Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

పదును తేలిన దౌత్యం

ఆదర్శాల వల్లెవేత తప్ప కార్యాచరణకు కూడిరాని కూటములవల్ల ప్రయోజనం ఏపాటి? ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని, విభజనవాదాన్ని సమకాలీన ప్రపంచంలో త్రివిధ దుష్కర్మలుగా తీర్మానించిన షాంఘై సహకార సంఘం (ఎస్‌సీవో) ఆ అంశంపై మూగనోము పట్టబట్టే- ఉగ్రవాదానికి నారూనీరూ పోసి పెంచుతున్న దేశాల్ని జవాబుదారీ చేసి తీరాల్సిందేనన్న భారత్‌ బాణీ ప్రధాని నరేంద్ర మోదీ గళంలో తాజాగా ప్రతిధ్వనించింది! హ్రస్వదృష్టి రాజకీయాల్ని పక్కనపెట్టి ఉగ్రవాద మహమ్మారిని మట్టగించడానికి ఏకతాటి పైకి రావాలన్న ప్రధాని మోదీ పిలుపు- కిర్గిస్థాన్‌లో జరిగిన ఎస్‌సీవో సదస్సుకు దిశానిర్దేశం చేసింది. అభివృద్ధి, ప్రాంతీయ భద్రతలే ప్రాధాన్యాంశాలుగా 1996లో ‘షాంఘై ఫైవ్‌’ పేరిట పురుడుపోసుకున్న కూటమి 2001లో ఎస్‌సీవోగా ఆవిర్భవించడం తెలిసిందే. 2017లో భారత పాకిస్థాన్లకు శాశ్వత సభ్యత్వ హోదా దరిమిలా అష్టరాజ్య కూటమిగా ఎస్‌సీవో సమగ్రత సంతరించుకొన్నా- దీపం కిందనే తారట్లాడే చీకటి మాదిరిగా పాక్‌ ఉగ్రవాదం, చైనా అగ్రవాదం భారత్‌ ప్రయోజనాలకు భంగకరంగా మారాయి. చైనాతో సరిహద్దు వివాదాల్ని సంప్రతింపులతో పరిష్కరించుకోగల అవకాశం ఉంది. మరోవంక దశాబ్దాలుగా ఇండియా సహనాన్ని బలహీనతగా భావించి ఉగ్రవాదమే ఆయుధంగా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్న ఇస్లామాబాద్‌ పట్ల కఠిన వైఖరి అవలంబించక తప్పని పరిస్థితిని పాకిస్థాన్‌ నేతాగణమే కల్పించింది. టెర్రరిజాన్ని ఏ మాత్రం ఉపేక్షించరాదంటూ ఎస్‌సీవో 2004 జూన్‌లోనే ప్రాంతీయ ఉగ్రవాద నిర్మూలన వ్యవస్థ(రాట్స్‌)ను రూపొందించింది. ప్రాంతీయంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై ‘రాట్స్‌’ సారథ్యంలో సభ్యదేశాల సంయుక్త సైనిక విన్యాసాలూ ఇటీవలే జరిగాయి. ఉత్తుత్తి విన్యాసాలు కాదు; వాస్తవ కార్యాచరణే నేడు కావాల్సింది అంటూ గళమెత్తిన మోదీ, ఉగ్రవాదంపై ప్రపంచ సదస్సు నిర్వహించాలని ఎస్‌సీవోకు విజ్ఞప్తి చేశారు. ‘ప్రగతి కోసం శాంతి- శాంతి కోసం భద్రత’ అత్యావశ్యకమన్న భారత్‌ బాణీకి ప్రతిధ్వని అది!

