు 50 సంవత్సరాల నుంచి రాష్ట్రాలు ఏదో రూపంలో కేంద్ర పెత్తనంపై పోరాటం చేస్తూనే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా 1967లో కాంగ్రెసేతర పార్టీలు సగం రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాయి. తమిళనాడు, పశ్చిమ్‌ బంగ, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, కేరళ, ఒడిశా, పంజాబ్‌లలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తమిళనాడు తప్ప మిగతాచోట్ల ఈ ధోరణి శాశ్వత ప్రభావం చూపలేకపోయింది. 1977లో జనతా ప్రభుత్వం కాంగ్రెస్‌ వ్యతిరేకతనే ప్రతిబింబించింది. తిరిగి 1989లో ఎన్‌.టి.రామారావు అధ్యక్షతన వి.పి.సింగ్‌ కన్వీనర్‌గా నేషనల్‌ ఫ్రంట్‌ ఆవిర్భవించింది. అదీ ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయింది. 1996లో చంద్రబాబు నాయుడు కన్వీనరుగా యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పడింది. దాని పరిస్థితీ అంతే. ప్రాంతీయ పార్టీలు తమంతట తాముగా అధికారంలోకి రాలేకపోవడం, దేశసమస్యలపై స్థూల అవగాహన లేకపోవడం, రాష్ట్రాలు పరస్పరం కలహించుకోవడం, నాయకత్వ సమస్య ఇందుకు ప్రధాన కారణాలు.
దాదాపు 105 లోక్‌సభ స్థానాల్లో (మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అయిదు కేంద్రపాలిత ప్రాంతాల్లో) పోటీ రెండు ప్రధాన జాతీయ పార్టీల మధ్యనే ఉంటుంది. మరో 255 లోక్‌సభ స్థానాల్లో (ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, కర్ణాటక, అసోం, ఝార్ఖండ్‌, పంజాబ్‌, హరియాణా, జమ్మూకశ్మీరు, గోవాల్లో) ప్రాంతీయ పార్టీలు ప్రభావం చూపినా అవి జాతీయ పార్టీలతోనే జతకట్టే అవకాశాలే ఎక్కువ. ఇక మిగిలిన 183 లోక్‌సభ స్థానాల్లోనే (పశ్చిమ బంగ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, కేరళ, తెలంగాణ, దిల్లీ, అసోం మినహా ఈశాన్య రాష్ట్రాలు) ఫెడరల్‌ ఫ్రంట్‌ పోటీచేయదగ్గ స్థాయిలో ఉండే అవకాశముంది. ఎన్నికల తరవాతŸ కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయపార్టీలతో కలిసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎంత పటిష్ఠ ప్రత్యామ్నాయంగా రూపుదాలుస్తుందన్నది కీలక ప్రశ్న. 2014లో మాదిరిగా ఏదో ఒక పార్టీకి ప్రజానీకం పూర్తి మెజారిటీ కట్టబెట్టే అవకాశం లేని పక్షంలోనే తృతీయ ఫ్రంట్‌ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్రల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు జాతీయపార్టీలను వదిలి ఈ కూటమిలోకి రాగలిగితేనే భవిష్యత్తు ఉంటుంది.

విస్తృత అవగాహన కీలకం
సమర్థ ప్రత్యామ్నాయ యత్నాలు విఫలం కావడానికి ఇంకో ప్రధాన కారణం- దేశ సమస్యలపై ఆయా పార్టీల మధ్య స్థూల అవగాహన కొరవడటం! ఉదాహరణకు ప్రభుత్వం నియమించిన పదిహేనో ఆర్థిక సంఘం మార్గదర్శకాలపై ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు 2011 జనాభా ప్రాతిపదికన నిధుల పంపిణీ జరగాలని కోరుతుంటే, దక్షిణాది రాష్ట్రాలు 1971 జనాభా లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాయి. 2011 జనాభా ప్రాతిపదిక తీసుకుంటే కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలుచేసిన దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ప్రత్యేక హోదా, పన్నురాయితీ వంటి డిమాండ్లపై పోటీ నెలకొంది. నదుల అనుసంధానంపై ఎగువనున్న రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, దిగువనున్న రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయి. శ్రీలంకతో సంబంధాలపై తమిళనాడుకు అభ్యంతరాలున్నాయి. జీఎస్‌టీపై తూర్పు, పశ్చిమ, దక్షిణ రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. నీటి పంపిణీపై రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయి. సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రభుత్వరంగ పాత్రపై ప్రాంతీయ పార్టీలకు, వామపక్ష పార్టీలకు మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయి. ఈ సమస్యలపై స్థూలంగా ఓ అవగాహనకు రాకుండా కేవలం కేంద్రం పెత్తందారీ ధోరణికి వ్యతిరేకంగా ఫ్రంట్‌ ఏర్పాటుచేస్తేనే ఆశించిన ఫలితాలు రావు. నాయకత్వ సమస్య కూడా దృష్టిపెట్టాల్సిన అంశమే. మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ మొదట్నుంచీ నాయకత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సమస్యను కేసీఆర్‌ ఎలా చక్కదిద్దుతారో చూడాలి. మొత్తం మీద చూస్తే ఫెడరల్‌ ఫ్రంట్‌ వ్యవహారం ఒడుదొడుకులతో కూడుకున్నది. ఫెడరల్‌ ఆకాంక్ష అప్పటికీ, ఇప్పటికీ బలీయంగా ఉంది. ఎన్టీఆర్‌ దీన్ని ముందుకు తీసుకువచ్చారు. చంద్రబాబునాయుడు మరింత ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు చంద్రశేఖరరావు అదే బాటలో పయనిస్తున్నారు. ఆయన ఎంతవరకు సఫలమవుతారనేది వేచి చూడాలి!

- కె.రామకోటేశ్వరరావు
Posted on 15.03.2018