Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

మూడో కూటమితో ఉత్కంఠ

* ఎన్నికలకు సిద్ధమైన ఛత్తీస్‌గఢ్‌

ఛత్తీస్‌గఢ్‌ అంటే 36 కోటల సమాహారమని అర్థం. చారిత్రకంగా రామాయణంలోని దక్షిణ కోసల రాజ్యం, దండకారణ్యం కలగలసిన ఈ రాష్ట్రం భౌగోళికంగా సీహార్స్‌ అనే చేప ఆకారంలో కనిపిస్తుంది. సహజ వనరుల నిలయంగా విలువైన ఖనిజాలు, హరిత వనాలు, జాలువారే జలపాతాలు, పరవళ్లు తొక్కే సెలయేళ్లు, అమాయక గిరిజనం- వీటన్నింటి సమ్మిశ్రమమిది. ఇరవై వేల ఎకరాల్లో ప్రణాళికా బద్ధంగా, ప్రపంచ స్థాయి వసతులతో ఈ శతాబ్దపు అత్యుత్తమ రాజధాని నయారాయ్‌పూర్‌ నగరాన్ని నిర్మించుకున్న రాష్ట్రమిది. ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత గల ఇనుప ఖనిజాన్ని అందించే బైలదిల్లా గనులతో పాటు 28 రకాల ఖనిజాల నిక్షేపాలు ఇక్కడున్నాయి. ఖనిజ ఉత్పత్తిలో దేశంలో నాలుగో స్థానం పొందిన ఛత్తీస్‌గఢ్‌ ఇనుముతో పాటు బొగ్గు, సున్నపురాయి, క్వార్టయిజ్‌, బాక్సైట్‌ నిక్షేపాల వెలికితీత ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. అందుబాటులో ఉన్న సాగుయోగ్యమైన భూమిలో 80 శాతాన్ని వినియోగించుకుంటూ వరి సాగులో వందల రకాలను పండిస్తూ దేశానికి ‘ధాన్యాగారం’గా పేరొందింది. అత్యుత్తమ సాంకేతికతతో అమలుచేస్తున్న ఇక్కడి ప్రజాపంపిణీ వ్యవస్థను సర్వోన్నత న్యాయస్థానంతో పాటు దాదాపు 11 రాష్ట్రాలు ప్రశంసించాయి. పద్దెనిమిదేళ్ల కిందట మధ్యప్రదేశ్‌ నుంచి విడిపోయినప్పటి నుంచి ప్రత్యేక ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఇది దూసుకుపోతోంది. మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలతో సరిహద్దులున్న ఈ రాష్ట్రంలో సుమారు 47 శాతం అడవులే. ఆ సహజ వనరుల మాటున వ్యూహాత్మకంగా విస్తరించిన వామపక్ష విప్లవోద్యమం వల్ల పచ్చని హరితవనాల్లో కనిపించే రక్తపు మడుగులపరంగానూ దేశంలో మొదటి స్థానంలో నిలుస్తోంది. ఒకవైపు ప్రగతికి ప్రతీకగా ఎదుగుతూ మరోవైపు ఆటవిక విచక్షణారహిత హననంతో వణుకుతున్న రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వేడి రాజుకొంది. ఏడాది చివర్లో ఫలితాలు తేలనున్న ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ నేడు విడుదల కానుండటంతో రాష్ట్రంతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది.
విజయాలు- వైఫల్యాలు
మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టం-2000 ప్రకారం అదే సంవత్సరం నవంబరు ఒకటో తేదీన ఛత్తీస్‌గఢ్‌ ఆవిర్భవించింది. తొలి మూడేళ్లు అజిత్‌ జోగి ముఖ్యమంత్రిత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలించింది. అనంతరం శాసనసభకు మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో ఆయుర్వేద వైద్యుడైన డాక్టర్‌ రమణ్‌సింగ్‌ నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం నాలుగో విజయానికి రమణ్‌సింగ్‌ కసరత్తు చేస్తున్నారు. పదిహేనేళ్ల సుదీర్ఘ పాలనలో ఆయన ఎన్నో విజయాలు సాధించారు. రమణ్‌సింగ్‌ పనితీరుకు ఇక్కడి ప్రజాపంపిణీ వ్యవస్థ అమలు తీరే చెప్పుకోదగ్గ మేలిమి ఉదాహరణ. అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ రాష్ట్రంలోని 80 శాతం మంది లబ్ధిదారులకు రెండు రూపాయలకు కిలో బియ్యం వంతున 35 కిలోలను ప్రతి నెలా సరఫరా చేస్తోంది. రెండు కిలోల అయొడైజ్డ్‌ ఉప్పు, మూడు లీటర్ల కిరోసిన్‌, 1.3 కిలోల చక్కెరనూ పంపిణీ చేస్తోంది. గత ఎన్నికల్లో చౌక బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చినా ఓటర్లు నమ్మలేదు. గత అయిదేళ్లలో రూ.30 వేలకోట్ల విలువైన పనులను రమణ్‌సింగ్‌ ప్రభుత్వం చేపట్టింది. రూ.700 కోట్ల మేరకు తునికాకు రైతులకు నగదు ప్రోత్సాహకంగా అందజేశారు. వంద శాతం విద్యుదీకరణ, 12 లక్షలకు పైగా ఇళ్ల రిజిస్ట్రేషన్‌ పట్టాల పంపిణీ, 5.4 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు ఉన్నత విద్య, రహదారులు, విద్యుత్తు విషయాల్లో ఎన్నో విజయాలను నమోదుచేసింది. సుదీర్ఘకాలం పాలన సాగించిన ఏ ప్రభుత్వమైనా ప్రజలనుంచి ఎంతో కొంత అసంతృప్తిని ఎదుర్కోవలసిందే. తన అద్వితీయ ప్రజాపంపిణీ విధానం ద్వారా అట్టడుగు ప్రజల్లో చావల్‌ బాబాగా పేరొందిన రమణ్‌సింగ్‌ ప్రభుత్వంపైనా ఎన్నో విమర్శలున్నాయి. కింది స్థాయిలో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతి నివురుగప్పిన నిప్పులా తయారైంది. రాష్ట్రంలో 25 లక్షల మంది విద్యాధికులైన నిరుద్యోగులు కొలువుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా నమోదైన 1.18 లక్షల మంది యువజన ఓటర్ల్ల నిర్ణయం ఎటువైపు అన్నది ప్రశ్నార్థకం. సేద్యరంగంలో విజయాలు ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు పదిహేను వందల మంది రైతులు ఈ మూడేళ్లలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వరికి మద్దతు ధర పెంచాలని, అయిదు అశ్వశక్తి పంపుసెట్లకు విద్యుత్తును ఉచితంగా సరఫరా చేయాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నది రైతుల ఆవేదన. రాష్ట్రం ఏర్పడిననాడే బొగ్గు తవ్వకాలు ప్రారంభించి విద్యుత్తు మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించింది. బొగ్గు గనుల తవ్వకాల వల్ల అటవీ ప్రాంతాల్లో ఆయుర్వేదానికి, సారా తయారీకి వినియోగించే ఇప్ప చెట్లు, బీడీల తయారీలో వాడే తునికాకు వనాలు దెబ్బతినడంతో గిరిజనులు ప్రధాన ఆదాయ వనరులను కోల్పోయామనే ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో 6-14 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 1.78 లక్షల మంది బడికి దూరంగా ఉన్నారు. వీరిలో సగం మంది బస్తర్‌ డివిజన్‌లోని నాలుగు జిల్లాల్లోనే ఉండటం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాలకు దేశవ్యాప్తంగా ఎంత గుర్తింపు లభించినా, అంతిమంగా స్థానిక ప్రజల సంతృప్త స్థాయే పాలకుల పనితనానికి కొలమానం. వారిలో నెలకొనే అసంతృప్తి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయక తప్పదు!