కడివెడు పాలనూ చప్పున విరిచేయడానికి ఉప్పుగల్లు చాలు. భారతావని పట్ల జ్ఞాతివైరంతో దహించుకుపోతూ ‘సార్క్‌’ లాంటి కూటమినీ సారహీనం చేసిన పాకిస్థాన్‌- ఎస్‌సీవో సభ్యదేశంగానూ కుక్క తోక చందమైన తన వంకర బుద్ధినే ప్రదర్శిస్తోందిప్పుడు! ఆయుధాల కొనుగోళ్ల మీద కంటే, మానవ వనరుల అభివృద్ధి మీదే అధికంగా ఖర్చు చెయ్యాలని పాక్‌ భావిస్తోందట! శాంతియుత వాతావరణంలోనే అభివృద్ధి సుమం వికసిస్తుందట! కాబట్టి ఇండియాతో అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ అంతర్జాతీయ మధ్యవర్తిత్వం సహా ఏ విధంగానైనా పరిష్కరించుకోవడానికి సిద్ధమట! గోముఖ వ్యాఘ్రం లాంటి పాకిస్థాన్‌ ఆర్థిక పెనుసంక్షోభమనే ఊబిలో నిలువునా కూరుకుపోయి కూడా- కశ్మీర్‌ వివాదాన్ని అంతర్జాతీయం చెయ్యాలన్న నయవంచక ధోరణినే ప్రదర్శిస్తోంది! పాక్‌ గడ్డ మీద ఉగ్రభూతాలకు నిలువనీడ లేకుండా చేస్తే, సరిహద్దుల్లో మోర్టార్ల మోతను నిలువరిస్తే, సమస్యలన్నింటినీ ద్వైపాక్షికంగానే పరిష్కరించుకొనేలా సంప్రతింపులకు సంసిద్ధమని భారత ప్రభుత్వం పదేపదే స్పష్టీకరించినా పెడచెవిన పెట్టిన పాక్‌- చైనా ద్వారా పని చక్కబెట్టుకొనే యత్నాలూ చేస్తోంది. భారత్‌ పాక్‌ల మధ్య సంబంధాల మెరుగుదలకు ఎస్‌సీవో సమర్థ వేదిక కాగలుగుతుందని నిరుడు చైనా రష్యాలు అభిలషించాయి. సంప్రతింపులకు మార్గం సుగమం చేస్తామన్న సంకేతాలు చైనా నుంచి అందుతున్న నేపథ్యంలో- ఉగ్రవాద రహిత వాతావరణాన్ని పాక్‌ సృష్టించాల్సి ఉన్నా, ఆ పని జరగడం లేదని షి జిన్‌పింగ్‌కు స్పష్టీకరించడం ద్వారా మోదీ నిక్కచ్చిగా వ్యవహరించారు. మసూద్‌ అజర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాద ముద్రకు దోహదపడినట్లుగానే, ఉగ్రరహిత దేశంగా పాకిస్థాన్‌ రూపాంతరీకరణకూ బీజింగ్‌ చొరవ చూపినప్పుడే ఉద్రిక్తతలు ఉపశమిస్తాయనడంలో సందేహం లేదు!

ప్రపంచ జనావళిలో 40 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తూ పసిఫిక్‌ నుంచి ఐరోపా దాకా, ఆర్కిటిక్‌ నుంచి హిందూ మహాసముద్రం వరకు విస్తరించిన ఎస్‌సీవో సుదృఢ వేదికగా, పరస్పర శ్రేయస్సాధకంగా ముందడుగేస్తే ఒడిసిపట్టగల ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ఇంధన, సహజ వనరుల రంగాల్లో ఎస్‌సీవో భారత్‌కు ఎంతగానో అక్కరకు రాగలుగుతుంది. ఆ వాస్తవిక అవగాహనతోనే కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, మంగోలియా ప్రభృత దేశాలతో ద్వైపాక్షిక బంధాన్ని బలంగా ముడివేస్తున్న మోదీ తాజా పర్యటనలో ఆతిథ్య దేశంతో 15 ఒప్పందాలు కుదిరాయి. తమ మధ్య బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా రెండు దేశాలూ ఉన్నతీకరించాయి! చైనా రష్యా అగ్రనేతలతో మోదీ భేటీ సందర్భంగా సానుకూల ప్రతిపాదనలు వెలుగుచూశాయి. డోక్లామ్‌ ప్రతిష్ఠంభన, తమ భూభాగం నుంచి అంగుళం స్థలాన్నీ వదులుకోమంటూ నిరుడు మార్చిలో షి జిన్‌పింగ్‌ ప్రకటన ఉద్రిక్తతల్ని పెంచిన తరుణంలోనే- ‘ఉహాన్‌’ మాటామంతీ చోటుచేసుకొంది. నాలుగు వేల కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి సుస్థిరత్వ సాధన కోసం సైన్యానికి వ్యూహాత్మక మార్గనిర్దేశం చెయ్యాలన్న నాటి ద్వైపాక్షిక అంగీకారానికి సైదోడుగా సంప్రతింపుల ప్రక్రియను ఉభయులకూ ఆమోదయోగ్యంగా సత్వరం పూర్తిచెయ్యాలని షి జిన్‌పింగ్‌, మోదీ తాజాగా నిర్ణయించారు.‘ఒకరికొకరం ముప్పుగా మారవద్దు’ అన్నది చైనా శుభకామన కాగా, సాంకేతిక పరిజ్ఞానం బదిలీతో పాటు భారత్‌లో తయారీకి బాటలుపరచేందుకు రష్యా సుముఖత వ్యక్తీకరించడం- మోదీ పర్యటన ఫలప్రదమైందనడానికి సంకేతం. పాకిస్థాన్‌ను పూర్తిగా పక్కనపెట్టి, తక్కిన దేశాలతో సౌహార్దాన్ని మరో మెట్టు ఎక్కించడం- ఇండియా దౌత్యధురీణతకు నిలువుటద్దం!

Posted on 15.06.2019