రాష్ట్రం ఏర్పడినప్పటి జరిగిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాలే ప్రధానంగా పోటీపడ్డాయి. బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) ప్రభావం స్వల్పం. కాంగ్రెస్‌లో కీలక నేతగా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అజిత్‌ జోగి రెండేళ్ల క్రితం- జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జేసీసీ) పేరిట సొంతపార్టీ పెట్టుకున్నారు. జేసీసీ ప్రధానంగా కాంగ్రెస్‌ ఓట్లనే చీల్చనుందని, అది భాజపాకు అనుకూల ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి చాణక్యనీతి ప్రదర్శిస్తూ జేసీసీతో పొత్తు కుదుర్చుకున్నారు. 90 అసెంబ్లీ స్థానాలున్న విధానసభలో జేసీసీ 55, బీఎస్పీ 35 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే అజిత్‌ జోగి ముఖ్యమంత్రి అవుతారని మాయావతి ప్రకటించారు. గత మూడు ఎన్నికల్లోనూ అతి స్వల్ప తేడాతో (రెండు శాతం ఓట్లు) అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ పార్టీ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో బరిలో నిలుస్తోంది. రమణ్‌సింగ్‌ పదిహేనేళ్ల పాలనపై సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత తమకు ఉపకరిస్తుందన్నది కాంగ్రెస్‌ భావిస్తోంది. సీనియర్లు పార్టీ నుంచి వెళ్లిపోయినా, సంప్రదాయ ఓటర్లే పార్టీకి రక్ష అని పీసీసీ అధ్యక్షుడు భూపేష్‌ బాగెల్‌ భరోసాగా ఉన్నారు. భాజపాలో ముఖ్యమంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులున్నారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు జేసీసీ-బీఎస్పీ కూటమి అన్ని స్థానాలకు పోటీచేస్తున్న ఈ ఎన్నికల్లో గత ఫలితాలు పునరావృతం కాకపోవచ్చునన్నది పరిశీలకుల విశ్లేషణ. కాంగ్రెస్‌ ఓట్లలో 65 శాతం ఎస్సీ, ఎస్టీ వర్గాలనుంచే వస్తున్నాయి. భాజపాకు 70 శాతం ఓట్లు ఉన్నతవర్గాలు, బీసీల నుంచే లభిస్తున్నాయి. అజిత్‌ జోగికి ఎస్సీల్లోని సత్నామీల్లో, గిరిజనుల్లో కొంత పలుకుబడి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఓటు బ్యాంకుల చీలికే ఫలితాలను ప్రభావితం చేయనుంది. భాజపా ఓట్ల శాతానికి ఏ మాత్రం గండిపడినా, జేసీసీ- బీఎస్పీ కూటమి కాంగ్రెస్‌తో కలిసి కర్ణాటక తరహా అధికార విన్యాసానికి యత్నించే అవకాశం లేకపోలేదన్నది మరో వాదన.
వ్యూహాత్మకంగా మావోయిస్టులు
మావోయిస్టుల తీవ్ర ప్రాబల్య రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలంటే కత్తి మీద సామే. భారీ సంఖ్యలో కేంద్ర బలగాల మోహరింపు ద్వారా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తున్నారు. సైద్ధాంతికంగా మావోయిస్టులు ప్రతి ఎన్నికలనూ బహిష్కరించాలని పిలుపిస్తుంటారు. ప్రజలను ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి దూరం చేయాలనే వారి భావజాలానికి తగిన స్పందన ఏ ఎన్నికల్లోనూ కనిపించదు. గత ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌లోని ముగ్గురు కీలక నేతలను, మరో 25 మందిని పాశవికంగా హతమార్చిన మావోయిస్టులు ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌లపై దాడులు చేయడం, ఈవీఎమ్‌లను ఎత్తుకుపోవడం, అభ్యర్థులను, నాయకులను అపహరించడం వంటి ఘటనలకు పాల్పడుతున్నా ప్రజలను ఓటింగునకు దూరం చేయలేకపోతున్నారు. వాస్తవానికి రాయపూర్‌, దుర్గ్‌, రాయ్‌గఢ్‌ వంటి నగర ప్రాంతాలకంటే మావోయిస్టుల పట్టున్న బస్తర్‌లోనే అధికంగా పోలింగ్‌ జరుగుతోంది. దీన్నిబట్టి మావోయిస్టులు ఆనవాయితీగా పిలుపిచ్చే ఎన్నికల బహిష్కరణను ఆచరించడానికి ప్రజలు సిద్ధంగా లేరని తేటతెల్లమవుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో మావోయిస్టుల వైఖరి ఏమిటో ఇప్పటివరకూ వెల్లడి కాలేదు. ప్రచార పర్వం మొదలయ్యాక యథావిధిగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ఘటనలు చోటుచేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

గత పదేళ్లలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల విధ్వంసక ఘటనలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. పదేళ్ల కిందటి ఘటనలు, మృతుల సంఖ్యతో పోల్చితే ఈ ఏడాది వాటి సంఖ్య మూడోవంతుకు తగ్గింది. అంతమాత్రాన వారి ప్రాబల్యం క్షీణించిందని భావించలేం. నేటికీ ఆ రాష్ట్రం మావోయిస్టుల వ్యూహాత్మక కార్యాచరణ కేంద్రమే. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో ఇప్పటికీ మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 24 ఉండగా, వాటిలో తీవ్ర ప్రాబల్య జిల్లాలు ఎనిమిది ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో అస్థిర ప్రభుత్వం ఏర్పడితే, దాన్ని ఆసరాగా తీసుకుని మావోయిస్టుల కార్యకలాపాలు మళ్ళీ విస్తరించే అవకాశం ఉందని, అది తమ రాష్ట్రాలకు మరింత ప్రమాదకరని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలూ భావిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ప్రస్తుత అయిదు రాష్ట్రాల్లో మూడు భాజపా పాలిత రాష్ట్రాలే. అందులోనూ ఛత్తీస్‌గఢ్‌ కీలక రాష్ట్రం. ఇక్కడ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా ఛత్తీస్‌గఢ్‌ ఓటరు చైతన్యశీలంగా వ్యవహరించాల్సిన తరుణమిదే!

- ఎం.కృష్ణారావ్‌
Posted on 16.10.2018